ఎన్‌డిఏ హ్యా’ట్రిక్‌’ ఎంత నిజం?

Apr 14,2024 05:15 #edit page

మరో వారం రోజుల్లోనే భారత దేశంలో ఎన్నికల ఓటింగు తొలి దశ మొదలవుతుంది. నెల రోజుల్లో అంటే మే 13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో పోలింగు జరుగుతుంది. అదే విధంగా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ కథనాల సమర్పణలో చాలా మార్పు గమనించవచ్చు. పోల్‌ నేరేటివ్స్‌ అనబడే ఈ ఎన్నికల కథనాలు రెండు మాసాల కిందటికీ ఇప్పటికీ ఎలా మారిపోతున్నాయో చూస్తే ఆశ్చర్యం కలగొచ్చు. నమో, మోడీ తప్ప మరో మాటే లేని పరిస్థితి మారిపోవడం ఎవరైనా ఒప్పుకోక తప్పని స్థితి. అదే తెలంగాణలో చూస్తే మూడు నాలుగు నెలల కిందట కెసిఆర్‌, బిఆర్‌ఎస్‌ నామజపమే. అంతకు ముందు తెలంగాణలో రాబోయేది బిజెపినే అన్న మోతలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షాలు పదేపదే ప్రదక్షిణలు చేసేవారు. ఇప్పుడు అది గతం. ఎ.పి లోనూ బిజెపి, జనసేన, ఎన్‌డిఏతో టిడిపి కలిస్తే ఏదో మంత్రజాలం జరిగిపోతుందని వారి అనుకూల మీడియా మోత మోగిస్తుండేది. ఇప్పుడు చూస్తే వారి కూటమి ఏర్పడి మోడీ కూడా సందర్శించి వెళ్లారు గానీ సీట్ల సర్దుబాటు, ఎన్నికల ఎజెండా ఏదీ స్పష్టత లేని స్థితి. పాలక వైసిపి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మోడీకి చాలా దగ్గర గనక పొత్తుకు ఒప్పుకోరనే కథనం వారి వైపు నుంచి వినిపిస్తూనే వుండేది. ఎంతసేపటికీ టిడిపిని, ఎ.పి బిజెపి నాయకత్వాన్ని తప్ప జాతీయ బిజెపిని కనీసం ప్రస్తావించేవారు కాదు. మొత్తంపైన ఇరు పక్షాలూ బిజెపి దిశలోనే వున్నా మరోవైపు చూస్తే? 2014లో బిజెపి, టిడిపి, జనసేన కూటమి ఎ.పి ని మోసం చేసిందని ముఖ్యమంత్రి జగన్‌ అనక తప్పని స్థితి. దాన్నిబట్టి ఆయన ఏదో మోడీపై పోరాడుతున్నారనుకున్నా పొరబాటే. ఆ మాటకొస్తే పొత్తు పెట్టుకున్న టిడిపి కూడా కేంద్ర బిజెపిని ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్న పరిస్థితి. ప్రతి సభలో ఎన్‌డిఎ పొత్తును సమర్థించుకోలేక తంటాలు పడుతున్న చంద్రబాబు తీరు ఆసక్తిగొల్పుతుంది. సిపిఎం నాయకులు చెబుతున్నట్టు పొత్తు పార్టీలు, తొత్తు పార్టీలు కూడా భరించలేని విధంగా బిజెపి వ్యవహరిస్తున్నదంటే దానికి కారణం దేశవ్యాపితంగా ఆ పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులే.
ఈ స్థానాలైనా ఎలా నిలుస్తాయి?
