అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడాలంటే యువకులు వారానికి 70 గంటలు పని చేయాలని ఇటీవల ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. గతంలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూడా దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. ఆయనను భవిష్ అగర్వాల్ సమర్థించారు. అయితే ఇక్కడ కేవలం అభివృద్ధి, వ్యాపార ప్రయోజనాలు మాత్రమే కనిపిస్తున్నాయని, వాటి వల్ల కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్యాలపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 70 గంటలు పని చేస్తే అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయని, అకాల మరణం ముప్పు కూడా పెరుగుతుందని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 55 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఎనిమిది లక్షల మంది మృతి చెందుతున్నట్లు డబ్ల్యుహెచ్‌ఓ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో మూడు వంతుల మంది మధ్య వయస్కులు లేదా అంతకన్నా పెద్దవారేనని తేలింది.
ఆసియాలో ఎక్కువ… ఐరోపాలో తక్కువ..
అధిక గంటల పని విధానం ఆసియాలో ఎక్కువగా.. ఐరోపాలో తక్కువగా ఉన్నది. ప్రపంచంలో తొమ్మిది శాతం కంటే ఎక్కువగా పిల్లలు, పెద్దలు సాధారణం కంటే అధిక గంటలు పని చేస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం…వారానికి 47.7 గంటలు పని చేసే కార్మికులు ఉన్న దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానంలో ఉన్నది. మరోవైపు కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి మొదలు కాగా, ఇంటి నుంచి పని చేసే వారు సగటున 3.6 గంటలు ఎక్కువ సేపు విధి నిర్వహణలో ఉంటున్నారని తేలింది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఒ.ఇ.సి.డి) గణాంకాల ప్రకారం అధిక పనిగంటల విషయంలో మొత్తం 187 దేశాల్లో భారతదేశానిది 136వ ర్యాంకు. భారతీయ శ్రామికులు సగటున ఏటా 1660 గంటలు పనిచేస్తూ, 2,281 డాలర్ల మేర తలసరి జిడిపి అందిస్తున్నారు.
వ్యాపార, పారిశ్రామికవేత్తల అభిప్రాయమదే..
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ఓలా భవిష్ అగర్వాల్ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార, పారిశ్రామికవేత్తలు అధిక పని గంటలకే ఓటు వేస్తున్నారు. ‘బాగా తినండి. దృఢంగా ఉండి. అలాగే, రోజుకు 18 గంటలు పని చేయండి’ అంటూ బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ శంతను దేశ్‌పాండే గతంలో లింక్డిన్‌లో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా 996 అనే రూల్‌ను ప్రతిపాదించారు. దాని ప్రకారం…ఉద్యోగులు వారంలో ఆరు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేయాలని సూచించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన సమయంలో ఎలాన్ మస్క్ కూడా సంస్థ మనుగడ కోసం వారానికి వంద గంటలు పని చేయాలని ఉద్యోగులకు మెయిల్ చేశారనే చర్చ జరిగింది.
తీవ్రమైన ఆరోగ్య సమస్యలు
ఆరు రోజుల పని దినాల ఉద్యోగాల్లో వారానికి 70 గంటలు పని చేస్తే రోజుకు 14 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన ప్రభుత్వ కార్యాలయాల్లో 8 గంటల పనితో 6 రోజుల పని నిర్వహణతో వారానికి 48 గంటలు పని చేస్తున్నారు. అదే ప్రైవేట్ కార్యాలయాల్లో రోజుకు పది గంటల పనితో వారానికి 60 గంటలు పని చేయిస్తున్నారనే చర్చ ఉన్నది. వారానికి 55 లేదా అంత కంటే ఎక్కువ గంటలు పని చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 35 శాతం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 35-40 గంటలు పని చేసే వారితో పోలిస్తే, గుండె జబ్బులతో మరణించే ప్రమాదం 17 శాతం ఎక్కువని చెబుతున్నారు. సుదీర్ఘ పని గంటలు అధిక బరువు, ప్రీడయాబెటిస్, టైప్ 2 మధుమేహం వంటి ప్రమాదాలను కూడా పెంచుతాయని పేర్కొంటున్నారు. వారానికి 69 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేసే వారు వారానికి 40 గంటలు పనిచేసే వారి కంటే తీవ్రమైన నిస్పృహ లక్షణాలను కలిగి ఉంటారని వివరిస్తున్నారు. అంతే కాకుండా ఐ.టి, టేబుల్ వర్క్ లాంటి ఉద్యోగాలు చేసే వారు పది గంటల కంటే ఎక్కువగా కూర్చుంటే మెదడుకు రక్త ప్రసరణ తగ్గడం, ఏకాగ్రత కోల్పోవడం, పనులపై దృష్టి పెట్టలేకపోవడం, డిప్రెషన్, యాంగ్జయిటీ, ఒత్తిడి స్థాయి పెరగడం వంటి సమస్యలు వస్తున్నట్లు తేలింది.
మహిళల పరిస్థితి మరింత దయనీయం
పురుషులతో పోలిస్తే మహిళలు అలా అధిక సమయం పని చేయడం చాలా కష్టం. ఒక నివేదిక ప్రకారం మహిళల కంటే పురుషుల వేతనాలు 1.2-1.3 రెట్లు అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇంటి పనికి సంబంధించి పురుషుల కంటే మహిళలు రెట్టింపు సమయం వెచ్చిస్తారు. దీంతో పురుషులతో పోలిస్తే వారికి రెస్ట్ తీసుకునే సమయం 24 శాతం తక్కువగా ఉంటుంది. దీంతో అధిక పని గంటల కారణంగా మహిళా కార్మికులపై ఒత్తిడి పెరుగుతున్నది. దీంతో కార్మిక శక్తిలో మహిళల శాతం రోజురోజుకు తగ్గిపోతున్నదని ప్రపంచబ్యాంకు పేర్కొన్నది.
కార్మిక చట్టాల ప్రకారం…
చాలా దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర పని గంటలు ఎక్కువే. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో ఇది 40 గంటలే. ఆస్ట్రేలియాలో అయితే 38 గంటలు. అయితే ఓ వైపు అధిక పని గంటలతో మరణాలు సంభవిస్తుండగా…మరోవైపు నిరుద్యోగ శాతం కూడా ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్నది. భారత దేశంలో సంభవిస్తున్న ఆత్మహత్యలలో పది శాతం నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులే కారణంగా తేలుతున్నది. నిరుద్యోగ యువతలో 2 శాతం మందికి 30 ఏళ్లకు కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. ఇదిలా ఉండగా వ్యాపార, పారిశ్రామికవేత్తలు పని గంటలు పెంచాలని చెబుతుండడం విమర్శలకు తావిస్తున్నది.
– వ్యాసకర్త సెల్ : ఫిరోజ్ ఖాన్, 9640466464