రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలతో దేశంలో రాజకీయ చర్చను కొత్త మలుపు తిప్పినట్టు కనిపిస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ హంగామా చేసి దెబ్బతిన్న బిజెపి హర్యానాలో మాత్రం దాన్ని సాధించగలిగింది. ఎగ్జిట్ పోల్స్, సర్వేల ఫలితాలు, కాంగ్రెస్ అంచనాలు ఆశలు దారుణంగా విఫలమైనాయి. మీరు సక్రమంగా పనిచేసి వుంటే విజయం దక్కేదని, మీ స్వప్రయోజనాలే పరమార్థంగా మన పార్టీని దెబ్బ తీశారని రాహుల్ గాంధీ ఆగ్రహిం చారంటే వారి పరిస్థితి అర్థమవుతుంది. జమ్ము కాశ్మీర్ 370 అధికరణం రద్దు ద్వారా దేశమంతా విజయం సాధించాలనుకున్న బిజెపి అక్కడే అనుకున్న లక్ష్యం సాధించలేకపోగా నేషనల్ కాన్ఫరెన్స్ చాలా కాలం తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తున్నది. ఒమర్ అబ్దుల్లా మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఆ పార్టీ సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. బిజెపి జమ్మూలో పూర్తి ఫలితాలు సాధించిందనే ప్రచారం కూడా జోరుగానే నడుస్తున్నది. ఇంకోవైపున బిజెపి ఎన్నికల విజయాలు సాధించే యంత్రంగా పని చేస్తుందనీ దాని వ్యూహాలు అమోఘమనీ మోడియాలో భజన కీర్తనలు వినిపిస్తు న్నాయి. కేంద్ర ఎన్‌డిఎ కూటమి పాలనలోనే వున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్యానా గెలుపును కీర్తించడంతో పాటు జమిలి ఎన్నికలు కూడా మంచిదని ప్రకటించారు. తిరుపతి లడ్డూ వివాదం హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల కోణంలో ముందుకు తెచ్చారనే విమర్శ తన సంపాదకీయంలో ప్రస్తావించిన హిందూ పత్రిక ఇప్పుడు దాన్ని మతతత్వ రాజకీయాల వైపు మరల్చవద్దని మరోసారి హితవు పలికింది. ఎ.పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి వారు బిజెపిని మించి సనాతన ధర్మం, హిందూత్వ వాదనలతో చెలరేగిపోవడానికి కారణాలేమిటని జాతీయ మీడియాలో ఎడతెగని చర్చ సాగుతున్నది. విజయదశమి ముంగిట్లో దేశ రాజకీయ ముఖచిత్రం ఇది. దేశానికి వ్యతిరేకంగా జరిగే కుట్రలకు కాంగ్రెస్ సహకరిస్తున్నదని హర్యానా విజయోత్సవ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్య బిజెపి తదుపరి ప్రచారాలు ఎలా వుంటాయో చెబుతున్నది. దీంతోపాటుగానే వామపక్షాలు, ఇతర లౌకిక పార్టీలపైన బిజెపి హర్యానా ఫలితాల ప్రభావం వెనువెంటనే జరిగే మహారాష్ట్ర ఎన్నికలపై ఎలా పడుతుందనే రకరకాల అంచనాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ‘ఇండియా’ వేదిక కీలక పార్టీ అయిన ఉద్దవ్ థాకరే శివసేన ఎం.పి సంజరు రౌత్ కాంగ్రెస్ అహంభావం గురించి అందరికన్నా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం యాదృచ్ఛికం కాదు.
