ఆకలి సూచీ – పొంచి వున్న ప్రమాదం

అంతర్జాతీయంగా, జాతీయంగా, ప్రాంతీయంగా నిర్దిష్ట సంవత్సర కాలంలో పేదరిక స్థాయిని నిర్ధారించటానికిి, ఆకలి తీరు తెన్నులు కొలవడానికి ప్రపంచ ఆకలి సూచీ (జి.హెచ్‌.ఐ) ఒక ముఖ్యమైన ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ప్రంపచవ్యాప్తంగా ఆకలిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందిస్తారు.
ఆహారం సరిపడినంతగా దొరకకపోవడం, మొత్తం జనాభాలో పోషకాహార లేమితో ఉన్న జనాభా ప్రాతిపదికన నిర్ధారించే పోషకాహార లోపం (అండర్‌ నరిష్‌మెంట్‌), 5 సంవత్సరాలలోపు పిల్లలలో ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం (చైల్డ్‌ స్టంటింగ్‌), 5 సంవత్సరాల లోపు పిల్లలలో తీవ్రమైన పోషకాహార లేమి వల్ల వయసుకు తగిన ఎత్తు లేకపోవడం (చైల్డ్‌ వేస్టింగ్‌), 5 సంవత్సరాలలోపు వారిలో పోషకాహార లేమి వలన, అనారోగ్యకర వాతావరణం వలన జరుగుతున్న శిశు మరణాలు వంటి నాలుగు కీలక సూచికలను కొలమానంగా తీసుకుని ‘ప్రపంచ ఆకలి సూచీ’ని లెక్కిస్తారు. 127 దేశాలను పరిగణనలోకి తీసుకుంటే 27.3 హంగర్‌ స్కోరుతో భారతదేశం 105వ స్థానంలో నిలిచింది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం ఆకలి ప్రమాదకర స్థాయిలో ఉన్న 41 దేశాల జాబితాలో భారతదేశం చేరటం శోచనీయం.
ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం తర్వాత ఉగాండా, మొజాంబిక్‌, జింబాబ్వే, పాకిస్తాన్‌, నైజీరియా, సూడాన్‌, జాంబియా వంటి 22 దేశాలు మాత్రమే ఉండడం గమనార్హం. భారత దేశానికి పొరుగు దేశాలైన చైనా (4), శ్రీలంక (56), నేపాల్‌ (68), బంగ్లాదేశ్‌ (84) ర్యాంకులతో మనకంటే ముందు నిలిచాయి. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం 36 దేశాలు అత్యంత ప్రమాదకర స్థాయిలోను, 6 దేశాలు ఆకలి తీవ్రతతోనూ ఉన్నాయి.
నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే 2019-2021కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలలో చైల్డ్‌ వేస్టింగ్‌ 19.3 శాతంగా, చైల్డ్‌ స్టంటింగ్‌ 35.5 శాతంగా ఉంది. ఎస్‌.ఒ.ఎఫ్‌.ఐ 2023 నివేదిక కూడా భారతదేశంలో 24 కోట్ల మంది ప్రజలు పోషకాహార లేమితో ఉన్నారని తెల్పింది. ఫుడ్‌ సెక్యూరిటీ అండ్‌ న్యూట్రిషన్‌ ప్రపంచ నివేదిక-2023లో కూడా ఇది 16.6 శాతంగా ఉన్నది.
‘పోషణ్‌’, ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’, ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’, ‘మధ్యాహ్న భోజన పథకం’, ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన’ వంటి వివిధ పథకాలు, కార్యక్రమాలు, చర్యల ద్వారా ఆకలిని తగ్గించి, పోషణను పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే ఈ ప్రచారార్భాటంలోని డొల్లతనాన్ని ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశ స్థానం బహిర్గతం చేసింది.
సామాజిక-ఆర్థిక తారతమ్యాలు, ప్రబలిన పేదరికం, తగినంత ఆహారాన్ని తీసుకోలేకపోవడం, పోషక విలువలున్న ఆహార వస్తువుల ధరలు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య పరిరక్షణా కొరత, లోపభూయిష్టమైన వ్యవసాయ పద్ధతులు, ఆహార పంపిణీ విధానాలు, లింగ అసమానతలు వంటివి ప్రపంచ ఆకలి సూచిలో భారతదేశ స్థానాన్ని దిగజార్చడానికి తీవ్ర ప్రభావాన్ని చూపిన అంశాలు. దీనిని పాలకులు గమనించి, సార్వజనీయ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఆర్థిక అసమానతలను తగ్గించే ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించి దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించాల్సిన సమయమిది.

– జి. కిషోర్‌ కుమార్‌,
జాయింట్‌ సెక్రటరీ, ఎస్‌.సి.జడ్‌.ఐ.ఇ.ఎఫ్‌
(ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఎల్‌ఐసి ఉద్యోగ సంఘం)
సెల్‌ : 9440905501

➡️