లెబనాన్‌ ఆక్రమణ బాటలో ఇజ్రాయిల్‌

లెబనాన్‌పై వైమానిక, క్షిపణి దాడులు జరుపుతున్న ఇజ్రాయిల్‌ వాటిని మరింత తీవ్రం గావించేందుకు భూతల దాడులకు సిద్ధమౌతున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్య ప్రాచ్యంలో పరిమిత యుద్ధం కోసం తహతహలాడుతున్న ఈ ఉన్మాది చర్యలను యావత్‌ ప్రపంచమూ ఖండించాలి. దాని ప్రతికూల ప్రభావం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు. ఇటీవల అది జరిపిన పేజర్లు, వాకీటాకీల పేల్చివేత దాడులతో లెబనాన్‌లో ప్రబల శక్తిగా ఉన్న హిజ్బుల్లా సాయుధ సంస్థకు తీవ్ర ఎదురు దెబ్బలతో పాటు కొంత మంది ప్రముఖ నేతలను కూడా అది కోల్పోయింది. దానికి ప్రతీకారంగా శక్తివంతమైన ఖాదర్‌-1 క్షిపణితో తొలిసారిగా ఇజ్రాయిల్‌ రాజధాని టెల్‌అవీవ్‌ నగరం మీద దాడి చేసింది. అది ఖండాంతర క్షిపణి కాకున్నా ఆ లక్షణాలు కలిగిన శక్తివంతమైన ఆయుధంగా చెబుతున్నారు. ప్రమాద ఘంటికలను మోగించటంతో పది లక్షల మంది నగర పౌరులు రక్షణ కోసం కలుగుల్లోకి పరుగులు తీశారని వార్తలు, దాన్ని తిప్పికొట్టామని నెతన్యాహు యంత్రాంగం చెబుతున్నప్పటికీ ఉత్తర ఇజ్రాయిల్‌ ప్రాంతంలో ఇరవై లక్షల మంది పౌరులు ప్రాణాలు అరచేత పట్టుకొని ఎప్పుడేం జరుగుతుందో అన్న భయంతో ఉన్నారని, స్కూళ్లను మూసివేశారని వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు హిజ్బుల్లా గరిష్టంగా ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణించే క్షిపణులతోనే దాడులు జరిపింది. మూడు వందల కిలోమీటర్లు, అంతకు మించి దూరం, భారీ మొత్తాలలో పేలుడు పదార్థాలను మోసుకుపోగల క్షిపణులు దానికి ఇరాన్‌ సరఫరా చేసిందన్న వార్తలు, వాటిని ప్రయోగిస్తే ఏం జరుగుతుందనేది చర్చగా ఉంది. ఒకవేళ అదే జరిగితే దానికి ఇజ్రాయిల్‌, గాజా, వెస్ట్‌బాంక్‌ ప్రాంతాలలో అది జరుపుతున్న మారణకాండకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న దేశాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇరాన్‌ను రెచ్చగొట్టేందుకు ఇజ్రాయిల్‌ చేస్తున్న ప్రముఖుల హత్యలు, దాడులు తెలిసిందే. మధ్యధరా, ఎర్ర సముద్రాల్లో అమెరికా, బ్రిటన్‌ యుద్ధ నౌకలు దానికి కాపుగా సిద్ధంగా ఉన్నాయి. ఎంతగా రెచ్చగొట్టినా పశ్చిమ దేశాలలో వలలో పడకుండా ఇరాన్‌ నాయకత్వం సంయమనం పాటిస్తోంది. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఎంతకాలం అలా ఉండగలదనేది ప్రశ్న. అదేమీ మరొక దేశాన్ని ఆక్రమించుకొనేందుకు చూడటం లేదు. ఇజ్రాయిల్‌ దురాక్రమణలో ఉన్న పాలస్తీనా విముక్తి పొందాలని, అక్కడి పౌరులపై జరుపుతున్న మారణకాండను ఆపాలని మాత్రమే కోరుతోంది. దాని విముక్తి కోసం అన్ని విధాలుగా సాయపడుతోంది.
గాజాపై ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడులకు నిరసనగా ఎమెన్‌ లోని హైతీ సాయుధులు జరుపున్న దాడుల కారణంగా మధ్య ధరా-ఎర్ర సముద్రాలను కలుపుతూ తవ్విని సూయజ్‌ కాలువ ద్వారా అరేబియా సముద్రంలోకి ప్రవేశించే నౌకల రవాణాకు ఆటంకం కొనసాగుతోంది. నౌకలు ఆఫ్రికాను చుట్టి రావటం ఎంతో ఖర్చుతో కూడుకోవటమే గాక అధిక సమయం కూడా పడుతోంది. దీని వలన పడే భారాలను జనాలు మోయాల్సి వస్తోంది. గాజాలో జరుపుతున్న మారణకాండను ఇంతవరకు పశ్చిమ దేశాలు నివారించలేకపోయాయి. మరోవైపు లెబనాన్‌లోకి చొచ్చుకుపోయేందుకు ఇజ్రాయిల్‌ పూనుకుంది. అక్కడ ఉన్న హిజ్బుల్లా స్థావరాలన్నింటినీ ధ్వంసం చేస్తానంటోది. ఈ తరుణంలో హిజ్బుల్లాతో 21 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ అంటూ అమెరికా, ఫ్రాన్స్‌ ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. పాలస్తీనాపై శాశ్వత కాల్పుల విరమణ సంగతి తేల్చని ఈ దేశాలు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నట్లు? లెబనాన్‌ ఆక్రమణకు సర్వసన్నద్ధాలు చేసుకొనేందుకు, అవసరమైన ఆయుధాలను సమకూర్చుకొనేందుకు దానికి అవకాశం కల్పించే దుష్ట ఆలోచన కూడా లేదని ఎలా చెప్పగలం.
ఇప్పటికే ఇజ్రాయిల్‌ అన్ని రకాల నిబంధనలు, సాంప్రదాయాలను తోసిరాజని తెగబడుతోంది. అంతర్జాతీయ కోర్టు తీర్పులను ఖాతరు చేయటం లేదు. దాని మీద ఆంక్షలు విధించేందుకు భద్రతా మండలిలో వచ్చిన తీర్మానాలన్నింటినీ అమెరికా వీటోతో అడ్డుకొని కాపు కాస్తోంది. మరి కొద్ది రోజుల్లో గాజా మారణకాండకు ఏడాది నిండనుంది. కొద్ది రోజుల్లోనే హమాస్‌ సాయుధులను మట్టుపెడతామని చెప్పిన ఇజ్రాయిల్‌కు అది సాధ్యం కాలేదు. అలాంటిది హమాస్‌ కంటే ఎన్నో రెట్లు బలం కలిగిన హిజ్బుల్లాను లొంగదీసుకోవటానికి పూనుకోవటం దుస్సాహసానికి పాల్పడటమే అని అనేక మంది విశ్లేషకులు హెచ్చరిస్తున్నప్పటికీ ముందుకు పోతున్నారు. తన రక్షణ కోసం అవసరమంటూ గతంలో దక్షిణ లెబనాన్‌ను ఆక్రమించుకొని విధిలేక వెనక్కు వచ్చిన ఇజ్రాయిల్‌ పాఠాలు నేర్చుకున్నట్లు లేదు. యూదు దురహంకారులు మధ్య ప్రాచ్యాన్ని మంటల్లోకి నెడుతున్నారు. వారికి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు వంత పాడటం గర్హనీయం.

– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️