వచ్చేస్తున్నా .. మీ రాష్ట్రంలోకి వచ్చేశా.. మీ ఊళ్లోకి…మీ ఇంట్లోకి వచ్చేస్తున్నా..! అంటూ తెగ సంబరపడుతూ గంతులేసుకుని ఓ ఇంటికొచ్చిన కరెంట్ ‘స్మార్ట్ మీటర్’తో…, ఆగాగు.. నీకంటే ముందే నేను ఇక్కడ ఉన్నాను. నీకంత సీను లేదు అన్నది ‘పాత కరెంటు మీటరు’.
నన్ను ఆపడానికి నీకు కాదు కదా? ఆ పైవాడికి కూడా సాధ్యం కాదు, నన్ను ఏరి కోరి మన దేశానికి, రాష్ట్రానికి తెచ్చుకుంటే మధ్యలో నీ గోల ఏంటీ..! అన్నది స్మార్ట్‌మీటర్.
నా కంటే నీ గొప్ప ఏంటీ..? ప్రశ్నించింది పాత మీటర్..? అలా అడుగు..నా గొప్పేంటో చెబుతాను. నేను అదాని (అదాని ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్) దత్త పుత్రికను, నేను న్యూ టెక్నాలజీతో చిప్ ఆధారంగా పనిచేస్తాను. రియల్ టైమ్ డేటా ఇస్తాను. దాన్ని బట్టి టైమ్ ఆఫ్ డే బిల్లింగ్ (ఏ సమయంలో కరెంటు ఎక్కువ వాడుతున్నారో ఆ సమయంలో కరెంటు రేట్లు పెంచుకోవచ్చు), ఇంట్లో ఏ వస్తువుకు ఎంత కరెంట్ వాడుతున్నారో డేటా ఇస్తాను. నా రీడింగ్ తీయడానికి మీటర్ రీడర్లు అవసరం లేదు, నన్ను ముందుగా మీ ముబైల్ ద్వారా రీచార్జ్ చేసుకోవాలి…! బిల్లు కట్టకపోతే ఫీజు పీకాల్సిన పనిలేదు, దానంతట అదే కరెంట్ ఆగిపోతుంది! అన్నిటికంటే సామాన్యులకు కునుకు లేకుండా చేస్తాను. నా కార్పొరేట్ సామ్రాట్‌కు కోట్లు కురిపిస్తాను..! నన్ను ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్ తదితర పెద్ద పెద్ద దేశాల్లో వాడుతున్నారు..! ఇంతకంటే నా గొప్ప ఇంకేం చెప్పాలి అన్నది స్మార్ట్‌మీటర్..!
ఓహో..నువ్వు ఆ సెకీ ఒప్పందంలో లంచమిచ్చి అమెరికా కోర్టులో అడ్డంగా దొరికిపోయిన అదాని పుత్రికవా..! నీ అదాని కహానీ నా దగ్గర చెప్పకు. ఇప్పటికే దేశంలో వనరుల్ని అప్పనంగా దోచుకుని అపర కుబేరుడైన మీ సారు… మన మోడీ సారుకు మంచి స్నేహితుడేగా… అందుకే నీకు ఈ ధైర్యం…! అన్నది పాతమీటరు.
మా అదానీ సారుకు తిరుగే లేదు… ఎన్ని కేసులున్నా…ఎన్ని ఆరోపణలున్నా.. చూసుకోవడానికి మహామహులు పైనున్నారు. అందుకే నీలాంటి పాతమీటర్లు బాగానే పని చేస్తున్నా… రివాంప్ట్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్‌డిఎస్‌ఎస్) ద్వారా దేశంలో 20 కోట్లు, రాష్ట్రంలో సుమారు 2 కోట్లు స్మార్ట్ మీటర్లు బిగించడానికి మా అదానీ సారుకే కాంట్రాక్టు ఇచ్చారు. ఇదేమైనా ఇప్పటి ఒప్పందం అనుకుంటున్నావా..! గతంలో జగన్ సారు ఉన్నప్పుడే వ్యవసాయ పంపుసెంట్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం ప్రారంభించారు అన్నది ‘స్మార్ట్ మీటర్’.