మోడీ బిల్డప్‌ను మోయవలసిన అగత్యం లేదని గత వారం ఈ శీర్షికలో చెప్పుకున్న విషయం. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం కొనసాగవలసిందేనన్నది దాని సారాంశం. జాతీయ మీడియా దాదాపుగా బిజెపి గుప్పిట్లో వుండిపోయింది గనక ఇప్పటి వరకూ బిజెపి కోణంలోనే నడిచిన ఎన్నికల కథనాలు మరింత సమగ్రంగా వీక్షిస్తే తప్ప సంపూర్ణ దృశ్యం బోధపడదు. మోడీకి 400 స్థానాలు వస్తాయనేది కేవలం మైండ్‌ గేమ్‌ మాత్రమేనని ఇప్పడు అందరూ ప్రస్తావిస్తున్న మాట. అదే సమయంలో రెండోవైపున కాంగ్రెస్‌ ‘ఇండియా’ వేదికల మాటేమిటని కూడా చూడాలి. ప్రేమ్‌ ఫణిక్కర్‌ అనే ఓ జర్నలిస్టు ఇదే భావనతో ‘వైర్‌’ పత్రికలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బిజెపికి ఇప్పుడు పార్లమెంటులో వున్నది 289 మాత్రమే వున్నాయని ఆయన మొదట తేల్చేశారు. ఈ స్థానాలన్నీ ఎలా నిలుపుకోవడమనేది పెద్ద సవాలు కాగా ఏకంగా అది రెట్టింపు కావడమేంటని ఆయన ప్రశ్న వేశారు. ఇప్పటికిప్పుడే మోడీ ఓడిపోతాడని తాను చెప్పడం లేదని కూడా ఆయన స్పష్టం చేస్తూనే ఆయన ఈ పోల్‌ నేరేటివ్‌ ఎంత అవాస్తవమో నిరూపించే ఉదాహరణలిచ్చారు. ఒక విధంగా ఇది ‘ఇండియా’ గురించిన కథనం కూడా.
రద్దయ్యే పదిహేడవ లోక్‌సభలో బిజెపి 303 స్థానాలతో బయలుదేరిన మాట నిజమే. 303 స్థానాలు గెలిచినప్పటికీ అందులో 14 మంది వివిధ కారణాల వల్ల రాజీనామా చేయడం, ఇద్దరు చనిపోవడం ఇందుకు కారణం. చత్తీస్‌గఢ్‌లో ముగ్గురు, మధ్యప్రదేశ్‌లో అయిదుగురు, రాజస్థాన్‌లో ముగ్గురు అసెంబ్లీలకు మారారు. ఇది నిస్సందేహంగా ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో సవాలును చెబుతుంది. ఇక మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో ఇద్దరు చనిపోయారు. బెంగాల్‌లో బిజెపి ఎం.పి స్థానం శతృఘ్న సిన్హా టిఎంసి తరపున గెలిచారు. కనుక ఇప్పుడు 370 లేదా 400 స్థానాలంటే వున్నవన్నీ గెలుచుకోవడమే గాక మరో 67 తెచ్చుకోవాలి. ఆ అవకాశం ఎక్కడుంది? కర్ణాటకలో గతంలో 28కి 25 వచ్చాయి. ఇప్పుడు ఇందులో సగమైనా కాంగ్రెస్‌కు పోతాయి. ఢిల్లీలో గతసారి మొత్తం ఏడు స్థానాలు తెచ్చుకుంది. ఈసారి తమకే సందేహం వుండి దాదాపు అభ్యర్థులందరినీ మార్చినా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టు తర్వాత కాంగ్రెస్‌, ఆప్‌ కలసి పోటీ చేస్తున్నందున ఏమయ్యేది చెప్పలేని పరిస్థితి. మహారాష్ట్రలో గతంలో అవిభక్త శివసేనతో కలసి 23 తెచ్చుకుంటే ఇప్పుడు ముక్కలుముక్కలై పోయిన పార్టీలతో కలసి ఆ ఫలితం రావడం అసాధ్యం. ఉత్తర ప్రదేశ్‌లో గతంలో 80కి 62 వచ్చాయి. కానీ ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు పూర్తి అవగాహనతో ఢకొీంటున్నాయి. ఆప్‌ పూర్తి మద్దతు ప్రకటించింది. కనుక తగ్గడమే తప్ప పెరగడం వుండదు (మాయావతి ఊగిసలాట కూడా ఇందుకు దోహదం చేయొచ్చు). బీహార్‌లో గతంలో 40కి 17 వచ్చాయి కానీ ప్రతిష్ట కోల్పోయిన నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్‌డిఎ కన్నా తేజస్వి యాదవ్‌ నాయకత్వంలో పూర్తి అవగాహనకు వచ్చిన ‘ఇండియా’ బ్లాక్‌ అవకాశాలు మెరుగ్గా వుండబోతాయి. గతసారి వున్న 29లో 28 తెచ్చుకున్న మధ్యప్రదేశ్‌లోనూ తగ్గడమే (శాసనసభలో కాంగ్రెస్‌ ఓటింగు కూడా అదే చెబుతుంది). హర్యానాలో రైతాంగ ఉద్యమ ప్రభావం బిజెపికి వ్యతిరేకంగానే వుంది. ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రచార బాధ్యత యువనేత సచిన్‌ పైలెట్‌కు అప్పగించడంవల్ల బిజెపి గతంలో వలె 25కు 24 తెచ్చుకోవడం జరిగేపని కాదు. అంటే ఈ రాష్ట్రాల్లో గతసారి 285లో 210 తెచ్చుకున్న బిజెపి కోల్పోయే అవకాశాలే అత్యధికం. అంటే తక్కిన దేశంలో 128 స్థానాలున్న దక్షిణాదిన, 42 స్థానాలు గల బెంగాల్‌లో, 13 సీట్లున్న పంజాబ్‌లో ఫలితాలు తారుమారు కావాలి. ఎందుకంటే 2019లో ఇక్కడ 128లో బిజెపి కేవలం 29 మాత్రమే గెలవగలిగింది. అందులోనూ 24 కర్ణాటకను తుడిచిపెట్టడం వల్లనే. మరో నాలుగు తెలంగాణ. ఇప్పుడు కర్ణాటకలో సగం కోల్పోవడం అనివార్యం. తెలంగాణలో ఒకటో అరో పెరగొచ్చు తప్ప మరెక్కడా ఆ అవకాశం లేదు. కనుక 370-400 సీట్ల కథలు ఎన్ని వందల సార్లు చెప్పినా అవి కథలే తప్ప నిజాలు కాబోవు.
