అధిక సంతానం పరిష్కారమా?

మరింత మంది పిల్లలను కనమని దంపతులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి పిలుపునిచ్చారు. గత ఆరు సంవత్సరాల క్రితం ఆయన ఇదే మాట మాట్లాడారు. అప్పుడు మాట్లాడింది 15వ ఆర్థిక సంఘం కేంద్ర నిధుల కేటాయింపుకు, జనాభాకు ముడిపెట్టినప్పుడు. ఇప్పుడు మాట్లాడుతుంది 2026లో జనాభా ఆధారంగా కేంద్ర నిధుల కేటాయింపుతో పాటు పార్లమెంట్‌ నియోజక వర్గాల పునర్విభజన గురించి కేంద్రం నిర్ణయిస్తున్నపుడు. చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబమనేది పాత సామెత, పెద్ద కుటుంబం సంతోష కరమైన కుటుంబమనేది నేటి సామెత అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ వ్యగ్యంగా చెబుతూనే సంతానాన్ని పెంచమని తమిళ ప్రజలను కోరారు. జనాభా నియంత్రణలో అద్భుత విజయాలను సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు జరిమానా విధిస్తారా అంటూ చాలామంది మేధావులు, ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం అలా చేస్తే జనాభా పెరగడం తప్ప మాకు వేరే దారి లేదని మరి కొందరు వాదిస్తున్నారు. ఈ వాదనల్లో రెండు అంశాలు ఉన్నాయని రిజర్వు బ్యాంకు మాజీ చైర్మన్‌ దువ్వూరి సుబ్బారావు విశ్లేషించారు. ఒకటి ఆర్థిక అంశాలు, రెండు రాజకీయాలు.

రాజ్యాంగం ప్రకారం మన దేశం రాష్ట్రాల సమాఖ్య (ఫెడరల్‌) విధానం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యతలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాల్లో రాజ్యాంగం నిర్దేశించింది. ఈ బాధ్యతలను అమలు చేయడానికి నిధుల పంపిణీ గురించి కూడా అందులో పేర్కొన్నారు. కాంగ్రెసు రాజకీయ ఆధిపత్య కోణం నుండే రాష్ట్రాలను తమ ఆధీనంలో వుంచుకోవాలని చూస్తే, బిజెపి మాత్రం తన మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం ఆధారంగా, కార్పొరేట్‌ శక్తుల ఆర్థిక ప్రయోజనాల కోసం రాష్ట్రాలను బలహీనం చేస్తున్నది. వాజ్‌పేయి పాలనా కాలంలో అధ్యక్ష తరహా విధానాన్ని అమలు చేసేందుకు రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇదే విధానాన్ని మోడీ కొత్త రూపాల్లో అమలు చేస్తున్నారు. ఒకే పన్ను, ఒకే భాష, ఒకే మతం, ఒకే విధానం, ఒకే ఎన్నిక ఇలా ఒకేలన్నీ అర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాలోని కేంద్రీకృత పాలనకు ‘ఓకే’ చెప్పడంలో భాగమే. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం, నీతి ఆయోగ్‌ పేరుతో కేంద్ర దయాదాక్షిణ్యాల మీద రాష్ట్రాలు ఆధారపడేటట్లు చేయడం, ప్రపంచ బ్యాంకు ద్వారా రాష్ట్రాలకు అప్పులు ఇప్పిస్తూ తమ గుప్పిట్లో పెట్టుకోవడం జరుగుతుంది. తాజాగా జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర నిధుల పంపిణీ, పార్లమెంట్‌ స్థానాల పునర్విభజన ఎజెండాను తెర పైకి తెచ్చారు. ఇందు కోసం 2025లో జనాభా లెక్కలు సేకరిస్తారు. ఆ జనాభా ఆధారంగా 2026 నుండి కేంద్ర నిధులు, పార్లమెంట్‌ సీట్లు నిర్ణయిస్తారు. దీనివల్ల జనాభా తక్కువగా వున్న దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి.