అప్పుడే కదా..బాబుగారి సన్ లోకేష్ బాబు నిన్ను ఎక్కడైనా బిగిస్తే పగలగొట్టమని చెప్పారు. గుర్తు లేదా?అని ఎదురు ప్రశ్న వేసింది పాత మీటర్..!
అప్పుడు పగులగొట్టమన్న సారే… ఇప్పుడు మొత్తం విద్యుత్ కనెక్షన్లన్నీ ఇళ్లతో సహా నాతో (స్మార్ట్‌మీటర్)నే నింపమని 3,713 కోట్లతో, వీటి తయారీ, సరఫరా, ఏర్పాటు, నిర్వహణ అన్నీ మా అదాని సారుతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అన్నది స్మార్ట్‌మీటర్..! అవునవును..? వీటిలో కూడా బోలెడంత అవకతవకలు జరిగాయని, అదాని సోలార్ ఎనర్జీ సెకీ ఒప్పందంలో జగన్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని నేడు బాబు గారు కూడా ఎక్కడా నోరు మెదపడకుండా ఉండిపోయారని లోకం కోడై కూస్తున్నది నీకు తెలియదా…అన్నది ‘పాత మీటర్’!
ఇంతకీ నన్ను ఎందుకు వద్దంటున్నావో తెలుసుకోవచ్చా… అన్నది స్మార్ట్‌మీటర్..!
నీలాంటి స్మార్ట్‌మీటర్లు మన లాంటి దేశాలకు ఇంకా అవసరం లేదు. ఎందుకంటే దేశంలో కరెంటంతా మీ అదాని సారు లాంటి ప్రైవేటు వారి చేతుల్లోకి పోయి, ప్రభుత్వ ధర్మల్ విద్యుత్‌ను నిర్వీర్యం చేసి, అవసరం లేకపోయినా అధిక రేట్లుకు కరెంట్ కొనడానికి మీ అదాని లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ప్రజలపై ఆ రేట్లు భారాన్ని రుద్దుతున్నారు. అందులో భాగంగానే సెకీ ఒప్పందంలో 2 వేల కోట్లు అవినీతి జరిగిందని జగమెరిగిన సత్యం..! ఆ అమెరికా కోర్టు కేసుతో మన పక్కనే ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, కెన్యా, లాంటి దేశాలు మీ అదాని సారుతో జరిగిన ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి. వాళ్లకున్న తెలివి కూడా మన వాళ్లకు లేకపాయే..! మన దేశంలో తన మిత్రుడికి ఎటువంటి నష్టం కలుగకుండా అక్కడ మోడీ సారూ… ఇక్కడ బాబుగారు ఇద్దరూ ఆ ఒప్పందాల్ని కొనసాగిస్తున్నారు అన్నది.. పాత మీటరు.
నీ స్మార్ట్ మీటర్ ఒకసారి బిగించారా..! జనాల జేబులకు చిల్లులే..! ఈ ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థలు ఏ అర్ధరాత్రి ఎంత కరెంటు చార్జీలు పెంచుతాయో తెలియదు. ఈ మీటరుకు 9 వేలు నుండి 13 వేల రూపాయల వరకు నెలవారీ బిల్లులో ప్రజలే చెల్లించాలి..! నిపుణులు చెబుతున్నట్లు ఈ స్మార్ట్‌మీటర్ల వల్ల మన ఆధార్, ఫోన్ నెంబర్లతో లింక్ పెట్టడం వల్ల వ్యక్తిగత గోప్యతకు ముప్పు, వీటిని ఎవరైనా హ్యాకింగ్ చేసి మన కరెంటు చోరీ చేసే అవకాశాలున్నాయి. ఈ మీటర్‌తో వచ్చే రేడియేషన్ ఫ్రీక్వెన్సీ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి…! ఈ స్మార్ట్‌మీటర్లు బిగించిన చోట్ల మీటర్లు గిర్రున తిరిగుతూ వందల్లో వచ్చే బిల్లులు వేలల్లోకి వెళ్లిపోయిన ఘటనలు అప్పుడే చూస్తున్నాం..! దీనిలో పెద్ద కుంభకోణం ఏమిటంటే.. ఇది ప్రజల అవసరం కోసం కాదు. అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికి, కరెంటు పెత్తనమంతా ప్రైవేటు వాళ్లకే అప్పజెప్పడానికే ఈ స్మార్ట్ మీటర్లు తెస్తున్నారు. అందుకే ఆ మోడీ సారు విద్యుత్ బిల్లు -2020ని తెచ్చి ప్రజలపై రుద్దారు..! ఇప్పటి వరకు పనిచేస్తున్న మీటర్ రీడర్లు వేలాది మందికి ఉన్న ఉపాధి పోయి రోడ్డున పడుతున్నారు. అనేక దేశాల్లో ఈ మీటర్లను వ్యతిరేకిస్తున్నారు. మన దేశంలో కూడా యు.పి. లాంటి చోట్ల వ్యవసాయానికి బిగించిన స్మార్ట్ మీటర్లు పీకి ప్రభుత్వ కార్యాలయాల్లో పడేసి నిరసనలు తెలిపారు. భవిష్యత్‌లో రైతులకిచ్చే ఉచిత కరెంట్‌కు, ఇతర సబ్సిడీలకు మంగళం పాడినట్లే..! ఇప్పటికే ప్రజలు గతంలో ఎప్పుడో వాడిన కరెంటుకు ట్రూ అప్, సర్ చార్జీల పేరుతో వాడిన కరెంటు కంటే ట్యాక్సులే ఎక్కువ కట్టాల్సి వస్తోంది. చిన్నా, చితక వ్యాపారాలు, పరిశ్రమలు ఈ బిల్లులు భరించలేక మూతబడి ఉన్న ఉద్యోగాలు పోతాయి..! నీ స్మార్ట్‌మీటర్ దెబ్బకు ఇది మరింత భారమై ప్రజలు మళ్లీ గుడ్డి దీపాలతో ఉండాల్సి వస్తుంది..! గ్రామాల్లో, పట్టణాల్లో ఈ బిల్లులు చెల్లించలేక ఉన్న వీధి లైట్లు పోయి చీకట్లో మగ్గాల్సి వస్తుంది…! కాబట్టి నీ లాంటి స్మార్ట్ మీటర్లు ఎవరి ప్రయోజనాల కోసం వచ్చాయో… వాటి వల్ల వచ్చే ప్రమాదాలేమిటో… స్మార్ట్‌మీటర్లు వద్దేవద్దని ఆ కమ్యూనిస్టులు ఇప్పటికే పెద్ద పోరాటం చేస్తున్నారు. నీ ఇ’స్మార్ట్’ బాగోతం బయట పడడం ఖాయం.. అన్నది పాత మీటర్…!
అబ్బా అనవసరంగా దీన్ని గెలికాను అని గొణుక్కుంటూ సైలెంట్ అయ్యింది స్మార్ట్ మీటర్!
నీ స్మార్ట్ మీటర్ ఒకసారి బిగించారా..! జనాల జేబులకు చిల్లులే..! ఈ ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థలు
ఏ అర్ధరాత్రి ఎంత కరెంటు చార్జీలు పెంచుతాయో తెలియదు. ఈ మీటరుకు
9 వేలు నుండి 13 వేల రూపాయల వరకు నెలవారీ బిల్లులో ప్రజలే చెల్లించాలి..! నిపుణులు చెబుతున్నట్లు ఈ స్మార్ట్‌మీటర్ల వల్ల మన ఆధార్, ఫోన్ నెంబర్లతో లింక్ పెట్టడం
వల్ల వ్యక్తిగత గోప్యతకు ముప్పు, వీటిని ఎవరైనా హ్యాకింగ్ చేసి మన కరెంటు చోరీ
చేసే అవకాశాలున్నాయి. ఈ మీటర్‌తో వచ్చే రేడియేషన్ ఫ్రీక్వెన్సీ వల్ల
ఆరోగ్య సమస్యలు వస్తాయి…!
– వి.వి.శ్రీనివాసరావు,
సెల్: 9490098799