స్ఫూర్తిదాయకం

నిబద్ధ రాజకీయ విధానం కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర 27వ మహాసభ విజయవంతం కావడం అభ్యుదయ శక్తులకు స్ఫూర్తిదాయకం. భరతమాత ముద్దుబిడ్డ, పీడిత ప్రజల ప్రియతమ నేత పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన నెల్లూరు గడ్డపై మూడు రోజులపాటు నిర్వహించిన ఈ మహాసభ పలువిధాలుగా ప్రత్యేకత సంతరించుకున్నది. అర్హతల కమిటీ విశ్లేషణ ప్రకారం మహాసభకు హాజరైన 472 మందిలో 73 శాతం మంది వివిధ ప్రజాపోరాటాల్లో పాల్గొని, అరెస్టులను ఎదుర్కొన్నవారు కావటం ఆ పార్టీ సమరశీలతకు అద్దం పడుతోంది. హాజరైనవారిలో 76 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బిసి తరగతుల నుంచి రావడం, 43 శాతం మంది 50 ఏళ్ల లోపు వారు కావడం సంతోషదాయకం. గత పదేళ్లకుపైగా కేంద్రంలో అధికారంలో వుంటూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన, చేస్తున్న బిజెపిని ఎదుర్కోవాలని, ఎన్‌డిఎలో భాగస్వామిగా వుంటూ కార్పొరేట్లకు అనుకూలంగానూ, సామాన్య ప్రజలపై అదనపు భారాలు మోపుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని మహాసభ ప్రజలకు పిలుపునివ్వడం సముచితమైనది. రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌, దాని విభాగాలు ఒక పథకం ప్రకారం విస్తరిస్తున్నాయి. దేవాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చాలని యత్నిస్తున్న మాట నిజమే! ఈ నేపథ్యంలో పెరుగుతున్న మతోన్మాద ప్రమాదాన్ని ప్రతిఘటించేందుకు, మత సామరస్య పరిరక్షణ కోసం కలిసి రావాలని లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు విజ్ఞప్తి చేయడం సిపిఎం ఆచరణాత్మక దృక్పథానికి ఓ సూచిక.
కేంద్రం చెబుతున్న వికసిత్‌ భారత్‌ నమూనాలో స్వర్ణాంధ్ర విజన్‌ 2047 పేరిట ముఖ్యమంత్రి విడుదల చేసిన డాక్యుమెంటులో గతంలోని పిపిపి స్థానంలో ఇపుడు పి-4 అంటూ ప్రజల సంపదను, ఊరుమ్మడి ఆస్తులను సంపన్నులకు కట్టబెట్టే విధానమన్న మహాసభ విశ్లేషణ సరైనదే! అదాని గ్రూప్‌ కంపెనీలతో సెకి ద్వారా గత వైసిపి ప్రభుత్వం కుదుర్చుకున్న అవినీతి ఒప్పందాలపై అమెరికా కోర్టులో కేసు నమోదైనా, ప్రజలపై లక్షల కోట్లు భారంవేసే ఆ అవినీతి ఒప్పందాలను టిడిపి కూటమి ప్రభుత్వం రద్దు చేయ నిరాకరించడంతో ఈ విషయంలో మోడీ- జగన్‌- చంద్రబాబు- పవన్‌ ఒక్కటేనని రుజువవుతోందన్న ఆ పార్టీ నిర్ధారణను ఎవరూ కాదనలేరు. నూతన ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని అమరావతిలో నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నది నిర్వివాదాంశం. రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే వివిధ పరిశ్రమలు, ప్రాజెక్టులను వికేంద్రీకరించాలని, తక్షణం పూర్తి చేయగలిగిన సాగునీటి ప్రాజెక్టులకు నిధులిచ్చి పూర్తి చేయాలని, టిడిపి కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలన్న మహాసభ డిమాండ్లు న్యాయసమ్మతమైనవి.
తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమానికి గొప్ప పోరాట సాంప్రదాయమున్నది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రత్యేకించి గతంలో కరోనా సమయంలోను, ఇటీవల వరద ముంపు, తుపాను సంభవించినపుడు సేవా, సహాయ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలను చూరగొన్నది. చారిత్రాత్మక రైతు పోరాటం, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం, ప్రత్యేక హోదా, పోలవరం, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, తదితర పోరాటాలను బలపర్చడంలో సిపిఎం ముందున్నది. కార్మిక హక్కుల కోసం నిలబడింది. ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా ఉంటోంది. కులవివక్షకు వ్యతిరేకంగా, గిరిజన హక్కుల పరిరక్షణకు కృషి చేసింది. ఈ పోరాట వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకుపోయి క్షేత్ర స్థాయిలో బలమైన ఉద్యమాలను నిర్మించేందుకు పూనుకుంటుందని, ప్రజలకు అండగా ఉంటుందని ఈ మహాసభ హామీనివ్వడం సంతోషదాయకం. పార్టీ స్వతంత్ర ప్రజా పునాది బలపడేందుకు నిర్మాణ చర్యలు తీసుకుంటుందనీ, ప్రజల ఆలోచనా ధోరణిని పెడదారి పట్టిస్తున్న మతోన్మాదం, కార్పొరేట్‌ విష సంస్కృతికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ప్రజా సాంస్కృతికోద్యమాన్ని నిర్మించడానికి కృషి చేయాలనడం మంచి విషయం. లౌకికవాద పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, మత సామరస్యం, రాష్ట్రానికి నిధులు, ఫెడరల్‌ హక్కుల కోసం అన్ని పార్టీల వెనకనున్న ప్రజానీకం ఐక్యంగా నిలబడాలని ఈ మహాసభ చేసిన విజ్ఞప్తికి అందరూ సానుకూలంగా స్పందిస్తారని ఆశిద్దాం!

➡️