మానవ తప్పిదం కారణంగానే తిరుపతి నగరంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారని స్పష్ట మవుతున్నది. తిరుమలకు వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు పోటెత్తడం ఆనవాయితీగా వస్తున్నది. క్రౌడ్ మేనేజ్‌మెంట్ విషయంలో టిటిడి ఉద్యోగులకు అపారమైన అనుభవం వున్నది. అయితే ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా చర్చ జరుగుతున్నది.
జరిగిన ఘటనలో వ్యక్తులకు, సంస్థలకు దురుద్దేశాలు ఆపాదించలేం. ఏ ఒక్కరూ ఇలాంటివి జరగాలనుకోరు. కాకపోతే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం తదితర కారణాలతో తిరుపతిలో ఆరుగురు భక్తులు చనిపోయారు. 40 మంది క్షతగాత్రులయ్యారు.
వైకుంఠ ఏకాదశి నాడు లక్షల సంఖ్యలో జనం తిరుమలకు వస్తారన్న అంచనాలు ఉన్నప్పటికీ దానికై చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్పష్టత లోపించడం వైఫల్యంగా కనిపిస్తున్నది. తిరుపతిలో ఏర్పాటు చేసే టికెట్ కేంద్రాలు స్థానికులకు మాత్రమేనని గతంలో ప్రకటించేవారు. ఎవరైనా ఇతర ప్రాంతాల భక్తులు కౌంటర్ల దగ్గరకు వచ్చినా టికెట్లు ఇచ్చేవారు. ఈ దఫా లోపం ఏమంటే… టికెట్ లేని వారిని తిరుమల కొండకు అనుమతించబోమని యాజమాన్యం ప్రకటిం చింది. దీనివల్ల ముఖ్యంగా తమిళనాడు ప్రాంతం నుంచి చాలా పెద్ద సంఖ్యలో ఎలాగైనా వైకుంఠ ద్వారాలలో ప్రవేశం పొందాలనే ఆతృతతో భక్తులు తిరుపతి చేరుకున్నారు. బుధవారం ఉదయానికి దూర ప్రాంతాల నుంచి రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయిన భక్తులు టికెట్ కౌంటర్లకు చేరుకున్నారు. గురువారం ఉదయం ఐదు గంటల నుంచి టికెట్లు ఇస్తారని ముందస్తుగా అధికారులు ప్రకటన చేసినా బుధవారం ఉదయం 10 గంటలకే కౌంటర్ల దగ్గరకు భక్తులు చేరుకోవడం మొదలైంది. ప్రతి గంటకు భక్తుల సంఖ్య పెరగడం ఉదయం నుంచి కనబడుతూనే ఉంది. పెరుగుతున్న సంఖ్యను దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ ఘటన జరిగేది కాదు.
టిటిడి ఉన్నతాధికారులు, బోర్డు చైర్మన్ పలుమార్లు ప్రకటనలు చేశారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని ఏర్పాట్లు చేపట్టామని, 3,000 మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో ప్రశాంతమైన వాతావరణంలో దర్శన ఏర్పాట్లు చేశామని ప్రకటించారు. ఇన్ని వేల మంది పోలీసులను కేటాయించామని చెబుతున్నా కౌంటర్లు దగ్గర భక్తులను నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి పోలీసులు పరిమిత సంఖ్యలో ఉండటం ఈ దుస్థితికి కారణంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టిటిడి టికెట్ కౌంటర్లను తిరుపతిలోని మూడు కేంద్రాల్లో నిర్వహిస్తున్నది. వేల సంఖ్యలో జనం రావడం టికెట్లు పొందడం అనేది ప్రతి రోజూ జరిగేది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మూడు కౌంటర్లకు అదనంగా మరో ఐదు కౌంటర్లను టిటిడి ఏర్పాటు చేసింది. తిరుమల కొండపై స్థానికులకు బాలాజీ నగర్‌లో కౌంటర్ ఏర్పాటు చేశారు. మొత్తం తొమ్మిది కేంద్రాల్లో 90 కౌంటర్లను టిటిడి ఏర్పాటు చేసింది.
వాస్తవంగా ఒక్కో కౌంటర్ దగ్గర పది వేల మంది జనం వచ్చినా లైన్ కదులుతూ ఉంటే మేనేజ్ చేయడం పెద్ద సమస్య ఏమీ కాదు. ఇది టిటిడి ఉద్యోగులకు తెలిసిన విద్యే. వచ్చిన జనాన్ని నియంత్రించకపోగా కౌంటర్లకు తాళాలు వేసి లైన్లోకి జనాన్ని పంపకపోవడం దారుణం.
జన సమ్మర్థంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో సన్నని ఇరుకు దారులలో వీటిని ఏర్పాటు చేయడం, మలమూత్ర విసర్జనకు కూడా అవకాశం లేకుండా ఉండటం, ఆఖరుకు ఆహారం, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి వేచి ఉండటం అడుగడుగునా కనిపించింది.
బైరాగి పట్టెడ లోనైతే గడ్డి తొక్కేస్తారన్న కారణంతో పార్కులో నీళ్లు పట్టేయడంతో ఎక్కడ కూర్చోవాలో తెలియక బురద నీళ్లలోనే వేల మంది నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. గంట గంటకు జనం విపరీతంగా పెరుగుతున్నా పోలీసుల సంఖ్యను పెంచాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న ఆలోచన టిటిడి కి, ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసులకు రాకపోవడం అన్యాయం. తిరుపతిలో ఏర్పాటు చేసిన దాదాపు అన్ని కేంద్రాల్లో ఈ తొక్కిసలాటలు, ఘర్షణలు జరిగాయి.
