గ్రామాల్లో పేదలకు ఏడాదిలో కనీసం వంద రోజులు పని కల్పించే ఉద్దేశంతో యుపిఎ-1 హయాంలో తీసుకొచ్చింది. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టం (ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎ-నరెగా). అటువంటి బృహత్తర చట్టం అమలులో లెక్కకు మించిన లోపాలను ఎత్తిచూపింది పార్లమెంటరీ స్థాయి సంఘం. చట్టం హామీ ఇచ్చిన ప్రయోజనాలు కార్మికులకు దక్కడం లేదని గుర్తించింది. నరెగాపై సమగ్ర సమీక్ష కోసం జాతీయ స్థాయిలో స్వతంత్రతతో కూడిన పారదర్శక సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కార్మికుల సంతృప్తి, వేతనాల్లో జాప్యం, భాగస్వామ్యం పోకడలు, ఆర్థిక అవకతవకల దృష్టి కోణంలో సర్వే చేయాలని సూచించింది. చట్టం అమల్లో ఎదురవుతున్న సవాళ్లనూ పరిశీలించాలంది. కార్మికుల పనిదినాలు వంద నుంచి 150 రోజులకు, దినసరి వేతనం 400 రూపాయలకు పెంచాలని తెలిపింది. కాంగ్రెస్ ఎంపి సప్తగిరి శంకర్ ఉల్కా నేతృత్వంలో గ్రామీణాభివృద్ధిపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మోడీ పదేళ్ల జమానాలో ఉపాధి హామీపై మచ్చుకు పరిశీలించి ఇచ్చిన రిపోర్టు ఇది. నరెగాను మోడీ ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో నిర్వీర్యం చేస్తోందని నివేదికతో స్పష్టమైంది. ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచే బిజెపి కుయుక్తులపై ఇంతకాలం వెల్లడవుతున్న ఆందోళనలను ఆ రిపోర్టు నిర్ధారించింది.
ఆది నుంచీ నరెగాపై మోడీ ప్రభుత్వానిది మొసలి కన్నీరేనని దాని చేష్టలే తెలుపుతాయి. బడ్జెట్ కేటాయింపుల నుంచి అమలు వరకు ప్రతిదీ చట్టాన్ని దెబ్బతీసేదిగానే ఉన్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలనే తీసుకుంటే దశాబ్ద కాలంలో ఏనాడూ డిమాండ్‌కనుగుణంగా లేవు. ఏవో కొన్ని నిధులను చూపించడం, వాటితోనే కాలక్షేపం చేయడం, చివరాఖరులో ఎంతో కొంత విదిలించడం పరిపాటిగా మారింది. కరోనా సమయంలో మాత్రమే ఖర్చు రూ.లక్ష కోట్లు దాటింది. పట్టణాలకు వలసలు వెళ్లిన లక్షలాది కార్మికులు తమ ఊళ్లకు వెనక్కి వచ్చిన సందర్భంలోని ఆ ఖర్చు సైతం నాటి డిమాండ్‌తో పోల్చితే చాలా చాలా తక్కువ. అదేంటంటే, బడ్జెట్‌లో నిధులు చూపించాల్సిన అవసరం లేదని, డిమాండ్ పెరిగితే ఆటోమేటిగ్గా నిధులు పెంచుతామన్న మోడీ సర్కారు మాట ఒట్టి బూటకం. సకాలంలో నిధులివ్వని కారణంగా పనులు నిలిచిపోయిన ఉదంతాలెన్నో. రాష్ట్రాలకు నిధుల విడుదలలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తోందని పార్లమెంట్ సాక్షిగా నిరూపణ అయింది. 2025 మార్చి చివరినాటికి కేంద్రం రాష్ట్రాలకు అక్షరాలా 26 వేల కోట్ల రూపాయలు బకాయి పడింది. వాటిలో కూలీల వేతనాలు రూ.15 వేల కోట్లు. 2024-25లో ఉపాధి హామీకి ప్రతిపాదించింది రూ.86 వేల కోట్లు కాగా అంత పెద్ద మొత్తంలో నెలల పర్యంతం నిధులివ్వకుండా జాప్యం చేసి పేదలను ఉద్ధరిస్తామనడం వంచన కాదా?
ఉపాధి హామీ ప్రధాన లక్ష్యం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పన. ఆ లక్ష్యాన్ని మోడీ సర్కారు క్రమంగా పక్కదారి పట్టించే ఎన్నో చర్యలు చేపట్టింది. బిజెపి, ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాలు వాటిని పుణికిపుచ్చుకుంటున్నాయి. వ్యవసాయానికి అనుసంధానం పాట పాడుతున్నాయి. ఖర్చు లేని ప్రకృతి వ్యవసాయానికి, సేంద్రీయ వ్యవసాయానికి లింక్ పెడుతున్నాయి. నరెగా పనుల్లో భారీ యంత్రాల వినియోగం చట్ట విరుద్ధం. అపరిమితమైన మెటీరియల్ కాంపొనెంట్ సైతం చట్ట విరుద్ధం. అవన్నీ యధేచ్ఛగా సాగిపోతున్నాయి. పని లేని రోజుల్లో పని కల్పన కోసం గ్రామాల్లో జాబ్ కార్డుల జారీ సక్రమంగా లేదు. జాబ్ కార్డు పొందిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్న నిబంధన అమలు కావట్లేదు. వేతనాల జాప్యానికి పరిహారం విషయంలోనూ తప్పించుకొనే ఉదంతాలే ఎక్కువ. ఇటీవలి కాలంలో లక్షలాది జాబ్‌కార్డులు రద్దు చేస్తున్నారు. ఆర్థిక అవకతవకలు సరేసరి. ఈ చర్యలన్నీ ఉపాధి హామీ లక్ష్యాన్ని పలచన చేసేవి. ఉపాధి లేని కార్మికులకు అన్యాయం చేసేవి. కార్మికుల్లో వందకు వంద రోజులూ పని దొరికే వారిని, దినసరి వేతనం రూ.300 దొరికే వారిని వేళ్లపై లెక్కించొచ్చు. పట్టణాల్లో, గ్రామాల్లో భారీ యంత్రాల విచ్చలవిడి వినియోగం, ఆర్థిక మాంద్యం, వ్యవసాయ సంక్షోభం వలన పనుల కోసం డిమాండ్ పెరుగుతోంది. కరువొస్తే తీవ్రత ఇంకా ఎక్కువ. అందుకే ఏడాదిలో 200 రోజుల పని, దినసరి కూలి 600 కావాలన్న డిమాండ్ బలంగా ముందుకొస్తోంది. అర్బన్‌లోనూ ఉపాధి హామీ కావాలన్న ఆకాంక్ష వెల్లడవుతోంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికతోనైనా మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. గతంలో వేసిన అమర్‌జిత్ సిన్హా కమిటీ నివేదికకు మల్లే చెత్తబుట్ట దాఖలు చేస్తే ప్రజలు క్షమించరు.