చిన్నప్పుడు కొందరు పిల్లలు తాము అనుకున్నది జరగనప్పుడు లేదా అనుకున్నది సాధించుకోవడానికి కిందపడి దొర్లడం, అలగడం, ఏడవడం లాంటివి చేస్తుంటారు. ఇంకాస్త ఎమోషనల్ బ్యాలెన్స్ లేని పిల్లలైతే తల గోడకేసి కొట్టుకోవడం లాంటివి కూడా. అయితే అది ఒక వయసు వరకే ఉంటుంది. ఆ తర్వాత కాస్త పరిపక్వత వచ్చాక పిల్లలు పెద్దలుగా మారే క్రమంలో ఒక మానసిక స్థిరత్వం, సమస్య పరిష్కారం మార్గం తెలుసుకుంటారు. పెద్దయ్యాక కూడా వారు అలాగే చేస్తున్నారంటే వాళ్లు కచ్చితంగా మానసిక సమస్యతో బాధ పడుతున్నారని అర్థం.
ఒక ఉపాధ్యాయుడు ఆ కుర్చీలో కూర్చోవడానికి ఎంతో చదివి, అనేక పరీక్షలు రాసి పాస్ అయ్యి పోటీ పడి ఆ స్థాయికి చేరుకొని ఉంటాడు. ఉపాధ్యాయుడికి సమాజం తెలుసు. జీవితం తెలుసు. ఎగుడు దిగుళ్ళు చవిచూసిన జీవితానుభవం ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి శిక్షణలో భాగంగా పిల్లల సైకాలజీ కూడా చదివే వస్తాడు. వీటన్నింటినీ ఉపయోగించి పిల్లవాడికి చదువు నేర్పించడంతోపాటు నైతిక పరివర్తన, క్రమశిక్షణ, జీవిత విలువలు లాంటివి కూడా తనకు తెలియకుండానే నేర్పిస్తాడు. పిల్లవాడు అలవర్చుకునేలా ప్రయత్నం చేస్తాడు. అయితే సమాజంలోని అనేక సామాజిక సాంకేతిక కారణాల వలన ఇక్కడ అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. ప్రతి రంగంలోనూ వైఫల్యం అనేది సర్వసాధారణం. ఆ వైఫల్యానికి కారణాలు వెతకాలి. సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అంతేతప్ప విద్యార్థులకు దిశానిర్దేశం చేసే ఒక ఉపాధ్యాయుడు తన వైఫల్యానికి కారణంగా గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారం చేసి, బెత్తంతో బాదుకొని తనను తాను శిక్షించుకోవడం అనేది ఎంతవరకు సబబో ఒకసారి మనం ఆలోచిద్దాం.
ఒక కుటుంబంలో తండ్రిగా, భర్తగా, తల్లిగా, అక్కగా, చెల్లిగా అనేకసార్లు అనేక సందర్భాల్లో మనం విఫలమవుతూ ఉంటాం. అంతమాత్రం చేత మనల్ని మనం శిక్షించుకుందామా? ఉపాధ్యాయుడు శిక్షించుకుంటే విద్యార్థులు మారతారా? మార్పు వస్తుందా? ఒకవేళ కొందరు విద్యార్థులు మారినా.. పాఠాలు బోధించే ఉపాధ్యాయులు ఇలా తమను తాము శిక్షించుకొనే విధానం సమర్ధనీయమా? అవును.. మారతారు అని ఎవరైనా గ్యారెంటీ ఇస్తే చెప్పండి. ఉపాధ్యాయులంతా రోజుకు ఐదు పది నిమిషాలు గుంజీలు తీసే, బెత్తంతో కొట్టుకొనే కార్యక్రమం చేపడదాం. పాఠశాలల్ని ప్రక్షాళన చేసి విద్యా వ్యవస్థని అభివృద్ధి దిశగా నడిపిద్దాం! అది చేసినా విద్యార్థులు మారరు, మార్పు రాదని అందరికీ తెలుసు. అయితే ఎందుకు చేసినట్లు? ఫ్రస్ట్రేషన్? తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేని ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఎలా దిశా నిర్దేశం చేయగలుగుతాడు?
నేనూ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలినే. ఆ స్థానంలో నాకు అనేక అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఉన్నాయి. నిజమే! పిల్లలు మాట వినరు. చదవరు. ఉపాధ్యాయులను కామెంట్ చేస్తుంటారు. ఒక్కోసారి పిల్లల కామెంట్స్ ఎలా ఉంటాయంటే.. ఎవరితో అయినా చెప్పుకోవడానికి కూడా సిగ్గనిపిస్తుంది. ఎన్ని నీతులు చెప్పినా వారి చెవికి ఎక్కవు. రాయమన్నది రాయరు. చదవమంటే చదవరు. ఒక్కోసారి ఎదురు తిరుగుతారు. ఒక్కోసారి ఒక్కొక్క క్లాస్‌కి వెళ్లాలంటే కూడా భయమేస్తుంటుంది. కొంతమంది నిజంగానే రౌడీలా ప్రవర్తించే వాళ్ళుంటారు. అయితే ఉపాధ్యాయుడు వాళ్లను అర్థం చేసుకోవాలి.
ఒక పిల్లవాడి ప్రవర్తనను నిర్ధారించేది ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల పిల్లల తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం, పిల్లల్ని గమనించే సమయం, మానసిక పరిణతి తల్లిదండ్రులకు లేకపోవడం, తల్లిదండ్రులు తిట్టుకోవడం, కొట్టుకోవడం, పేదరికం, అజ్ఞానం, మూఢనమ్మకాలు, అతి ప్రధానంగా సోషల్ మీడియా, వాళ్ళు చూసే బూతు బొమ్మలు, సినిమాలు, రీల్స్…ఇవన్నీ కూడా విద్యార్థి వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తాయి. అయితే ప్రతి తరగతి గదిలోను ఇలాంటి సమస్యాత్మకమైన విద్యార్థులు పదిమందిలోపే ఉంటారు. వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పించడం, వారి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయడం వంటివి చేస్తుండాలి. ఒక విద్యార్థి ప్రవర్తనకు మూల కారణాన్ని వెలికి తీసి దాని పరిష్కార దిశగా ఉపాధ్యాయుడు ఆలోచించగలిగితే సమస్యకు పరిష్కారం దొరకవచ్చు.
ఎదుగుతున్న దశలో విద్యార్థి మొత్తం అనేక ప్రశ్నలతో నిండుకున్నటువంటి ఒక సమస్య లాంటివాడు. ఉపాధ్యాయుడు సహనంగా ఉండాలి. ఓర్పుగా, నేర్పుగా ముఖ్యంగా విద్యార్థికి మార్గదర్శకంగా ఉండాలి. విద్యార్థి జీవితాన్ని నిర్దేశించే నాయకుడిగా ముందు నడవాలి. తన గౌరవాన్ని కాపాడుకోవాలి. విద్యార్థులు దైవంగా భావించి నమస్కరించే తన స్థాయిని నిలబెట్టుకోవాలి. అనేకమంది విద్యార్థుల దృష్టిలో ఉపాధ్యాయుడు ఒక హీరో. వారి ముందు జీరోలా ప్రవర్తించకూడదు. తనను తాను తగ్గించుకొని…తనను తాను శిక్షించుకొనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక ప్రశ్నగానే మిగిలిపోతాడు తప్ప అతనిలో ఏ సమాధానమూ విద్యార్థులకు దొరకదు.
– గంగవరపు సునీత