హర్యానాలో కాంగ్రెస్ ఓటమి ప్రధానంగా స్వయంకృతాపరాధమన్నది రాహుల్ గాంధీ మాటల్లోనే స్పష్టమవుతున్న విషయం. మిగిలిన నేతలను పక్కన పెట్టి కేవలం భూపేందర్ హుడా నే ఏకైక అధిపతిగా పోటీ పడాలనుకోవడం ఆ పార్టీ మొదటి తప్పిదం. తెలంగాణలో రేవంత్ రెడ్డి, కర్ణాటకలో డి.కె.శివకుమార్ వంటి గట్టి నేతలపై ఆధారపడటం వల్లనే గెలిచామని కాంగ్రెస్ అధిష్టానం వ్యూహకర్తలు భావించడం ఇందుకు కారణమని చెబుతున్నారు. అధిష్టానం చుట్టూ తిరుగుతూ అంతర్గత కలహాలలో మునిగి తేలడం అనే జాడ్యం ఆ పార్టీని ఇంకా వదిలిపెట్టలేదు. బిజెపి మతతత్వ వ్యూహాలనూ కులాలవారీ ఎత్తుగడలను గట్టిగా ఢకొీనడంలోనూ కాంగ్రెస్ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇందుకు తగినట్టే ప్రాంతీయ పార్టీలూ చీలిక వర్గాలు తమ మనుగడ కోసం కాంగ్రెస్, బిజెపి ల మధ్య దాగుడు మూతలాడే లక్షణాన్ని కొనసాగి స్తున్నాయి. ఇవన్నీ హర్యానా ఫలితాలపై ప్రభావం చూపించాయి. మతాన్ని రెచ్చగొట్టడంతో పాటు సామదానభేద దండోపాయాలతో అధికారంలోకి రావాలనే బిజెపి వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇవే అవరోధాలుగా మారుతున్నాయి. జాట్ ఆధిపత్య వర్గాలకు ప్రతిబింబమైన హుడానే నమ్ముకోవడంతో ఇతర తరగతుల వారు దూరమైనారని ఇప్పుడు ప్రతివారూ గుర్తిస్తున్నారు. అంతేగాక ఆయననే ఏక బిందువుగా చేసుకోవడంతో మిగిలిన కీలక నేతలు, వర్గాలు దూరమైనాయి. లోక్‌సభ ఎన్నికల నాటికీ శాసనసభ ఎన్నికలకూ మధ్య కాంగ్రెస్ ఓట్లలో వచ్చిన తేడా ఆశ్చర్యం కలిగించేంత వుందంటే ఇవన్నీ కారణాలే.
హర్యానా ఫలితాల విశేషాలు
హర్యానా ఎన్నికల ఫలితాలపై అనేక వ్యాఖ్యలు వెలువడ్డాయి గానీ లోక్‌సభ ఎన్నికల నాటికీ ఇప్పటికి ఇంతలోనే వచ్చిన తేడా నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. కనీసం 36 అసెంబ్లీ విభాగాల్లో దాని ఓట్లు అప్పటికంటే ఒకో చోట పదివేలకు పైగా పడిపోయాయి.18 స్థానాల్లోనైతే ఏకంగా 20 వేల చొప్పున తగ్గాయి. 28 నియోజక వర్గాలలో అయిదో వంతు ఓట్లు తగ్గిపోయాయి. మరీ ముఖ్యంగా హుడా కుటుంబ నియోజకవర్గమైన రోహ్తక్ లోక్‌సభ స్థానంలోని తొమ్మిది అసెంబ్లీ సీట్లలో అప్పుడు 7.83 లక్షల ఓట్లు వస్తే ఇప్పుడు కేవలం 5.93 లక్షలు వచ్చాయి. అంటే దాదాపు రెండు లక్షల ఓట్లు తగ్గిపోయాయి. నిజానికి హర్యానా వరకూ లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే శాసనసభలో కాంగ్రెస్ పుంజుకోవడమే గత రెండుసార్లు జరిగింది. ఇప్పుడు అది తారుమారైంది. పార్టీలో ముఠా తగవుల వల్ల, టికెట్టు రాని వారు పోటీ అభ్యర్థులుగా వుండటం లేదా ఓట్లు మరోవైపు మరలించడం వల్ల ఇలా జరిగిందని భావించక తప్పదు. అసలు అభ్యర్థుల కంటే రెబల్ కే చాలా ఎక్కువ ఓట్లు వచ్చిన సీట్లు కూడా వున్నాయి. బిజెపి ఓటింగు పెద్దగా పెరిగింది లేదు గానీ సీట్లు విపరీతంగా పెరిగాయి. కాంగ్రెస్ ఓటింగు ఊహించలేనంతగా పడిపోయింది. 