స్టాక్‌ మార్కెట్‌లో ‘దిద్దుబాటు’ జరుగుతోందా?

వాటాల అమ్మకాలు, కొనుగోళ్లలో ఎక్కువ లావాదేవీలు నడుస్తున్న 30 అతి పెద్ద కార్పొరేట్‌ కంపెనీల వాటాల విలువలు పెరగటం, తరగటాన్ని బట్టి బొంబాయి స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ (బిఎస్‌ఇ) ఇండెక్స్‌ ఎగుడు దిగుడులకు లోనవుతోంది. ఫైనాన్స్‌ పెట్టుబడు లకు ఆలవాలంగా నిలుస్తున్న బొంబాయి స్టాక్‌ ఎక్స్‌చేంజి 1986లో స్థాపించబడి 1991 తరువాత సరళీకరణ విధానాలు తీవ్రమయ్యే కొద్దీ స్టాక్‌ (షేర్లు) మార్కెట్‌ ప్రాబల్యం పెరిగింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ఎగుమతులపై సుంకాలు పెంచుతానని ప్రకటించాడు. దీన్ని సాకుగా చూపించి ప్రభావిత కంపెనీల వాటాలను విదేశీ పెట్టుబడి సంస్థలు అమ్మకాలకు పాల్పడుతున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఎక్కువ అమ్మకాలకు పూనుకున్నపుడు, స్వదేశీ సంస్థాగత పెట్టుబడులు ఎక్కువ కొనుగోళ్లకు పూనుకుంటున్నాయి. మార్కెట్‌ ఇండెక్స్‌ అస్థిరత్వం బొంబాయి స్టాక్‌ మార్కెట్‌లో రిజిస్టరైన 5 వేలకు పైగా ఉన్న కంపెనీల వాటాల విలువపై కూడా పడుతోంది.
2024 సంవత్సరం మొత్తం మీద విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.41 లక్షల కోట్లు కొనుగోళ్లు, రూ.44 లక్షల కోట్లు అమ్మకాలు చేశాయి. అదే సమయంలో స్వదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.34 లక్షల కోట్లు కొనుగోళ్లు, రూ.29 లక్షల కోట్లు అమ్మకాలు చేశాయి. నికరంగా విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.3 లక్షల కోట్లు మేర ఎక్కువ అమ్మకాలు చేస్తే, స్వదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.5 లక్షల కోట్లు ఎక్కువ కొనుగోళ్లు చేశాయి. వెరసి షేర్‌ మార్కెట్‌ను స్వదేశీ పెట్టుబడులు నిలబెడుతున్నాయి. వీటిలో పెద్దదైన ఎల్‌.ఐ.సి. మ్యూచువల్‌ ఫండ్‌ను ఈ కర్తవ్య నిర్వహణకు పాలకులు ఉపయోగించుతున్నారు.

2025 జనవరి, ఫిబ్రవరి నెలల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.లక్షన్నర కోట్లు తరలివెళ్లాయి. వీటి వలన డాలరుకు డిమాండ్‌ పెరిగి రూపాయి విలువ పడిపోతోంది. విదేశీ వాణిజ్య లోటు రూపాయి విలువ పడిపోవటంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. రూపాయి-డాలరు స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ కూడా రూపాయి విలువపై ప్రభావం చూపిస్తోంది.
సెప్టెంబరు 27న 85,571 పాయింట్లకు చేరిన తరువాత విదేశీ సంస్థాగత పెట్టుబడులు కొనుగోళ్లకు మించి అమ్మకాలు ఎక్కువ చేయటం మొదలుపెట్టి 2025 ఫిబ్రవరి ముగిసే నాటికి తారాస్థాయికి చేర్చాయి. విదేశీ సంస్థగత పెట్టుబడులు సరైన కారణాలు లేకుండానే అత్యధిక కొనుగోళ్లు చేసి వాటాల విలువను పెంచి తరువాత కాలంలో అమ్ముకున్నాయి. విదేశీ పెట్టుబడులు తమ లాభాలను బుక్‌ చేసుకుంటున్నాయి కాబట్టి ఎక్కువ అమ్మకాలు చేస్తున్నాయని ఆర్థికమంత్రి సీతారామన్‌ సాదాసీదాగా చెప్పారు. రూపాయి విలువ పడిపోవటంగానీ, వ్యక్తిగత మదుపుదార్లు నష్టపోవటంగానీ సాధారణ అంశంగా ఆమెకు కనిపించింది.

