కల్తీకి కళ్లెం ఎలా..!

హోటళ్లు, ఫుట్‌పాత్‌లపై నోరూరించే, ఘుమ ఘుమలాడే వంటకాల వెనక అనేక నాసిరకం ఆహార పదార్థాలు దాగి ఉంటున్నాయి. కనీస ప్రమాణాలు పాటించ కుండా మాంసా హారాన్ని నిల్వ ఉంచుతున్నారు. వాటికే రంగులద్ది మళ్లీ మళ్లీ నూనెలో వేయించి…వేడివేడిగా పొగలు కక్కిస్తూ వడ్డిస్తున్నారు. పలు చోట్ల రోగాల బారిన పడిన జంతువుల మాంసాన్ని సైతం వినియోగించిన ఘటనలు వెలుగు చూశాయి. నాసిరకం నూనెలు, అనుమతి లేని రంగులను మితిమీరి వాడుతున్నారు.
కల్తీ ఆహారం వల్ల అతిసారం నుంచి క్యాన్సర్ల వరకు దాదాపు 200 రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తులు, నరాలు, ఎముకలు, మూత్రపిండాలు, మెదడు, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. ఆహార పదార్థాల తయారీలో రుచి, రంగు కోసం హానికరమైన రసాయనాలు, రంగులను కలుపుతుండడంతో దేశంలో సుమారు 10 కోట్ల మంది వివిధ వ్యాధులతో బాధ పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.
వంట నూనెల నియంత్రణ చట్టం-1947, నిత్యావసర సరకుల నియంత్రణ చట్టం-1955, పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం-1992 వంటివి క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలుకు నోచుకోవడంలేదు. ఆహారం కల్తీ చేయటం, నాసిరకం పదార్థాలు అమ్మటం నేరమని ఆహార భద్రతా ప్రమాణాల చట్టం-2006 చెబుతున్నది. ఆహార కల్తీ నిరోధక చట్టం-1954 కఠిన శిక్షలను నిర్దేశించింది. ఆహార, పానీయాలను కల్తీ చేసి అమ్మేవారికి ఆరు నెలల తప్పనిసరి జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధించాలని పార్లమెంటరీ ప్యానెల్‌ సైతం ఏడాది క్రితం సిఫారసు చేసింది. అయితే హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తూ.. కలుషిత ఆహారాన్ని గుర్తిస్తున్నా.. వారికి శిక్షలు మాత్రం పడడం లేదు. జరిమానాలతో బయటికొచ్చి మళ్లీ అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఫుడ్‌ సేఫ్టీ యాక్ట్‌ ప్రకారం నాసిరకం ఆహారం అని తేలితే జాయింట్‌ కలెక్టర్‌ సమక్షంలో నేరస్తుడిని ప్రవేశపెట్టి జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. సబ్‌ స్టాండర్డ్‌ కేసుల్లో రూ.వెయ్యి నుంచి రూ.2 లక్షల వరకూ జరిమానా చెల్లించి నేరస్తులు బయట పడుతున్నారు. కల్తీ ఆహారం అని తేలితే క్రిమినల్‌ కేసు బుక్‌ చేయాలి. వారికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఒకవేళ కల్తీ ఆహారం తిని ఎవరైనా చనిపోయినట్లు నిరూపించగలిగితే గరిష్టంగా ఏడేళ్ల శిక్ష విధించేందుకు చట్టంలో సెక్షన్లున్నాయి. ఇన్ని శిక్షలున్నా కల్తీ నిరా ఘాటంగా జరిగిపోతూనే వుంది.
కల్తీ ఆహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కదలాలి. నిఘా పెరగాలి. తనిఖీ నిరంతరం కొనసాగాలి. కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజలలో సైతం చైతన్యం పెరగాలి. అప్పుడే ఈ కల్తీకి కళ్లెం వేయగలం!

– ఫిరోజ్‌ ఖాన్‌,
సెల్‌ : 9640466464

➡️