చేతిరాత

Feb 4,2024 07:15 #Editorial, #Education
importance of handwriting editorial

అందమైన చేతిరాత కోసం చిన్నప్పుడు కాపీ బుక్కులు నింపిన జ్ఞాపకం. ముత్యాలు పేర్చినట్టుగా వుండే అక్షరాలను చూసుకొని మురిసిపోయిన జ్ఞాపకం. ఇప్పుడు సంతకం కూడా కుదురుగా రాయలేకపోవడాన్ని తలచుకుని వగచడం వాస్తవం. ఇది చాలామందికి అనుభవం. రాసే అక్షరం, చేసే సంతకం ఇప్పుడు అష్టవంకరలు పోతోంది. ఇమెయిల్స్‌, బ్లాగ్‌లు, సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ఉత్తరాలు, డైరీలు రాసే అలవాటు తప్పిపోయింది. ‘చేతిరాత గుండె కదలికకు మరింత అనుసంథానించబడి వుంది’ అంటారో రచయిత్రి. పూర్వం తల్లిదండ్రులు తమ పిల్లలతో శ్రద్ధగా ఒరవడి రాయించేవారు. ప్రస్తుతం ర్యాంకులపై పెట్టే శ్రద్ధ.. చేతిరాత విషయంలో చూపడంలేదు. ‘పిల్లల చేతిరాత అందంగా వుండేలా ప్రోత్సహిస్తే, వారి వ్యక్తిత్వ వికాసానికి, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది’ అంటారు చిత్రకారుడు, కవి ఆత్మకూరు రామకృష్ణ. అనేక గ్రంథాలను పరిశోధించి, చేతిరాతను ఎలా మెరుగుపర్చుకోవాలో శాస్త్రీయ పద్ధతిలో వివరించారు ‘హస్తలేఖనం ఓ కళ’ అనే గ్రంథంలో. అందమైన చేతిరాత ఓ ప్రత్యేక నైపుణ్యం మాత్రమే కాదు, అది అభ్యసన ప్రక్రియలో ఓ భాగం’ అంటారు వాండర్‌ బిల్డ్‌ యూనివర్శిటీకి చెందిన నిపుణులు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నట్లుగా చేతిరాత మెరుగుదలకు నిత్య సాధన ఎంతో అవసరం.

ఈ డిజిటల్‌ యుగంలో రాసేవారి సంఖ్య చాలావరకు తగ్గిపోయింది కానీ, ఒకప్పుడు చేతిరాతకి చాలా ప్రాముఖ్యత వుండేది. టాల్‌స్టారు తన ‘యుద్ధము-శాంతి’ నవలను అనేక పర్యాయాలు తిరగశారాడట. ఇంగ్లీషులో ఎమిలీ డికెన్‌సన్‌ కవితల సంపుటాలు ఆమె చేతిరాతవే అచ్చేశారు. ఇలియట్‌, కీట్స్‌, వాల్ట్‌ విట్‌మన్‌, రిచర్డ్‌ బాష్‌ వంటి ప్రముఖుల రచనలు వారి చేతిరాత ప్రతులనే అచ్చువేశారు. హిందీ రచయితలలో మహాదేవివర్మ ‘దీప్‌శిఖా’ ఆమె చేతిరాతతో అచ్చయింది. గురజాడ వారి ‘కన్యాశుల్కం’, శీలా వీర్రాజు ‘కిటికీ కన్ను’, మహాకవి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ వారి చేతిరాతతోనే ప్రచురించబడగా, శ్రీరమణ ‘మిథునం’ బాపూ స్వదస్తూరితో ముద్రితమైంది. అలాగే కొందరు సినారె, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, నగముని, నార్ల, గురజాడ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, దాశరథి వంటి 182 మంది కవుల చేతిరాత ప్రతులతో ‘పొయిట్రీ వర్క్‌షాప్‌’ పేరుతో కవితా సంకలనాన్ని ప్రచురించారు. అచ్చు యంత్రానికి ముందున్న మహాగ్రంథాలన్నీ గతకాలపు మహాకవుల చేతిరాతలే. చేతిరాతలకు ఇంతటి గొప్ప చరిత్ర వుంది. అయితే, ఆధునికులలో సగటున ఓ వ్యక్తి 41 రోజులకు గాని నాల్గు లైన్లు రాయాల్సిన అవసరం గాని, ప్రతి ముగ్గురిలో ఒకరికి 6 నెలల పాటు కలం పట్టే అవసరంగాని రావడం లేదట. ఇక ప్రతి ఏడుగురిలో ఒకరు తమ చేతిరాత అవమానకరంగా మారిపోయిందని వాపోతున్నారంటూ బ్రిటిష్‌ కంపెనీ డాక్మెయిల్‌ సర్వే తేల్చింది.

కీబోర్డ్‌పై టైప్‌ చేయడం కంటే, చేతితో రాయడం వల్ల నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ‘కీబోర్డ్‌ మీద టైపింగ్‌తో పోలిస్తే చేత్తో రాస్తున్నప్పుడు మెదడు అనుసంధానం మరింత విస్తృతంగా ఉంది. ఈ అనుసంధానం జ్ఞాపకశక్తికి, కొత్త సమాచారాన్ని విశ్లేషించడానికి కీలకం. నేర్చుకొనేందుకు ప్రయోజనకరం’ అని నార్వేజియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌ తెలిపారు. చేతిరాత, టైపింగ్‌ సమయంలో నాడీ సంబంధమైన నెట్‌వర్క్‌ను పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. టైపింగ్‌ కూడా మంచిదే అయినప్పటికీ, చేతిరాతతో పోల్చినప్పుడు నేర్చుకునే సామర్థ్యం తక్కువగా వుందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ‘రోజులో కనీసం 20 నిమిషాల పాటు మన ఎమోషన్స్‌ని చేతిరాతలో వ్యక్తీకరించడం వల్ల డిప్రెషన్‌ను జయించవచ్చు’ అని ప్రముఖ రచయిత్రి హర్షదా పఠారే చెబుతున్నారు. ఇక ‘రాయడం వల్ల మన ఆలోచనల్లో ఏకాగ్రత పెరుగుతుందని’ మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ పరిశోధకులు కూడా వెల్లడించారు. ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడం, చిన్నచిన్న కథలు, ఉత్తరాలు రాయడం, నిద్రకు ముందు కాసేపైనా డైరీ రాయడం అలవాటుగా మార్చుకోవాలి. మనకు ఇష్టులైన వారికి స్వదస్తూరితో రాసి శుభాకాంక్షలు చెబితే మరింత తృప్తిగానూ వుంటుంది కదా.

➡️