ప్రజలతో పెనవేసుకున్న జీవితం ఆయనది

May 29,2024 09:15 #editpage

నేడు కా|| జక్కా వెంకయ్య వర్థంతి
కామ్రేడ్‌ జక్కా వెంకయ్య నెల్లూరు ప్రజలందరికి సుపరిచితుడు. పోరాట యోధుడు. సిద్ధాంతకర్త. వర్గ దృక్పధం నరనరాన జీర్ణించుకుని కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆచరించిన వ్యక్తి. గతితార్కిక భౌతికవాద సూత్రాలను, రాజకీయ అర్థశాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసి రాష్ట్రమంతా అనేక రాజకీయ పాఠశాలల్లో బోధించారు. సాధారణ అంశం, ప్రత్యేక అంశం ఆధారంగా సమస్యలకు సలహా చెప్పేవారు. 70 సంవత్సరాల స్వచ్ఛమైన, ఆదర్శవంతమైన, ప్రజలతో గాఢంగా పెనవేసుకున్న జీవితం ఆయనది.
స్వంత ఆస్తిని, తన జీవితాన్ని పార్టీకి అంకితం చేసిన వ్యక్తి. ప్రజలకు వెంకన్నగా, పార్టీకి జె.వి గా సుప్రసిద్ధుడు. జిల్లాలో సి.పి.ఎం పునర్నిర్మాణంలో ఆయనది ముఖ్య పాత్ర. అనేక ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోసిన ప్రజా నాయకుడు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి. వ్యవసాయ కార్మికులకు కూలి రేట్ల పెంపుదల, బంజరు, మిగులు భూములు, చెరువు లోతట్టు భూములు వేలాది ఎకరాలు పేదలకు దక్కేందుకు పెద్ద వర్గ ఉద్యమాలను నడిపారు. భూస్వాములు, గ్రామ పెత్తందార్లు జిల్లాలో పేదల పైన జరిపిన దాడులకు, సాంఘిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి. 1979లో జిల్లాలో జరిగిన భూ పోరాటం ఓ మైలు రాయి. 1100 మంది అరెస్టయి బెయిల్‌ తీసుకోకుండా ఆయనతో పాటు 11 రోజులు జైలులో ఉన్నారు. దోపిడీకి గురవుతున్న రైతాంగ సమస్యలను ఆయన వెలుగులోకి తెచ్చాడు. నీటి పారుదల, వ్యవసాయ రంగంపై అపారమైన అనుభవమున్న వ్యక్తి. ఆయన సలహాలు జిల్లా వ్యవసాయ రంగానికి ఎంతో తోడ్పడ్డాయి. నేటికీ ప్రామాణికంగా ఉన్నాయి. రెండు సార్లు అల్లూరు శాసన సభ్యునిగా ఎన్నికై ఆ పదవికే వన్నె తెచ్చాడు. జిల్లాలో సాగిన అక్షరాస్యత, మత సామరస్య, అఖిలపక్ష రైతు ఉద్యమాలలో, సారా వ్యతిరేక పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రజా నాయకుడు. కమ్యూనిస్టుగా జీవితాంతం ఉన్నత విలువలు పాటించి పార్టీ, ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న వెంకన్న 88 ఏట అమరుడైనాడు. 43 సంవత్సరాల పాటు ఆయనతో కలిసి పని చేయడం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది.
పార్టీ విస్తరణలో ….
