ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్‌ పర్సా

కామ్రేడ్‌ పర్సా సత్యనారాయణను నేను మొదటిసారిగా 1975లో కలిశాను. పెడనలో జరిగిన మేడే ర్యాలీలో ప్రసంగించిన తర్వాత మా ఇంటికి భోజనానికి వచ్చారాయన. నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడిని కలవడం అదే మొదటిసారి. ఎమర్జెన్సీ సమయంలో ఆయన అండర్‌గ్రౌండ్‌లో వున్నప్పుడు రెండవసారి కలిశాను. మచిలీపట్నంలో మా ఇంటి దగ్గర ఎనిమిది-తొమ్మిది మంది పార్టీ సభ్యులకు ఐదు రోజుల పాటు ఏర్పాటు చేసిన రాజకీయ తరగతులలో భాగంగా ఆయన రాజకీయ భౌగోళిక శాస్త్రం బోధించడానికి వచ్చారు. నేను పార్టీ తరగతులకు హాజరు కావడం అదే మొదటిసారి. ఈ రెండు సందర్భాలలోనూ, ఆయన కనబరిచిన ఆప్యాయత, సరళంగా క్లాసు బోధించిన విధానం నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆ తర్వాత నాకు ఆయన మార్గదర్శకత్వంలో పని చేసే అవకాశం లభించింది. నేను సిఐటియు రాష్ట్ర కేంద్రంలో చేరడానికి ముందే…ఎ.పి రాష్ట్ర శ్రామిక మహిళల సమన్వయ కమిటీ (సిఐటియు), ఎ.పి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌లో ఆయన గైడెన్స్‌లో పనిచేశాను.
‘కామ్రేడ్‌ పర్సా’ అని ఆప్యాయంగా పిలుచుకునే ఆయన నిజమైన కమ్యూనిస్టు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా వుండేవారు. అంతేగాక ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేవారు. నిజాం పాలనా కాలంలో సింగరేణి బొగ్గు గనులలో ఆయిల్‌, రేషన్‌ జారీ చేసే గుమస్తాగా పని చేసేటప్పుడే కార్మికులను సంఘటిత పరుస్తూ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. సింగరేణి కోల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ పాల్గొన్నారు. ఆయన తన రాజకీయ జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. సింగరేణి యాజమాన్యం కక్ష సాధింపు చర్యలు, ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు, అరెస్టులు, జైలు శిక్ష, పోలీసుల చిత్రహింసలు వంటివెన్నో ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కార్మిక, శ్రామిక ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేశారు తప్ప ఆయన ఎన్నడూ ఆ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. పాల్వంచ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు పార్టీ నిర్ణయం మేరకు…రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఆందోళనకు మద్దతుగా రాజీనామా చేశారు. సిపిఎం ఎ.పి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా కూడా పనిచేశారు.
కామ్రేడ్‌ పర్సా సిఐటియు ఎ.పి అధ్యక్షుడిగా, ఆ తరువాత గౌరవాధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షుడిగానూ ఉన్నారు. సిఐటియు మాసపత్రిక ‘కార్మికలోకం’ సంపాదకుడిగా చాలా సంవత్సరాల పాటు పనిచేశారు. పత్రిక చందాలు పెంచమని, వ్యాసాలు రాయమని, పత్రిక చందా బకాయిలు చెల్లించమని గుర్తు చేస్తూ సిఐటియు కార్యకర్తలకు తన అందమైన దస్తూరీతో రాసిన పోస్ట్‌ కార్డ్‌లు ఎప్పుడూ గుర్తొస్తూనే వుంటాయి. శ్రామిక మహిళల రాష్ట్ర సమన్వయ కమిటీ (సిఐటియు)కి ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ప్రారంభ దశలో రాష్ట్ర అంగన్‌వాడీ యూనియన్‌కు కూడా ఆయన మార్గనిర్దేశం చేశారు. కార్యకర్తలకు సమస్యలు ఎదురైనప్పుడు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా వుండేవారు. వారికి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురయ్యే అనేక సమస్యలకు తనదైన చిరునవ్వుతో పరిష్కారం చూపేవారు. ముఖ్యంగా ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమంలో పని చేసే మహిళా కార్యకర్తలను ప్రోత్సహించేవారు. వారు అభివృద్ధి చెందేలా ముందుకు నడిపేవారు. తన తరానికి చెందిన అనేక మంది కమ్యూనిస్టుల మాదిరిగానే ఆయన చాలా నిరాడంబరంగా వుండేవారు. అంత పెద్ద నాయకుడితో మాట్లాడుతున్నామనేదే తెలిసేది కాదు. నమ్మిన సిద్ధాంతం పట్ల, పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావం, అచంచల విశ్వాసం, జీవితాంతం కనబరిచిన క్రమశిక్షణ…తను పడ్డ అన్ని రకాల కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొనేలా చేశాయి. కామ్రేడ్‌ పర్సా శత జయంతి సందర్భంగా ఆయనలోని ఈ లక్షణాలను మనం అనుసరించేందుకు ప్రయత్నించాలి.
