విద్వేష క్రతువు

విశ్వ హిందూ పరిషత్‌ (విహెచ్‌పి) ఆదివారం నాడు విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో నిర్వహించిన హైందవ శంఖారావం సమాజంలో విద్వేషాలు నూరిపోసేందుకు ఉద్దేశించిన క్రతువులా అనిపిస్తోంది. సభా వేదిక మీద నుంచి చేసిన ప్రసంగాలు ఆ లక్ష్యంగానే సాగాయి. భవిష్యత్‌ కార్యాచరణను నిర్దేశిస్తూ ప్రకటించిన డిక్లరేషన్‌ ఆసాంతం సమాజంలో అలజడి రేపేదిగా ఉంది. హిందూ దేవాలయాల నిర్వహణను హిందూ సమాజానికే అప్పగించాలన్నది డిక్లరేషన్‌ ప్రధాన డిమాండ్‌. గుళ్లను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించి స్వయంప్రతిపత్తి కల్పిస్తూ చట్టం చేయాలన్నారు. ఆక్రమణలకు గురైన దేవాలయ భూములను ప్రభుత్వం తిరిగి ఆయా దేవాలయాలకు అప్పగించకపోతే బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. దేవాలయ సంస్థల్లో పని చేస్తున్న అన్య మతస్థులను తక్షణం తొలగించాలని అల్టిమేటం జారీ చేశారు. పండగలు, శోభాయాత్రల వంటి వాటిపై ఆంక్షలొద్దే వద్దని హూంకరించారు. తమ డిక్లరేషన్‌ను సాధించుకునేందుకు ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. ఆ విధంగా ప్రతిజ్ఞ సైతం చేయించారు. శంఖారావం డిక్లరేషన్‌ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది. ప్రజా వ్యతిరేకమైనది. ఈ డిక్లరేషన్‌ను ప్రజాస్వామ్య వాదులంతా అభిశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దేవాలయాలపై పెత్తనం కోసమే విహెచ్‌పి ఒక పథకం ప్రకారం పని చేస్తోందని డిక్లరేషన్‌ బట్టి అర్థమవుతుంది. చరిత్రను పరిశీలిస్తే ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరాలైనా రాజులు, జమిందార్లు, ఆ తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయి. లౌకిక దేశంలో ప్రభుత్వాల పరిధిలోనే ఉండాలి కూడా. రాజ్యాంగం పౌరులందరికీ మత స్వేచ్ఛ ఇచ్చింది. దానికి పరిమితులూ విధించింది. దేవాలయ వైదిక క్రతువుల్లో ప్రభుత్వ జోక్యం ఉండరాదు. వాటి పరిధిలోని విద్యాలయాలు, వైద్యశాలలు ఇతర సంక్షేమ కార్యక్రమాలు పరిపాలన, నిర్వహణ, వంటి లౌకిక వ్యవహారాలను ప్రభుత్వం చూడాలి. ప్రభుత్వ నియంత్రణ వలన ఆలయాలు అపవిత్రం అవుతున్నాయి కనుక వాటి నుంచి విముక్తి కల్పించాలనడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే. దేవాలయాలకు వెనకటి రాజులు, పోషకులు, జమీందార్లు, భక్తులు విలువైన ఆస్తులను అందించారు. వాటన్నింటి కబ్జా కోసమే ఈ ఆలయాల స్వాధీనం డిమాండ్‌గా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ లోని యోగి ఆదిత్యనాధ్‌ ప్రభుత్వమే యు.పి లో దేవాలయాలన్నింటినీ ప్రభుత్వ అధీనంలోకి తెస్తూ చట్టం తెచ్చింది. అయోధ్య రామాలయం ట్రస్టులో ప్రభుత్వ ప్రతినిధులున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ ట్రస్టుపై ఉంది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాశీలోని విశ్వేశ్వరస్వామి ఆలయం ట్రస్టు సైతం ప్రభుత్వ పరిధిలోనే నడుస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆలయాలను ప్రభుత్వ చెర నుంచి విముక్తికి పోరాడతానంటోంది విహెచ్‌పి. ఈ రెండు నాల్కల వైఖరేంటి?

శంఖారావాన్ని విహెచ్‌పి నిర్వహించినా బిజెపి ప్రధాన శక్తి అన్నది బహిరంగ రహస్యం. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి, పార్టీ ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు హాజరు కావడం ద్వారా అసలు విషయం అర్థమైపోతుంది. ఎపిలో బిజెపి ఉనికి కోసం ఎప్పటి నుంచో వెంపర్లాడుతోంది. కూటమి ప్రభుత్వంలో ఆ పని చేయాలని పథకం వేసింది. బిజెపి పెరగాలంటే దాని సహజ సిద్ధ ఎజెండా ప్రజల మధ్య విద్వేషాలు రాజేయడం. విహెచ్‌పి డిక్లరేషన్‌ను అందుకు ఉపయోగపెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. గుళ్లను రాజకీయ కేంద్రాలుగా, పండగలను మత ప్రచార కార్యక్రమాలుగా మార్చే ప్రయత్నం చేస్తోంది. గత వైసిపి ప్రభుత్వంలో రామతీర్థం, అంతర్వేది, తిరుపతి వంటి వాటిని ముందుకు తెచ్చింది. కొంత కాలం లడ్డూ వివాదం, సనాతన ధర్మం అంది. ఇప్పుడు ఏకంగా దేవాలయాల స్వాధీనం అంటోంది. దేవాలయ భూముల్లో దశాబ్దాల నుంచి ఉన్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి పేదలు గెంటివేతకు గురవుతారు. మతం ప్రాతిపదికగా దేవాలయ సంస్థల్లో పని చేసేవారు, వ్యాపారాలు చేసే వారిపై నిషేధం రాజ్యాంగ విరుద్ధం. సామాజిక న్యాయానికి విఘాతం కలిగిస్తాయి. ఇటువంటి కుట్రలను ప్రజలు అప్రమత్తతతో ఎదుర్కోవాలి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌లో మతోన్మాద కుయుక్తులు సాగవని చాటాలి.

➡️