నక్సలైట్ల చీలికతో 1969 లో జిల్లాలో పార్టీ చాలా బలహీన పడింది. 17 మంది జిల్లా కమిటీ సభ్యులలో 15 మంది నక్సలైటు ఉద్యమంలోకి వెళ్లారు. కా.వెంకయ్య, అల్లూరు ఏరియా సీనియర్‌ నాయకులు బీమవరపు శేషయ్య మాత్రమే పార్టీలో మిగిలారు. రాష్ట్ర కేంద్రాన్ని బలపరచుకునేందుకు విజయ వాడకు వచ్చి రాష్ట్ర కేంద్రంలో పని చేయమని రాష్ట్ర కమిటీ కా.వెంకయ్యను కోరింది. తాను నెల్లూరులోనే ఉండి జరిగిన నష్టాన్ని పూడ్చుకుని జిల్లా వ్యాపిత ఉద్యమాన్ని నిర్మిస్తానని చెప్పారాయన. విద్యార్థి ఉద్యమం నుంచి కార్యకర్తలను, హోల్‌టైమర్లను తయారు చేసుకుని నెల్లూరు జిల్లా పాత 10 నియోజక వర్గాలకు పార్టీని విస్తరించారు. జిల్లా వ్యాపిత ఉద్యమంగా మార్చారు. జిల్లా వ్యాపిత ఉద్యమం నిర్మించడం ద్వారా ఆయన వారికి సమాధానం చెప్పారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కృష్ణపట్నం పోర్టు, కడప రైల్వే లైను, జెన్కో ఆధ్వర్యంలో విద్యుత్‌ ప్లాంటు, వెనుకబడిన ఉదయగిరి ప్రాంతానికి సీతారామ సాగర్‌ నిర్మించాలని 1990 ఆగస్టు 15న నెల్లూరు పెన్నా బ్రిడ్జ్‌ నుంచి గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ వరకు 10 వేల మందితో మానవ హారం నిర్మించి వాటి సాధనకు ఆయన నాయకత్వంలో పెద్ద కృషి జరిగింది. కృష్ణపట్నం పోర్టు జెన్కో కేంద్రాలు కూడా ఏర్పడ్డాయి.
శాసన సభ్యునిగా …
జక్కా వెంకయ్య 1985, 1994, అసెంబ్లీ ఎన్నికల్లో అల్లూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేడు పాలక వర్గ పార్టీలు శాసనసభకు రూ. 20 నుంచి రూ. 30 కోట్లు, పార్లమెంటుకు రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. 1985, 1994 ఎన్నికల్లో స్వల్ప మొత్తాలు మాత్రమే ఖర్చు పెట్టి ఆదర్శంగా నిలిచారు. రెండు మార్లు ఆయన పాదయాత్ర ద్వారా తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు 25 మంది దళ సభ్యులు, 10 మంది కళాకారుల బృందం, ఒక చక్కబండి మీద మైకుతో ప్రచారం చేశారు. ఎలాంటి ప్రచార రధాలు, కార్లు, జీపులు ఆర్భాటాలు లేవు. వెంకయ్య, దళ సభ్యులందరూ దళితవాడల్లో బస చేసేవారు. ఎమ్మెల్యే వేతనం పార్టీకి చెల్లించి పార్టీ హోల్‌టైమర్లుకు ఇచ్చే వేతనంతోనే చివరి వరకు జీవించిన ఆదర్శనీయుడు. శాసనసభలో వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టాడు. అయితే ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు. జిల్లాలో వరదలు వచ్చినపుడల్లా 2000 గొలుసు కట్టు చెరువులు తెగి రైతులకు, వ్యవ సాయానికి భారీ నష్టం జరుగుతుండేది. ఆయన దీనిపైన శాస్త్రీయ ఆలోచన చేయడమేగాక, జిల్లాలో పాదయాత్ర నడిపి…అసెంబ్లీలో దీనిపై చర్చ పెట్టి నిధులు కేటాయింపు చేసి చెరువులు తెగకుండా కృషి చేశారు. ఆక్వా రైతులకు మీటర్లు వద్దని, రైతులకు మద్దతు ధర ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు భూములు, ఇళ్ల స్థలాలు, చెరువు లోతట్టు భూములు పంచాలని పేద రైతుల వద్ద కొద్దిపాటి ప్రభుత్వ భూమి ఉన్నా తీసుకోవద్దని తీర్మానం చేయడంతో రైతులందరు వ్యవసాయ సమస్యలపైన ఆయన దగ్గరకు వచ్చేవారు. ఏనాడూ వ్యక్తిగత సమస్యలపై పోలీసు స్టేషన్లకు ఫోన్‌ చేసేవారు కాదు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేవాడు. దాంతో అధికారులు, రైతులు, కూలీలు, ఆయన పట్ల ఎంతో గౌరవ భావనతో ఉండేవారు. ఇరిగేషన్‌ విషయాలలో నాటి కలక్టరు జన్నత్‌ హుస్సేన్‌, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఆయన సలహాలు తీసుకునేవారు.
