రాష్ట్రాల మధ్య అసమానతల పెరుగుదల

ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఇ.ఎ.సి-పి.ఎం) గత నెలలో…భారత దేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ తీరు 1960-61 నుంచి 2023-24 …పేరిట ఒక పత్రం విడుదల చేసింది. దేశ ఆదాయంలో ఒక్కో రాష్ట్రం వాటా, అఖిల భారత సగటుతో పోలిస్తే తలసరి ఆదాయం వివరాలేంటో అందులో పొందుపరిచింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక్కో రాష్ట్రం ఎంత ప్రధానంగా ఉందో, అలాగే ఒక్కో రాష్ట్రంలో పౌరుల సగటు సంక్షేమం సగటున ఎలా వుందో ఆ డేటా మనకు తెలియజేస్తుంది. సగటు లెక్క అసమానతలను దాచేస్తుంది. ఉదాహరణకు మహారాష్ట్రను తీసుకుంటే జాతీయ ఆదాయానికి అత్యధికం అక్కడ నుంచే వస్తుంది. జాతీయ సగటు కంటే ఆ రాష్ట్ర తలసరి ఆదాయం 150 శాతం ఎక్కువ. అయితే అందులో సంపన్నమైన ముంబాయి కలిసి వుంటుంది. మరోవైపున రైతుల ఆత్మహత్యలకు, దారిద్య్రానికి పేరుమోసిన విదర్భ కూడా ఆ రాష్ట్రంలోదే. ముంబాయి ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో అత్యధిక మొత్తం వస్తుంది. అది దేశంలోనే అతి సంపన్నమైన పురపాలక సంఘంగా వుంది. అయితే అక్కడ వుండే పేద్ద మురికివాడలలో జీవన పరిస్థితులు పౌర సమాజానికి ఎంతమాత్రం సరిపడనివి.