1992లో హర్షద్‌ మెహతా, 2001లో కేతన్‌ పరేఖ్‌ కుంభకోణాలు స్టాక్‌మార్కెట్లను కుదిపేశాయి. అక్రమ నిధులను స్టాక్‌మార్కెట్‌కు మళ్లించి వాటాలకు విలువలను పెంచి వాటిని అమ్ముకుని లాభాలు గడించారని వారిపై అభియోగం మోపబడింది. ఈ కుంభకోణాల వలన వాటాల విలువలు పెరిగి కార్పొరేట్‌ కంపెనీలు లాభపడ్డాయి. కుంభకోణాల నివారణకు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజి బోర్డు ఆఫ్‌ ఇండియా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని అపుడు చెప్పారు. కానీ ఇపుడు మార్కెట్‌ను కుదిపేస్తున్న స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ ‘సెబీ’ కి గానీ, ప్రభుత్వానికి గానీ తప్పిదంగా కనబడటం లేదు.
అత్యధికంగా కొనుగోలు చేసి వాటాల విలువలను పెంచి వాటిని అధిక ధరలకు మరలా భారీగా విక్రయించి లాభాలు చేసుకోవటంతో పాటు మరలా తగ్గిన రేట్ల మీద షేర్లను కొనుగోలు చేయటం సాధారణంగా మారింది. తమ పెట్టుబడులతో మార్కెట్‌ను అతలాకుతలం చేసే గ్యాంబ్లింగ్‌ కొనసాగుతోంది. ఈ గ్యాంబ్లింగ్‌లో వ్యక్తిగత మదుపుదార్లు సమిధలవుతున్నారు.
అధికంగా జరుగుతున్న లావాదేవీలపై పన్ను వేయటానికి కూడా నిరాకరించిన పాలకులు ఇపుడు చాలా అతి స్వల్పంగా పన్ను వసూలు చేస్తున్నారు. కొద్దిపాటి లావాదేవీల పన్ను స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ను నివారించలేకపోతోంది. విదేశీ సంస్థాగత పెట్టుబడులు మన ప్రభుత్వాలను బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. అదివరలో ఒక కేంద్ర మంత్రి హుటాహుటిన ముంబాయి పోయి విదేశీ పెట్టుబడులను బతిమలాడినంత పని చేశారు. ఇటువంటి వాటి మీద ఆధారపడటం మన ఆర్థిక వ్యవస్థకు మంచి చేయలేదని అనుభవం చెబుతోంది.

ఒకపుడు స్టాక్‌బ్రోకర్ల ద్వారా తమ వాటాల విలువలను అమితంగా పెంచుకునే ప్రయత్నం చేసిన కార్పొరేట్‌ కంపెనీలు ఇపుడు తమ పెట్టుబడులను షెల్‌ (డొల్ల) కంపెనీలకు బదలాయించి వాటి ద్వారా పెట్టుబడులు పెట్టిస్తున్నారు. తమ కంపెనీలు ఉత్పత్తి ద్వారా, సేవలు అందించటం ద్వారా లాభాలు గడించటంతో సరిపెట్టుకోకుండా, తమ వాటాల విలువలను తారుమారు చేసే పద్ధతులకు పూనుకుంటున్నారు. 2023లో అదానీ కుంభకోణం స్టాక్‌ మార్కెట్లను పెద్ద కుదుపు కుదిపింది. అదానీ తన షెల్‌ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టించి తన వాటాల విలువలను పెంచుకునే విధంగా తారుమారు చేశారని యు.ఎస్‌ పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ అభియోగం.

తమ దగ్గర ఉన్న పెట్టుబడులతో వాటాల విలువలను తారుమారు చేసే పద్ధతి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతోంది. స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ దీనికి ఆదరువుగా నిలుస్తోంది. అధికారికంగానే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ‘సెబీ’కి స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ పట్ల ఎటువంటి అభ్యంతరం లేదు.

2024 సెప్టెంబరు 27న ఇండెక్స్‌ అత్యధిక స్థాయిలో ఉన్న రోజున బిఎస్‌ఇలో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ రూ. 478 లక్షల కోట్లకు చేరింది. ఆ తరువాతి 5 నెలలో 2025 ఫిబ్రవరి ఆఖరు నాటికి దానిలో నుండి రూ.94 లక్షల కోట్లు సంపద ఆవిరైంది. ఆవిరైందని చెప్పుకునే ఈ సంపద తిరిగి వచ్చిన తరువాత మరలా యథాతథ స్థితికి చేరుతుంది. ఈ పెరుగుదల కాలం గడిచే కొద్దీ జరుగుతూనే ఉంటుంది.

ప్రభుత్వాల ఫైనాన్స్‌ పెట్టుబడులకు అనుకూలమైన నయా సరళీకరణ విధానాలు సామాన్య మదుపుదార్లను బలి చేస్తున్నాయి. బ్యాంకులు, పోస్టాఫీసులలో ప్రజల డిపాజిట్లపై ఇచ్చే వడ్డీలను తగ్గించి, షేర్‌ మార్కెట్‌ వైపు మళ్లించటం కొనసాగుతోంది. ఉద్యోగులు, కార్మికులకు చెందిన రూ.లక్షల కోట్ల పి.ఎఫ్‌, పెన్షన్‌ నిధులను న్యూ పెన్షన్‌ స్కీం లేదా కంట్రిబ్యూటరీ పి.ఎఫ్‌ పేరుతో జూదపూరిత షేర్‌ మార్కెట్‌కు పాలకులు తరలిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఆర్థిక సంక్షోభాలు వచ్చినా వాటి ప్రభావం తీవ్రంగా స్టాక్‌ మార్కెట్‌పై పడుతోంది. పెన్షన్‌ నిధులు ఆవిరైపోయి పెన్షనర్లు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు.

స్వదేశీ, విదేశీ ఫైనాన్స్‌ పెట్టుబడులకు, అంబానీ, అదానీ, బిర్లా, మహీంద్ర వంటి కార్పొరేట్‌ కంపెనీలకు లాభం చేసే విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఐక్యం కావాలి. తమ పొదుపు నిధులు స్టాక్‌ మార్కెట్‌లో స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌కు బలికాకుండా చూసుకోవాలి. సామాన్య ప్రజలను జూదాలకు బానిసలు చేసే విధానాలను వ్యతిరేకించాలి.

 వ్యాసకర్త : సిఐటియు ఉపాధ్యక్షులు పి.అజయ కుమార్‌

➡️