ఒక దేశం అభివృద్ధి చెందటం అంటే ఏమిటి? విద్య, వైద్యం, నివాసం, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలు అందరికీ అందుబాట్లో ఉండడం. వీటి లేమి కారణంగా ఏ ఒక్కరూ జీవనానికి ఇబ్బంది పడకుండా బతకడం. కానీ, ఆచరణలో మన అభివృద్ధి అత్యంత అసమంగా ఉంది. కనీస సదుపాయాలు కనీసంగా కూడా అందుబాట్లో లేక మన రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో, మారుమూల మైదాన గ్రామాల్లో అత్యవసర వైద్య సేవల కోసం జనం అల్లాడిపోతున్న దీనస్థితి దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. డోలీల్లో కూర్చోబెట్టుకొని గర్భిణీలను, బాలింతలను మోసుకొస్తున్న హృదయవిదారక దృశ్యాలు తరచూ చోటు చేసుకోవడం… డెబ్బరు ఐదేళ్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. అన్ని గిరిజన గ్రామాలకు రహదారులు వేస్తామని, డోలీ మోతల అవసరం లేకుండా చేస్తామని మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇంకా మాట దశలోనే ఉంది. ఈలోగానే ఉత్తరాంధ్రలో ఆరేడు డోలీమోతల సంఘటనలు వెలుగు చూశాయి. అల్లూరి జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం గూనలంక గ్రామానికి చెందిన గర్భిణీ బుధవారం పురిటినొప్పులు పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు ఆమెని ఎనిమిది కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకు రావాల్సి వచ్చింది. కొండదారిని దాటి, రోడ్డుకు వచ్చాక అక్కడి నుంచి అంబులెన్సులో చింతపల్లి ప్రభుత్వాసుపత్రిలో చేర్చటం, అక్కడ సహజ ప్రసవం జరిగి, తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడం కొంత ఉపశమనం.
ఏ సామాజిక, ఆర్థిక తరగతికి చెందిన తల్లికయినా బిడ్డకు జన్మనివ్వడం అనే ప్రక్రియ ప్రాణాంతకంగా మారకూడదు. ఎప్పుడేం జరుగుతుందోనన్న నరకయాతనకు గురి కాకూడదు. కానీ, కొండ ప్రాంతపు గిరిజన తల్లులకు ప్రసవవేదన ప్రాణం పోయేంత దారుణంగా మారిపోతోంది. వైద్యసేవలు అందుబాట్లో లేక, సహజ ప్రసవం జరగక, అత్యవసర స్థితి ముంచుకొచ్చిన సమయంలో మండల కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రులకు తోడ్కొని పోవటమే పెద్ద గండంగా పరిణమిస్తోంది. నొప్పులు పడుతున్న గర్భిణీకి ఆ పరిస్థితే మహా నరకయాతన. అలాంటి స్థితిలో డోలీలో వేసుకొని, ఎగుడు దిగుడు దారుల్లో, రాళ్లూ రప్పల తోవల్లో, ఎండో వానో చలో వెంటాడే సమయాల్లో తరలించటం ఎంత దుర్భరం! ఎంత దయనీయ దుఃఖభరిత సందర్భం! ఈ దృశ్యాన్ని, దుఃఖాన్ని ఊహించుకుంటేనే మనసు విచలితమైపోతోంది. గిరిజన తల్లులు దశాబ్దాలు తరబడి ఈ బాధనీ, భయాన్ని అనుభవిస్తున్నారు. అనేక వందల సార్లు ఈ అసహాయ స్థితి, ఆర్తనాదమూ పాలకుల దృష్టికి వచ్చినా, చెవికి సోకినా పరిస్థితిని మార్చటానికి చేసింది దాదాపు శూన్యం. దేశంలో ఇప్పటికీ ఏటా 24 వేల మంది తల్లులు ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతుండగా, అందులో అత్యధికులు కొండిపాంత నివాసితులే! రెక్కాడితేనే కానీ డొక్కాడని పేద తల్లులే! ప్రతి వెయ్యి మంది నవజాత శిశుమరణాల్లో దేశం సగటు 26 అయితే, 25 మరణాలతో మన రాష్ట్రం 23వ స్థానంలో ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవటానికి పాలకులు చాలా చర్యలు చేపట్టాల్సి ఉంది.
గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య సేవలు మెరుగుపర్చాలంటే- మైదాన ప్రాంతాల వలె జనాభా సంఖ్యనో, జనసాంద్రతనో పరిగణనలోకి తీసుకోకూడదు. నివాస ప్రాంతాల భౌగోళిక వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక వసతులు కల్పించాలి. సురక్షిత నీరు లేక, పోషకాహారం అందక అతిసార, విషజ్వరాలు వంటి సాధారణ జబ్బులకు గురై ఏటా వందలాది మరణాలు గిరిజన ప్రాంతాల్లో సంభవిస్తున్నాయన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. అప్పటికప్పుడు గంభీరమైన ప్రకటనలు చేసి, ఆ తరువాత మరచిపోయే ధోరణికి పాలకులు స్వస్తి చెప్పాలి. మన్యంలో డోలీ మోతలు లేని విధంగా అన్ని చర్యలూ తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. హెల్దీ, వెల్దీ, హ్యాపీ స్వర్ణాంధ్రను సాధిస్తామని చంద్రబాబు 2047 విజన్ పత్రంలో స్వప్నావిష్కరణ చేశారు. ఆ కల సంగతి తరువాత. ముందు తగినన్ని నిధులు కేటాయించి, డోలీ మోతల్లేని, అకాల మరణాలు లేని స్థితిని సాధించాలి. నెలకొకసారి ఏజెన్సీలో బస చేసి, సమస్యలను పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ దిశగా చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. కేంద్రంలోని బిజెపి రకరకాల పేర్లతో గిరిజన ప్రాంతాల్లో మతోన్మాదం చొప్పించే ప్రణాళిక మీద ఎక్కువ శ్రద్ధ చూపుతుంది తప్ప- గిరిజనుల విద్య, వైద్యారోగ్యాల గురించి, కనీస సదుపాయాల కల్పన గురించీ పట్టించుకోవటం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలకే పరిమితం కాకుండా గట్టి చేతలను చేపడితేనే మన్యానికి డోలీమోతల వెతలు తప్పుతాయి.