రెండు కేంద్రాల్లో భక్తులు మరణించారు. బైరాగి పట్టెడ కేంద్రంలో తొక్కిసలాట తర్వాత అంబులెన్స్ కోసం అర గంటకు పైగా నిరీక్షించాల్సి వచ్చిందంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. దాదాపు అన్ని కేంద్రాల్లో గాయాలపాలైన వాళ్ళు, ఊపిరాడక ఇబ్బందులు పడిన వాళ్ళు, టికెట్లు వద్దని వెనక్కు వెళ్లిపోయిన వారు వందల సంఖ్యలో కనిపించారు. క్యూలైన్ల నిర్వహణలో అడుగడుగునా ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది.
గతంలో క్యూలైన్ల ఏర్పాటును తిరుమల జెఇఓ ఆధ్వర్యంలో కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు, టిటిడి ఉద్యోగులు సమన్వయంతో నిర్వహించేవారు. ఈ దఫా ప్రతిరోజూ సమీక్షలు చేయడం, గొప్పగా నిర్వహిస్తున్నామని ప్రకటనలు చేయడం వల్ల విపరీతమైన ప్రచారం లభించింది. పూర్వం వైకుంఠ ఏకాదశికి వచ్చేవాళ్ళకి టిక్కెట్ లేకపోయినా సర్వదర్శనానికి అనుమతించేవారు. ఈ దఫా టిక్కెట్ లేకపోతే తిరుమలకు రావడానికి వీల్లేదని ప్రకటన చేయడంతో ప్రతి ఒక్కరూ ‘ఏదో రకంగా టిక్కెట్టు సంపాదించాలి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల’న్న ఆత్రుత ఈ తొక్కిసలాటకి కారణమైనట్టుగా కనిపిస్తున్నది.
దర్శనం జరిగే పది రోజులూ టికెట్లు ఇచ్చే పద్ధతి గతంలో ఉండేది. ఇప్పుడు మూడు రోజులకు కుదించడం కూడా ఒత్తిడి పెరగడానికి కారణంగా భక్తులు అంటున్నారు. దర్శనాల విషయంలో టిటిడి కి నిర్దిష్టమైన విధానాలు ఉన్నాయి. వాటి ప్రకారమే నడుస్తుంటుంది. టిటిడి ఉద్యోగులను భాగస్వామ్యం చేయడం కంటే శ్రీవారి సేవకులను, పోలీసుల్ని నమ్ముకోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని కొందరు ఉద్యోగులు వ్యాఖ్యానించారు.
స్థానికేతరులు తిరుపతి నగరంలో ఎక్కడ చూసినా కనబడ్డారు. జనం పెరిగిపోవడంతో స్కూలు నుంచి ఇళ్లకు వచ్చే పిల్లల బస్సులు సైతం ఆలస్యంగా నడిచాయి. ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. తిరుపతి నగర ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇలాంటి కేంద్రాలు నివాస ప్రాంతాల్లోనూ జనసమ్మర్ధం ఉండే ప్రాంతాల్లోనూ ఇరుకు వీధుల్లోనూ కాకుండా తారకరామా స్టేడియంలోనూ, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లలోనూ ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం, ప్రత్యామ్నాయాలను ఆలోచించక పోవడం వంటి విషయంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.
తిరుపతి ఘటన ఎవరికి ఎంత నష్టం? ఎంత లాభం? అనే లెక్కలు వేసుకుంటూ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పరస్పర విమర్శలు చేసుకోవడం దురదృష్టకరం. జరిగిన ఘటనలో బాధితులను ఆదుకోవడం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన విధంగా వ్యవహరించాలన్న ఆతృత కంటే ఈ ఘటన నుంచి లాభం ఎంత పొందాలి? ఎదుటి వాళ్లకు నష్టం ఎంత చేయాలి? అన్న దాని మీద ఆత్రుత కనిపిస్తున్నది.
రానున్న పది రోజులలోను ఇదే రకంగా జనం వచ్చే పరిస్థితులు ఉన్నందున, మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విఐపి దర్శనాలు రద్దు చేశామని ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో తిరుమల కొండ మొత్తం వారితోనే నిండిపోయింది. విఐపి సంస్కృతి విపరీతంగా పెరిగిపోవడం, ప్రతిదానికీ లెక్కలు కట్టి డబ్బులు వసూలు చేయడం, దర్శనానికి సిఫార్సుల లేఖలు పెరిగిపోవడం పట్ల సామాన్య భక్తుల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. దైవ సన్నిధిలో సామాన్యుడికి సమానత్వం లేకపోతే ఎలా అనే ప్రశ్న అడుగడుగున సంధిస్తున్నారు. ఏ పాపం తెలియని అమాయకులైన భక్తులు వందలు, వేల మైళ్ళ దూరం నుంచి స్వామివారిని దర్శించుకోవాలన్న కాంక్షతో వచ్చి ప్రాణాలు కోల్పోయారు. మృతుల నష్టపరిహారం విషయంలో ప్రభుత్వ ప్రకటన సమంజసంగా లేదు. చనిపోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఆధ్యాత్మిక సంస్థ టిటిడి పై, రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా వ్యవహరించాలి.
వ్యాసకర్త – కందారపు మురళి టిటిడి ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు, తిరుపతి