ఆదుకునే తీరిదేనా?

Apr 24,2024 05:30 #editpage

కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న కర్ణాటకను ఆదుకునేందుకు ఉదారంగా ముందుకు రావాల్సింది పోయి, కరువు నిధులను బిగబట్టుకు కూర్చొన్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వ తీరు గర్హనీయం. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరికి ఇది పరాకాష్ట.
గత 122 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 73 శాతం వర్షపాత లోటు గత ఏడాది చోటుచేసుకోవడం, ఎనిమిదేళ్లుగా వెంటాడుతున్న వర్షాభావం, పాలకుల నిర్లక్ష్యం వెరసి కర్ణాటకను తీవ్ర దుర్భిక్షంలోకి నెట్టాయి. గత ఏడాది 236 మండలాలకుగాను 223 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారంటేనే దీని తీవ్రత అర్థమవుతుంది. కోటీ 18 లక్షల 62 వేల ఎకరాల్లో పొలాలు నెర్రెలివ్వడంతో రూ.35,162 కోట్ల మేర పంటనష్టం వాటిల్లింది. జాతీయ విపత్తు సహాయక నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) కింద రూ.18,171 కోట్లు సహాయం చేయాలని కర్ణాటక ప్రభుత్వం కోరితే,, కరువు బృందాల యాత్రలు, కమిటీల నివేదికల పేరుతో కాలయాపన చేయడం తప్ప కేంద్రం చిల్లి గవ్వ కూడా విదల్చలేదు. ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌ (ఐఎంసిటి) రాష్ట్రాన్ని సందర్శించి, కరువును అంచనా వేసి నింపాదిగా నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక పై కేంద్రం వెంటనే కదిలిందా అంటే అదీ లేదు. ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే. కరువు నిధులు కేంద్రం దయాదాక్షిణ్యాలతో ఇచ్చే భిక్ష కాదు. రాష్ట్రాల హక్కు. భారత రాజ్యాంగంలోని 14, 21 అధికరణల ప్రకారం పౌరులకు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులో భాగంగానే దీనిని చూడాలి. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న వాదన సహేతుకమైనదనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర రాజధాని బెంగళూరుతో సహ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు గుక్కెడు నీటి కోసం కటకటలాడుతున్నాయి. నిధుల కోసం కర్ణాటక అభ్యర్థించి అయిదు మాసాలైనా కేంద్రం నుంచి కించిత్‌ కూడా స్పందన లేదు. వేరే గత్యంతరం లేని స్థితిలోనే కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇంతకాలం దీనిని పట్టించుకోనివారు వారం రోజులు గడువు ఇవ్వండి పరిష్కరించేస్తామని కోర్టుకు చెప్పడం వింతగా ఉంది. ఫెడరల్‌ వ్యవస్థలో తలెత్తే వివాదాలన సామరస్యంగా పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానంచే మరో సారి చెప్పించుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? దీనికి మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కేంద్రం నిధులివ్వడం లేదు కాబట్టి తానేమి చేయలేనని చేతులెత్తేయడం కాకుండా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి కరువు పీడిత ప్రాంత ప్రజలను ఆదుకోడానికి సిద్ధరామయ్య ప్రభుత్వం సత్వరమే కదలాలి.
గత డిసెంబర్‌లో వరదలు ముంచెత్తడంతో తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది. జాతీయ విపత్తుగా ప్రకటించి, రూ.7,033 కోట్లు మధ్యంతర నిధులు, రూ.12,659 కోట్లు శాశ్వత సహాయ నిధిని విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం కోరినప్పుడు కూడా కేంద్రం ఇదే విధమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను శత్రువులుగా చూసే దోరణి కర్ణాటక, తమిళనాడు, కేరళ సహా అనేక రాష్ట్రాల విషయంలో కళ్లకు కడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఈ ధోరణి సమాఖ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టు.
రాజ్యాంగంలోని ఒకటవ అధికరణలో ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అని చెప్పడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారు. కానీ, దీనికి భిన్నంగా మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ చేష్టలు ఉన్నాయి. పన్నుల పంపిణీ మొదలు, గ్రాంట్‌ – ఇన్‌ -ఎయిడ్‌, కరువు సహాయం, నీటి వనరుల ప్రాజెక్టులకు అనుమతులు దాకా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం అంతులేని వివక్షను ప్రదర్శిస్తోంది. పన్నుల ఆదాయంలో ఉత్తర ప్రదేశ్‌కు వందకు 46 శాతం ఇస్తున్న కేంద్రం, కేరళకు 21 శాతం, కర్ణాటకకు 13 శాతం మాత్రమే ఇస్తున్నది. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ పన్ను బదలాయింపు ఫార్ములాను మార్పు చేయడం వల్ల కేరళ, కర్ణాటక సహా చాలా రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఒకే దేశం – ఒకే పన్ను పేరుతో తీసుకొచ్చిన ‘జిఎస్‌టి’ వల్ల రాష్ట్రాలు రూ.3 లక్షల కోట్లు మేర నష్టపోయాయి. ఒక్క మన రాష్ట్రమే రూ.30 వేల కోట్లు దాకా నష్టపోయింది. కేంద్ర – రాష్ట్ర సంబంధాల సమతుల్యతను దెబ్బతీస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆ రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగాల్సివచ్చింది. ఆర్థిక వనరుల విషయంలో రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం, సమాఖ్య వ్యవస్థకు వాటిల్లుతున్న ప్రమాదంపై చర్చను అది లేవనెత్తింది. సరిగ్గా ఆ సమయంలోనే కర్ణాటక సిఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఢిల్లీ వేదికగా ఆందోళన చేపట్టింది. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు ఇదే సంఫ్‌ుపరివార్‌ విధానం. అంతిమంగా ఇది నియంతృత్వానికి దారితీసే ప్రమాదముంది..దీనికి బ్రేక్‌ వేయాలంటే ఓటుతో మోడీ ప్రభుత్వంపై వేటు వేయాలి.

➡️