ప్రస్తుత దేశ జనాభాలో సగం మంది 25 సంవత్సరాల వారే. దేశ జనాభా మధ్యస్త వయస్సు 28.4 సంవత్సరాలు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా వున్న దేశం మనది. అయితే ఈ పరిస్థితి దేశమంతా ఒకే విధంగా లేదు. జనాభా నియంత్రణ కోసం 1952లో ఏర్పడిన కుటుంబ నియంత్రణ జాతీయ కార్యక్రమాన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు, మరికొన్ని ఈశాన్య రాష్ట్రాలు సమర్ధవంతంగా అమలు చేయడంతో ఆయా రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తగ్గింది. జనాభా ఆధారంగా కేంద్ర నిధులు అంటే ఈ రాష్ట్రాలు నష్టపోతాయి. అందుకే 1971 జనాభా లెక్కల ఆధారంగా ఈ రాష్ట్రాలకు 25 శాతం వెయిటేజీ (అదనపు సౌకర్యం) ఇవ్వాలని 1976లో కేంద్రం నిర్ణయించింది. 13వ ఆర్థిక సంఘం వరకూ ఇదే విధానం కొనసాగింది. 2013లో రిజర్వుబ్యాంకు మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వై.వి.రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన 14 ఆర్థిక సంఘం ఈ 25 శాతం వెయిటేజీని 17.5 శాతానికి తగ్గించి, 2011 జనాభా లెక్కలకు 10 శాతం వెయిటేజీ ఇచ్చింది. ఈ విధానం దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక స్థితిని దిగజార్చింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలు 13వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల కంటే 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్లో సంవత్సరానికి సుమారు 6 నుండి 8 వేల కోట్లు నష్టపోయాయి. 1971 నుండి 2011 మధ్య ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌ రాష్ట్రాల్లో జనాభా రెట్టింపు కాగా, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పెరుగుదల మందగించింది. ‘జనాభా పేరుతో రాష్ట్రాలకు శిక్ష వేస్తారా?’ అని 2018 ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి మోడీని ప్రశ్నించారు. ఇదే నెలలోనే తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ -కేంద్రానికి మనం ఇస్తున్న పన్నుల్లో సగం కూడా తిరిగి కేంద్రం మనకు ఇవ్వడంలేదని, ఉత్తరాది రాష్ట్రాల కోసం మనం కష్టపడాల్సి వస్తుందని-ఘాటుగా మాట్లాడారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా 14వ ఆర్థిక సంఘం నిర్ణయంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసాయి. 2005-10 మధ్య కేంద్రం రాష్ట్రాలకు ఇస్తున్న గ్రాంట్స్‌ లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు రూ.1,33,471.45 కోట్లు, బీహార్‌కు రూ.75,648.83 కోట్లు ఇవ్వగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ.50,353.26 కోట్లు, కేరళకు రూ.19,607.72 కోట్లు మాత్రమే కేటాయించారు. దేశ జనాభాలో 16.30 శాతం వున్న ఉత్తరప్రదేశ్‌ దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి)లో కేవలం 8.4 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. జనాభాలో కేవలం 2.76 శాతం వున్న కేరళ దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 3.8 శాతం వుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 2023-24లో 30 శాతానికి పైగా వాటా కలిగి వున్నాయి. ఇప్పటి వరకు జనాభాకు అదనంగా అనుసరిస్తున్న వెయిటేజీ విధానంలోనే దక్షిణాది రాష్ట్రాలతో పాటు, మరికొన్ని చిన్న రాష్ట్రాలు నష్టపోతుంటే 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగానే నిధులు కేటాయిస్తే మా పరిస్థితి ఏమిటనేది ఈ రాష్ట్రాల ఆందోళన.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జనాభా ఆధారిత నిధుల కేటాయింపు, పార్లమెంట్‌ స్థానాల పునర్విభజన అనేది ప్రపంచీకరణ, మతతత్వ విధానాల అమలులో భాగమే. 1991 నుండి దేశంలో అమలులోకి వచ్చిన ప్రపంచీకరణ విధానాలు అన్ని రాష్ట్రాలను అప్పుల్లో ముంచాయి. రోజువారీ అవసరాలకు కూడా కేంద్రం దగ్గర లేదా ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ బ్యాంకుల దగ్గర దేబిరించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులు ఎంత బలంగా వుంటే అంతగా ఈ ఆర్థిక సంస్థల షరతులకు రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోతాయి. కాబట్టే కేంద్రం నుండి గ్రామ పంచాయితీ వరకు ప్రపంచ బ్యాంకు విధానాలు, షరతులు వేగంగా అమలవుతున్నాయి. చట్టబద్ధంగా రావలసిన నిధులను కూడా కేంద్రం ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకుతో అప్పు ఇప్పిస్తామంటే అదే మహాప్రసాదం అన్నట్లుగా కొందరు ముఖ్యమంత్రులు చేతులు చాచి కళ్ళకు అద్దుకుంటున్నారు. ఇటీవల మన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ద్వారా ఇప్పించే రూ.15 వేల కోట్లను పార్లమెంట్‌లో దేశ ఆర్థికమంత్రి ఎంత ఘనంగా చెప్పారో, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తన్మయత్వంతో స్వాగతించిందో చూశాం. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు, రోజువారీ ఖర్చులకు కూడా కేంద్రం మీద రాష్ట్రాలు ఆధారపడేటట్లు చేయడం ద్వారానే దేశమంతా ఒకే విద్యుత్‌, విద్య, వైద్యం, రవాణా, గనుల విధానం అమలు చేయించి స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు ఈ రంగాలను సులభంగా హస్తగతం చేస్తున్నారు.

2025 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్‌ స్థానాలను పునర్విభజన చేసి 2026లో జమిలి ఎన్నికలకు పోవాలని కేంద్ర బిజెపి నిర్ణయించుకుంది. తాము బలహీనంగా వున్న దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్‌ స్థానాలను తగ్గించి, తమకు అనుకూలంగా వున్న ఉత్తరాది రాష్ల్ట్రాల స్థానాలతో అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య వ్యవస్థను తుంగలో తొక్కేందుకు జమిలి ఎన్నికలను తెస్తున్నది. తమ మతతత్వ ఎజెండాను, కార్పొరేట్‌ అనుకూల ఆర్థిక విధానాలను మరింతగా అమలు చేసుకునేందుకు 2025 జనాభా లెక్కలను అవకాశంగా తీసుకుంటున్నది. రోగం ఒకటైతే, మందు మరొకటి ఇచ్చిన చందంగా కార్పొరేట్‌, మతోన్మాద జమిలి ప్రయోజనాల కోసం చేస్తున్న బిజెపి కుట్రలను చెప్పకుండా అధిక సంతానాన్ని పెంచమని ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిస్తున్నారు. బిజెపి అనుసరించే విధానాలను ప్రతిఘటించకుండా రాష్ట్రానికి రావలసిన నిధులు సాధించలేరు, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోలేరు. ఈ విషయాన్ని గుర్తించకపోగా ఆ పార్టీతో టిడిపి, జనసేన ప్రత్యక్షంగా, వైసిపి పరోక్షంగా చెలిమి చేస్తూ దేశానికి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాయి. మన రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా మతోన్మాద భావ వ్యాప్తి చెందడానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు ఒక ఆయుధంగా పవన్‌ కళ్యాణ్‌ తోడ్పడుతున్నారు. రాష్ట్రాలను బలహీనం చేసే బిజెపి కుట్రలను చైతన్యవంతులైన ఆంధ్ర ప్రజలు ఐక్యంగా ప్రతిఘటించేందుకు సిద్ధం కావాలి.

వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్‌

➡️