అమెరికా దన్నుతో తెగబడుతున్న ఇజ్రాయిల్‌

Apr 4,2024 04:20 #artical, #editpage

గాజాలో పాలస్తీనియన్లపై మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయిల్‌ మొత్తం మధ్యప్రాచ్యం, పశ్చిమాసియాను రణరంగంగా మార్చాలని చూస్తున్నది. ఏప్రిల్‌ ఒకటవ తేదీన సిరియా రాజధాని డమాస్కస్‌ లోని ఇరాన్‌ కాన్సులేట్‌ భవనంపై దాడి చేసి పన్నెండు మందిని బలిగొనటమే దానికి పక్కా తార్కాణం. ఇద్దరు సీనియర్‌ కమాండర్లు, మరో ఐదుగురు మిలిటరీ సలహాదారులు, ఐదుగురు సిరియన్‌ పౌరులు ఆ దాడిలో మరణించారు. దీనికి బాధ్యురాలైన ఇజ్రాయిల్‌తో పాటు దాని వెనుక ఉన్న అమెరికా మీద కూడా తగిన చర్య తీసుకుంటామని ఇరాన్‌ ప్రకటించింది. ఆక్రమిత గోలన్‌ గుట్టల నుంచి ఎఫ్‌-35 యుద్ధ విమానాలతో ఆరు క్షిపణులను ప్రయోగించింది. ఒక దౌత్య కార్యాలయం మీద దాడి చేయటం అన్ని రకాల నిబంధనలు, సాంప్రదాయాలను ఉల్లంఘించటం తప్ప మరొకటి కాదు. ఆ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని, దాడికి వెళుతూ అస్పష్టంగా ఇజ్రాయిల్‌ ఉప్పందించింది తప్ప…వివరాలు చెప్పలేదని అమెరికా బుకాయించింది తప్ప… దాడిని ఖండించకపోగా, దాడితో సంబంధం ఉందని చెప్పి తమపై దాడులకు దిగితే ప్రతిదాడులు చేస్తామని బెదిరింపులకు దిగింది. రష్యా కోరికపై మంగళవారం సాయంత్రం భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపింది. ప్రతిదాడులు జరిపేందుకు తమకు హక్కు ఉందని ఇరాన్‌ ఈ సమావేశంలో స్పష్టం చేసింది. ఒక దేశ రాయబార కార్యాలయం మీద దాడి జరపటం అంటే ఆ దేశం మీద దాడిగానే చూస్తారు.
అమెరికా దన్నుతో తెగబడుతున్న ఇజ్రాయిల్‌ ఒకవైపు ఇరుగు పొరుగు దేశాల మీదనే కాదు గాజాలో మానవతాపూర్వక సాయం అందిస్తున్న విదేశీయుల మీద కూడా దాడులు చేసి చంపివేస్తున్నది. దాని చర్యల మీద ప్రపంచమంతటా తీవ్ర నిరసన వెల్లడి అవుతున్నది. హమాస్‌ తీవ్రవాదుల అణచివేత ముసుగులో ఆసుపత్రులను కూడా వదలకుండా దాడులు చేస్తున్నది. అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 33 వేల మంది ప్రాణాలు తీసింది, లక్షలాది మందిని గాయపరచింది. గాజాలోని నివాసాలన్నింటినీ నేలమట్టం గావిస్తున్నది. గాజా పౌరుల మీద జరుపుతున్న మారణకాండకు వ్యతిరేకంగా హైతీ, హిజబుల్లా సాయుధులు ఎర్ర సముద్రం నుంచి ఇజ్రాయిల్‌ వైపు ప్రయాణించే ఓడలు, ఇజ్రాయిల్‌ మీద దాడులు జరుపుతున్నారు. గాజా మారణకాండను తక్షణమే నిలిపివేయటం, పాలస్తీనా స్వతంత్ర రాజ్యాన్ని పునరుద్ధరించటం తప్ప మరో పరిష్కార మార్గం లేదు. అందుకు సిద్ధంగాని అమెరికా ఆ ప్రాంతంలో చిచ్చు రేపేందుకు కుట్రలు చేస్తున్నది. దానిలో భాగమే ఇరాన్‌ రాయబార కార్యాలయంపై దాడి. ఇది ఇరాన్‌ మీదనే కాదు, సిరియా సార్వభౌమత్వం మీద కూడా దాడిగానే ప్రపంచం చూస్తున్నది. ఉద్రిక్తతలను మరింత పెంచేందుకు తప్ప తగ్గించేందుకు ఇలాంటి చర్యలు తోడ్పడవు. అమెరికా, పశ్చిమ దేశాలు ఎందుకీ కుట్రలకు పాల్పడుతున్నాయన్నది ప్రశ్న.
చర్యకు ప్రతి చర్య లేకపోతే సామ్రాజ్యవాదులను నిలువరించటం కష్టం. రెండు ప్రపంచ యుద్ధాలు సామ్రాజ్యవాదుల మధ్య ప్రపంచాన్ని పంచుకొనే క్రమంలో వచ్చిన పేచీలతోనే జరిగాయి. ఆ రెండు యుద్ధాలలో పరస్పరం తలపడిన సామ్రాజ్యవాదులు ఇప్పుడు రాజీపడి ఏకమయ్యారు. తమను ప్రతిఘటిస్తున్నవారిని సహించలేకపోతున్నారు. కీలకమైన మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యవాదులకు చైనా, రష్యా, ఇరాన్‌ దగ్గర కావటం మింగుడుపడటం లేదు. ఓమన్‌ గల్ఫ్‌లో ఈ మూడు దేశాల నౌకాదళాలు సంయుక్తంగా సముద్ర భద్రత (మెరైన్‌ సెక్యూరిటీ బెల్ట్‌ 2024) పేరుతో భారీ విన్యాసాలు జరుపుతున్నాయి. వీటిలో రష్యా నుంచి వచ్చిన రెండు విమాన వాహక యుద్ధ నౌకలతో పాటు మూడు దేశాలకు చెందిన ఇరవై ఆధునిక యుద్ధ నౌకలు ఉన్నాయి. రాత్రి, పగలు నిర్వహించే విన్యాసాలలో ఉపరితల, గగనతల లక్ష్యాలను చేరుకొనే ఆయుధ ప్రయోగాలు జరుపుతారు. వీటికి పాకిస్తాన్‌, భారత్‌, కజకస్తాన్‌, అజర్‌బైజాన్‌, ఓమన్‌, దక్షిణాఫ్రికా నౌకాదళాల ప్రతినిధులు పరిశీలకులుగా ఉన్నారు. ఇవి 2019 నుంచి ఏటా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంతో, ఖండంతో సంబంధం లేని నాటో దేశాల కూటమి వీటికి పోటీగా ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన మూడు దశాబ్దాల తరువాత తొలిసారిగా ఈ ప్రాంతంలో విన్యాసాల పేరుతో బల ప్రదర్శన జరపనుంది. ఈ పరిణామాలను విడివిడిగా చూడలేము. అందుకే మధ్య ప్రాచ్యంలో మారణహోమానికి అమెరికా కూటమి తెర తీస్తున్నదని, దానిలో భాగంగానే ఇరాన్‌పై దాడి అని చెప్పాల్సి వస్తోంది.
– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️