నిరాడంబర జీవితం
పుట్టింది భూస్వామ్య కుటుంబం. ఉన్న ఆస్తిని పార్టీకి ఇచ్చి సాదా జీవితం గడిపారు. 7 సంవత్సరాల పాటు పార్టీ ఆఫీసులో చిన్న గదిలో తానే వంట చేసుకుంటూ తన బట్టలు తానే ఉతుక్కుని రెండు బెంచీలను మంచంగా మార్చుకున్నారు. గదిలో ఫ్యాను కూడా వుండేది కాదు. అప్పటికి పార్టీ ఆఫీసులో రూములలో ఫ్యాన్లు లేవు. 2004లో ఆయనకి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అత్యంత ప్రమాదకర పరిస్థితి నుంచి మనోధైర్యంతో వైద్యం చేయించుకుని, చనిపోయేవరకు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన సతీమణి పార్వతమ్మ ఇంటికి వచ్చినవారందరిని ఎంతో ఆదరణతో గౌరవించేవారు. కుటుంబ సభ్యులంతా వెంకయ్య బాటలోనే నడిచారు.
ఉద్యమ పధంలో…
నెల్లూరు జిల్లా కమ్యూనిస్ట్‌ ఉద్యమంలో 21 మంది నాయకులను, కార్యకర్తలను…భూస్వాములు, గూండాలు హత్య చేశారు. వాటన్నిటిని ఎదుర్కొని, ఆ కుటుంబాలన్నిటికి పునరావాసం ఏర్పాటు చేసి ఉద్యమం దెబ్బ తినకుండా ధైర్యంగా నిలబడ్డారు. పెనుబల్లి గ్రామంలో ఒక హత్య కేసులో ఆయనను ఇరికించారు. 1979లో జరిగిన భూ పోరాటంలో జిల్లా అంతటా వేలాది మంది భూములలోకి దిగి భూములు ఆక్రమించుకున్నారు. కొన్ని సాధించుకున్నారు. పోలీసులు దీనిని దుర్మార్గంగా అణచివేసేందుకు పేదలపై కాల్పులు జరపగా గాలంకి తిరిపాలు అమరుడయ్యారు. మరొక మహిళా కార్యకర్త రమణమ్మ చేయి తెగిపడింది. సోమరాజు పల్లిలో జరిపిన కాల్పులలో కా|| నరసయ్యకు చేయి తెగిపోయింది. ఉద్రిక్తంగా జరిగిన ఈ పోరాటంలో ఆయన పాత్ర స్ఫూర్తిదాయకం. అన్ని కష్ట సమయాలలో పార్టీని కాపాడటంలో వెంకయ్య విశేషంగా కృషి చేశారు. డా.జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నిర్మాణం 2012లో ప్రారంభమైంది. ఆయన చనిపోయే వరకు విజ్ఞాన కేంద్ర నిర్వహణకు ఎంతో కృషి చేశారు.
కామ్రేడ్‌ జక్కా వెంకయ్య జీవితం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకే కాక ప్రజలందరికీ ఆదర్శం. కామ్రేడ్‌ సుందరయ్య, డా. శేషారెడ్డి, డా. దశరధ రామి రెడ్డి స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చిన జక్క వెంకయ్య…కా. సుందరయ్య లాగే ఆదర్శవంతమైన జీవితం గడిపారు. ఆయన ఆశయ సాధన మన లక్ష్యం. అదే మనం ఆయనకిచ్చే ఘనమైన నివాళి.
(నెల్లూరు జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నేడు
జక్కా వెంకయ్య మెమోరియల్‌ హాలు ప్రారంభ సందర్భంగా)

చండ్ర రాజగోపాల్‌

/ వ్యాసకర్త సి.పి.ఎం నెల్లూరు జిల్లా పూర్వ కార్యదర్శి /

➡️