హిందూత్వ-కార్పొరేట్‌ దిశ

Jun 11,2024 05:55 #Articles, #edit page, #PM Modi

నరేంద్ర మోడీ నేతృత్వాన కేంద్రంలో బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఆదివారం అట్టహాసంగా కొలువుదీరింది. మొత్తం 71 మందితో ప్రధాని మోడీ తన కొత్త మంత్రి మండలిని నియమించగా, 30 మందికి కేబినెట్‌, ఐదుగురికి స్వతంత్ర, 36 మందికి సహాయ మంత్రి హోదా కల్పించారు. యువత, అనుభవజ్ఞ నేతల కలబోతగా మోడీ స్వీయ భుజకీర్తులు తగిలించుకున్నప్పటికీ, ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి, పరివార్‌లకు చెందిన కీలక వ్యక్తులకే ప్రాధాన్యతనిచ్చారని ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల జాబితాను చూస్తే అర్థమైపోతుంది. కేబినెట్‌లోకి తీసుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, జెపి నడ్డా, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తదితరులందరూ సంఫ్‌ు నాయకులే. గత రెండు పర్యాయాలకు భిన్నంగా ఈమారు బిజెపికి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరిపడా మెజార్టీ కోల్పోయింది. ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీలతో కలిసి మూడవ తడవ సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసింది. అయినప్పటికీ తన హిందూత్వ ఎజెండా అమలును వీడకుండా మంత్రి మండలిలో సంఫ్‌ు పరివార్‌ నేతలను చొప్పించడం సాహసమే! తద్వారా తమ అసలు సిసలు లక్ష్యం నుంచి పక్కకు పోలేదని స్పష్టమైన సంకేతమే ఇచ్చింది.
మోడీ ప్రభుత్వాన్ని ‘3.0’ అని బిజెపి హోరెత్తిస్తుండగా, నియమించిన 71 మంది మంత్రుల్లో ఒక్కరు కూడా ముస్లిం మైనార్టీ లేరు. ఆ సామాజిక తరగతికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులెవరూ బిజెపికి లేరని తప్పించుకోడానికి కుదరదు. రెండు సభల్లో సభ్యత్వం లేకుండానే పంజాబ్‌కు చెందిన రవనీత్‌సింగ్‌ బిట్టు, కేరళకు చెందిన జార్జి కురియన్‌లను మంత్రులను చేశారు మోడీ. కేరళలో ఎల్‌డిఎఫ్‌, పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వాలున్నందున, అక్కడ రాజకీయ లబ్ధిని ఆశించి ఎం.పి.లు లేకపోయినా ఆ కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీన్నిబట్టి చూస్తే కావాలనే ముస్లింలకు మంత్రి మండలిలో చోటు కల్పించలేదని అర్థమవుతుంది. మహిళలు ఏడుగురికే అవకాశమిచ్చారు. మోడీ టీంలోకి ఏడుగురు ఎస్‌సిలను, ముగ్గురు ఎస్‌టిలను మాత్రమే తీసుకున్నారు. ఇదీ ‘అత్యద్భుత’ 3.0 మోడీ కేబినెట్‌లో అమలు జరిపిన సామాజిక న్యాయం. మోడీ పీఠానికి ఉన్న నాలుగు కాళ్లల్లో ఒకటి టిడిపి, కాగా రెండవది జెడియు. చంద్రబాబు, నితీష్‌ కుమార్‌ పార్టీలు లేకపోతే మోడీ సర్కారు లేదు. వీరిద్దరూ మహిళాభ్యున్నతికి, సామాజిక న్యాయానికి, ముస్లింల రక్షణకు కట్టుబడి ఉన్నామంటారు. మోడీ కేబినెట్‌లో మహిళలకు, ఎస్‌సి, ఎస్‌టిలకు సరైన ప్రాతినిధ్యం కల్పించకపోయినా, ఒక్క ముస్లింనూ మంత్రిని చేయకపోయినా ఎందుకు గమ్మునున్నారో తెలీదు.
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, బిజెపి, మోడీ తమ భాగస్వామ్య పక్షాలను అదుపులోనే ఉంచారని మంత్రుల ఎంపికను చూస్తే అవగతమవుతుంది. ఎ.పి.లో 16 ఎం.పి. స్థానాలను గెలిచిన టిడిపికి ఒక కేబినెట్‌, ఒక సహాయ మంత్రితో సరిపెట్టారు. జెడియుకు సైతం అంతే. ఒకటి రెండు సీట్లున్న పార్టీలకూ అదే మోతాదులో మంత్రి పదవులిచ్చారు. కేరళలో ఒకే ఒక్క సీటును బిజెపి గెలవగా ఆ ఒక్కరికీ మంత్రి పదవి కట్టబెట్టారు. ఒక్క సీటూ గెలవకపోయినా తమిళనాడు నుంచి ఇద్దరిని మంత్రులను చేశారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణకు ఇచ్చిన ఇద్దరు మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు నేపథ్యం సంఫ్‌ుతోనే ముడిపడి ఉంది. ఎ.పి.లో బిజెపి మూడు స్థానాలు గెలవగా మంత్రి పదవి వచ్చిన భూపతిరాజు శ్రీనివాస వర్మది విహెచ్‌పి, ఎబివిపి బడే. సంఫ్‌ు మూలాలు లేనందునే పురందేశ్వరి, సిఎం రమేష్‌లకు, తెలంగాణలో భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ ఈటల రాజేందర్‌కు ఛాన్స్‌ ఇవ్వలేదని అర్థమవుతుంది. పట్టాభిషేక మహోత్సవంగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి కార్పొరేట్‌ దిగ్గజాలైన ముఖేష్‌ అంబానీ, అనంత్‌ అంబానీ, గౌతం అదానీ, ఆనంద్‌ పిరమాళ్‌ వంటి వారు స్వయంగా హాజరయ్యారు. సంఫ్‌ు నేతలతో మోడీ కేబినెట్‌, ఆ బృందానికి కార్పొరేట్ల సంపూర్ణ ఆశీర్వచనాలను చూస్తుంటే తిరిగి హిందూత్వ-కార్పొరేట్‌ పాలనే కొనసాగుతుందని అర్థమవుతోంది. యావత్‌ ప్రతిపక్షం, ప్రజలు అప్రమత్తమై సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సి ఉంది.

➡️