అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఇజ్రాయిల్ నరమేధాన్ని ఎదిరించి పోరాడుతున్న ఇరాన్‌కు నేతృత్వం వహిస్తున్న ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలి మరణించడం దిగ్భ్రాంతికరం. ఆయనతోపాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దొలాహియన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్సు గవర్నర్, మరో ఐదుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలు, పొగమంచు కారణంగా పర్వత శ్రేణుల్లో ప్రమాదం జరిగిందని పాశ్చాత్య మీడియా చెబుతుండగా, ‘సంఘటన’గా ఇరాన్ పేర్కొంది. ప్రమాదమా? కుట్రా? అనే అంశాన్ని నిర్ధారించలేదు. సంఘటనా స్థలంలో విచారణ నిర్వహించడంతోపాటు నిజానిజాలు తేల్చడానికి సైనిక, వైమానిక నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. అధ్యక్షుడి హెలికాప్టర్‌తోపాటు వెళ్లిన మరో రెండు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోగా, ఈ హెలికాప్టర్ ఒక్కటే కూలిపోయిన నేపథ్యంలో కుట్రకోణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అత్యాధునిక ఆయుధాలతోపాటు సంపదతో అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ‘దుష్ట రాజ్యం’ అంటూ ఇరాన్‌పై ఆంక్షలు విధించినా.. అద రకుండా, బెదరకుండా సామ్రాజ్యవాదంపై అలుపెరగని పోరాటం చేస్తోంది. వేల సంవత్సరాల చరిత్ర, భారత్‌సహా అనేక ప్రాచీన దేశాలతో వ్యాపార సంబంధాలు ఉన్న ఇరాన్ నాలుగున్నర దశాబ్దాల క్రితం రాజరికానికి ముగింపు పలికింది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి అధ్యక్ష పదవికి, పార్లమెంటుకు ఎన్నికలు జరిగే ఈ దేశంలో షియా చట్టాల ఆధారంగా పాలన సాగుతుంది. మధ్య ప్రాచ్యంలో పట్టు సాధించి, అపార చమురు నిక్షేపాలపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు ప్రధాన అడ్డంకిగా ఇరాన్ ఉంది. 2021 ఆగస్టులో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రైసీ మతపరంగా సాంప్రదాయ వాది అయినా సామ్రాజ్యవాద వ్యతిరేకి. చైనా, రష్యాలతో సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లి, సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులను ఐక్యం చేసేందుకు ప్రయత్నించారు. నూతన టెక్నాలజీని, మందులు, వైద్య పరికరాలను, విమానాలు, హెలికాప్టర్ల విడిభాగాలు సైతం రాకుండా యుఎస్ అడ్డుకుంటోంది. ఆదివారం కూలిన అధ్యక్షుడి బెల్ 212 హెలికాప్టర్ 1979కి ముందు ఇరాన్ చివరి రాజు షా మహ్మద్ రెజా పహ్లవీ హయాంలో సమకూర్చుకున్నది. ఇది కూలిన సంఘటనకు నేరస్తుల్లో అమెరికా ఒకటని ఇరాన్ విదేశాంగశాఖ మాజీ మంత్రి జావెద్ జరీఫ్ తేల్చిచెప్పారు. ఆంక్షల వల్ల, తలెత్తిన నిర్వహణా లోపాల కారణంగా 1979 నుంచి ఇరాన్‌లో జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రముఖులు సహా దాదాపు రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
అనేక దేశాల అధినేతలను హత్య చేసిన చరిత్ర ఉన్న అమెరికా నిఘా సంస్థ సిఐఎది. ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొసాద్ పలువురు ఇరాన్ కీలక అధికారులను, నేతలను ఇటీవలి సంవత్సరాల్లో హత్య చేసింది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జిసి) కమాండర్ కాసెం సోలిమని హత్య తదితర అనేక దుశ్చర్యలకు ఇవి పాల్పడ్డాయి. సిరియాలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై క్షిపణి దాడి చేసి జనరల్ మహ్మద్ జాహెదీసహా ఏడుగురు సీనియర్ ఐఆర్‌జిసి కమాండర్లను హత్య చేసింది. దీనికి ప్రతిస్పందనగా… అనేక దశాబ్దాల తరువాత ఇజ్రాయిల్‌తో నేరుగా తలపడింది రైసీ నాయకత్వంలోనే. అగ్రరాజ్యాలపై ఒత్తిడి తెచ్చేందుకు, ఇజ్రాయిల్‌కు కళ్లెం వేసేందుకు హమాస్, హౌతీ, హిజ్బుల్లా తదితర సంస్థలకు ఆర్థిక, ఆయుధ చేయూతనందిస్తోంది. రైసీ, అబ్దొల్లాహియన్ మరణించడం దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఇరాన్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం దేశ తొలి ఉపాధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ మొఖ్బర్ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం 50 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇజ్రాయిల్ నరమేధానికి ప్రత్యక్షంగా సహకరిస్తూ… వేల మందిని బలిగొంటున్న అమెరికా… ఈ వ్యక్తి చేతులు రక్తంతో తడిశాయని సంతాప సందేశంలో పేర్కొనడం విడ్డూరం. మోడీ హయాంలో అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ.. ఇజ్రాయిల్‌కు వంత పాడుతున్నా… ఇరాన్ మనకు మిత్రదేశంగానే కొనసాగుతోంది. తాజా సంక్షోభాన్ని తట్టుకుని ఇరాన్ మరింత ముందుకు వెళ్లాలని ఆశిద్దాం.