ప్రాంతీయ అసమానతలు
భారత దేశంలో పశ్చిమ, దక్షిణ ప్రాంతాల పరిస్థితి మెరుగ్గా వున్నట్టు ఆ నివేదిక చెబుతుంది. ఈశాన్య రాష్ట్రాల పని తీరు బలహీనంగా వుందంటుంది. హర్యానా, ఢిల్లీలను మినహాయిస్తే ఉత్తరాది రాష్ట్రాలు వెనకబడే వున్నాయి. మొత్తంపైన చూస్తే దేశంలో విభజన లేదా అంతరాలు పెరిగిపోతున్నాయనే చిత్రమే కళ్లకు కడుతుంది. సమాఖ్య వ్యవస్థతో వైవిధ్యభరిత దేశంగా వున్న ఇండియాకు ఇదేమీ మంచిది కాదు.
పెరిగిపోతున్న ఈ వ్యత్యాసమే సమాఖ్య విధానాన్ని ప్రశ్నించడానికి దారి తీస్తున్నది. సంపన్న దేశాల ప్రతినిధులు ఇటీవలనే కేరళలో ఒక శిఖరాగ్ర సమావేశం జరిపారు. కేంద్రం నుంచి తమకు వనరులలో న్యాయమైన వాటా అందడం లేదని వారన్నారు. తాము జాతీయ ఖజానాకు సమకూరుస్తున్నది కేంద్రం తమకు తిరిగి ఇచ్చేదానికన్నా ఎక్కువగా వుందని చెప్పారు. 11వ ఆర్థిక సంఘం చెప్పిన నిధుల పంపిణీ పద్ధతికి వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో కూడా విజయవంతమైన రాష్ట్రాలు ఒక శిఖరాగ్రసభ జరిపాయి. కనుక మొత్తంపైన సమాఖ్య స్ఫూర్తి సన్నగిల్లుతున్నదన్నమాట. 1991లో మొదలైన నయా ఉదారవాదం/సరళీకరణ విధానాల నుంచే దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్టు ఆ నివేదిక చెబుతున్నది. అయితే అందుకు మూలమైన కారణాల్లోకి వెళ్లలేదు. తూర్పున ఒరిస్సాతో సహా కోస్తా రాష్ట్రాలు మెరుగ్గా పని చేస్తున్నాయని పేర్కొంది. అయితే కొన్ని రాష్ట్రాల ఫలితాలు బాగా లేకపోవడం మరికొన్ని రాష్ట్రాలలో కనిపించే మెరుగైన ఫలితాలతో ముడిపడి వుందా?
ఉత్పత్తిని నిర్ధారించే అతి ముఖ్యమైన అంశం పెట్టుబడుల రాక. పెట్టుబడులు గనక భారీగా వుంటే ఆర్థిక వ్యవస్థ పరిమాణం అంత పెద్దగా వుంటుంది. కనుక మరింత సంపూర్ణమైన విశ్లేషణ కావాలంటే ఒక్కో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల మోతాదును కూడా అధ్యయనం చేయవలసి వుంటుంది. మెరుగ్గా కనిపించే రాష్ట్రాలు వెనకబడిన వాటికంటే అధిక శాతం పెట్టుబడులు తెచ్చుకోవడం, కనక మంచి ఫలితాలు సాధించడం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
పెట్టుబడి అనేది ప్రభుత్వ ప్రైవేటు రంగాల నుంచి వస్తుంది. ఇందులో మొదటిది విధానాలను బట్టి వచ్చేదయితే ప్రైవేటు పెట్టుబడి లాభాల లెక్కలను బట్టి నిర్ణయమవుతుంది. ఒక వెనకబడిన ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం స్వల్పకాలంలో లాభాలు రావని తెలిసినా దాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం పెట్టుబడి పెట్టొచ్చు. అదే ప్రైవేటు రంగమైతే ప్రభుత్వం తనకు పన్ను రాయితీలు, తక్కువ రేట్లకు విద్యుత్‌ వంటివి రాయితీలు కల్పిస్తేనే పెట్టుబడి పెడుతుంది. ప్రైవేటు రంగం దానివరకే అయితే గనక పెద్ద మార్కెట్‌ గ్యారంటీగా అందుబాటులో వుండే అభివృద్ధి చెందిన ప్రాంతాలకే వెళుతుంది. కనుక ముంబాయి, ఢిల్లీ, చెన్నరు, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగర సంగమాలు మాత్రమే ఆ పెట్టుబడులకు ఇష్టమైన కేంద్రాలుగా వుంటాయి. ఢిల్లీని ఆనుకుని వున్న (అత్యధిక తలసరి ఆదాయంతో) హర్యానా కూడా లాభపడుతుంది. కోల్‌కొతా ఇష్టమైన ఎంపిక కాలేకపోవడానికి వేరే కారణముంది. ఎగుమతుల ద్వారా విదేశీ మార్కెట్లకు పంపించేందుకు చౌకగా అందుబాటులో వుంటాయి గనక కోస్తా ప్రాంతాలు కూడా ఎంపికలో ముందుం టాయి. అలాగే అక్కడ అవసరమైన ముడిసరుకుల దిగుమతులు కూడా చౌకగా అందుతాయి.
పాలనా వ్యవస్థ, మౌలిక సదుపాయాలు ఒక రాష్ట్రంలో మౌలిక సదుపాయాల లభ్యత, పాలనా నాణ్యత కూడా లాభాలను నిర్ణయించే ముఖ్యమైన అంశాలుగా వుంటాయి. ఈ రెండు కోణాలలోనూ సంపన్న రాష్ట్రాలు మెరుగ్గా వుంటాయి గనక పెట్టుబడులను ఆకర్షించడంలో ముందుంటాయి. మెరుగైన పాలన కూడా నాణ్యమైన విద్య, వైద్యంతో ముడిపడి వుంటుంది. దానివల్ల మరింత ఉత్పాద కమైన శ్రామికులు అందుబాటులో వుండే అవకాశం కలుగుతుంది. అయితే పేద రాష్ట్రాల నుంచి సంపన్న రాష్ట్రాలకు భారీగా వలసలు జరుగుతాయి గనక ఈ అంశమేమీ కీలకంగా వుండదు.
మొత్తం పెట్టుబడులలో 75 శాతం ప్రైవేటు పెట్టుబడే. 1991లో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమయ్యాక ప్రభుత్వ రంగం నిర్వహించే అగ్రగామి పాత్ర మార్కెట్ల చేతుల్లోకి పోయింది. అందువల్ల లాభాలు అధికంగా వుండే సంపన్న రాష్ట్రాలకే మరిన్ని పెట్టుబడులు తరలిపోతున్నాయి. అంతేగాక పెట్టుబడులను నిర్దేశించే ద్రవ్య రంగం పాత్ర 1991 తర్వాత మరింత ముఖ్యంగా తయారైంది. పేద రాష్ట్రాలలో గణనీయంగా వుండే గృహ పొదుపు మొత్తాలు అధిక లాభాల కోసం సంపన్న రాష్ట్రాలకు దారి మళ్లించబడ్డాయి. సంపన్న రాష్ట్రాలతో పోలిస్తే పేద రాష్ట్రాల డిపాజిట్లు పరపతి నిష్పత్తి తక్కువగా వుండటం దీన్నే ప్రతిబింబిస్తుంది. పెట్టుబడులు దారి మళ్లడం అసమానతల పెరుగుదలకు కారణమవుతుంది. చివరగా చెప్పాలంటే పేద రాష్ట్రాలు అసంఘటిత రంగంలో పెద్ద భాగం కలిగివుంటూ తక్కువ ఉత్పాదకత, తక్కువ ఆదాయాలతో పని చేస్తున్నాయి. నూతన ఆర్థిక విధానం సంఘటిత రంగానికే మొగ్గు చూపింది. దానికి తోడుగా రవాణా కారిడార్లు, హైవేలు నిర్మించడంతో సమీప ప్రాంతంలోకి అవి చొచ్చుకుపోవడానికి వీలైంది. కనుక అసంఘటిత రంగాన్ని దెబ్బతీసి అభివృద్ధి చెందిన సంఘటిత రంగం సంపన్న రాష్ట్రాలు మరింతగా అభివృద్ధి చెందడానికి దోహదపడింది. క్లుప్తంగా చెప్పాలంటే సరళీకరణ అనంతర దశలో నూతన ఆర్థిక విధానం రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు పెరగడంలో కీలక పాత్ర వహించందనేది ప్రధాని కార్యాలయం ఆర్థిక సలహా మండలి పత్రం చెబుతున్న సారాంశం.

