పుస్తకాల బరువు కాదు… మేధస్సు పెరగాలి!

Jun 9,2024 05:55 #books, #school, #students

రాష్ట్రంలో 50 రోజుల వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు జూన్‌ 12న పున:ప్రారంభం కానున్నాయి. ఒకప్పుడు వేసవి సెలవులంటే…పిల్లలకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలుండేవి. అమ్మమ్మ, నానమ్మ ఊళ్లకు వెళ్లి…ఆట పాటలతో సరదా సరదాగా గడిచిపోయేది. ఇప్పటి పిల్లలకు అలాంటి సరదాలు లేవు. 24 గంటల్లో నిద్రపోయే ఆ కాస్త సమయం తప్ప మిగతా సమయమంతా టీవీలు, మొబైల్‌ ఫోన్లు, ఐపాడ్‌లకు అతుక్కుపోతున్నారు. అద్భుతంగా గడపాల్సిన బాల్యం యాంత్రికంగా మారిపోయింది. పదవ తరగతి, ఇంటర్‌ చదివే పిల్లల పరిస్థితి చూస్తే జాలేస్తుంది. ఇల్లు, కోచింగ్‌ సెంటర్లు తప్ప మరో ధ్యాస వుండదు. విద్య కార్పొరేటీకరణ అయిన తర్వాత ఈ ధోరణులు బాగా పెరిగిపోయాయి. దీంతో వేసవి సెలవుల ఉద్దేశమే దెబ్బతింటోంది. ఇలా వుంటే పిల్లల్లో సాంఘిక జీవనం ఎలా పెంపొందుతుంది? మానసికోల్లాసం, శారీరక దారుఢ్యం ఎలా పెరుగుతుంది? ఆటపాటలు, పత్రికలు, నీతికథలు, ప్రముఖుల జీవిత చరిత్రలు చదివించడం, నృత్యం, చిత్రలేఖనం, సంగీతం, స్విమ్మింగ్‌ వంటి వాటిల్లో పిల్లల అభిరుచులను బట్టి ప్రోత్సహించడం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బాధ్యత.
‘మనిషి జీవితానికి వెలుగునిచ్చి, మనోవికాసానికి తోడ్పాటునిచ్చేది విద్య మాత్రమే’ అంటారు స్వామి వివేకానంద. నేడు ఇందుకు భిన్నంగా జరుగుతోంది. భుజాలు ఒంగిపోయేలా పుస్తకాల బ్యాగ్‌లతో కిక్కిరిసిన ఆటోలోనో, బస్సులోనో ప్రయాణం- ఇలా ఉరుకులు పరుగులతో జీవితం సాగిపోతోంది. పదేళ్లు కూడా నిండని పిల్లలు 8 నుంచి 10 కిలోలకు పైగా బరువున్న పుస్తకాల బ్యాగ్‌లు మోయాల్సి వస్తోంది. అమ్మకి ఇష్టమైన సబ్జెక్టు అనో, నాన్నకి నచ్చిన సబ్జెక్ట్‌ అనో తమకు ఇష్టమున్నా లేకున్నా బట్టీ పట్టాల్సిందే. ఒకటో తరగతి చదువుతున్న బుడ్డోడి స్కూల్‌ బ్యాగ్‌ బరువు 8 కిలోలు. ఉదయం, సాయంత్రం ఆ బాగ్‌ మోయడానికి వాళ్ల అమ్మ రావాల్సిందే. పదో తరగతి పిల్లల బ్యాగ్‌లైతే 10 నుంచి 12 కిలోలు. ఈ బరువులు మోయలేక చిన్నారి వెన్నెముకలు వంగిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇవన్నీ ఒక ఎత్తయితే… మోయలేని ఫీజుల భారంతో చిన్న జీవితాలు చితికిపోతున్నాయి. ఇంకా చిత్రం ఏంటంటే…టెన్త్‌ చదువుతున్న కూతురు ‘టీచర్‌ అవుతాను’ అంటే-‘మన హోదాకు టీచర్‌ కావడం ఏంటి?’ అని ఎంపీసీలో చేర్పించారు. ఆ అమ్మాయి ఆ లెక్కలు చెయ్యలేక తల్లిదండ్రులకు చెప్పలేక కుమిలిపోయింది. దీనికి బాధ్యులెవరు? పిల్లలపై తమ అభీష్టాలను రుద్ది, వారిని తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురిచేయడం కన్నా వారికి నచ్చిన సబ్జెక్టునే తీసుకునేలా చూడటం మంచిది. ‘తాము సాధించలేని లక్ష్యాలను సాధించే ‘పనిముట్లు’గానో, తమ వారసత్వాన్ని కొనసాగించే ‘సొత్తు’గానో తల్లిదండ్రులు భావిస్తున్నారా… అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి’ అంటారు పద్మశ్రీ ప్రొఫెసర్‌ శాంతాసిన్హా. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ప్రశ్న ఇది.
జీవితం ఒక సజీవ స్రవంతి. దాని ప్రవాహం సర్వదా ముందుకే. అది అంతకంతకూ విశాలమౌతుండాలి. అంతకంతకూ పరిణతి చెందాలి. కానీ, కార్పొరేట్‌ సంస్కృతి పుణ్యమా అని విద్యాసంస్థల్లో పేద, ధనిక అంతరాలు పెరిగిపోతున్నాయి. విద్యా, వైద్యం అందని ద్రాక్షలా మారింది. పేదలకు ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వాలు- కార్పొరేట్‌ సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నాయి. బాల పొంగు- పాల పొంగు అన్నారు. ఆ పొంగు వృధా పోకుండా దేశానికి జీవనాడి కావాలంటే… విద్యా, వైద్య వ్యవస్థల్లో సమూల మార్పులు రావాలి. ఈ రెండు వ్యవస్థలు ప్రభుత్వాధీనంలో నడవాలి. పిల్లల భుజాలపై పుస్తకాల బరువును కాదు… వారి మేధస్సును పెంచే విద్యావిధానం కావాలి. పిల్లలను వ్యక్తులుగాను, సంఘజీవులుగానూ తీర్చిదిద్దాలి. ప్రతి పాఠశాల మాతృమూర్తి ప్రేమతో పెరగాలి. కామన్‌ స్కూల్‌ సిస్టమ్‌ వుండాలి. సంస్కృతీ శిఖరాలను అధిరోహించాలి. సంశోధించవలసింది సముద్రమైనా వెనుదిరిగేదిలేదు… అన్నట్లుగా భవిష్యత్తరాలను తీర్చిదిద్దాలి. ఈ బాధ్యత ప్రభుత్వాలతో పాటు తల్లిదండ్రులకూ వుంది.

➡️