‘ఆకలి…ఆకలి…తెరిచిన/ రౌరవ నరకపు వాకిలి/ హృదయపు మెత్తని చోటుల/ గీరే జంతువు ఆకలి/ బ్రహ్మాండం దద్దరిలి/ బ్రద్దలైన ఏదో ధ్వని’ అంటాడు అలూరి బైరాగి. ఆకలి హోరు ముందు పిడుగైనా వినిపించదు. ఆకలి కమ్మిన కళ్లకు ప్రపంచమే కనిపించదు. పేదవాడి కడుపు కరువు తీర్చలేని నాగరికత ఇది. తల్లి గర్భం నుంచి ఈ భూమిపైకి అడుగుపెట్టిన క్షణం నుంచి భాష రాకపోయినా, బంధం అర్థం కాకపోయినా… ఆకలి బాధ మాత్రం అర్థమౌతుంది. ఈ భూమ్మీద ఆకలి తెలియని జీవి లేదు. ఆకలి తీర్చుకోడానికి నిరంతర పోరాటం తప్పనిసరి. ఆకలితో పోరాటం మనిషికి ఈనాటిది కాదు. ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా… జనం ఆకలి మాత్రం తీర్చలేకపోతున్నారు. అంతరిక్షంలోకి దూసుకుపోతున్న రోజుల్లోనూ నిత్యం పస్తులు, పసిబిడ్డల ఆకలి కేకలు… తగలబడుతున్న కాష్టం నుంచి వినిపించే చిటపటల్లా మండుతూనే వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 53 దేశాల్లో సుమారుగా 11.3 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కనీసం ఒక్కపూట కూడా కడుపు నింపుకోలేని దుస్థితిలో వున్నారని సాక్షాత్తూ ఐరాసనే వెల్లడించింది. ‘అసలు మనిషిని చైతన్యవంతంగా చేసేదేమిటో తెలుసా? ఆకలి. ఒక్క మనిషినే కాదు, సృష్టిలో ప్రతి జీవికీ కూడా… ఆకలి తీరిన మీదటే అన్నీ…’ అంటారో రచయిత్రి.
‘అన్నపు రాశులు ఒకచోట/ ఆకలి మంటలు మరోచోట/ హంస తూలికలు ఒకచోట/ అలసిన దేహాలొకచోట’ అంటారు కాళోజీ. మోడీ ఏలుబడి మొదలైన ఈ పదేళ్లు… దేశం అనుభవిస్తున్న దురవస్థకు సజీవ సాక్ష్యాలు. మోడీ పాలనలో అదానీ, అంబానీలు దేశంలోనే అత్యంత శ్రీమంతులుగా చలామణి అవుతుండగా, పేదలు మరింత నిరుపేదలుగా మార్చివేయబడుతున్నారు. దేశ సంపదను సంపన్నులకు కట్టబెట్టే ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలే ఈ దుస్థితికి కారణం. చేసేందుకు ఉపాధి దొరకని పరిస్థితి, పని దొరికినా కరిగిపోతున్న నిజవేతనాలు వంటివాటితో సామాన్యులు కడుపునిండా తినలేకపోతున్నారు. తిన్నది కూడా పౌష్టికాహారం కాదు. పేదలు పట్టెడన్నం కోసం ఆకలి కేకలు పెట్టే దుస్థితికి దేశం చేరింది. గతంలో వున్న అంత్యోదయ కార్డులు నిరుపేదలకు, నిర్భాగ్యులకు ప్రయోజనకరంగా వుండేవి. రకరకాల నిబంధనలతో వాటిని అటకెక్కించారు. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ దారుణమైన స్థితికి పడిపోయింది. 2023 సంవత్సరానికి గానూ మొత్తం 125 దేశాలను పరిగణనలోకి తీసుకొంటే 28.7 హంగర్ స్కోరుతో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గతేడాది ర్యాంకుతో పోలిస్తే నాలుగు స్థానాలు దిగజారింది. ఈ ఆకలి కేకలు ఏ మానవత్వానికీ వినబడవు. ఎండిన డొక్కల్లో ఆవి చేస్తున్న రణం… కార్పొరేట్ల దోపిడీ సాక్షిగా మరణ శాసనాల్ని లిఖిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆకలి, ఆహార అభద్రతతో పోరాడుతూనే ఉన్నారనేది కఠోర వాస్తవం. సాంకేతికత, వ్యవసాయంలో పురోగతి ఉన్నప్పటికీ, ప్రపంచం ఆకలి సంక్షోభంలో కూరుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది మరణాలలో ఒకరిది ఆకలి మరణంగా నమోదవుతోంది. 8.28 కోట్ల మంది ప్రజలు దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో ఉన్నారు. ఈ గణాంకాలు భయంకరమైన వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఆకలి, పేదరికం, నిరుద్యోగం, అవినీతి, అన్యాయం, మతోన్మాదం అలుముకున్న ఈ దేశం గమ్యం ఎటువైపు? ఈ దేశం నిజంగానే వికసిత్ భారత్ కావాలంటే-రైతులను శక్తివంతం చేయడం, సార్వత్రిక ప్రజాపంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఆకలిని నిర్మూలించడంలో కీలకమైన దశలు. సామాజిక న్యాయం, ఆర్థిక స్థిరత్వం రెండింటినీ ప్రోత్సహిస్తూ, ఈ భూమ్మీద ఉన్న ప్రతి వ్యక్తికి పౌష్టికాహారం అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రతి యేడాది మే 28న నిర్వహించే ‘ప్రపంచ ఆకలి దినం’ ఆకలి యొక్క వినాశకర ప్రభావాన్ని గుర్తు చేయడమే కాదు, మార్పునకు ఉత్ప్రేరకం కావాలి. ‘ఆకలి దహిస్తూండబట్టి గానీ లేపోతే నేనూ/ ఈ ఉభయ సంధ్యల రంగులతో నా మానసాన్ని/ సింగారించుకుని వుందును’ అంటారో కవి. ఆకలి, దాని వినాశకరమైన పరిణామాల నుంచి బయటపడి ప్రతి ఒక్కరూ సమున్నతంగా జీవించే ఆకలిలేని ప్రపంచం కోసం కృషి చేయాలి. అందుకు తగిన విధంగా ప్రభుత్వాల విధానాలను మార్చాలి.
