విద్వేష ప్రచారం విభజన కుట్రలకే ఊతం

పహల్గాంలో పర్యాటకుల అమానుష హత్యాకాండపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు కొనసాగుతున్నాయి. కంప్యూటర్‌ మోనిటర్లపైన, స్మార్ట్‌ఫోన్ల తెరలపైన కనిపించే చిత్రాలతో ఘటనలను కథనం చేసే ప్రస్తుత కాలంలో ఈ ఘోరమైన సన్నివేశాన్ని గురించి ఎవరైనా ఇంకేం ఆశించగలుగుతారు? వారిలో మృతులను మతపరంగా నిర్ధారించుకొని మరీ ప్రాణాలు తీసినట్టు తెలిసి రావడంతో ఈ బాధ మరింత తీవ్రమవుతున్నది. అలాంటి ఘాతుక చర్య ఆలోచనా శక్తిగల వారిని కదిలించకుండా ఉండదు. ఇందుకు కారకులైన నేరస్తులను ఎంత తీవ్రంగా ఖండించినా తక్కువ అవుతుంది.
అయితే ఈ రోజున ఈ ఘాతుకానికి పాల్పడిన వారి పట్ల, వారిని నడిపించే వారి పట్ల ఒక జాతిగా, దేశంగా, ప్రజానీకంగా సమైక్యంగా ఎలా స్పందించాలన్నది మన ముందున్న సవాలు. ఇది కచ్చితంగా అవసరమైనది. ఆ పని జరిగేలా చూడడం కోసమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటైంది. ఆ సమావేశం ముక్త కంఠంతో ఈ ఘాతకాన్ని ఖండించటమే కాక నేరస్తులను పట్టుకోవడంలో సహకరించాలని తీర్మానించింది. ఈ క్లిష్ట సమయంలో చర్య తీసుకోవడానికి అసాధారణమైన రీతిలో అంత విస్తృత ప్రాతిపదికన ఆమోదం తెలపడం అంటేనే ఈ సవాలు తీవ్రత ఎంతో తెలుస్తుంది.

చేయకూడనిదేంటి?
ఈ సమయంలో చేయవలసింది ఏమిటి, చేయకూడనిది ఏమిటి అన్నది తక్షణం నిర్ణయించుకోవాల్సిన అంశం. ఏం చేయాలన్నది ప్రభుత్వం మాత్రమే నిర్ణయించగలుగుతుంది. అయితే విభిన్నతతో కూడిన ప్రజలుగా మనం ఏం చేయకూడదో కూడా ఏకశిలా సదృశ్యమైన ఐక్యతతో నిర్ణయించుకోవాలి. ఇప్పుడు, బహుశా ఎప్పుడూ…టెర్రరిస్టులు భారతీయుల వైవిధ్యాన్ని దెబ్బకొట్టదగిన ఒక బలహీనతగా పరిగణించి దాడులు గురిపెడుతుంటారు. కనుక బైసరన్‌లో మృతులను మతాన్ని బట్టి ఎంపిక చేయడం వెనుక ఉన్న దుష్ట కుట్ర అర్థం అవుతుంది. తద్వారా ప్రజలను మతపరంగా విభజించాలనే టెర్రరిస్టు నేరస్తుల కుటిల పన్నాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సాగినవ్వరాదు.
అయితే కచ్చితంగా ఈ విషయంలోనే ప్రజలమైన మనం హిందుత్వ ప్రచారాలకు లోబడిపోయే అవకాశం వుంటుంది. రాజకీయ సైద్ధాంతిక ఆధిక్యత కోసం ఇలాంటి మత సమీకరణాన్ని అంచుల దాకా తీసుకుపోవడం ఆ ప్రచారం లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రధాన స్రవంతి కార్పొరేట్‌ మీడియాను సాధనంగా చేసుకుంటారు. ఎందుకంటే అది ఎప్పుడూ పాలక వ్యవస్థల పట్ల మొగ్గు చూపుతుంది.

సోషల్‌ మీడియాలో విష ప్రచారం
అయితే విజ్ఞతకు, సుస్థిరతకు అసలైన ముప్పు సోషల్‌ మీడియాలో విషపూరిత కోణాల నుంచి ఉత్పన్నమవుతోంది. ఈ విచ్ఛిన్నత ప్రాణాంతక స్వభావం సంతరించుకోవడానికి కారణం కూడా ఉంది. హిందూత్వ శక్తులు, వారి సమాచార విభాగం ఐటీ సెల్‌ ఆధ్వర్యంలో విద్వేష పూరితమైన కట్టుకథలు వదలడానికి ఒక యంత్రాంగం ఏర్పాటు చేశారు. కొంతకాలం కిందట అమిత్‌ షా మాట్లాడుతూ తాము 32 లక్షల వాట్స్‌అప్‌ గ్రూపులు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా ఏ విషయమైనా గంట లోపలే దేశమంతా వైరల్‌ చేయగలమని ప్రకటించారు.
దీని ఫలితాలు అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అసత్య ప్రచారాల విద్వేష ప్రభావంపై యునెస్కో ఇప్‌సాస్‌ నిర్వహించిన సర్వే ఈ వాస్తవాన్ని వెల్లడించింది. భారతదేశంలో ఆ సర్వేకు స్పందించిన 64 శాతం మంది అసత్య కథన వార్తలు, విద్వేషాలు వ్యాప్తిలో సోషల్‌ మీడియాదే ప్రధాన నేరస్థ పాత్ర అని చెప్పారు. దురదృష్టవశాత్తు భారతీయ పట్టణ వాసుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు (56 శాతం) వార్తలు, కథనాలు తెలుసుకోవడానికి తాము సోషల్‌ మీడియా సమాచారంపైనే ఆధారపడతామని కూడా చెప్పారు. పహల్గాం దారుణ ఘటన తర్వాత సాధారణంగా కాశ్మీరీలు, ప్రత్యేకించి ముస్లింలు లక్ష్యంగా సోషల్‌ మీడియాలో విద్వేష ప్రచారం పొంగిపొర్లింది.

