చిత్తశుద్ధి లేని క్షమాపణలు

మణిపూర్‌లో 2023 మే మూడవ తేదీన రెండు సామాజిక తరగతుల మధ్య పరస్పర అనుమానాలతో ప్రారంభమైన ఘర్షణ 2024లో కొనసాగి మూడో ఏడాదిలో ప్రవేశించింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియటం లేదు. పరిస్థితిని చక్కదిద్దటంలో విఫలమైనందుకు విచారంగా ఉందంటూ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే ఒక్క రోజు కూడా గడవక ముందే విమర్శకులపై ఎదురు దాడికి దిగటాన్ని బట్టి విచార ప్రకటనలో చిత్తశుద్ధి లేదని స్వయంగా వెల్లడించుకున్నారు. మెయితీ-కుకీ, జో తెగల మధ్య ప్రారంభమైన ఘర్షణల్లో కొందరు మహిళలపై అత్యాచారాలు, నగంగా ఊరేగింపులు జరిగాయి. 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అరవై వేల మంది నెలవులు తప్పారు. బాధితుల్లో ఎక్కువ మంది గిరిజనులైన కుకీలే ఉన్నారు. మెయితీలందరినీ గిరిజనులుగా పరిగణించాలంటూ హైకోర్టు పెట్టిన చిచ్చు అక్కడ జరుగుతున్న దారుణ మారణకాండకు మూలం. రెండింజన్ల పాలన సాగిస్తున్న బిజెపి ఆదిలోనే దానికి తెర దించి ఉంటేే ఇంత జరిగేది కాదు.
మణిపూర్‌లో బిజెపి రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో ఘోరంగా విఫలమైంది. అదే ఏ ప్రతిపక్ష పార్టీనో అధికారంలో ఉంటే అలా ఉపేక్షించేదా? అల్లకల్లోల పరిస్థితి ఏర్పడిన కారణంగా రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించారు. అక్కడ బిజెపికి చెందిన ముఖ్యమంత్రి, మంత్రులు రాజభోగాలు అనుభవించటం తప్ప చేసేదేమీ లేదు. ప్రపంచమంతటా, మణిపూర్‌ చుట్టూ ప్రధాని నరేంద్రమోడీ విమానాల్లో తిరుగుతారు, సుభాషితాలు చెప్పి వస్తున్నారు తప్ప మణిపూర్‌ వెళ్లి భరోసా ఇచ్చేందుకు ఎలాంటి చొరవ లేదు.
ప్రతిపక్షాలు ముందుకు తెచ్చిన అనేక అంశాల మీద మోడీ మౌనంగా ఉన్నట్లుగానే ఆయన ప్రధమ గణంలోని బీరేన్‌ సింగ్‌ మౌనంగా ఉంటే అదొక తీరు. కానీ ఎదురుదాడికి దిగారు. గతంలో కూడా మణిపూర్‌లో అనేక ఉదంతాలు జరిగాయి కదా వాటన్నింటికీ నాడు ప్రధానులుగా ఉన్న పివి నరసింహారావు, ఐకె గుజ్రాల్‌ క్షమాపణలు చెప్పారా అని ప్రశ్నించారు. ఆ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవారు కూడా క్షమాపణలు చెప్పిన దాఖలా లేదు, మరి బీరేన్‌ సింగ్‌ ఎందుకు చెప్పినట్లు? నాడు మణిపూర్‌లో జరిగిన ఉదంతాలను పాలకులు మూసిపెట్టలేదు, మోడీ ఏలుబడిలో ఎందుకు పాచిపోయేట్లు చేసినట్లు?
మణిపూర్‌ అంశం ప్రస్తావనకు వచ్చినపుడల్లా బిజెపి నేతలు గతంలో కాంగ్రెస్‌ అనుసరించిన వైఖరి, విదేశీ జోక్యం గురించి చెబుతూ తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు చూస్తారు. సరిహద్దుల భద్రత, అక్రమ చొరబాట్లను అరికట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. పదేళ్ల నుంచి ఏం చేస్తున్నట్లు? 2017 నుంచి ఇదే బీరేన్‌ సింగ్‌ సిఎంగా ఉన్నారు. ఈ పెద్దమనిషి ఏం చేస్తున్నట్లు? అంతా చేసి నేరం నుంచి తప్పించుకోవటం తప్ప క్షమాపణలో చిత్తశుద్ధి లేదని మణిపూర్‌ గిరిజన సంఘాల ఐక్యతా కమిటీ బీరేన్‌ సింగ్‌ ప్రకటన మీద వ్యాఖ్యానించింది. ఒక మైనారిటీ తరగతి మీద జరిపిన మారణకాండ బాధ్యత నుంచి తప్పించుకొనేందుకు సిఎం చూశారని పేర్కొన్నది. కుకీ-జో గిరిజనుల పట్ల వివక్ష నిలిపివేయాలని మరో గిరిజన సంఘాల కమిటీ డిమాండ్‌ చేసింది. మణిపూర్‌లో సాయుధ బృందాలపై భద్రతా దళాలు జరిపిన దాడులలో స్టార్‌ లింక్‌ ఉపగ్రహ యాంటెన్నా, రౌటర్‌తో పాటు ఆధునిక రైఫిళ్లు దొరికినట్లు ప్రకటించారు. మారుమూల ప్రాంతాలలో ఇంటర్నెట్‌ సేవలను అందించే ఈ ఉపగ్రహం సేవలను పొందటం మన దేశంలో నిషిద్ధం, అయినప్పటికీ అవి దొరికాయంటే అనధికారికంగా సమాచారం అందుకున్నట్లు స్పష్టమౌతోంది. వీటిని మెయితీలు అధికంగా నివసించే ప్రాంతాలపై జరిగిన దాడుల సమయంలో సాయుధులు వదలివేసి పారిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే తమ ఉపగ్రహం నుంచి భారత్‌కు సంకేతాలు అందకుండా చేసినట్లు ఎలన్‌ మస్క్‌ చెప్పుకున్నాడు. తమ దాడుల సందర్భంగా మయన్మార్‌లో తయారైన ఆయుధాలు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్పారు. వాటిలో మయన్మార్‌ సైనికులు వాడే ఎంఏ4 రైఫిల్‌, ఎకె47 కూడా ఉంది. గత ఐదారు నెలల నుంచి సాయుధ బృందాలు తల దాచుకున్న ప్రాంతాలలో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, మిలిటరీ యూనిఫారాలు తదితరాలను కూడా పట్టుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మయన్మార్‌ సరిహద్దులను దాటి ఉగ్రవాదులు రాకపోకలు సాగిస్తున్నా, ఆయుధాలు అక్రమ రవాణా జరుగుతుంటే సరిహద్దు భద్రతలను చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు? స్టార్‌ లింక్‌ ఉపగ్రహం నుంచి ఉగ్రవాదులు, సాయుధ మూకలకు సంకేతాలు, సందేశాలు అందుతుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే. భద్రమైన చేతుల్లో దేశం ఉందని నరేంద్ర మోడీ గురించి గొప్పలు చెప్పుకోవటం తప్ప ఉపయోగం ఏముంది?
తాజా ఘర్షణలు, దాడులకు 2023 ఏప్రిల్‌ 14న మణిపూర్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే మూలం! మెయితీ సామాజిక తరగతికి గిరిజన హోదా కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలంటూ తనకు లేని అధికారంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరువాత సుప్రీం కోర్టు ఈ చర్యను తప్పు పట్టింది. ఒక పెద్ద కుట్రలో భాగంగా అక్కడ పరిణామాలు జరిగినట్లు భావిస్తున్నారు. హైకోర్టు ఆదేశాన్ని నిరసిస్తూ మే 3వ తేదీన గిరిజన విద్యార్థులు నిరసన తెలిపారు. నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక వైపు నుంచి హింసాకాండ జరుగుతూనే ఉంది. మెయితీ-గిరిజనుల మధ్య పరస్పరం అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మయన్మార్‌లో 2021 మిలిటరీ తిరుగుబాటు సమయంలో అక్కడి నుంచి శరణార్ధులుగా వచ్చిన వారి గురించి మెయితీలు అభ్యంతరం తెలిపారు. ఇవన్నీ కూడా బిజెపి రెండింజన్ల పాలనలోనే జరిగాయి. అందువలన గత కాంగ్రెస్‌ పాలనే కారణం అనటం తప్పించుకోచూడటం తప్ప మరొకటి కాదు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అక్కడ నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ అనే ఒక ప్రాంతీయ పార్టీతో జత కట్టి చెరో సీటులో పోటీ చేసింది. రెండు సీట్లలో కాంగ్రెస్‌ గెలిచింది. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను గమనంలో ఉంచుకొని క్షమాపణల పర్వానికి తెర తీశారని చెప్పాల్సి వస్తోంది. మెయితీలను గిరిజనులుగా గుర్తించాలా లేదా అన్నది బిజెపి తేల్చటం లేదు. తమకు అన్యాయం చేస్తారని కుకీ, ఇతర గిరిజనులు అనుమానంగా చూస్తుంటే తమకు రిజర్వేషన్ల ఆశ చూపి ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చూసి ఎటూ తేల్చటం లేదని మెయితీలు అసంతృప్తితో ఉండటమే బిజెపి ఓటమికి కారణం.

-సత్య

➡️