ఈ నిరుద్యోగానికి పరిష్కారం ఎలా?

Jun 12,2024 05:15 #editpage

ఆర్థిక శాస్త్రంలో డిమాండుకు కొరత ఉన్న వ్యవస్థకి, సప్లరుకి కొరత ఉన్న వ్యవస్థకి (పెట్టుబడులకు, ముడి సరుకులకు, కార్మికులకు, టెక్నాలజీకి కొరత ఉండడాన్ని సప్లరుకి కొరత ఉన్నట్టు పరిగణిస్తాం) మధ్య తేడాను చూస్తారు. మొదటి తరహా వ్యవస్థలో స్థూల డిమాండు పెరిగితే అందుకు అనుగుణంగా సరుకుల ఉత్పత్తిని పెంచుకోవచ్చు. డిమాండుకు తగినట్టు సరుకుల సరఫరా లేకపోతే వాటి ధరలు పెరుగుతాయి. ఉత్పత్తిని పెంచడం ద్వారా అటువంటి ధరల పెరుగులను నివారించవచ్చు. అదే రెండో తరహా వ్యవస్థలో (సప్లరుకి కొరత ఉన్న వ్యవస్థలో) స్థూల డిమాండు గనుక పెరిగితే అది ఉత్పత్తి పెరుగుదలకు దారితీయదు. అప్పటికే ఆ వ్యవస్థలో ఉన్న ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించివున్నందున (అప్పుడు అదనంగా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు) గాని, లేదా ఏవైనా కీలకమైన ముడి సరుకులకో, పరికరాలకో, కార్మికులకో కొరత ఏర్పడినందువలన గాని మార్కెట్‌కు అవసరమైనంత మేరకు ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి స్థితిలో స్థూల డిమాండు మరింత పెరిగితే అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. యుద్ధ సమయాల్లో మినహాయిస్తే సాధారణంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఎప్పుడూ డిమాండుకు కొరత ఉన్న వ్యవస్థగానే ఉంటుంది. అదే సోషలిస్టు వ్యవస్థలో (గతంలోని సోవియట్‌ యూనియన్‌ లేదా తూర్పు యూరప్‌ దేశాల వ్యవస్థలలో) సప్లరుకి కొరత ఉండేది. డిమాండుకు కొరత ఉన్న వ్యవస్థలో గనుక స్థూల డిమాండ్‌ పెరిగితే దానితోబాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
ప్రస్తుతం మన దేశంలో నిరుద్యోగం ఒక తీవ్ర సామాజిక సమస్యగా ఉంది. దాని తీవ్రత తాజా ఎన్నికలలో బిజెపి బలం తగ్గడానికి దోహదం చేసింది. అందుచేత నిరుద్యోగ సమస్యను అత్యవసరంగా పరిష్కరించవలసిన అగత్యం ముందుకొచ్చింది. ఈ పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థల్లో పైన తెలిపిన తేడాను దృష్టిలో ఉంచుకోవడం అవసరం.
మన దేశంలో ప్రభుత్వ సర్వీసులతో సహా సేవా రంగంలో చాలా గణనీయంగా ఉపాధి కల్పనను కావాలనే తగ్గించారు ఇక్కడ పెట్టుబడికి కొరత అన్న సమస్య ఏదీ లేదు. అదే విధంగా మనకి ఇప్పుడు పెట్టుబడికి గాని, కార్మికులకు గాని ఏ ఇతర ఇన్‌పుట్‌లకు గాని కొరత లేదు. ఆహారధాన్యాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. పేదలకు ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయడాన్ని తొలుత ఎకసెక్కం చేసిన మోడీ ప్రభుత్వం కూడా ఉన్న ఆహారధాన్యాల నిల్వలను కుటుంబానికి 5 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నించింది. ఇప్పుడు తగ్గిన నిల్వలను పెంచుకోడానికి అంతర్జాతీయ మార్కెట్‌ నుండి గోధుమలను కొనుగోలు చేయడానికి మన దేశం ప్రయత్నిస్తోంది. దీనికి కారణం ఉన్న నిల్వలను సక్రమంగా వినియోగించలేక దుర్వినియోగం చేయడమే. అంతేకాని దేశంలో ఇప్పుడు ఆహారధాన్యాల కొరత ఏమీ లేదు. అందుచేత ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న తీవ్ర నిరుద్యోగానికి కారణం డిమాండుకు తీవ్ర కొరత ఉన్న వ్యవస్థే. దీనిని పరిష్కరించడానికి వెంటనే స్థూల డిమాండును పెంచాలి. దానికోసం ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచాలి.