బొగ్గు కార్మికులను, ఇతర వర్గాల కార్మికులను సంఘటిత పరుస్తున్నప్పుడు…స్వాతంత్య్రానికి ముందు నిజాం లేదా బ్రిటిష్‌ వలసవాదులపై, స్వాతంత్య్రం వచ్చాక భారత పాలక వర్గాలపై పోరాడుతున్నప్పుడు… కామ్రేడ్‌ పర్సా ఒక్కటే కోరుకున్నారు. అన్ని రకాల దోపిడీల నుండి సమాజాన్ని విముక్తం చేయాలని, సోషలిస్టు సమాజాన్ని సాధించాలని కలలు కన్నారు. ఈ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికిగాను శ్రామిక వర్గాన్ని ఏకం చేయడానికి, వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి తన జీవితాన్నే అంకితం చేశారు.
నేడు, మన దేశంలోని కార్మికవర్గం, సామాన్య ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నయా ఉదారవాద విధానాల కారణంగా ఒక వైపు తమ జీవనోపాధి, పని పరిస్థితులపై క్రూరమైన దాడులకు గురవుతున్నారు. మరోవైపు మత, విచ్ఛిన్న శక్తులు, ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని శక్తులు ప్రభావం చూపుతున్నాయి. మతం, కులం, భాష, ప్రాంతం వంటి అంశాల ప్రాతిపదికన ఐక్య పోరాటాలను బలహీనపరుస్తూ బడా పెట్టుబడిదారీ వర్గానికి ప్రయోజనం చేకూరుస్తున్నాయి. పదేళ్ల పదవీ కాలంలో మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అనుసరిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ ఎజెండా అయిన మత విభజనను ప్రోత్సహిస్తోంది.
ఇది ఒక్క మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. పెట్టుబడిదారీ విధానం యొక్క వ్యవస్థాగత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అన్ని పెట్టుబడిదారీ దేశాలలోని పాలక వర్గాలు, ప్రపంచవ్యాప్తంగా తమ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాలు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నాయి. ప్రజలను విభజించడానికి, వారి మధ్య ఐక్యతకు భంగం కలిగించేందుకు, వారి అసమ్మతిని వ్యతిరేకతను అణిచివేసేందుకు మితవాద శక్తులను ప్రోత్సహిస్తున్నాయి.
పెట్టుబడిదారీ సంక్షోభాన్ని పరిష్కరించడానికిగాను 1970లలో చేపట్టిన నయా ఉదారవాదం విఫలమైంది. నేడు అంతర్జాతీయ ఫైనాన్స్‌ కాపిటల్‌ పెత్తనం చెలాయిస్తున్నది. ప్రస్తుతం ఉన్న చట్రంలో ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు పెట్టుబడిదారీ విధానం ఇంత వరకు ఒక పరిష్కారాన్ని కనుగొనలేకపోయింది.
తమ లాభాలను పెంచుకోవడానికి, సంపదను కూడబెట్టుకోవడానికి ప్రజా వనరులను కొల్లగొట్టడం, కార్మికుల స్థితిగతులపై మరిన్ని దాడులకు పాల్పడడం, కార్మిక సంఘాలను బలహీనపరచడం, దోచుకోవడం తప్ప ఏమీ లేదు. దీన్ని సులభతరం చేయడానికి వారు మితవాద శక్తులను, నియంతత్వ ప్రభుత్వాలను ప్రోత్సహిస్తున్నారు.
