రజాకార్లను రక్షించిన యూనియన్‌ సైన్యం 

Mar 28,2024 04:15 #editpage

రజాకార్‌ చిత్ర నిర్మాతలు దానికి టాగ్‌లైన్‌గా ‘హిస్టరీ రీ రిటెన్‌’ అని పెట్టుకొన్నారు. ఆ చిత్రం చరిత్రను తిరగ రాయలేదు. నిజానికి తిరగేసి రాసింది. అవాస్తవాలను చరిత్రలో జోడించే దుస్సాహసం చేసింది. సినిమాలో చూపినట్లు రజాకార్లు యూనియన్‌ సైన్యం పై తిరగబడలేదు. నిజాం నవాబులాగే వారూ లంగిపోయారు. మరాఠ్వాడ జిల్లాల్లో రక్తపాతం జరిగిన మాట వాస్తవమే కాని అది ప్రతిఘటన వల్ల జరగలేదు. అప్పటి ఉస్మానాబాదు జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ హైదర్‌ రాసిన పుస్తకంలో ఈ విషయం స్పష్టంగా రాశారు. యూనియన్‌ సైన్యాలు హైదరాబాద్‌ స్టేట్‌ లోకి వస్తున్నాయని తెలిసి ఆయన స్వయంగా హైదరాబాదుకు వచ్చి నిజాంను, అప్పటికి ఇంకా ప్రధానిగా ఉన్న లియాకత్‌ అలీని కలిసి తాను ఏమి చేయాలో ఆదేశించమని కోరాడు. అప్పటికే యూనియన్‌ ప్రభుత్వంతో ఒప్పందానికి వచ్చిన ఎలాంటి ఆదేశం ఇవ్వలేదు. ఆ స్థితిలో తన కింద ఉన్న బలగాలకుజిల్లా కలెక్టర్‌గా ఆయన ఆదేశం జారీ చేయలేదు.
హైదరాబాద్‌ నగరంలో యూనియన్‌ సైన్యాలను ప్రజలు హర్షోల్లాసాలతో స్వాగతించారు. ఒప్పందం ప్రకారం యూనియన్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ రాజ్యాన్ని విలీనం చేసుకొని నిజాంను రాజ ప్రముఖ్‌గా నియమించింది. రాజప్రముఖ్‌గా నిజాం ఆదేశాల ప్రకారమే హైదరాబాద్‌ పరిపాలన 1952లో ఎన్నికలు జరిగే వరకు కొనసాగింది. 1971లో ఇందిరా గాంధీ రాజభరణాలు రద్దు చేసే వరకు నిజాంకు రాజభరణం అందింది. నిజాం అకృత్యాలపై ఎలాంటి విచారణ జరగలేదు. రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీని అరెస్టు చేసి మలక్‌పేటలోని మహబూబ్‌ మాన్షన్‌ (భవంతి)లో వుంచారు. కాశీం రజ్వీకి అండదండలు అందించిన ప్రధాని లియాకత్‌ అలీని గృహ నిర్బంధంలో ఉంచారు. అతను అనారోగ్యం పేరుతో నాటకమాడి అంబులెన్సు ద్వారా తప్పించుకొని పాకిస్తాన్‌ ఉడాయించాడు. యూనియన్‌ సైన్యం లాలూచీ లేకుండా అది సాధ్యం కాదు. కాశీం రజ్వీని కూడా కొంతకాలం తర్వాత పాకిస్తాన్‌ పంపారు. తెలంగాణ ప్రజలపై భయంకరమైన హింసాకాండ సాగించి వేలమంది హత్యలకు అత్యాచారాలకు కారకుడైన రజ్వీ వంటి దుర్మార్గుడికి లభించాల్సిన శిక్ష పడలేదు. రజ్వీ పోకడలను వ్యతిరేకించిన కలెక్టర్‌ హైదర్‌కు మాత్రం జైలు శిక్ష పడింది. కోర్టులో రజ్వీ తరపున వాదించే న్యాయవాదికి ప్రభుత్వమే ఫీజు చెల్లించింది. భూమి రక్షించుకోవడానికి పోరాడుతున్న రైతులు 2,500 మంది యూనియన్‌ సైన్యాలు చంపేశాయి. భూములను మళ్లీ భూస్వాముల పరం చేశాయి. వాస్తవ చరిత్రను చెప్పాలనే ఉద్దేశమే ఉంటే ‘రజాకార్‌’ చిత్రంలో ఇవన్నీ చూపెట్టేవారు కాని ముస్లింల పట్ల ద్వేషం రెచ్చగొట్టడమే తమ సంకుచిత రాజకీయ లక్ష్యం గనుక…వాస్తవ ఘటనలకు మసిబూసి అబద్దాలను జనం ముందుంచడానికి ప్రయత్నించారు. నిజాంకు జాగీర్దారీ దొరలతో మంచి దోస్తానా ఉండింది. దొరల నుండి విలువైన కానుకలు అందేవి. అందమైన మహిళలను కూడా దొరలు నిజాంకు నజరానాగా బహూకరించేవారు. నిజాం పేర వసూల్‌ చేసే భూమి శిస్తులో దొరలు కొంత పంపి మిగతా డబ్బును తమ భోగవిలాసాలకు తమ స్వంత గూండాల సైన్యంతో పాటు నిజాం అధికార్లను మేపడానికి వాడేవారు. ప్రజలను జంతువుల కంటే హీనంగా చూసేవారు. ప్రశ్నించే వారిని చంపేసేవారు. సాధారణ ఎన్నికల ముందు హిందువుల ఏమార్చి ఓట్లను కొల్లగొట్టడానికి చేసిన ప్రయత్నమే ‘రజాకార్‌’ మొదట కాంగ్రెస్‌లో ఉండి వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత బిజెపి లోకి జంప్‌ అయిన గూడూరు నారాయణ రెడ్డి ఆ చిత్ర నిర్మాత. తెర వెనుక నుండి కథ నడిపింది మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సిహెచ్‌ విద్యాసాగరరావు వగైరా. కాశ్మీర్‌ ఫైల్స్‌, కేరళ స్టోరీస్‌ పరంపరలో రజాకార్‌ మరొకటి.
