అవకతవకల నీట్‌ – దేశ భవితపై వేటు

Jun 15,2024 03:05 #editpage

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించబడుతున్న నీట్‌ పరీక్ష, ఆశావహ విద్యార్థులకు వేటుగా మారడం కడు శోచనీయం. అవకతవకల విధానంగా మారి, లక్షలాది విద్యార్థుల భవితను డోలాయమానంలో పడవెయ్యడం ఖండనీయం. ఈ దుస్థితికి కేంద్రం బాధ్యత వహించాలి. ప్రతీ సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు వైద్య కళాశాలల్లో ప్రవేశానికై ఈ పరీక్ష రాస్తుంటారు. ఒక సీటు పొందడానికి పాతిక మంది పోటీ పడుతుంటారు. వారి కుటుంబాలు ఈ పరీక్షకు సన్నద్ధం చెయ్యడం కోసం లక్షల రూపాయల్ని వెచ్చిస్తుంటారు. వైద్య విద్య అభ్యసించడం అన్నది మెజారిటీ విద్యార్థుల, వారి తల్లిదండ్రుల కల. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఈ పరీక్ష స్థాయికి తమ పిల్లలు చేరడానికే అప్పులపాలవుతుంటారు. ఇంకోవైపు కోచింగ్‌ సెంటర్లలో విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి. ఆత్మహత్యల దాకా వెళ్ళే పరిస్థితి. ఇంతమంది ప్రతిష్టాత్మకంగా భావించే, ఇంత పోటీ ఉన్న ఈ ప్రవేశ పరీక్ష ను కేంద్రం ఎంత పకడ్బందీగా జరపాలి? అర్హులైన విద్యార్థులు నష్టపోకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? దురదృష్టం. ఆ రకమైన నిబద్ధత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు లక్ష పైబడి ఉన్న సీట్ల కోసం ఈ ఏడు నీట్‌ రాశారు. అందులో ఒకే సెంటర్‌లో ఎనిమిది మందికి వంద శాతం మార్కులు వచ్చాయి. ఒకే సెంటర్‌లో సీరియల్‌గా నెంబర్లు ఉన్న ఆరుగురికి ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. కొంతమందికి ఎలా చూసినా వీలుకాని మార్కులు-అంటే అయితే రెండు లేదా నాలుగు రావాల్సిన చోట మూడు రావడం లాగా అన్నమాట – వచ్చాయి. వీటిపై కోర్టుకి వెళ్తే, ప్రభుత్వం సమాధానం ఏమిటంటే కొన్ని చోట్ల గ్రేస్‌ మార్కులు కలపాల్సి వచ్చింది. అలా కలిసిన వారు 1563 మంది. వారి గ్రేస్‌ మార్కులు తీసివేసి లెక్కిస్తాం, కావాలంటే మరలా వారికి వెంటనే పరీక్ష పెట్టి అవకాశం కల్పిస్తాం. ఎంత అన్యాయం! కోర్టుకి వెళ్ళలేక పోయిన విద్యార్థుల సంగతి ఏమిటి? న్యాయంగా రావాల్సిన ర్యాంక్‌ తారుమారై నష్టపోయిన వారు వేలల్లో ఉండే అవకాశం లేదా? ఇంత అవకతవకలతో నిర్వహించే వారికి పడాల్సిన శిక్ష ఏమిటి? లక్షలాది విద్యార్థుల, వారి కుటుంబాల భవిష్యత్‌తో అలసత్వంతోనో, అవినీతి వల్లనో ఆడుకొనే అవకాశం ఎవరికీ ఉండకూడదు. ఇది దేశ గౌరవాన్ని భంగపరిచే ఉదంతం. న్యాయస్థానం తీర్పు, జరిగిన తీవ్ర అన్యాయాన్ని సరిదిద్దుతుందని ఆశ. ప్రభుత్వం ఇలాంటి తప్పిదాలు జరగకుండా శ్రద్ధ చూపాలని, పటిష్ట విధానాన్ని పాటించాలని ఆకాంక్ష.
– డా.డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపీ.

➡️