ఇప్పుడు చాలా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలుగా భర్తీ కాకుండా పడివున్నాయి. విద్యా రంగంలో సిబ్బంది కొరత తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాని ఫలితంగా విద్యా ప్రమాణాలు దెబ్బ తినిపోతున్నాయి. చివరికి సైన్యంలో సైతం మామూలు స్థాయిలో ఖాళీలను నింపడం లేదు. దానికి తోడు అగ్నివీర్‌ వంటి పథకాలను ప్రవేశపెట్టడం నిరుద్యోగ తీవ్రతను పెంచింది. ఉపాధి కల్పనలో తక్కిన యజమానులకన్నా ముందుండి దారి చూపవలసిన ప్రభుత్వం నిరుద్యోగాన్ని పెంచడంలో ముందుంది. ద్రవ్యపరంగా నియంత్రణలు అమలులో ఉండడమే దీనికి కారణం. ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం.
ఇంతకు ముందు మనం డిమాండుకు కొరత ఉన్న ఆర్థిక వ్యవస్థకి, సప్లరుకి కొరత ఉన్న ఆర్థిక వ్యవస్థకి మధ్య ఉండే తేడాను గురించి చర్చించాం. ఏదైనా ఒక సర్వ స్వతంత్ర దేశపు ఆర్థిక వ్యవస్థలో సప్లరుకి సంబంధించిన కొరత ఉండే అవకాశం లేదు. ఇక ఒక సర్వ స్వతంత్ర దేశం మీద ద్రవ్యపరమైన నియంత్రణలు మామూలుగా ఉండే అవకాశం లేదు. ఏవైనా ద్రవ్య పరమైన నియంత్రణలు ఉంటే అవి అంతర్జాతీయ పెట్టుబడి మన ప్రభుత్వం మీద విధించినవై వుండాలి, అందుకు ఆ అంతర్జాతీయ పెట్టుబడికి స్థానిక మిత్రులైన దేశీయ కార్పొరేట్‌-ద్రవ్య పెట్టుబడి ముఠా తోడై వుండాలి. అంటే ద్రవ్య నియంత్రణతో మన దేశం తన స్వయం నిర్ణయాధికారాన్ని కొంతమేరకు కోల్పోయినట్టు భావించాలి. అంతే తప్ప స్వతహాగా మన ప్రభుత్వం ఏవో పరిమితుల మధ్య ఉన్నట్టు కాదు.
నిజానికి డిమాండుకు కొరత ఉన్న వ్యవస్థలో ఆ డిమాండును పెంచడానికి అవసరమైన అదనపు వ్యయాన్ని ప్రభుత్వం చేయాలంటే అందుకు ఆటంకం ఏమీ ఉండదు. 90 సంవత్సరాల క్రితమే కాలెక్కీ-కీన్స్‌ సైద్ధాంతికంగా అర్థశాస్త్రంలో తెచ్చిన పెనుమార్పులు ఆటంకాలు వుంటాయనే వాదాన్ని తిప్పికొట్టాయి. అప్పుడు తిరస్కరించబడ్డ వాదనలనే ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యయం మీద పరిమితులు బడా కార్పొరేట్లు విధించినవే తప్ప స్వతహాగా ఉన్నవి కానే కావు. అందుచేత అంతర్జాతీయ, దేశీయ బడా పెట్టుబడి దురాశాపూరితమైన నిబంధనల ఉచ్చు నుండి బైటపడి, నిరుద్యోగాన్ని పరిష్కరించేందుకు తన దృఢ నిశ్చయాన్ని ప్రభుత్వం ప్రదర్శించాల్సి వుంది.
ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచడానికి ద్రవ్యలోటును పెంచి ఖర్చు చేయాల్సి వుంటుంది. దానివలన ఉపాధి కల్పన పెరుగుతుంది. ఇలా ద్రవ్యలోటు పెరిగితే దాని ఫలితంగా ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతాయన్న వాదనలు పస లేనివి. నిజానికి ద్రవ్యలోటు పెరిగితే దానివలన కలిగే నష్టం ఏమిటంటే అది సంపదలో అసమానతలు పెరగడానికి దారితీస్తుంది. ఇదెలాగ జరుగుతుందో చూద్దాం. ఉదాహ రణకు ప్రభుత్వం రూ.100 మేరకు తన వ్యయాన్ని పెంచిందనుకుందాం. అందుకోసం అప్పు చేసింది అనుకుందాం (ద్రవ్య లోటు పెంచడం అంటే అప్పు చేసి ఖర్చు చేయడమనే అర్థం). అలా ఖర్చు చేసిన రూ.100 చివరికి పెట్టుబడిదారుల దగ్గరకే చేరుతాయి (ముందు కార్మికులకు అందినా, ఆ సొమ్మును వారు ఖర్చు చేస్తారు గనుక అంతిమంగా ఆ సొమ్ము పెట్టుబడిదారుల దగ్గరకే చేరుతుంది). ప్రభుత్వం ఆ పెట్టుబడిదారుల నుండే అప్పు తీసుకుంటుంది.
దీనిని ఇంకా బాగా అర్ధం చేసుకోవాలంటే మనం ఆర్థిక వ్యవస్థని మూడు విడివిడి భాగాలుగా విడదీసి చూడాలి. మొదటిది: ప్రభుత్వం. రెండోది:శ్రామిక ప్రజలు, మూడోది : పెట్టుబడిదారులు. ఈ మూడు భాగాల దగ్గర ఏర్పడే లోటు అంతా కలిపితే ఎప్పుడూ సున్నాగానే ఉంటుంది (లోటు అంటే అప్పు చేసి ఖర్చు చేయడం. ఒకడు అప్పు చేయాలంటే దానిని ఇచ్చేవాడు మరొకడు ఉండాలి కదా. ఇద్దరిదీ కలిపితే నికర లోటు సున్నా అవుతుంది కదా). శ్రామిక ప్రజలు ఎంత సంపాదిస్తారో అంతా ఖర్చు చేసేస్తారు. అందుచేత వారివద్ద లోటు ఏమీ ఉండదు (వాళ్ళలో వాళ్ళు ఒకరికొకరు అప్పులిచ్చుకోవాలే తప్ప పెట్టుబడిదారులు పేదలకు అప్పులివ్వరు). అందుచేత ప్రభుత్వం అప్పు చేసి ఖర్చు చేయాలంటే అంతిమంగా అది పెట్టుబడిదారుల నుండే మిగులు నుండే చేయాలి. ప్రభుత్వం బ్యాంకుల నుండి మొదట రూ.100 అప్పు తెచ్చి ఖర్చు చేస్తుంది. ఆ ఖర్చు అంతిమంగా పెట్టుబడిదారుల దగ్గరకు చేరుతుంది. అప్పుడు ఆ పెట్టుబడిదారుల నుండి ప్రభుత్వం రూ.100 అప్పు తెచ్చి బ్యాంకుల అప్పు తీరుస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారుల దగ్గర రూ.100 మిగులు పోగుబడుతుంది. దీనివలన పెట్టుబడిదారులు అదనంగా కష్టపడేదేమీ లేదు సరికదా, వారికి మిగులు చేరుతుంది. ప్రభుత్వం చేసే అదనపు వ్యయం వలన ఈ పెట్టుబడిదారుల దగ్గర అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సరుకులు చెల్లుబాటు అవుతాయి. దానితోబాటు అదనంగా సంపద పోగుబడుతుంది. ఇది సంపద అసమానతలకు దారి తీస్తుంది. ఈ విధంగా సంపదలో అసమానతలు పెరిగిపోకుండా ఉండాలంటే, పెట్టుబడిదారుల దగ్గర పోగుబడిన అదనపు సంపదను పన్ను రూపంలో ప్రభుత్వం తిరిగి తీసుకోవాలి. అలా తీసుకున్నందువలన పెట్టుబడిదారులకు అంతవరకూ ఉన్న సంపద ఏమీ తగ్గిపోదు. కేవలం అదనంగా పోగుబడినది మాత్రమే పన్ను రూపంలో వెనక్కి పోతుంది.
అంటే ప్రభుత్వ వ్యయాన్ని పెంచి నిరుద్యోగాన్ని తగ్గించడం ద్వారా అంతరకూ పెట్టుబడిదారుల దగ్గర పోగుబడిన సంపద ఏమీ తగ్గిపోదు. అందుచేత అంతర్జాతీయ, దేశీయ బడా కార్పొరేట్లు ఎటువంటి ఆటంకాలు కల్పించినా, వాటన్నింటినీ అధిగమించే ధైర్యాన్ని ప్రభుత్వం ప్రదర్శించగలిగితే నిరుద్యోగాన్ని పరిష్కరించవచ్చు.