కాశ్మీరీల సంఘీభావం
క్షేత్రస్థాయి వాస్తవాలు వేరుగా ఉన్నప్పటికీ ఇలా జరగడం గమనించదగింది. మృతులు, బాధితుల పట్ల సంఘీభావం తెల్పడంలో కాశ్మీరీలు అగ్ర భాగాన నిలబడ్డారు. కాశ్మీరీ ముస్లిం పోనీ అశ్వికుడు టెర్రరిస్టుల నుంచి తుపాకీ లాక్కుని ఎదురు దెబ్బ తీయబోగా తనపై తూటాల వర్షం కురిపించి ప్రాణాలు తీశారు. పర్యాటక రంగంతో ముడిపడిన డ్రైవర్లు, ఇతర స్థానికులు సౌకర్యార్థం ఆహారం నుంచి వసతి సదుపాయం వరకు సమస్తమూ సమకూర్చారు. టెర్రరిస్ట్‌ ఘాతుకాన్ని ఖండిస్తూ కశ్మీర్‌ లోయలో పట్టణాలు, నగరాలన్నిటా పూర్తి బంద్‌ పాటించి దుకాణాలన్నీ మూసి వేశారు. దానివల్ల తమ ఉపాధి పోతుందని తెలిసినా తక్కిన దేశంతో పాటు వారు ఆ విధంగా చేయడం అపూర్వమైన చర్య. మూలాల నుంచి వ్యక్తమైన ఈ ప్రజా కార్యాచరణను మరింత ప్రతిబింబిస్తూ జమ్ము కాశ్మీర్‌ శాసనసభ అసాధారణమైన మానవతతో సంఘీభావం వెల్లడించింది.

గుండెలు పిండే కథ
అయితే పహల్గాం పచ్చిక బైళ్లలో జరిగిన ఈ హత్యాకాండలో నౌకా దళాధికారి అయిన తన భర్తను కోల్పోయిన హిమాన్షి నర్వాల్‌పై అత్యంత విషపూరితంగా సైబర్‌ దాడి సాగించటం అన్నిటిని మించి మనసును కలచివేస్తుంది. మనం ఎంత ప్రమాదకరమైన అగాధపు లోతుల్లో దిగబడి పోయామో ఆమె హృదయ విదారక స్థితిని బట్టి తెలుస్తుంది. తన భర్త మృతదేహాన్ని ఒళ్ళో పెట్టుకున్న హిమాన్షి శోక తప్త వదనమే ఈ విషాదం తీవ్రతను, నేరం అమానుషత్వాన్ని చెప్పేలా వైరల్‌ కావడం మరింత విపరీతం. అయినా ఆమె అంత విషపూరితమైన దాడులకు ఎందుకు గురికావాల్సి వచ్చిందంటే ఆమె అచంచలంగా ఇచ్చిన జవాబే కారణం. ”ముస్లింలకు, కాశ్మీరీలకు వ్యతిరేకంగా ప్రజలు దాడి చేయాలని మేము కోరుకోవడం లేదు. మాకు న్యాయం మాత్రం కావాలి” అని ఆమె అనడం, విద్వేష వర్గాలతో గొంతు కలపడానికి నిరాకరించడం వారు భరించలేక పోయారన్నమాట.
మానవత్వం లేని ద్వేషపూరితమైన ఈ ప్రవర్తనను హిందుత్వ అగ్ర పీఠాధిపతులు ఖండించకుండా ప్రమాదకరమైన మౌనం పాటించారు. జాతీయ మహిళా కమిషన్‌ చాలా మొక్కుబడిగా ఒక ట్వీట్‌తో ఇది నైతికంగా సరైంది కాదని ప్రకటించింది గాని దీని వెనక ఉన్న సైద్ధాంతిక మూలాలను బయట పెట్టడం అటుంచి, ఈ అంతర్జాల పోకిరీలపై చట్టపరమైన శిక్ష, చర్యలకు కదలిక చూపలేదు. ఇది ఎంత మాత్రం ఆమోదం, ఆమోదయోగ్యం కాదు. ఈ వైఖరి టెర్రరిస్టుల పథకాల వలల్లో చిక్కుకోవడానికే దారితీస్తుంది.

– మే 7 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సౌజన్యంతో

➡️