2014లో అత్యధికంగా వచ్చిన దాన్ని మించి బిజెపికి 48 స్థానాలు రాగా కాంగ్రెస్‌కు 37 వచ్చాయి. ఐఎన్‌ఎల్‌డికి రెండు, ముగ్గురు స్వతంత్రులు కూడా గెలిచారు. బిజెపికి ఓట్లలో 39.9 శాతం, సీట్లలో 53.3 శాతం దక్కాయంటే ఐఎన్‌ఎల్‌డి, బిఎస్‌పి, హెచ్‌ఎల్‌పి కూటమితో లోపాయికారి అవగాహన కీలక పాత్ర వహించింది. సిస్రా స్థానంలో బిజెపి నేరుగా తన అభ్యర్థిని ఉపసంహరించుకుని ఈ కూటమికి మద్దతు ప్రకటించింది. మిగిలిన చోట్ల అవగాహన ప్రకారం ఓట్ల బదలాయింపు జరిగిందని పరిశీలకులు చెబుతున్నారు. సిస్రా లోక్‌సభ స్థానంలోనే తీసుకుంటే మూడు అసెంబ్లీ సీట్లలో బిజెపి ఓట్లు దారుణంగా తగ్గిపోగా మరో మూడు చోట్ల గణనీయంగా పెరిగాయి. అంటే ఇక్కడ ఒక అవగాహన ప్రకారమే పరస్పరం గెలిపించుకున్నారనే సందేహాలు సహజం. 18 వేల ఓట్లు తగ్గిన కాంగ్రెస్ మూడు అసెంబ్లీలు కోల్పోగా వాటిలో రెండు ఐఎన్‌ఎల్‌డికి, ఒకటి బిజెపికి వచ్చాయి. మరికొన్ని చోట్ల ఈ కూటమికి వచ్చిన ఓట్లు బిజెపి ఆధిక్యత కంటే ఎక్కువగా వున్నాయి. కనుక కావాలనే పోటీ పెట్టించారనే ఆరోపణలున్నాయి. ఇవన్నీ ఎన్నికలలో అసాధారణమేమీ కాదు గాని కాంగ్రెస్ అనైక్యత, ఆప్ వంటి పార్టీలను దూరం చేసుకోవడం ఘోరంగా దెబ్బ తినడానికి కారణమైనాయి. ఐఎన్‌ఎల్‌డి జాట్లు, దళితుల ఓట్ల కోసం కాంగ్రెస్‌తో పోటీ పడిందని గుర్తు పెట్టుకోవాలి. ఇంత క్లిష్ట పరిస్థితిలోనూ మైనార్టీ వర్గాలు మాత్రం కాంగ్రెస్‌కే ఓటు వేశారు గానీ బిజెపి మతతత్వ దాడిని ఆ పార్టీ గట్టిగా ఎదుర్కోలేదనే అసంతృప్తి వారిలోనూ వచ్చింది. ఐక్యత కోసం ప్రయత్నించి విఫలమై 89 చోట్ల పోటీ చేసిన ఆప్ 1.8 శాతం ఓట్లు తెచ్చుకుంది. కనీసం ఈ రెండు పార్టీలు కలిసివున్నా పరిస్థితి చాలా మారివుండేదని ఒక అంచనా. సమాజ్‌వాది పార్టీ కూడా ఈ విషయంలో తన అసంతృప్తిని వెలిబుచ్చింది.
ఇవిఎంలు, ఇతర పార్టీలు…
ఇక పది స్థానాల్లో ఇవిఎంల అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అసలు తాము ఈ ఫలితాలను ఆమోదించడం లేదని మొదట్లో జైరాం రమేష్ వంటి వారు ప్రకటించారు. ఇ.సి కి ఫిర్యాదు కూడా చేశారు. అయితే ప్రజల తీర్పును ఆమోదించ లేదని చెప్పడం అప్రజాస్వామికమని ఇసి ఆ పార్టీ ఆరోపణలపై విరుచుకుపడింది. ఎ.పి లో వైసీపీ కొన్నిచోట్ల ఆరోపించినట్లుగా ఇవిఎంల బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువగా వుండటం బట్టి తప్పు జరిగిందని ఆరోపించడం సరికాదని సమర్థించుకుంది. మరింత లోతుగా అధ్యయనం చేశాకే ఈ అంశంపై ముందుకు పోవాలని ప్రస్తుతానికి కాంగ్రెస్ నిర్ణయించింది. ఏమైనా లౌకిక పార్టీలనూ ‘ఇండియా’ భాగస్వాములను కలుపుకొని పోవడంలో వైఫల్యం, ఎన్నికల ఎత్తుగడలు, నినాదాల లోపాల గురించి ఇంతవరకూ మాట్లాడింది లేదు. గతంలో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ లలో జరిగిన తప్పులే ఇక్కడా పునరావృతమైనాయని అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శను పరిశీలించుకున్నదీ లేదు. ఒక విధమైన ఆశాభంగం అసహనంలో, అనైక్యత మరింత పెరుగుతున్న స్థితిలో వుండిపోయింది. ఈ ఫలితం తర్వాత ఢిల్లీలో తాము వంటరిగానే పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. యు.