తేలని లెక్కలు

Jun 6,2024 05:25 #Articles, #edit page

గగన్‌ వర్మ మరణించాడు. తనకిప్పుడిప్పుడే మరణం లేదని గగన్‌కు గట్టి నమ్మకం ఉండేది. తన నమ్మకాన్ని ఎంత గట్టిగా ప్రకటిస్తూ వచ్చాడంటే…నా బోటి పరిశీలకులు సైతం గగన్‌ చాలా కాలం బతికేలా ఉన్నాడన్న అభిప్రాయంతో ఉండేవాళ్ళు. కాని ఎంతటి వారికైనా మరణము తప్పదు కదా. అందుచేత గగన్‌ వర్మ ఉన్నట్టుండి …పోయాడు.
పరలోకం మీద గగన్‌ వర్మకు గట్టి విశ్వాసం ఉండేది. ఆ పరలోకానికే తానూ చేరి దైవం రక్షణలో ఉంటాననుకున్నాడు. ఆ విశ్వాసమే గగన్‌ ను పరలోకపు ప్రవేశ ద్వారం వద్దకు చేర్చింది. అక్కడ ఉన్న ద్వారపాలకుడు గగన్‌ వర్మను చూడగానే తలుపులు తెరిచాడు. చిరునవ్వుతో లోపలికి అడుగుపెట్టిన గగన్‌ నిర్ఘాంతపోయాడు. అది స్వర్గం కాదు. నరకం !
”ఏమిటీ అన్యాయం ? నేను స్వర్గానికి పోవలసినవాడిని. నన్ను ఇక్కడికి ఎందుకు కేటాయించారు ? నేను ఒప్పుకోను. అప్పీలు చేసుకుంటాను ” అని ప్రకటించాడు. పరలోకంలో సత్వర న్యాయం అమలౌతుంది కదా. అక్కడ వాయిదాలు, బెయిళ్ళూ
ఉండవు మరి. వెంటనే అప్పిల్లేట్‌ కోర్టు న్యాయమూర్తి ముందుకి గగన్‌ ను చేర్చారు.
”చెప్పండి గగన్‌ వర్మ గారూ ? మిమ్మల్ని నరకానికి ఎందుకు పంపకూడదో కారణాలు తెలపండి ” అని న్యాయమూర్తి అడిగారు. అప్పుడు గగన్‌ ” అయ్యా న్యాయమూర్తిగారూ ! నేను భూలోకంలో రాజ్యాన్ని పాలించిన కాలంలో నాకు తెలిసి అన్నీ పుణ్యకార్యాలే చేశాను. 40 లక్షల మందికి వితంతు పెన్షన్లు నెలనెలా వచ్చేలా చేశాను. 60 లక్షల మందికి వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు వచ్చేలా చేశాను. ఇంకా అనేక లక్షల మంది చిన్న వృత్తులవారికి, రైతులకు తోడ్పాటు అందించాను. తల్లి కడుపు స్కీం ద్వారా తమ బిడ్డల్ని చదివించుకునేందుకు తోడ్పాటు అందించాను. దాని వలన లాభం పొందినవారు కూడా లక్షల్లోనే ఉన్నారు. మరి వారందరి దీవెనలూ నాకే కదా ఉంటాయి? అందరి దీవెనలు పొందగలిగినప్పుడు నేను నరకానికి ఎందుకు పోవాలి? ” అని గగన్‌ వర్మ తన వాదనను అత్యంత వేదనాభరితంగా వినిపించేడు.
అప్పుడు న్యాయమూర్తిగారు తన దగ్గరున్న చిట్టా బైటకు తీసేడు. దానిని పరిశీలించి ఇలా చెప్పేడు : ”గగన్‌ వర్మ గారూ ! మీరు కేవలం మీ పాలనలో చేసిన పుణ్యకార్యాలనే ఇక్కడ చెప్పారు తప్ప… మీరు చేసిన అన్ని పనులనూ పేర్కొనలేదు. మచ్చుకి: కరెంటు చార్జీలు పెంచేశారు. ఆ చార్జీలు ఎంతెంత పెరిగాయో, ఆ బిల్లులు కట్టలేక ఎన్ని లక్షల మంది ప్రజలు మిమ్మల్ని బిల్లులు కట్టిన ప్రతీసారీ తిట్టుకున్నారో మీకు తెలుసా ? మా దగ్గర రికార్డు ఉంది. ఆస్తి పన్ను పెంచేశారు. పేదవాళ్ళని కూడా విడిచిపెట్టకుండా చెత్త పన్ను వసూలు చేశారు. లక్షల మంది స్కీము వర్కర్ల గోడు పట్టించుకోలేదు సరికదా వాళ్ళని జైళ్ళలో పెట్టారు. ఇళ్ళ నుంచి బైటకు రాకుండా వాళ్ళని నిర్బంధించిన సందర్భాలెన్నో మీకు గుర్తున్నాయా ? సమాజానికి జ్ఞానబోధ చేసే ఉపాధ్యాయుల ఉసురు పోసుకున్నారు. లక్షల మంది కౌలుదారులను గాలికొదిలేశారు. కోట్లాది మంది అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలను కనీసమైనా పెంచినది లేదు. ఇంకా…” న్యాయమూర్తి చెప్పబోతూంటే గగన్‌ వర్మ ఆపాడు.