బిజెపి యేతర శక్తుల బలం
ఇంకోవైపున ‘ఇండియా’ వేదిక సంగతి చూస్తే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, బెంగాల్‌, ఢిల్లీ, పంజాబ్‌ వేదిక పార్టీల ఆధ్వర్యంలో వున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లలో ‘ఇండియా’ పూర్తి అవగాహనతో ముందుకు పోతున్నది. కేరళ, బెంగాల్‌లో ‘ఇండియా’ లోని పార్టీలే అటూ ఇటూ వున్నాయనేది ప్రతికూలంగా చూపుతుంటారు గానీ నిజానికి అది ఎన్‌డిఏ కు వ్యతిరేకమైన అంశమే. ఎందుకంటే ఎటూ అవి ‘ఇండియా’తోనే వుంటాయి. కాశ్మీర్‌లో లోక్‌సభ సీట్లు రెండే అయినా జాతీయ ప్రాధాన్యత వుంటుందనేది వాస్తవం. ఒరిస్సాలో బిజెడి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బిజెపితో చర్చలు జరిపినా పొత్తుకు సిద్ధం కాలేదు. వైసిపి ఎ.పి లో బిజెపినే బలపరుస్తున్నా పొత్తు వుండదు. ఈ విధంగా చూస్తే బిజెపి యేతర పార్టీల బలం ఎక్కువగా వుంటుంది. వాస్తవానికి ఈ మొత్తంలో ఇటు నితీశ్‌ కుమార్‌, చంద్రబాబు నాయుడు అటు మారకపోయి వుంటే పరిస్థితి మరింత భిన్నంగా వుండేది. కానీ బిజెపి వల్ల టిడిపికి నష్టం తప్ప లాభం వుండదనే అత్యధికుల అభిప్రాయంగా వుంది. ఆ భయం వారి నాయకత్వంలోనూ వుంది. మోడీ నాయకత్వం అనేదే ఎన్‌డిఎకు పెద్ద అనుకూలాంశమని చెప్పుకోగా తాజా సర్వేల్లో అది కూడా బాగా పడిపోతున్నది. ఉదాహరణకు లోక్‌నీతి, సిఎస్‌డిస్‌ సర్వేలో మోడీ పట్ల మొగ్గు చూపినవారు 48 శాతం మాత్రమే వున్నారు. ఇది గతంలో 67 శాతం వరకూ వుండేది. కొద్దిగానో పూర్తిగానో ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినవారి శాతం 30 నుంచి 39కి పెరిగింది. నిరుద్యోగం, పేదల సంక్షేమం వంటి విషయాల్లో కేవలం 90 శాతం వరకూ అసంతృప్తి నెలకొంది. మోడీకి 48 శాతం రాహుల్‌ గాంధీకి 27 శాతం వుంది గనక ఆయనకు తిరుగు లేదని చిత్రించవచ్చు గాని వాస్తవానికి రాహుల్‌ ప్రధాని అభ్యర్థి అని ‘ఇండియా’ ప్రకటించిందేమీ లేదు. కనుక ఈ పోలికే నిరాధారమైంది. వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలు, విజయాలు కలిసి బిజెపి యేతర కలయికకు దారి తీసే అవకాశం కాదనలేనిది.