బెంగాల్‌, కేరళ సమస్యలు
పశ్చిమ బెంగాల్‌, కేరళ సమస్యలు మరో ప్రత్యేక కోవకు చెందినవి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ దీర్ఘకాలం పాటు వామపక్ష ఉద్యమం, కార్మికుల సమరశీలత వుండింది. కనుకనే ప్రైవేటు రంగం ఈ రాష్ట్రాలలో తక్కువగా పెట్టుబడి పెట్టింది. భారత సరిహద్దు ప్రాంతంలోని రాష్ట్రాలకూ తక్కువ పెట్టుబడులు రావడానికి వ్యూహాత్మక కారణాలున్నాయి. వాటిలో అనేకం తిరుగుబాట్లతో సతమతం కావడం కూడా ప్రైవేటు రంగాన్ని భయపెడుతుంది.
కేంద్రం ప్రభుత్వ రంగ పెట్టుబడులలో రాజకీయమాడుతుందని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు విమర్శిస్తాయి. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ నినాదం ఇందుకు నిదర్శనమని చెప్పాయి. అంతేగాక దేశంలో పెరుగుతున్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం (క్రోనీయిజం) కూడా పెట్టుబడులపై ప్రభావం చూపిస్తున్నది. ఎందుకంటే రాజకీయ సంకేతాలు కూడా కీలకమైనవే. దీనివల్ల ఆశ్రితులకు / అస్మదీయులకు చిక్కులు తగ్గించి తస్మదీయులకు ఇంకా పెంచడం జరుగుతుంది. దానివల్ల కూడా అభివృద్ధి అవకాశం తగ్గిపోతుంది.

సమూలమైన మార్పు ఎలా?
వివిధ రాష్ట్రాల ఆర్థిక పురోగమనంలో పాతుకుపోయిన తేడాలు సమాఖ్య విధానానికే ముప్పు తెచ్చేవిగా వున్నాయి. అందువల్లనే ఈ విధానాన్ని పూర్తిగా మార్చవలసిన అవసరమేర్ప డింది. ఈ వ్యత్యాసాలను ఇప్పుడున్న స్థాయిలోనే అట్టిపెట్టే అవకాశం కూడా ఇప్పుడు లేదు. ప్రైవేటు పెట్టుబడుల ధోరణిని పూర్తిగా మార్చడమే ఇప్పుడు జరగాల్సింది, వెనకబడిన రాష్ట్రాలలో బలహీన పాలనా వ్యవస్థలను నాసిరకం మౌలిక సదుపా యాల కొరతను కూడా సమూలంగా మార్చాలి.
ఇందుకోసం కేంద్రం రాష్ట్రాలు కూడా రంగంలోకి దిగాలి. పాలనా రీతులను మెరుగు పర్చడం, అవినీతి తీవ్రతను తగ్గించడం రాష్ట్రాల బాధ్యత. సామాజిక రంగాలలో ప్రభుత్వ వ్యయం గణనీయంగా పెరగాలి. మార్కెట్‌ ప్రేరిత ఆర్థిక వ్యవస్థలో పేద రాష్ట్రాలలో ప్రైవేటు పెట్టుబడులను పెంచడం సాధ్యం కాని పని. అసంఘటిత రంగాన్ని దెబ్బకొట్టి సంఘటిత రంగంపై పక్షపాతం చూపే కేంద్రం వ్యూహంలో మార్పు వస్తేనే అది వీలవుతుంది. అసంఘటిత రంగంపైకి దృష్టి కేంద్రీకరణ మారితే ఉపేక్షిత వర్గాల ఆదాయాలు పెరుగుతాయి. దానివల్ల గిరాకీ పెరిగి పేద రాష్ట్రాలలో ఉత్పత్తి పెరుగుతుంది. ఈ రాష్ట్రాల్లో గనక గిరాకీ పెరిగితే అప్పుడు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి వీలవుతుంది. గిరాకీ లేకపోవడం వల్ల అవరోధాలు ఎదుర్కొంటున్న సంఘటిత రంగం కూడా దానివల్ల లాభపడుతుంది. వారికి తమ పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన తగినన్ని వనరులు వున్నాయి గనక వారికి కావలసింది ప్రభుత్వం ఏవో రాయితీలు కల్పించడం కాదు. ఇలాంటి విధానపరమైన మార్పుల వల్ల సంపన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందవని కాదు గానీ అసమానతలు తగ్గుముఖం పడతాయి. కింద నుంచి పైకి విస్తరించే ఈ తరహా అభివృద్ధి వల్ల సమాఖ్య విధానం దృఢతరమై భారతదేశ ఐక్యత పరిరక్షించబడుతుంది.

వ్యాసకర్త : అరుణ్‌ కుమార్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో ఆర్థికశాస్త్రంలో
విశ్రాంత ఆచార్యులు

➡️