”అయ్యా! అలాంటివి తమరు పట్టించుకోరాదని నా మనవి. ఎందుకంటే మొదటిది: నేను చేసిన పుణ్యకార్యాల ముందు ఇవన్నీ చాలా తక్కువ. పైగా మీరు శలవిచ్చిన చాలా పనులు హస్తినాపురం నుండి చక్రవర్తుల వారు పంపిన ఆదేశాలను బట్టి చేశానే తప్ప మరోటి కాదు. ”
న్యాయమూర్తికి ఆగ్రహం వచ్చింది. ”మూర్ఖుడా ! మరణించాక కూడా నీ ధోరణి మారదా? ఎవరు చెప్పినదీ వినిపించుకోవా? నీ హితవు కోరి అనేకమంది నీ పాలన గురించి చెప్పిన సలహాలు, అభిప్రాయాలు అప్పుడు పెడచెవిన పెట్టావు. ఇక్కడికి చేరావు. ఆఖరిసారి చెప్తున్నాను విను ! నువ్వు చేసిన పుణ్యకార్యాలకన్నా పాపాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ పాపాల లెక్కల్ని నువ్వు ఎక్కడా రాసుకోలేదు. నీ సేవకులు కూడా ఎవరూ రాసినట్టు లేదు. పైగా నువ్వెటూ ఎవరు చెప్పినా వినిపించుకునే రకం కాదని నీ సైన్యం యావత్తూ ఏకాభిప్రాయంతో ఉంది. అందుకే వాళ్ళెవ్వరూ నీకు చెప్పే సాహసం చేయలేదు. ఇక హస్తినాపురం చక్రవర్తి అంటావా ! అతగాడికి కూడా హెచ్చరిక వెళ్ళింది. అతగాడి సమయం వచ్చినప్పుడు అతడూ నీ దగ్గరకే వస్తాడు. అప్పుడు ఇద్దరూ తీరుబాటుగా మీ మీ తప్పుల వాటాలను తేల్చుకుందురు గాని. నీ అప్పీలును తిరస్కరిస్తున్నాను” అన్నాడు.
”అయ్యా! కోపగించుకోకండి. నా బాధలో నేనున్నాను. కాస్త జాలి చూపండి. నా సంగతి సరే. మరి నా స్థానంలో ఇప్పుడు పట్టాభిషిక్తుడు కాబోతున్నవాడి సంగతేమిటి? అతగాడేమైనా పుణ్యాత్ముడా? అతడికి ఈ విజయం ఎలా వచ్చింది? ఇది న్యాయమా? ” అని గగన్‌ అడిగాడు ఉక్రోషంగా.
” ఓయి గగన్‌ వర్మా ! మీ రాజ్యంలో ప్రజలకు నిజమైన తీర్పు చెప్పే అవకాశం ఎక్కడుంది? ‘లాఠీ దెబ్బలు తినాలా లేక బెత్తం దెబ్బలు తినాలా అన్నది ఎంచుకోండ’ి అన్న చందాన నడుస్తున్నాయి రాజకీయాలు. ప్రజలని దోపిడీ నుంచి విముక్తి చేసే రాజకీయాలనేవి ఉన్నాయని, వాటిని కూడా ఎంచుకోవచ్చునని ప్రజలు గ్రహించనంత కాలమూ అటు లాఠీనో, ఇటు బెత్తాన్నో ఎంచుకుంటూనే వుంటారు. దెబ్బలు తింటూనే వుంటారు. గతంలో సైకిల్‌ తొక్కి తొక్కి చెమటలెక్కిపోయాక కాసేపు ఫ్యాన్‌ గాలి కింద కూర్చుందామనుకున్నారు. ఇప్పుడు ఆ ఫ్యాన్‌ కి బిల్లులు కట్టలేక, మళ్ళీ సైకిలెక్కుదామనుకున్నారు. ప్రజలు తమకు నిజంగా మేలు చేసే రాజకీయాలేమిటో తెలుసుకునే రోజూ వస్తుందిలే. నువ్విక్కడ ఎంతో కాలం ఒంటరిగా ఉండనక్కరలేదు. నీకు తోడు ఇంకా చాలామంది పాలకుల్ని ప్రజలే ఇక్కడికి పంపుతారు.”
పాపం గగన్‌ వర్మ ! నరకంలో కూచుని ఇంకా తన పుణ్యకార్యాల లెక్కల్నే మళ్ళీ మళ్ళీ సరి చూసుకుంటున్నాడు!

– సుబ్రమణ్యం

➡️