సిద్ధరామయ్య జోస్యం
ఈ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసక్తికరమైన కోణం ఆవిష్కరించారు. ‘ఇండియా’కూ స్పష్టమైన ఆధిక్యత రాకపోయినా ఎన్‌డిఏ కు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని సీట్లు రాబోవని అంచనా చెప్పారు. బిజెపి లేకుండా కేంద్రంలో సర్కారు ఏర్పాటుకు అవకాశం వుంటుందన్నారు. దేశవ్యాపితంగా బిజెపికి వ్యతిరేకంగా కనిపించని నిరసన వున్నదనీ, ఈ నిశ్శబ్ద ఓటింగు మోడీ సర్కారును ఓడిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బిజెపికి 200 పైన సీట్లు రావచ్చేమో గాని మెజార్టీ చేరుకోజాలదని స్పష్టం చేశారు. దక్షిణాది పార్టీలు, బిజెపి వ్యతిరేక శక్తులు కలిస్తే నవీన్‌ పట్నాయక్‌ కూడా చేతులు కలపొచ్చని వ్యాఖ్యానించారు.1991లో 1996లో కూడా దక్షిణాది బలమే ప్రత్యామ్నాయ ప్రభుత్వాలకు దారితీయడం ఇక్కడ గుర్తుచేసుకోవచ్చు. రాబోయే కాలంలో దక్షిణాది నుంచి ప్రధాని రావచ్చని రేవంత్‌ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. ఎవరికీ మెజార్టీ రాకూడదని జగన్‌ కూడా పదేపదే చెబుతుంటారు. కనుక ఎన్నికల అనంతర దృశ్యాన్ని ఏకపక్షంగా అంచనా వేయడం పొరబాటే. ‘ఇండియా’ గెలిస్తే దేశ ఆయుధ శక్తిని దెబ్బ తీస్తుందని మోడీ తాజాగా ఆరోపించడం చూస్తే రెచ్చగొట్టడానికి ఎంతగా ప్రయత్నం జరుగుతున్నదీ తెలుస్తుంది. కాశ్మీర్‌లోనూ ఇదే విధమైన ప్రచారం చేసి వచ్చారు. కాంగ్రెస్‌ రామమందిరం కట్టనివ్వలేదని మరో చోట ఆరోపించారు. ఏదో విధంగా మతపరమైన ఉద్వేగాలను పొరుగు దేశాలతో వివాదాలను ముందుకు తెచ్చే పాత ఎత్తుగడ పునరావృతం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎన్‌డిఎ మరీ ముఖ్యంగా బిజెపి కంగారునే సూచిస్తాయి. ఎ.పి లో టిడిపితో పొత్తు కుదర్చుకోవడంలోనూ ఈ అనివార్యతే గోచరిస్తుంది. అయితే ఇవన్నీ మెజార్టీ తెచ్చిపెట్టబోవు. ప్రతిపక్షాలపై మోడీ నిరంకుశ దాడి కేజ్రీవాల్‌ అరెస్టుతో పరాకాష్టకు చేరిందనీ, ఇదే బిజెపికి నష్టదాయకం అవుతుందని కేంద్ర కాబినెట్‌ మాజీ కార్యదర్శి కె.ఎం.చంద్రశేఖర్‌ రాస్తున్నారు. ఈ పరిస్థితులలో ‘ఇండియా’ వేదికలో పెద్ద పార్టీగా వున్న కాంగ్రెస్‌ తన పాత్ర సక్రమంగా నిర్వహించడం చాలా కీలకం. ఎ.పి లో ఎలాగో చర్చలు, సిపిఎం సర్దుబాట్ల తర్వాత ఒక అవగాహన కుదిరింది గాని తెలంగాణలో ఇప్పటికి ఇంకా వామపక్షాలతో చర్చలకు చొరవ తీసుకున్నదే లేదు. కాంగ్రెస్‌ బలంగా వున్న చాలా రాష్ట్రాలలోనే ‘ఇండియా’ పొత్తులు కుదరకపోవడం ఒక నిజం. బిజెపి మత రాజకీయాలు ఏకపక్ష ధోరణులపై నిరసన ప్రజల తీర్పులో ప్రతిబింబించాలంటే కాంగ్రెస్‌ మరింత వాస్తవికంగా వ్యవహరించాలి.

– తెలకపల్లి రవి

➡️