దాదాపు నలభై అయిదేళ్లుగా కుల, మతాలకు అతీతంగా అందరికీ అన్నం పెడుతున్న ఓ అన్నదాన సత్రాన్ని, ఆశ్రమాన్ని కడప జిల్లాలో కూల్చివేశారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని పదే, పదే ప్రకటనలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని అటవీ శాఖ అధికారులు కడప జిల్లాలో ఈ ఆశ్రమాన్ని కూల్చివేశారు. ‘కాశినాయన జ్యోతి క్షేత్రం’గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం నల్లమల అడవిలో ఉంది. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం, కాశినాయన మండలం పరిధిలో ఈ క్షేత్రం నెలకొల్పబడింది. ఒక మండలమే ఆయన పేరుతో ప్రసిద్ధి చెందిందంటే ఈ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుంది.
అవధూత కాశినాయన 1995లో ఇక్కడ సమాధి కావించబడ్డారు. ఆయన హయాంలోనే ఈ ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అన్నదానం చేసేవారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ప్రాశస్త్యమైందని, దీన్ని అందరూ పాటించాలని ఉపదేశాలు ఇచ్చేవారాయన. కాశీ అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించి ఆకలితో జీవులు ఉండకూడదన్న సంకల్పంతో కడుపు నిండా అన్నం పెట్టడమే తన లక్ష్యంగా ఈ ఆశ్రమాన్ని నడిపారు. గత 45 ఏళ్లుగా ఈ అన్నదాన సత్రం లక్షల మంది ఆకలిని తీర్చింది. రోజురోజుకు వృద్ధి చెందుతూ అక్కడ భోజనం చేసే అన్నార్తుల సంఖ్య వేల నుంచి లక్షలకు చేరింది. కాశినాయన జ్యోతి క్షేత్రంలో తొమ్మిది ఆలయాలు ఉన్నాయి. కాశీ అన్నపూర్ణా దేవి ఆలయాన్ని కాశినాయన ప్రతిష్ట చేయగా అనంతర కాలంలో మిగతా వాటిని భక్తులు నిర్మించారు. కాశినాయనకు గోవులంటే అమితమైన ప్రేమ. ఆయన సంస్మరణార్థం గోవులను సంరక్షించడానికి పెద్ద గోశాలను నడుపుతున్నారు.
కాశినాయన జ్యోతి క్షేత్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమం అన్నదానం. ప్రతిరోజు ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడి ఆశ్రమ నిర్వాహకులు ఉదయం 3:30 గంటల నుంచి ఈ పనుల్లో తలమునకలై ఉంటారు. ఇక్కడ భోజనం చేయడానికి కుల, మతాలను పట్టించుకోరు. ఏ ప్రాంతం వారన్నది చూడరు. ఎన్ని రోజులు ఉంటారని అడగరు. ఎవరైనా ఎప్పుడైనా రాత్రయినా, పగలైనా ఎప్పుడూ భోజనం అందుబాటులో ఉండేలా ఆశ్రమ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన వర్ధంతి రోజున మూడు లక్షల మందికి పైగా ఇక్కడ భోజనాలు చేస్తుంటారు. ఈ క్షేత్రం సేవకు తోడ్పడేందుకు ఆర్యవైశ్యులు ఓ సత్రాన్ని, రెడ్డి సంఘం వారు ఓ సత్రాన్ని, రజకులు, కుమ్మరులు రెండు సత్రాలను నిర్మించారు. రజకులు, కుమ్మరులు నిర్మించుకున్న సత్రాలను అటవీ అధికారులు కూల్చివేశారు. 500 ఆవులున్న గోశాలను ఇక్కడి నుంచి కూటమి ప్రభుత్వం బలవంతంగా తరలించింది. ఇక్కడి శిల్ప సంపద కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రజలు తండోప తండాలుగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటిన్లలో అందించే భోజనం కంటే 100 రెట్లు ఎక్కువ నాణ్యతతో ఇక్కడ ప్రజలకు ఉచితంగా అందిస్తుంటారు. అలాంటి ఉచిత అన్నదాన సత్రాన్ని, ఆశ్రమాన్ని ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం కూల్చివేసింది.
