సిపిఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త ప్రకాశ్ కరత్ ఈ నెల 9వ తేదీన గమనార్హమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తర్వాత ఇంకా ఎవరూ ఆ స్థానంలోకి రాలేదు. కరత్ పొలిట్ బ్యూరో సమన్వయకర్తగా నియమితులయ్యారు. అది ప్రస్తుతానికి ప్రధాన కార్యదర్శి వంటి హోదా. పైగా ఆయన స్వయంగా లోగడ ఆ హోదాలో పని చేశారు. అందువల్ల తన మాటలకు తగినంత ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు. కరత్‌కు మార్క్సిస్ట్ సిద్ధాంతాలలో నిష్ణాతుడనే పేరు పార్టీలో, బయటా కూడా ఉన్నది. హరికిషన్ సింగ్ సూర్జిత్ ప్రధాన కార్యదర్శిగా ఉండినపుడు, సిపిఎంతో పాటు మొత్తం వామపక్షాలను మధ్యే మార్గ పార్టీలతో మైత్రి వైపు మళ్లించారు. సీతారాం అందుకు అనుకూలురు కాగా, కరత్ వ్యతిరేకి.
కరత్ మాట్లాడిన సందర్భం సిపిఎం కేరళ శాఖ సభలు కొల్లామ్ పట్టణంలో జరగటం. ఆ సభలు ఒక రాష్ట్రానికి సంబంధించినవి. ఆయన మాటలు నేరుగా తన ప్రసంగంలో అన్నవి గాక, విడిగా ఒక పత్రికా ప్రతినిధితో చెప్పినవి. అందువల్ల వాటికి తగిన ప్రచారం రాలేదు. కానీ అవి మొదట అనుకున్నట్లు గమనార్హమైనవి: ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్, ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరిట ఏర్పడిన 26 బిజెపి యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధా నాలు, సిద్ధాంతాలు, నాయకులు ఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. ఒక సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఇతర పార్టీలు ప్రయత్నించాయిగానీ అది ఆచరణలో పని చేయగలది కాదన్నాము. దానితో, నాయకులు మాత్రం కలుస్తుండేవారు. కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు గానీ అవేవీ పని చేయ లేదు. సీట్ల సర్దుబాటుపై జాతీయ స్థాయి చర్చలు వీలయేవి కాదు గనుక ఆ పని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా జరగాలన్నాము మేము. ఉదాహరణకు మా పార్టీ బెంగాల్‌లో, కేరళలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయదు. మొత్తానికి ఆ పద్ధతి పనిచేసి బిజెపి సొంత మెజారిటీ కోల్పోయి 240 స్థానాలకు తగ్గింది. అందువల్ల, ఇండియా కూటమి అన్న ఆలోచనే లోక్‌సభ ఎన్నికలకు పరిమితమైనటువంటిది… లోక్ సభ ఎన్నికల అనంతరం తమకు అసలు ఒక ఉమ్మడి వేదిక అవస రమా? అయితే ఏ విధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. ఒక వేళ వేదిక ఎన్నికల కోసమే అయితే, ఇపుడు చేయవలసింది ఏమీ ఉండదు’ అన్నారు సిపిఎం సమన్వయకర్త.
కూటమి భవిష్యత్తు?
కరత్ వెల్లడించిన అభిప్రాయాలలో ఇండియా కూటమి ఏవిధంగా వ్యవహరించిందన్న గత పరిస్థితులకే పరిమితమ య్యారనే భావన కలగవచ్చు. కానీ అందులో అంతర్లీనంగా, ప్రతిపక్షాలు మౌలికంగా ఎట్లా పనిచేస్తున్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా పని చేయా లనే కోణాలు కూడా కనిపిస్తాయి. చెప్పాలంటే ఈ ప్రశ్నలు ప్రతి పక్షాలకు 1977 నాటి జనతా పార్టీ నుంచి మొదలుకొని తర్వాత కాలంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌ల కాలంలో, ఇంకా తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడిన యుపిఎ హయాంలోనూ కొనసాగినవే. ఇండియా కూటమి బలహీనతలు, వైఫల్యాల వెనుక కూడా ఇదంతా ఉంది.
కూటమికి వ్యవస్థాత్మక నిర్మాణాన్ని సిపిఎం వ్యతిరేకించటానికి కారణం అందులో పలు రకాల విధానాలు, సిద్ధాంతాలు గల పార్టీలు, నాయకులు ఉండటం. దీనికి సమాధానాలు కనుగొనలేకపోయినందువల్లనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కూటమికి భంగపాట్లు ఎదురు కావటం జరిగింది. అటువంటి భంగపాట్లు జనతా పార్టీ కాలం నుంచి గత 48 సంవత్సరాలుగా ప్రతిపక్షాలకు ఎదురవుతూనే ఉన్నాయి. అందుకు ఒక కారణం వారి వైఫల్యాలు కాగా, మరొకటి భారతదేశపు మహా విస్తారమైన వైవిధ్యత.
