ఆయనది యాభయ్యేళ్ల ప్రజా ఉద్యమం

ప్రజా నాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గాదె సుబ్బారెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. 68 సంవత్సరాల తన జీవిత కాలంలో 50 సంవత్సరాల పాటు ప్రజా ఉద్యమాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. తేలికగా డబ్బు సంపాదించడం, అవకాశవాదంతో భావాలు మార్చుకోవడం, కీర్తి కాంక్ష మొదలైన పోకడలు నయా ఉదారవాద విధానాల లక్షణాలుగా సమాజాన్ని ప్రభావితం చేస్తున్న కాలంలో అర్ధ శతాబ్దం పాటు ఉన్నత ఆశయాల కోసం కట్టుబడి పని చేయడం అరుదైన విషయం.
కమ్యూనిస్టు ఉద్యమానికి బలమైన ప్రాంతాలు తాడేపల్లి, ఉండవల్లి గ్రామాలు. సుబ్బారెడ్డి చిన్న వయసు నుంచే కుటుంబం అనేక దాడులు, ఇబ్బందులు ఎదుర్కొంది. 1970 ప్రాంతంలో ప్రారంభమైన ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమంలో మిలిటెంట్‌గా పనిచేశారు. తర్వాత గన్నవరం డివిజన్‌ యువజన సంఘంలో ప్రత్యేకంగా ఉయ్యూరు ప్రాంతంలో కేంద్రీకరించి పనిచేశారు. ఉద్యమ విస్తరణలో భాగంగా ఉయ్యూరు డివిజన్‌ సిపిఐ(ఎం) కార్యదర్శిగా బాధ్యత చేపట్టారు. పార్టీ అవసరాల ప్రాతిపదికపై గుడివాడ దివి తాలూకాలో బాధ్యతలను నిర్వహించారు. కృష్ణా జిల్లా తూర్పు ప్రాంతంలో గన్నవరం, ఉయ్యూరు, గుడివాడ, దివి డివిజన్లో పార్టీ ఎక్కడికి అవసరమంటే అక్కడికి కుటుంబంతో సహా వెళ్ళి దీక్షతో పని చేశారు. గుంటూరు జిల్లా ప్రజా నాట్యమండలి అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశారు. భార్య శివలీల మహిళా సంఘంలో పనిచేసేలా ప్రోత్సహించారు. ఆమె ఉయ్యూరు మండల ప్రజా పరిషత్‌ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై బాధ్యతలు నిర్వహించారు. కుటుంబాన్ని ఎక్కడకు మార్చినా ఆ ఇల్లు కార్యకర్తలకు కేంద్రంగా ఉండేది. ఇద్దరు కుమార్తెలను కూడా అభ్యుదయ భావాలతో పెంచారు.
కామ్రేడ్‌ సుబ్బారెడ్డి సాంస్కృతిక రంగంలో విలువైన అనుభవం గడించారు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా బహుముఖ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. మిన్ను విరిగి మీద పడ్డా నిబ్బరంగా వుండేవారు. ఎంతటి విషయాన్నైనా నిమిషంలో చెప్పేవారు. మార్క్సిజాన్ని జీవితాన్ని కలగలిపి చెక్కేవారు. నటన, నిర్వహణకు చిరునామాగా వుండేవారు. ఒక్కసారి పరిచయమైతే చాలు! ఆ స్నేహం చిరకాలం నిలిచిపోయేది. చెప్పలేని ఇగోలు కళాకారుల పనిలో చొరబడకుండా చూశారు. సమస్య ఏదైనా సరే ఆకట్టుకునేలా, ఆలోచింపచేసేలా స్కిట్‌ రాయడంలో నేర్పరి. ఎలా మొదలెట్టాలో, ఎక్కడ మలుపివ్వాలో, పంచ్‌ డైలాగ్‌లతో మనసునెలా తట్టాలో ఎరిగినవారు. ఆ నైపుణ్యంతోనే అలవోకగా ఆశువుగా స్క్రిప్ట్‌లు రాసేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటికలు, నాటకాలు రాసేటప్పుడు ప్రజల్లో ఉండే మాస్‌ సెంటిమెంట్‌ డైలాగులు చొప్పించేవారు. ”టామీ టామీ” నాటికలో పిచ్చికుక్క కరిచిన వ్యక్తిగా ఆయన వ్యక్తీకరించిన హావభావాలు, డైలాగులు, నటన హృదయాన్ని హత్తుకునే విధంగా ఉండేవి. ప్రజా ఉద్యమాలకు, పాదయాత్రలకు, పోరాట పాటలలో గాదె, పి.ఎన్‌.ఎం కవి ప్రజల భావాలను, స్పందనలను జోడించేవారు. అవి ప్రజలను మెప్పించేవి. ప్రముఖ గేయ రచయితలు వడ్లమూడి నాగేశ్వరరావు, దేవేంద్ర మొదలైన వారు కూడా సుబ్బారెడ్డిలో ఉన్న సృజనాత్మకతను గుర్తించారు.
విజయవాడలో నెలకొల్పిన మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం బృందంలో సుబ్బారెడ్డి ముఖ్య పాత్ర వహించారు. 2017లో విజయవాడలో ‘అమరావతి బాలోత్సవం’ను అద్భుతంగా నిర్వహించారు. ఆ కృషి ద్వారా వచ్చిన అనుభవాలతోనే రాష్ట్రంలో 30 ప్రాంతాలకు బాలోత్సవాలు విస్తరించాయి. మహబూబ్‌ నగర్‌లో రెండు బాలోత్సవాలకు రూపకల్పన చేసి వారందరనీ మెప్పించారు. జాషువా సాంస్కృతిక వేదిక కన్వీనర్‌గానూ సముచిత పాత్ర నిర్వహించారు. కరోనా కాలంలో కార్యక్రమాలను ఎలా రూపొందించాలనే సమస్య వచ్చింది. ఆన్‌లైన్‌లో 8 రోజుల పాటు జాషువా ఉత్సవాలు జరిగే విధంగా ప్లానింగ్‌ చేయడంలో కీలక పాత్ర ఆయనదే. ఆ సందర్భంగా నిర్వహించిన షార్ట్‌ ఫిలింస్‌ పోటీల కోసం 2,500 వీడియోలు రావడం విశేషం. ఇది ఒక వినూత్న ప్రక్రియ.
సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజాతంత్ర ఉద్యమానికి కార్యకర్తలను రాబట్టడం సుబ్బారెడ్డి అనుసరించిన గొప్ప నిర్మాణ పద్ధతి. ఉద్యమ అనుభవాల నుండి కార్యకర్తలను గుర్తించి రాబట్టడం ఆయన ప్రత్యేకత. అంతేగాక కార్యకర్తల కుటుంబాలలో విద్యా, వైద్యం, ఆర్థిక విషయాలపై శ్రద్ధ పెట్టడం, సరైన మార్గనిర్దేశం చేయడంలో దిట్ట. పార్టీయేతరులకు కూడా తోడ్పడేవారు. నలుగురినీ నవ్విస్తూ అందరిలో కలిసిపోయే వ్యక్తిత్వం ఆయనది. ఆయన మరణం ప్రజాతంత్ర ఉద్యమానికి, సాంస్కృతిక రంగానికి తీరని లోటు. దాన్ని భర్తీ చేయడం మన కర్తవ్యం. అదే కామ్రేడ్‌ సుబ్బారెడ్డికి మనమిచ్చే ఘనమైన నివాళి.

 

 వ్యాసకర్త మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి. మురళీకృష్ణ

➡️