సనాతన ధర్మానికి దన్ను తానేనని అదేపనిగా చెప్పుకునే పవన్ కల్యాణ్ నేతృత్వంలోని అటవీ విభాగం వారు ఈ ఆశ్రమంపై దాడికి పాల్పడి బుల్డోజర్లతో కూల్చివేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాశినాయన క్షేత్రాన్ని ఎంతో పవిత్రంగా భావించి అభివృద్ధి పరచుకున్నామని కూటమి ప్రభుత్వం కూలగొట్టడాన్ని తమ మనోభావాలపై దాడిగా ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. దీంతో అన్ని రాజకీయ పక్షాలు, వివిధ ధార్మిక సంఘాలు ఈ సమస్యపై గళమెత్తాయి. అన్నమాచార్య పీఠాధిపతి విజయ శంకర స్వామి, అచలానంద ఆశ్రమ పెద్దలు ఈ ప్రాంతాన్ని సందర్శించి తమ ఆవేదనను వెల్లడించారు. అన్నదాన సత్రంపై, హిందూ ధార్మిక క్షేత్రంపై జరిగిన దాడికి వ్యతిరేకంగా 17వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వేలాది మందితో నిరసన తెలియజేస్తున్నట్టు విజయ శంకర స్వామి ఓ ప్రకటన చేశారు. ప్రకటన వెలువడిన తరువాత మంత్రి లోకేష్ జరిగిన ఘటనకు క్షమాపణ చెబుతున్నానని, సొంత నిధులతో కూలిన నిర్మాణాలను తిరిగి నిర్మిస్తామని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని నష్ట నివారణ ప్రకటన చేశారు. ఇదే అంశంపై దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కాశినాయన జ్యోతి క్షేత్రం టైగర్ జోన్ పరిధిలో ఉన్న కారణంగా అటవీ శాఖ అధికారులు తమకు తెలియకుండానే కూల్చివేతలకు సిద్ధమయ్యారని, దీనిని నివారించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని వెల్లడించారు. ఇదే అంశంపై పలువురు ప్రజాప్రతినిధులు శాసనసభలో తమ గళాన్ని వినిపించారు.
ఈ కూల్చివేతలను అడ్డుకోవాల్సిన…తనను తాను సనాతనవాదిగా ప్రకటించుకున్న…ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇంతవరకు నోరు మెదపక పోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రికి తెలిసే ఈ కూల్చివేతలు జరిగాయని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానాలు చేశారు. హిందూ ధర్మ రక్షకులమంటూ లక్షల మందితో విజయవాడలో కోట్లాది రూపాయల ఖర్చులతో భారీ సభలు నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్, వీటితో అంటకాగుతున్న బిజెపి నోరు తెరవకపోవడం విచిత్రం. తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో తీవ్రంగా స్పందించి దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ నేరుగా ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ శాఖలో ఈ స్థాయిలో కూల్చివేతలు జరుగుతుంటే మౌనంగా ఎందుకు ఉన్నట్టో అర్థం కాదు.
పాలకులు అరణ్యాలను అదానీలకు కట్టబెడుతున్న కాలంలో, గిరి పుత్రులను అటవీ ప్రాంతాల నుంచి తరిమివేసి భూగర్భ ఖనిజాలకై తాపత్రయ పడుతున్న నేపథ్యంలో…కాశినాయన క్షేత్రంలో జరుగుతున్న కూల్చివేతల వెనుక టైగర్ జోన్ల సమస్య కంటే కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు జరుగుతున్న కుట్రగా పలువురు భావిస్తున్నారు. హిందుత్వ-కార్పొరేట్ బంధం ఇలాంటి సమయంలో మరింత స్పష్టంగా అవగతమవుతుంది.
– వ్యాసకర్త : కందారపు మురళి
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు,
సెల్: 9490098840