ప్రస్తుతం దేశంలో ఆదాయ అంతరాలు 1950వ దశకంలో కంటే అధికంగా ఉన్నాయని పీపుల్ రిసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ (ప్రైస్) సంస్థ ఇటీవల విడుదల చేసిన పత్రంలోని సమాచారం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రిసెర్చ్, ప్రైస్ తదితర సంస్థలు నిర్వహించిన కుటుంబ ఆదాయ సర్వేల ఆధారంగా ఈ పత్రాన్ని రూపొందించారు. అసమానతలను నిర్ధారించడానికి ఉపయోగించిన గణాంక పద్ధతి ‘గినీ కోయిఫిషెంట్’ ప్రకారం అసమానతల సూచీ 1953-55 మధ్య 0.371గా ఉంటే 2022-23లో 0.410గా ఉంది. అంటే ఆదాయ అంతరం అంతకంతకూ పెరిగిపోతోందన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అని మొదలుబెట్టి, ఆ తరువాత వికసిత్ భారత్ అని చెబుతూ దేశం కోవిడ్ సంక్షోభం అనంతరం మళ్లీ ఆదాయాలు పుంజుకొని అభివృద్ధి ఉరకలు వేస్తుందన్నారు. అందుకు ఇంగ్లీషు అక్షరం వి తరహా అభివృద్ధి అంటే గతంలో క్షీణించిన వృద్ధి రేటు తిరిగి పెరుగుతూ పోతుందన్నారు. ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ వంటి వామపక్ష ఆర్థికవేత్తలు బిజెపి పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ఇంగ్లీషు అక్షరం వి నమూనా కాకుండా కె తరహాలో పరిణామం చెందుతోందన్నారు. అంటే కొద్దిమంది సంపన్నుల సంపద పెరుగుతోందనీ (కె లో పైభాగం) అత్యధికులుగా వున్న మధ్యతరగతి, పేదలు ఇంకా కునారిల్లుతున్నారని (కె లో కింది భాగం) వివరించారు. తాజా ఆదాయ అంతరాల నివేదిక ఈ విశ్లేషణ ఎంత సత్యమో విదితపరుస్తోంది.
దేశంలోని సంపన్నులు జాతీయాదాయంలో తమ వాటాను గణనీయంగా పెంచుకుంటుంటే గ్రామీణ, అల్పాదాయ వర్గాల ప్రజలు అత్యవసర సేవలు, విద్య, ఆరోగ్య రక్షణ, ఆర్థికావసరాలు పరిమితంగానే పొందగలుగుతున్నారని ఆ పత్రం తెలిపింది. వరల్డ్ ఇనీక్వాలిటీ డాటాబేస్ (విడ్) ప్రకారం 2023లో దేశంలో అత్యంత సంపన్నులైన ఒక శాతం ప్రజలు 22.6 శాతం జాతీయాదాయంపై ఆధిపత్యాన్ని చెలాయించారని పేర్కొంది. దేశంలో ఓ మోస్తరు సంపాదన కలిగిన 40 శాతం జనాభా వాటా జాతీయాదాయంలో 43.9 నుండి 46.6 శాతం వరకూ ఉన్నదని కుటుంబ సర్వేలు తెలిపాయి. అయితే విడ్ అంచనాల ప్రకారం జాతీయాదాయంలో మధ్య తరగతి ప్రజల వాటా గణనీయంగా పడిపోయింది. 1953-55లో 41.5 శాతంగా ఉన్న వాటా 2022-23లో కేవలం 27.3 శాతానికి తగ్గిపోయింది. ఇక జనాభాలో చివరి 50 శాతంగా ఉన్న పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజలు జాతీయాదాయంలో 25.5 (1961-65) నుండి 15.8 (2020-21) శాతం మధ్య ఆదాయ వాటాను కలిగి ఉన్నారని కుటుంబ సర్వేలు తెలిపాయి. కాబట్టి జాతీయ అంతర్జాతీయ నివేదికలు వేటిని పరిశీలించినా అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి శత కోటీశ్వరుల సంపద పెరగడం, పేదలు మరింత నిరుపేదలవుతున్న వాస్తవాన్ని నివేదిస్తున్నాయి.
ప్రపంచంలో పేదరికం తగ్గింపు కోసం అనేక దేశాల్లో ఆయా ప్రభుత్వాలు ఆర్థిక విధానాలను రూపొందిస్తున్నాయి. అయితే ముఖ్యంగా సోషలిస్టు దేశాలు అదేవిధంగా స్కాండినేవియా దేశాలు ఆదాయ అంతరాల తగ్గింపు కోసం కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా సంపద పోగు పడుతున్న వారి నుండి అధిక పన్నులు వసూలు చేయడం, మధ్య, అల్పాదాయ వర్గాల వారికి ప్రభుత్వ తోడ్పాటు పెంచడం వంటి విధానాలు అనుసరిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగ పాత్రను పెంచుతున్నాయి. ఇంకొన్ని దేశాల్లో ఆదాయంలో పన్ను చెల్లింపు వాటాను కొలబద్దగా తీసుకొని, అధికాదాయ వర్గాలవారి నుండి ఎక్కువగా వసూలు చేస్తున్నారు. అంతరాల తగ్గింపు లక్ష్యంగా వివిధ చర్యలు చేపడుతున్నారు. అందుకు భిన్నంగా నరేంద్ర మోడీ పాలనలో సంపన్నులపై విధించే కార్పొరేట్ పన్ను తగ్గించారు. వారు బ్యాంకులకు చెల్లించవలసిన లక్షల కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేశారు. ప్రోత్సాహకాల పేరిట కేంద్ర బడ్జెట్‌లో ఏటా లక్షల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. మరోవైపున మధ్యతరగతి వారిపై విధించిన ఆదాయ పన్ను ఖజానాకు ఏడాదికేడాది ఎక్కువగా పోగుపడుతోంది. ఇక పేదలను ఎంతలా దిగజార్చుతున్నదీ అందరికీ తెలిసిన విషయమే! ప్రభుత్వ విధానాలే ఆదాయ అంతరాల పెరుగుదలకు కారణం కనుక వాటిని మార్చాల్సిందే. అందుకు బలమైన ప్రజా ఉద్యమాలు కావాలి.