మన దేశంలో మోడీ హయాంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం కార్మికుల మీద తీవ్రంగా పడింది. అది కార్మికులలోకి లోతుగా చొచ్చుకుపోయింది. ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థలు చిమ్ముతున్న కాషాయ గరళానికి అన్ని రంగాల కార్మికులు బాధితులవుతున్నారు. ఇతర మతాలలో కూడా ఛాందసవాద శక్తులు పెరుగుతున్నాయి. వర్గపరమైన గుర్తింపునకు బదులుగా మత, కుల పరమైన గుర్తింపు పెరుగుతోంది. ఐక్య పోరాటాలపై దీని ప్రభావం పడుతోంది. వర్గ ఐక్యతను పెంపొందించడానికి, వర్గ పోరాటాలను ముమ్మరం చేయడానికి తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయి.
నేడు గుత్తాధిపతులు, బడా పెట్టుబడిదారులు, వారిని రక్షించే ప్రభుత్వం తమ పధాన శత్రువులని శ్రామిక వర్గంలోని అనేక సెక్షన్లు గుర్తించడంలేదు. గత మూడు దశాబ్దాలుగా నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా స్థిరమైన ఐక్య పోరాటాలు సాగుతున్నప్పటికీ కార్మికులు నేటికీ నయా ఉదారవాదాన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థను తమ ప్రధాన శత్రువుగా గుర్తించడంలేదు. దోపిడీని అంతం చేయాల్సిన ఆవశ్యకతను, దోపిడీ రహిత సమాజాన్ని స్థాపించడంలో తమ పాత్రను కార్మికులకు తెలియచేయాల్సి ఉంది.
18వ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మరికొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులు, కర్షకులు చేస్తున్న నిరంతర పోరాటాల ఫలితంగా ప్రజల జీవనోపాధి సమస్యలు, ఉపాధి, వేతనాలు, ధరలు మొదలైనవి ఎన్నికల సమయంలో చర్చనీయాంశమైనాయి. అయినప్పటికీ, మతపరమైన అంశాలపై ప్రజల మధ్య చీలికలు పెట్టి వీటిని పక్కదారి పట్టించేందుకు బిజెపి తీవ్రంగా ప్రయత్నించింది. రామమందిర నిర్మాణం వైపు ప్రజల దష్టిని మళ్లించాలని చూసినా విజయవంతం కాలేదు.
బిజెపి మళ్లీ అధికారంలోకి వచ్చినట్లయితే…అమెరికా సామ్రాజ్యవాద వ్యూహాత్మక జూనియర్‌ భాగస్వామిగా భారతదేశాన్ని మార్చేందుకు తన జంట ఎజెండా అయిన నయా ఉదారవాదం, హిందుత్వలను మరింత వేగంగా అమలు పరుస్తుంది. అదే సమయంలో బిజెపిని ఓడించినంత మాత్రాన … ఆ తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేరుస్తుందని, ప్రత్యామ్నాయ ప్రజానుకూల విధానాలను అనుసరిస్తుందని గ్యారంటీ ఏమీ లేదు. 2004లో మాదిరిగా ఈ 18వ సార్వత్రిక ఎన్నికలలోనూ వామపక్ష శక్తుల ప్రాతినిధ్యం పెరిగినట్లయితే ఆ మేరకు అవి కార్మికుల, కర్షకుల, ఇతర సెక్షన్లకు చెందిన ప్రజా సమస్యలను పార్లమెంటులో వినిపిస్తాయి.
అయితే, కేంద్రంలో ఏ రాజకీయ పొందికతో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ నయా ఉదారవాద విధానాలకు, అలాగే పాలక వర్గాల విభజిత విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాల్సి వుంటుంది. ఈ పోరాటాన్ని ఇప్పటికన్నా మరింత శక్తివంతంగా, సమరశీలంగా ముందుకు తీసుకుపోవాలి.
అన్ని రకాల దోపిడీల నుండి సమాజాన్ని విముక్తి చేసేందుకు తన జీవితాన్నే అంకితం చేసిన కామ్రేడ్‌ పర్సా స్వప్నాన్ని సాకారం చేయడమే ఈ శత జయంతి సందర్భంగా ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.

– వ్యాసకర్త సిఐటియు జాతీయ అధ్యక్షులు కె. హేమలత

➡️