ఇన్నిన్ని ప్రాంతాలు, సైద్ధాంతిక, విధానపర, రాజకీయ వైవిధ్యతలు ఉన్నపుడు ఏకాభిప్రాయాలు, విభేదాలకు అవకాశం ఉండని సమష్టి నాయకత్వాలు తేలిక కాదు. కాంగ్రెస్, బిజెపి ల వలె నిర్దిష్ట దీర్ఘకాలిక చరిత్రలు, నాయకత్వాలు, సిద్ధాంతాలు ఉన్నపుడు అది సాధ్యమవుతుంది. లేదా ఎమర్జెన్సీ వంటి అసాధారణ పరిస్థితి ఏర్పడి దేశాన్ని ఒకటి చేయటం వంటిది జరగాలి. వీటన్నింటి మధ్య స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి ఒక పాయగా సాగుతుండిన సోషలిస్టు రాజకీయం సరిగా కుదురుకొని ఉంటే ఏమి జరిగేదో గానీ పలు కారణాలవల్ల అది ఛిన్నాభిన్నమైంది.
మరొకవైపు, కేవలం ఎమర్జెన్సీ పట్ల వ్యతిరేకతతో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఏర్పడిన జనతా పార్టీ, తర్వాత ‘యాంటీ కాంగ్రెసిజం’ ఆలోచనలతో ముందుకు వచ్చింది. తాము ఒకప్పటి కాంగ్రెస్ సంప్రదాయంలో వామపక్షపు మొగ్గు గల మధ్యే మార్గ ప్రత్యామ్నాయం కాగలమన్న ఫ్రంట్ కూటములు అదే దశలో చెదిరిపోయాయి.
కనీస ఉమ్మడి కార్యక్రమం ఏమిటి?
అయితే, ప్రకాశ్ కరత్ మాటలను పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే, 1977 నాటి జనతా పార్టీ కాదుగానీ, 1989లో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ కొంత భిన్నంగా కనిపించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలతో అదే పార్టీకి చెందిన వి.పి. సింగ్ వంటి ముఖ్య నేతలు బయటకు రావటం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నదనే ఫిర్యాదుతో పలు ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఎమర్జెన్సీ-జనతా పార్టీ దశలో ఒకటై తిరిగి చెదిరిపోయిన సోషలిస్టు వర్గాలు, ఉభయ కమ్యూనిస్టులు, దేశవ్యాప్తంగా సమాజంలోని ప్రజాస్వామికవాదులు ఒకే వేదిక పైకి వచ్చి చేరారు.
అంతేగాక, వి.పి. సింగ్, ఎన్టీఆర్‌ల నాయకత్వాన బిజెపి ని ఒక అడుగు దూరంలోనే ఉంచివేశారు. ఈ వైవిధ్యతల మధ్య అపుడు ప్రకాశ్ కరత్ ఉద్దేశిస్తున్నది ఒకటి జరిగింది. అది, ఎన్నికలకన్నా ముందే వివిధ పార్టీల మధ్య సుదీర్ఘ చర్చల ద్వారా ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ఒకటి రూపొందించటం. అది దేశ ప్రజానీకానికి ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించిన మాట నిజం.
అయితే కొందరు సీనియర్ల అధికార కాంక్షలు, మందిర్-మండల్ వివాదాల మూలంగా ఆ ప్రయోగం భంగపడటం తెలిసిందే. అది జరగనట్లయితే దేశ రాజకీయాలు మరొక విధంగా ఉండేవేమో. సిపిఎం సమన్వయకర్త ప్రకాశ్ కరత్ అపుడంతా జాతీయ స్థాయిలో ఈ పరిణామాలను ప్రత్యక్షంగా గమనించిన వ్యక్తి. ప్రస్తుత ‘ఇండియా’ కూటమికి సంబంధించిన పరిణామాల వరకు తనకు తెలియనిది లేదు. అందువల్లనే ఆ కూటమి ఏర్పాటు తీరు, లక్ష్యాలు, పని తీరు, పరిమితులు, సాఫల్య వైఫల్యాల గురించి అంత స్పష్టంగా చెప్పగలిగారు.
ఈ విషయాన్ని కొంత ముందుకు తీసుకువెళ్ళినట్లయితే, ఆయన ఎత్తి చూపిన సైద్ధాంతిక, విధానపరమైన వైవిధ్యతలు, వైరుధ్యాల నుంచి, నాయకుల వ్యక్తిగత ధోరణుల నుంచి బిజెపి యేతర పార్టీలు బయటకు రాగలగటం, నేషనల్ ఫ్రంట్ వలె కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించుకోవటం ఎంత వరకు సాధ్యమన్నది ప్రశ్న. అందుకు బిజెపి వ్యతిరేకత అన్నదొక్కటే చాలదు. తమ వైపు నుంచి ప్రజలకు చూపించే ప్రత్యామ్నాయ పాజిటివ్ ఆర్థిక, సామాజిక, అభివృద్ధి అజెండా తప్పనిసరి. ఎన్నికల తర్వాత ఏమిటన్న చర్చ ‘ఇండియా’ కూటమిలో ఎప్పుడూ జరగలేదని కరత్ ఎత్తిచూపింది ఈ విధమైన కొరతనే!
– టంకశాల అశోక్,
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
/ ‘సాక్షి’ సౌజన్యంతో /