వందో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకను సమున్నతంగా ఎగురవేసిన ఇస్రోకు అభినందనలు. ఇస్రో అంటే కేవలం అంతరిక్ష పరిశోధనా సంస్థ మాత్రమే కాదు, భారతీయ మేధస్సు, సాంకేతిక నైపుణ్యంలో స్వావలంబనకు ప్రతీక. భారతీయుల స్వప్నాలను రెక్కలుగా మార్చి, విజయకేతనం ఎగురవేయడంలో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది సమిష్టి కృషికి తార్కాణం. ‘ఈ స్వప్నం నిజమౌతుంది/ ఈ స్వర్గం రుజువౌతుంది’ అంటారు మహాకవి శ్రీశ్రీ. చంద్రుడ్ని తాకిన చంద్రయాన్, అంగారకుడ్ని అన్వేషించిన మంగల్యాణ్, సూర్యుని రహస్యాలను శోధించిన ఆదిత్య-ఎల్1 వంటి విజయాల ద్వారా పట్టుదల వుంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయొచ్చని ఇస్రో చాటి చెప్పింది. విక్రమ్ సారాభారు, సతీశ్ ధావన్ వంటి దిగ్గజాల తొలి అడుగులతో ఆరంభించి, అబ్దుల్ కలామ్ వంటి వారి మేధస్సుతో వికసించి… ఐదు దశాబ్దాలకు పైగా సాగించిన చిరస్మరణీయ ప్రస్థానం… అద్భుతం, అమోఘం. 2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యం భారత్‌ది. అంతేకాదు… వచ్చే ఐదేళ్లలో రెండో సెంచరీ మార్కునూ చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం ఆహ్వానించదగిన పరిణామం.
దాదాపు ఆరు దశాబ్దాల క్రితం చిరుపాయలా మొదలైన భారత అంతరిక్ష పరిశోధనా కార్యక్రమం… ప్రారంభంలో అనేక బాలారిష్టాలను ఎదుర్కొని ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆకాశమంత ఎదిగింది. స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగిన ఇస్రో… శ్రీహరికోట రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి జిఎస్‌ఎల్‌వి ఎఫ్15 రాకెట్ ద్వారా ఎన్‌విఎస్-02 నేవిగేషన్ ఉపగ్రహాన్ని రోదసీలో నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ తాజా శాటిలైట్ ప్రయోగంతో మన ‘నావిక్’లో విధులు నిర్వహిస్తున్న ఉపగ్రహాల సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పెరిగింది. నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. అమెరికాకు చెందిన జిపిఎస్‌కు ఇది ప్రత్యామ్నాయం. భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకూ విస్తరించి వున్న ప్రాంతాల్లో వినియోగదార్లకు కచ్చితమైన స్థానం, వేగం, సమయం, వాహన చోదకులకు దిశానిర్దేశం, ఇంటర్నెట్‌తో అనుసంధానం వంటి ఎన్నో సేవలను అందించడం దీని ఉద్దేశ్యం. చాలా దేశాలు అమెరికా జీపిఎస్‌పై ఆధారపడితే, భారత్ మాత్రం ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌లో స్వశక్తితో నిలబడేందుకు కృషి చేస్తోంది. ఇటీవల అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించే (డాకింగ్ చేసే) స్థాయికి ఇస్రో చేరడం చరిత్రలో లిఖించదగ్గ మరో మలుపుగా చెప్పొచ్చు.
1962లో అణుశక్తి విభాగం కింద ఏర్పడిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ద్వారా ఇస్రోకు బీజం పడింది. 1972లో అంతరిక్ష శాఖ ప్రత్యేకంగా ఏర్పాటైంది. 1979 ఆగస్టు 10న ఉపగ్రహ ప్రయోగనౌక (ఎస్‌ఎల్వీ-3 ఈ10) ద్వారా రోహిణి టెక్నాలజీ పేలోడ్‌ను ప్రయోగాత్మకంగా నింగిలోకి పంపింది. 1980నాటికి సొంతగా రోహిణి శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపడం ద్వారా అటువంటి ఘనత సాధించిన ఆరో దేశంగా భారత్ నిలిచింది. ఒకప్పుడు సాంకేతిక విజ్ఞానాన్ని అందించడానికి నిరాకరించిన అగ్రరాజ్యానికి దీటుగా ఎదిగిన ఇస్రో ప్రయాణం అనితరసాధ్యం. ఇప్పటివరకూ 548 శాటిలైట్లను కక్ష్యలోకి చేర్చిన ఇస్రో… 2040నాటికి చందమామ పైకి మనిషిని పంపేందుకు తీవ్రమైన కసరత్తే చేస్తోంది. మరోవైపు భారతదేశ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి నావిక్-01, నావిక్-02 ఉపగ్రహాలను ప్రయోగించింది. మరో మూడు ఉపగ్రహాలను త్వరలో ప్రయోగించనుంది.
రానున్న రోజుల్లో మరిన్ని చారిత్రాత్మక ఘట్టాలకు ఇస్రో చోదకశక్తి కానుంది. ఇస్రో ఇటీవల నింగిలోకి పంపిన ‘ఉరు శాట్’ ఉపగ్రహం పూర్తిగా కేరళ మహిళల కృషి ఫలితం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల ముందంజకు ఇదొక నిదర్శనం. ఈ విజయాలు భారతీయ యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాలు. ఇస్రో ప్రతి ప్రయోగం దేశ ఆర్థిక, సాంకేతిక, శాస్త్రీయ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సూచికలు. ‘నేను సైతం/ భువన భవనపు/ బావుటానై పైకిలేస్తాను’ అని శ్రీశ్రీ అన్నట్టుగా ఈ విజయాలు అందించిన స్ఫూర్తితో ఇస్రో మున్ముందుకు సాగాలి.