ముందు ప్రభుత్వ విద్యాలయాల్లో, యూనివర్సిటీల్లో ఉన్న బోధన, బోధనేతర పోస్టులనన్నింటినీ భర్తీ చేయాలి. అదే విధంగా వైద్య రంగంలో కూడా భర్తీ చేయాలి. ఆ తర్వాత ఈ రంగాల్లో అదనపు పోస్టులను మంజూరు చేయాలి. అప్పుడు పతనమౌతున్న మన విద్యా, వైద్య ప్రమాణాలను నిలబెట్టగలుగుతాం. వాటితోబాటు ఇప్పుడు ఉనికిలో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలి. దానికి విధించిన పరిమితులను ఎత్తివేయాలి. గ్రామాల్లో ఎంతమంది పని కావాలని అడిగితే అంతమందికీ పనులు కల్పించాలి. ఆ పథకాన్ని పట్టణ ప్రాంతాలకూ విస్తరించాలి. ఆ పథకం కింద చెల్లించే వేతనాలను కూడా సహేతుకంగా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంచాలి.
ఈ మూడూ చేస్తే దాని ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక రకాల వినిమయ సరుకులకు డిమాండ్‌ బాగా పెరుగుతుంది. ఇప్పుడున్న ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తి స్థాయి మేరకు వినియోగించగలుగుతాం. అంతేకాక అదనపు సామర్ధ్యాన్ని కూడా నెలకొల్పవలసిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో అభివృద్ధికి ఇది దారి తీస్తుంది (ఆ పరిశ్రమలకు అవసరమైన రుణ సదుపాయాలను కూడా కల్పించాల్సి వుంటుంది). అంటే, ప్రభుత్వం తన వ్యయం ద్వారా కల్పించే అదనపు ఉపాధి వలన ప్రైవేటు రంగంలో కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ప్రభుత్వం చేసే ఈ అదనపు వ్యయానికి కావలసిన ఆర్థిక వనరులను సమీకరించడానికి పెట్టుబడిదారుల మీద, తక్కిన బడా సంపన్నుల మీద అదనపు పన్నులు విధించాలి. వారి ఆదాయాలమీద, వారి దగ్గర వున్న సంపద మీద పన్నులు విధించాలి. ముఖ్యంగా వారి స్థిరాస్తుల మీద, వారి నగదు నిల్వల మీద (షేర్ల రూపంలో ఉన్నవాటితో సహా) అదనపు పన్నులు వేయాలి. దానివలన వారు పెట్టే పెట్టుబడులు ఏమీ తగ్గిపోవు. సంపదమీద పన్ను సమర్ధవంతంగా వసూలు కావాలంటే వారసత్వ పన్ను కూడా అదే సమయంలో విధించాలి. మన దేశంలో ఇప్పుడు సంపద పన్ను కాని, వారసత్వ పన్ను కాని అమలు చేయడంలేదు. నయా ఉదారవాద శకంలో కొద్దిమంది దగ్గర విపరీతంగా సంపద పోగుబడుతున్నప్పుడు, అసమానతలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు ఈ మాదిరి పన్నులు అసలే లేకపోవడం దిగ్భ్రాంతికరం. అదే సమయంలో ఈ రెండు రకాల పన్నులనూ ఇప్పటి నుంచైనా అమలు చేస్తే ప్రభుత్వం దగ్గర పెద్ద మోతాదులో ఆర్థిక వనరులు సమకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్పష్టంగా కనపడుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ఒక్కటే తక్షణ పరిష్కారం. ఆ అదనపు ప్రభుత్వ వ్యయానికి కావలసిన వనరులను సమీకరించడానికి సంపద పన్ను, వారసత్వ పన్ను విధించడమే సముచిత మార్గం. దీనివలన ఒకే దెబ్బకు అనేక పిట్టల్ని కొట్టవచ్చు. ఒకటి: ఉద్యోగాలు పెరుగుతాయి, రెండు: సంపద అసమానతలు పెరిగిపోకుండా అదుపులో ఉంటాయి. తద్వారా ప్రజాస్వామ్యం బలపడుతుంది, మూడు: విద్యా, వైద్య ప్రమాణాలు మన దేశంలో మెరుగుపడతాయి.

ప్రభాత్‌ పట్నాయక్‌
( స్వేచ్ఛానుసరణ )

➡️