చికాగోలో 1893 సెప్టెంబర్‌లో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో భారతీయ సంస్కృతిని చాటి మన్ననలు పొందిన హిందూ సన్యాసి స్వామి వివేకానంద. తన బోధనలతో భిన్న మతాల మధ్య సమానత్వం, సామరస్యం కోసం పాటుపడిన వివేకానంద 1863 జనవరి 12న నాటి బెంగాల్ ప్రెసిడెన్సీ లోని కలకత్తాలో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్తా. మూఢనమ్మకాలపై పోరాడిన, విగ్రహారాధనను వ్యతిరేకించిన నరేన్… రామకృష్ణ పరమహంసకు శిష్యుడయ్యారు. గురువు బాటలో ‘జీవుడే దేవుడు, మానవ సేవే మాధవ సేవ’ వంటి నినాదాలను హిందూ మతంలో ప్రచారం చేశారు. పరమహంస మరణానంతరం నరేన్ 23 ఏళ్ళకే సన్యాసం స్వీకరించి స్వామి వివేకానందగా మారారు. 1888 నుండి 93 మధ్య దేశం లోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో పలు మతాలు, కులాలు, భాషలకు చెందిన వారిని కలిసి తమ భావాలను ప్రచారం చేశారు. బ్రిటిష్ దాస్యంలో అష్టకష్టాలు పడుతున్న ప్రజానీకాన్ని చూసి చలించి పోయారు. స్వాతంత్య్రం కోసం దేశభక్తియుత పోరాటం చేయాలని భావించారు.
భారతదేశం వివిధ మతాల, వివిధ తత్వాల సమ్మేళనమని, పాశ్చాత్యులు విజ్ఞాన శాస్త్రంలో మంచి పురోగతిని సాధించారని, ఈ రెండు కలిస్తే మానవజాతికి మరింత మేలు జరుగుతుందని ఆయన భావించారు. అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ప్రపంచ సర్వమత మహాసభలు దీనికి వేదిక కావాలని భావించి వాటికి హాజరయ్యారు. 7 వేల మంది హాజరైన ఆ సభలో 31 మంది వక్తలుగా పాల్గొన్నారు. ఆ సర్వమత మహాసభలలో అందరి కన్నా చివర మాట్లాడిన వివేకానంద ‘ప్రియమైన అమెరికా సోదరీ సోదరులారా’ అంటూ ప్రారంభించినప్పుడు సభ కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. భారత దేశంలో పలు మతాలు సామరస్యంగా ఉండడం, ఈ భావనలు మానవాళికి ఎలా మేలు చేస్తాయో చెప్పటం ద్వారా సభికులను, ఆ దేశ ప్రజానీకాన్ని ఆకట్టుకున్నారు.
సర్వ మత సమ్మేళనం నుండి స్వదేశానికి వచ్చిన తర్వాత దేశ ప్రజలను చైతన్యపరచడానికి కృషి చేశారు. శాంతియుత జీవనానికి మన దేశం నిదర్శనమని, పరుల మీదకు దండయాత్రలు, దాడులు ఎరుగనిది భారత జాతి చరిత్ర అని చెప్పారు. జాతులను దోచుకుని, విధ్వంసం కావించి, భూమి అదిరి పడేలా అన్య దేశాలపై దాడులు చేసే యోధులను మన హిందూ మతం తయారు చెయ్యదని బోధించారు. మసీదులను, చర్చిలను నిర్మించి ఇచ్చి మత సహనానికి ప్రతీకగా నిలవటం మన దేశ ఔన్నత్యమని చెప్పేవారు. ప్రపంచమంతా మత సామరస్య ప్రతిష్టకు పునాదులు వేయడానికి ఆరాటపడుతోందని, నాగరికతకు అది ఒక మహా ప్రసాదం అని ఆయన తెలిపారు. ఈ భావన లేని నాడు ఏ నాగరికతా నిలవదన్నారు. అత్యున్నతమైన ఆధ్యాత్మిక ధర్మాల వలన నిరుపేదలకు ఏమీ ప్రయోజనం లేదని చెప్పేవారు. సాటి భారతీయుల ఆకలి మంటలు చల్లారేంతవరకు మోక్షం ఎక్కడిదని ప్రశ్నించారు. ‘ప్రపంచ హితం, వ్యక్తి మోక్షం’ నినాదంతో రామకృష్ణ మఠం స్థాపించారు. ప్రతి జాతి నుండి శ్రేష్టమైన విషయాలు స్వీకరించాలని ఉద్బోధించారు. తన బోధనలతో దేశ ప్రజానీకాన్ని ప్రభావితం చేసిన స్వామి వివేకానంద 1902 జులై 4న నిర్యాణమొందారు. 1984 నుండి భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం’గా పాటిస్తున్నది.
మూఢాచారాలు, మూఢ నమ్మకాలు భారతదేశ పురోగతిని నిరోధిస్తాయని ఆయన చెప్పిన బోధనలను విస్మరించి… మత ఉద్రిక్తతలను పెంచి, ఆధ్యాత్మిక భావనలను సైతం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న బిజెపి, దాని మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్, వాటి అనుబంధ సంస్థల ఆగడాలను అడ్డుకోవటం… దేశ హితం కోరి స్వామి వివేకానంద చేసిన బోధనలు ప్రచారం చేయటం, దేశభక్తుల ముందున్న నేటి కర్తవ్యం.
– ఎం.వి.సుధాకర్
( జనవరి 12న స్వామి వివేకానంద 162వ జయంతి )