అక్రమాలు బట్టబయలు

దేశ వ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నిర్వహించిన నీట్‌-యుజి-2024 పరీక్షకు సంబంధించి ఎగ్జామ్‌ సెంటర్లు, నగరాల వారీగా బహిర్గతం చేసిన ఫలితాలు విస్మయం కలిగిస్తున్నాయి. భారీ అక్రమాలు జరిగాయని రూఢ పరుస్తున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎక్సామ్‌ రిజల్ట్స్‌ను ఎన్‌టిఎ తన వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. గుజరాత్‌లో రాజ్‌కోట్‌లో యూనిట్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ పరీక్షా కేంద్రంలో ఏకంగా 85 శాతం మంది అభ్యర్ధులు అర్హత సాధించడం అద్భుతాల్లోకెల్ల అద్భుతం. అక్కడ 22 వేలకుపైగా పరీక్ష రాశారు. ఈ కేంద్రంలో 12 మంది 700 పైగా మార్కులు సాధించారు. 115 మంది 650 పైగా, 259 మంది 600 పైగా స్కోర్‌ చేశారు. అలాగే రాజస్థాన్‌లోని విద్యాభారతి శిఖర్‌ సెంటర్‌లో పరీక్ష రాసిన వారిలో చాలా మంది మెరుగైన స్కోర్‌ సాధించారు. హర్యానాలో రోహ్ తక్ లో మోడల్‌ స్కూల్‌ సెంటర్‌లో 45 మంది 600 పైగా స్కోర్‌ సాధించారు. ఇవి నీట్‌ సిత్రాల్లో కొన్ని. గతంలో హర్యానాలో ఒక సెంటర్‌లో ఆరుగురికి 720కి 720 మార్కులు రావడంతో అక్రమాలు బయటికొచ్చాయి. గ్రేస్‌ మార్కులు తొలగించి, ఫలితాలను సవరించాక చూస్తే 13 మంది 600 పైన స్కోర్‌ చేయగా ఒకే ఒక్కరు 682 మార్కులు తెచ్చుకున్నారు. అక్రమాల ఆరోపణలొచ్చిన 1,563 మందికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రీఎగ్జామ్‌ పెడితే 813 మందే అటెండ్‌ అయ్యారు. ఇవన్నీ నీట్‌లో అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో కళ్లకుకడుతున్నాయి.
ఇప్పటి వరకు ‘నీట్‌’లో అక్రమాలపై బుకాయిస్తూ, సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చిన కేంద్ర బిజెపి సంకీర్ణ ప్రభుత్వం పరిస్థితి శనివారం నాటి రిజల్ట్స్‌తో కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. మొన్న పార్లమెంట్‌ సమావేశాల తొలి రోజునే ‘నీట్‌’ అక్రమాలపై యావత్‌ విపక్షం ఎన్‌డిఎ సర్కారును సిబిఐ దర్యాప్తును చూపించి తప్పించుకోబోయింది. ప్రస్తుతం బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న సమయాన ‘నీట్‌’ అక్రమాలు మరింతగా వెలుగు చూడటంతో మోడీ సంకీర్ణ ప్రభుత్వం గుక్కతిప్పుకోలేకపోతోంది. కాగా సిబిఐ తన దర్యాప్తులో భాగంగా శనివారం మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసింది. వారితో కలిపి ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్‌ చేసినట్లయింది. ‘నీట్‌’ స్కాం మొత్తం బిజెపి, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న బీహార్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే పురివిప్పిందని సిబిఐ ఎంక్వయిరీ ద్వారా తెలుస్తుంది. ఇది కూడా కేంద్ర బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని చెమటలు పోయిస్తోంది. అందుకే సిబిఐ దర్యాప్తు నత్తకు నడకలు నేర్పుతున్నట్లుంది. దర్యాప్తును సిబిఐకి ఇచ్చినప్పుడే ప్రతిపక్షాలు అనుమానించాయి. గతంలో మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం పరిస్థితిని గుర్తుకు తెస్తుంది.
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) ఛైర్మన్‌ మనోజ్‌ సోనీ ఆనూహ్య రాజీనామా కలకలం రేపుతోంది. ఇంకా ఐదేళ్ల పదవీ కాలం ఉండగానే సోనీ రాజీనామా చేయడం ఒక ఎత్తయితే, పక్షం రోజుల క్రితమే ఆయన రాజీనామా చేయగా, ఆ విషయాన్ని ఎన్‌డిఎ ప్రభుత్వం రహస్యంగా ఉంచడం మరో ఎత్తు. ట్రైనీ ఐఎఎస్‌ అధికారి పూజా ఖేద్కర్‌ నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించారన్న వివాదంతో యుపిఎస్‌సిలో స్కామ్‌లు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యుపిఎస్‌సి ఛైర్మన్‌ సోనీ రాజీనామా అనుకుంటున్న తరుణంలో అక్రమాలకు నిలయంగా మారిన ఎన్‌టిఎ ఛైర్మన్‌ మాటేమిటన్న ప్రశ్న సహజంగానే ముందుకొస్తుంది. ఇదిలా ఉంటే, బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ‘అగ్నిపధ్‌’ నియామకాల్లోనూ అవకతవకలు జరిగాయని తాజాగా బయటకొచ్చింది. సైనిక దళాల్లో, అదీ కాంట్రాక్టు పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకోవడం బిజెపి జమానా ఎంతగా అవినీతి పంకిలంలో పొర్లాడుతోందో తెలియజేస్తుంది. ఇప్పటికైనా ఎన్‌డిఎ సర్కారు ‘నీట్‌’ అక్రమాలను అంగీకరించాలి. నిష్పక్షపాతంగా లోతైన విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలి. లక్షలాది మంది అభ్యర్ధులకు న్యాయం చేయాలి. నిరంకుశ సంస్థగా, లోపాలకు మారుపేరుగా తయారైన ఎన్‌టిఎను రద్దు చేయాలి.

➡️