పి లో రానున్న ఉప ఎన్నికల్లోనూ ఎస్.పి కాంగ్రెస్‌ను దూరం పెడుతుందని మొదట కథనాలొచ్చినా అఖిలేశ్ యాదవ్ కలిసే పోరాడతామని స్పష్టం చేశారు. ఆ పార్టీ నాయకత్వం ఆత్మావలోకనం చేసుకోవాలని సిపిఎం కూడా సూచించింది. మహారాష్ట్రలోనూ ఇలాంటి విమర్శ ఇంతకు ముందే వుంది. హర్యానాలో బిజెపి మంత్రులు ఎనిమిది మంది ఓడిపోయారంటే ప్రజల్లో వ్యతిరేకత తక్కువ లేదని తెలుస్తుంది. అయితే లోక్‌సభ పోటీలోనూ ఇరు పార్టీలకూ సరిసమానంగానే సీట్లు వచ్చాయని కూడా గుర్తు పెట్టుకోవాలి. అందువల్ల ఈ ఫలితాన్ని మరీ ఏకపక్షంగా చూపించి బిజెపికి తిరుగులేదనో గొప్ప వ్యూహాలతో గెలిచిందనో టముకు వేయడం అర్థరహితం. ఎటొచ్చీ లౌకిక పార్టీలు కలసికట్టుగా గట్టిగా పోరాడవలసిన అవసరాన్ని హర్యానా ఫలితాలు హెచ్చరికగా నిలిచాయి.
కాశ్మీర్‌లో జరగాల్సిందేమిటి?
జమ్ము కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, దాని మిత్రులు పూర్తి మెజార్టీ సాధించారు గానీ కాంగ్రెస్ సీట్లు తగ్గిపోయాయి. కాన్ఫరెన్స్‌కు 42, బిజెపికి 29, కాంగ్రెస్‌కు 6, పిడిపికి 3, సిపిఎంకు 1, ఆప్‌కు 1, జెపిసికి 1, ఇండిపెండెంట్లకు ఏడు వచ్చాయి. బిజెపితో జట్టు కట్టిన పిడిపిని ఓటర్లు తిరస్కరించి నేషనల్ కాన్ఫరెన్సుకు పాలన అప్పగించారు. జమ్మూలో బిజెపికి సీట్లు, ఓట్లు కూడా బాగా వచ్చాయి. ఈ రెండు ప్రాంతాల ఆకాంక్షలను, అవసరాలను అందుకోవడం ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం ముందు సవాలుగా వుంటుంది. సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణ తమ మొదటి కర్తవ్యమని ఒమర్ ప్రకటించారు. అదే సమయంలో వ్యక్తిగతంగా ప్రధాని మోడీ పట్ల సానుకూల ధోరణిలో మాట్లాడటం కాశ్మీర్ పరాధీనతకు ఒక నిదర్శనం. ఏమైనా బిజెపి కాశ్మీర్‌లో ఓట్లను చీల్చడానికి అనేక వేర్పాటువాద పార్టీలను ఉపయోగించిందనే ఆరోపణలున్నాయి. పైగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు ముందే విస్తారమైన అధికారాలు కట్టబెట్టడంతో పాటు అయిదుగురు ఎంఎల్‌ఎలను నామినేట్ చేసే పెత్తనం కూడా ఇచ్చారు. ఆ విధంగా కేంద్ర పెత్తనం, బిజెపి కుయుక్తులు కొనసాగుతూనే వుంటాయి. నలుగురు ఇండిపెండెంట్ల మద్దతు ప్రకటించడంతో కాన్ఫరెన్స్‌కు సర్కారు ఏర్పాటు చేసే ఆధిక్యత వచ్చింది. కాంగ్రెస్, సిపిఎం, ఇండిపెండెంట్ సభ్యులను కలుపుకుంటే 53 సీట్లతో బలమైన మద్దతు వుంటుంది. ప్రజల తీర్పునకు అనుగుణంగా వేగంగా చర్యలు తీసుకోవడం అబ్బుల్లా కర్తవ్యం కాగా అందుకు పూర్తిగా సహకరించడం, తమ ఏకపక్ష నిరంకుశ పోకడలు మార్చుకోవడం కేంద్రంపై వున్న బాధ్యత.
– తెలకపల్లి రవి