ఎండాకాలం…పరీక్షల కాలం కట్టకట్టుకుని ఒకేసారి వస్తాయి. ఎండాకాలం అంటే ఉష్ణోగ్రతలు పెరిగే కాలం. పరీక్షల కాలం అంటే ఒత్తిడి పెరిగే సమయం. వీటితో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా పెద్ద సవాళ్లను ఎదుర్కొంటారు. మార్చి 15తో ఇంటర్ పరీక్షలు ముగియనుండగా, 17 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమై ఈనెల చివరివరకూ కొనసాగుతాయి. పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే, ఈ రోజుల్లో పరీక్షలు విద్యార్థులపై అత్యధిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. పరీక్షా ఫలితాలు వారి భవిష్యత్‌ను నిర్ణయిస్తాయన్న భావన వల్ల విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఈ ఒత్తిడి వల్ల కొందరు విద్యార్థులు మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. సమాజంలో వున్న పోటీ భావన, ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్ల అధిక అంచనాలు ఒత్తిడికి గురిచేస్తున్నాయి. అయితే, సరైన ప్రణాళిక, సమర్థవంతమైన అధ్యయనం, ఆరోగ్య సంరక్షణ ద్వారా ఈ కాలాన్ని సులభంగా ఎదుర్కోవచ్చు. జీవితంలో విజయం సాధించడానికి క్రమశిక్షణ, శ్రమ, ఆత్మవిశ్వాసం అవసరం. మార్కులు తక్కువ వచ్చినవారు, తరగతి గదిలో మొద్దబ్బాయిలుగా ముద్ర పడినవారు…జీవితంలో గొప్ప విజయాలు సాధించిన ఉదాహరణలు అనేకం వున్నాయి. విద్య యొక్క వేర్లు చేదుగా వుంటాయి. కానీ, దాని ఫలాలు తీపిగా వుంటాయి.
ఈసారి మార్చి మొదటివారం నుంచే ఎండలు, వడగాడ్పుల తీవ్రత కూడా ఎక్కువగానే వుంటుందని నిపుణులు చెబుతున్నారు. వెంటిలేషన్ లేని గదులు, రేకుల షెడ్లలో పరీక్షలు రాసే విద్యార్థులు అప్రమత్తంగా వుండాలని, ఏమాత్రం అజాగ్రత్త వహించినా వడదెబ్బ బారిన పడే ప్రమాదం వుందని చెబుతున్నారు. దీనికితోడు పిల్లలు… ఏం చదవాలి? ఎలా చదవాలి? అన్న టెన్షన్‌తో సరిగ్గా తినలేరు, నిద్రపోలేరు. ఆ తర్వాత కూడా పాస్ అవుతామో, ఫెయిల్ అవుతామోనన్న భయం వారిని వెంటాడుతుంటుంది. తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి, పెద్దపెద్ద ఉద్యోగాలలో స్థిరపడాలని, తాము సాధించలేనిది తమ పిల్లల ద్వారా సాధించాలని కలలుగంటారు తల్లిదండ్రులు. వారి ఆశలను, ఉపాధ్యాయులు మెడకు తగిలించే ర్యాంకుల గుదిబండను మోయలేక, వాటిని నెరవేర్చుతామో లేదోనన్న ఆత్మన్యూనతా భావంతో, క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ‘చదువురాని వాడినని దిగులు చెందకు/ ఏమి చదివి పక్షులు పైకెగర గలిగెను/ ఏ చదువు వల్ల చేపపిల్ల ఈద గలిగెను’ అంటారో కవి. కార్పొరేట్ స్కూళ్ల ర్యాంకుల మాయాజాలంలో కొట్టుకుపోకుండా… తమ బిడ్డల ఆసక్తిని గుర్తించి, ప్రోత్సహించాలి. ఎవరో ఏదో చేశారని, మనవాడూ అదే చెయ్యాలన్న అతి అంచనాలకు పోతే, బిడ్డలపై శక్తికి మించిన భారం మోపినట్లవుతుంది.
అదే సమయంలో పరీక్షలకు భయపడాల్సిన పనిలేదు. పరీక్షలు, మార్కులు మాత్రమే మనిషి జీవితాన్ని నిర్ణయించవు. అవి జ్ఞానానికి ఒక అంచనా మాత్రమే. శక్తి మేరకు కృషి చేయడం ముఖ్యం. ప్రతి విజయం-ప్రయత్నించాలనే నిర్ణయంతోనే మొదలవుతుంది. విజయం రాత్రికి రాత్రే లభించదు. ‘విజయం సాధించడమే అంతిమం కాదు, వైఫల్యం ప్రాణాంతకం కాదు… కొనసాగించాలనే పట్టుదలే ముఖ్యం’ అంటారు విన్‌స్టన్ చర్చిల్. విద్యార్థులు ర్యాంకులు తెచ్చే యంత్రాలు కాదు. పోటీతత్వం వారిని యాంత్రికంగా మార్చేస్తోంది. చదువొక్కటే కాదు… ఆటపాటలతో పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా పెరిగే వాతావరణం కూడా అవసరం. ‘మనసు నింపాల్సిన పాత్ర కాదు… రగిలింపజేయాల్సిన నిప్పు’ అంటారో కవి. ఇవాళ ఓడినా… రేపు గెలుస్తామన్న ఆశను మనసులో రగిలించాలి. అది తమ లక్ష్యం కోసం నిరంతరం శ్రమించేలా, పరితపించేలా చేస్తుంది. ఒకవేళ పరీక్షలలో ఫెయిల్ అయినా… నిరుత్సాహపడాల్సిన పనిలేదు. వారికి ఆసక్తి వున్న రంగంలో ప్రోత్సహించాలి. ప్రపంచంలోని ఏ మారుమూలనున్న ఇంట్లోనైనా రాత్రవగానే స్విచ్ వేస్తే… ఎలక్ట్రిక్ బల్బు వెలుగులు విరజిమ్ముతుంది. చిన్నతనంలో మొద్దబ్బాయిగా ముద్రపడి, ఆ తర్వాత గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగిన థామస్ ఆల్వా ఎడిసన్ ఆ బల్బును కనుగొన్నారు. ప్రతి ఒక్కరిలోనూ నిగూఢంగా గొప్ప శక్తి దాగివుంటుంది. దాన్ని గుర్తించి, వెలికితీయగలిగితే… ప్రతి విద్యార్థీ ఒక ఎడిసన్‌లా ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు.