‘ఎక్కడమ్మా నువ్వు లేనిది?/ ఏమిటీ నువ్ చేయలేనిదీ?/…వ్యవసాయంలో నువు లేకుంటే/ నోటికాడికి కూడే రాదు/ …సమాజ గమనం నువు లేకుంటే గతితప్పి గంగపాలవుతుంది’ అంటారు కవి దేవేంద్ర. భూస్వామ్య సమాజం స్త్రీని సొంత ఆస్తిగా, వంటింటికే పరిమితంజేసి, జీతంలేని పనిమనిషిగా చేస్తే… పెట్టుబడిదారీ విధానం స్త్రీ ఉనికినే సరుకుగా మార్చింది. దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగడంతో పాటు వారి ‘పని-జీవితం’ మధ్య అసమతుల్యత కూడా అంతే వేగంగా పెరుగుతోంది. స్త్రీ పురుషులిద్దరూ ఒకేలాంటి ఉద్యోగం చేస్తున్నా… ఇంటా బయటా పురుషుని ఉద్యోగానికి, ప్రమోషన్‌కు వున్న ప్రాధాన్యత స్త్రీకి వుండదు. ‘ఆర్థిక స్వేచ్ఛ, ఆత్మగౌరవం, స్వంత ఆలోచన, స్వయం నిర్ణయ శక్తి, స్త్రీల ప్రగతికి దోహదం చేస్తాయ’ని యునెస్కో-2002లో ప్రచురించిన ‘జెండర్ సెన్సిటివిటీ-ఎ ట్రైనింగ్ మాన్యువల్’ నివేదిస్తోంది. కానీ, ఆచరణలో స్త్రీ జీవితం- శ్రమ మధ్య సమతుల్యతలో తీవ్రమైన అంతరం వుంది. ఈ తరం పురుషులు కొందరు ఇంటిపనిలో భార్యకు కొంత సాయం చేసినా, ముఖ్యమైన నిర్ణయాల్లో పురుషులదే పైచేయి. భార్య సంపాదన మీద నియంత్రణ కూడా పురుషులదే. స్త్రీలను పురుషులతో సమానంగా గుర్తించాలని, మానవ సంబంధాలలో మౌలికమైన మార్పులు రావాలని చెబుతూ…’లింగభేదం లేకుండా కుటుంబ సభ్యుల మధ్య ఇంటి పనిని సక్రమంగా పంచుకోవడంపై దృష్టి పెట్టండి’ అంటారు అక్‌సోన్ కూల్.
భారత్‌లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. అయితే, పని ప్రదేశంలో ఎంత ఒత్తిడికి గురవుతున్నా, ఇంటి పనిలో ఎలాంటి మినహాయింపు వుండదు. ‘ఇంటెడు చాకిరి చేస్తూ/ పిల్లపాపలను కని పెంచుతూ/ ఉద్యోగము చేసి సంపాదిస్తూ/ జీతమంతా భర్త చేతిలో గుమ్మరించి/ బస్సు చార్జీలకై భర్త ముందు/ చేయి చాచి అర్థించిన నాడు-/ సిగ్గుతో ముడుచుకున్న చిరునవ్వును నేను’ అంటారు డాక్టర్ వాసా ప్రభావతి. మహిళలు ఉద్యోగం చేయడానికి అంగీకరిస్తున్నప్పటికీ ఇంటి పనిభారం, పిల్లల సంరక్షణ బాధ్యతలను పంచుకోడానికి సగటు భారతీయ కుటుంబాల్లోని పురుషులు సిద్ధపడటంలేదు. ఉద్యోగులైన స్త్రీలు 5.8 గంటల సమయం ఇంటి పని చేయడానికి వెచ్చిస్తుండగా, నిరుద్యోగులైన పురుషులు 3.5 గంటలు, ఉద్యోగులైన పురుషులు 2.7 గంటలు మాత్రమే ఇంటి పని చేస్తున్నారని ‘డేటా పాయింట్’ ప్రచురించింది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ 15-59 సంవత్సరాల వయసు గల స్త్రీ పురుషుల్లో 85 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ఇంటి పనుల్లో నిమగమై వుంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఆడిటింగ్, ఐటీ, మీడియా వంటి రంగాల్లో వున్న మహిళలు వారానికి 55 గంటల కంటే ఎక్కువ సమయం పని చేస్తున్నారు. ఇది వారంలో ఆరు లేదా ఐదు రోజుల పనిని బట్టి ప్రతిరోజూ 9-11 గంటలు పని చేస్తున్నారని అంచనా. సగటు స్త్రీకి శ్రమ-జీవితం మధ్య సమన్వయం కుదరడం లేదు. ‘సమస్యంతా అమ్మను అమ్మలా, మనిషిలా ఎలా చూడాలన్నదే/ నేను అమ్మనో బొమ్మనో కాకుండా/ మనిషిగా ఎలా నిలబడాలన్నదే!!’ అంటారు. సమాజంలో శ్రామిక బానిసయ్యిందో, మనిషిగా ఎందుకు కాకుండా పోయిందోనని ఆవేదన వ్యక్తం చేస్తారు కవయిత్రి శోభారాణి.
ఒక సర్వే ప్రకారం…స్త్రీలలో 81.2 శాతం మంది వేతనంలేని గృహ సేవలలో నిమగమై వున్నారు. గృహ నిర్వహణ, పిల్లలు, అనారోగ్యం, వృద్ధుల సంరక్షణ కోసం పురుషుల కంటే పదిరెట్లు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారని ఆ సర్వే తేల్చింది. ‘మహిళలందరూ పని చేస్తారు, కానీ వారందరికీ జీతం లేదు’ అంటారు నోబెల్‌ప్రైజ్ గ్రహీత, ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్. శ్రమ, జీవితం…ఈ రెండిటి మధ్య సమతుల్యత సాధించడంలో మహిళలకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ‘స్త్రీ, పురుషులలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించాలంటే ఇంటి పని విషయంలో పురుషుడు తప్పక సాయపడాలి. ప్రస్తుతం వర్క్ కల్చర్ మారిపోయిన నేపథ్యంలో ఇంటి నుంచి కూడా స్త్రీకి పూర్తి స్వేచ్ఛ లభించాలి’ అని ఐఐఎం-అహ్మదాబాద్ ప్రొఫెసర్ సతీశ్ దియోధర్ నివేదిక వెల్లడించింది. స్త్రీల ఆరోగ్యం, వారి ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఆయా సంస్థలు, ప్రభుత్వాలు కొన్ని నిబంధనలను సడలించాలి. ముఖ్యంగా కుటుంబం వారికి బాసటగా నిలవాలి. అప్పుడే సమతుల్యత సాకారమౌతుంది.