తెలంగాణలోని జాగీర్దార్లకు, వారికి అండగా నిల్చిన నిజాంకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ స్టేట్‌లో వివిధ రూపాల్లో ప్రతిఘటనా పోరాటాలు సాయుధ పోరాటానికి ముందే మొదలయ్యాయి. గ్రంథాలయోద్యమం, ఆంధ్ర జనసభ, ఆంధ్ర మహాసభ ఆ ప్రతిఘటనల్లో భాగంగా ముందుకొచ్చాయి. తెలుగులో చదువుకొనే, కనీసం సభల్లో మాట్లాడే అవకాశం లేని స్థితిలో ఆంధ్రజనసభ ఆ తర్వాత ఆంధ్రమహాసభ ఆవిర్భవించాయి. తెలంగీ బేడంగీ (తెలుగు భాష పద్దతీ పాడూ లేనిది) అన్న నిజాం తైనాతీల ఎగతాళి మాటలు తెలుగు మాట్లాడే వారి ఆత్మ గౌరవాన్ని కించపరిచాయి. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని చదువులు కూడా కేవలం ఊర్దూలో ఉండటం వల్ల తెలుగు వారికే కాదు హైదరాబాద్‌ రాష్ట్రంలోని మరాట్వాడ ప్రాంతం లోని మరాఠీ ప్రజలకు, ఉత్తర కన్నడ జిల్లాల్లోని కన్నడిగులకు కూడా ఈ దుస్థితి మింగుడు పడలేదు. ఆంధ్రమహాసభ లోని కమ్యూనిస్టులు ప్యూడల్‌ వ్యతిరేక పోరాటాన్ని మహాసభ వేదిక పైకి ఎప్పుడైతే తెచ్చారో అప్పుడు మహాసభలోని భూస్వామ్య అనుకూల వర్గాలు బెంబేలెత్తి మహాసభ నుండి చీలిపోయారు. ఆ తర్వాత వారి పోరాటాలు అంతగా కన్పించవు.
ఆ తర్వాత ఆంధ్రమహాసభ మహోద్వేగంతో ముందుకు సాగింది. జమిందారీ వ్యతిరేక పోరాటం ఉధృతమైంది. జాగీర్దార్ల అరాచకాలకు వ్యతిరేకంగా స్వీయ రక్షణ కోసం రైతులు, కూలీ జనం ఆయుధాలను చేపట్టారు. క్రమంగా పోరాటం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోకి వెళ్లింది. నల్గండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని విస్తారమైన ప్రాంతం మూడు వేల గ్రామాలు జాగీర్దారీ భూస్వామ్య పాలన నుండి విముక్తి అయ్యాయి. పదిలక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. 1946 నుండి 1951 వరకు జరిగిన ఆ పోరాటంలో నాలుగు వేల మంది తమ ప్రాణాలడ్డారు. రజాకార్లు నిజాం సైన్యం దొర గూండాల చేతుల్లో 1500 మంది చనిపోయారు. రైతులు, వివిధ వృత్తులవారు చేసిన పోరాటాన్ని అణచడానికి జాగీర్దార్ల గుండాల పాటు రజాకార్లు సామాన్య ప్రజలపై చెప్పలేని అఘాయిత్యాలకు, క్రూర చర్యలకు పాల్పడ్డారు. సినిమాలో చూసిన అకృత్యాలన్నీ రజాకార్లు హిందూ ఫ్యూడల్‌ దొరల సైన్యాలతో కలిసి చేసినవే. దొరలు రజాకార్లను ఉపయోగించుకొన్న సత్యాన్ని రజాకార్‌ సినిమా కావాలనే దాచిపెట్టింది. వీరనారి చాకలి ఐలమ్మ పట్ల తెలంగాణ ప్రజల్లో విశేష అభిమానం ఇప్పటికీ ఉంది. కనుక ఆ అభిమానాన్ని కూడా ఎన్నికల్లో తమకు అనుకూలంగా మల్చుకోవడానికి ఐలమ్మ సంఘటనతోనే సినిమా మొదలెట్టారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూ మహాసభలు తెలంగాణలో చేసింది ఏమీ లేదు కనుక వారిని చూపెట్టడానికి అవకాశమే లేదు. సావర్కర్‌ అనుమతితో హిందూ మహాసభ నిజాంకు వ్యతిరేకంగా జరిపిన సత్యాగ్రహంలో గాంధీజీని చంపిన నాధూరాం గాడ్సే పాల్గన్నాడు. అందుకు పదకొండు నెలల పాటు హైదరాబాద్‌ జైల్లో శిక్షను అనుభవించాడు. జాతిపితను చంపిన గాడ్సే హిందూ మతోన్మాది గనుక ఆ ఘటన ప్రస్తావన కూడా సినిమాలో చూపకుండా జాగ్రత్త పడ్డారు. ఆర్య సమాజ్‌ వ్యక్తిగత దాడులకు మాత్రమే పరిమితం అయింది. నిజాం నవాబుపై వారు చేసిన హత్యాయత్నం ఆ కోవలోనిదే.
నిజాం ప్రభుత్వం, యంత్రాంగం ఫ్యూడల్‌ దొరల దోపిడీకి అనుకూలంగా నిల్చేది. దొరల్లో అత్యధికులు హిందువులే. గ్రామాల్లోని వృత్తికులాలు, సేవాకులాలు దొరలకు, అధికారులకు ఉచితంగా తమ ఉత్పత్తులు, సేవలను వెట్టి కింద అందించేవి. దొరల ఇళ్లల్లో పెళ్లైతే పెళ్లి కూతురితో పాటు కొందరు మహిళలను కూడా బానిసలుగా పంపేవారు. దొరలు వారిని తమ కామ వాంఛలు తీర్చుకోవడానికే గాదు, తమ ఇంటికి అతిథులుగా వచ్చిన వారికి వారిని తార్చేవారు. ఇలాంటి విషయాలేవీ సినిమాలో లేవు. ఈ ఘటనలను చెప్పడమంటే దౌర్జన్యాలకు, దోపిడీకి మతం ప్రాతిపదిక కాదన్న విషయం తెలిసి పోతుంది. అది పరివార్‌కు మింగుడు పడని విషయం గదా?
సినిమాలో పదే పదే హైదరాబాద్‌ను తుర్కిస్తాన్‌గా మార్చడానికి నిజాం ప్రయత్నిస్తునట్లు చూపారు. మొదటి నిజాం ఇరాన్‌ నుంచి వచ్చిన వాడు. టర్కీతో పెళ్లి సంబంధాలున్నా టర్కీతో పాలనా సంబంధాలు లేవు. సినిమాలో వాడిన తుర్కిస్తాన్‌ అనే మాట మనకు చరిత్రలో కన్పించదు. ముస్లింలను తెలంగాణలో తుర్కోళ్లు అంటారు. ముస్లింలు అలా పిలిపించుకోవడానికి ఇష్టపడరు. వారికి ఆ మాట ఎద్దేవగా అన్పిస్తుంది. కనుకే తుర్కిస్తాన్‌ అనే మాటను సృష్టించి సినిమాలో వాడారు. నిజాం ఒక దశలో మత మార్పిడులు చేయించారు. అతనే వాటిని నిలిపేశాడు. కారణం మళ్లీ ఈ దొరలే. మత మార్పిడి వల్ల ఇస్లాంను స్వీకరించిన మాల మాదిగలు, ఇతర శూద్రులు వెట్టిచాకిరీ నిరాకరిస్తే మా గతేమిటి? మీ అధికారుల గతేమిటి? అని దొరల ప్రతినిధి వర్గం నిజాంను కలిసి ప్రశ్నించింది. వెంటనే నిజాం మత మార్పిడులను నిలిపేయించాడు. సినిమాలో ఈ విషయంలో దొరల ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు.
హైదరాబాద్‌ రాష్ట్రంలోని ప్రతి ముస్లిం తనను తాను ప్రభువుగా భావిస్తే నిజాం ప్రభుత్వానికి ఢోకా ఉండదని కొందరు మేధావులు నిజాంకు సూచించారు. ఆ నేపధ్యంలో ”అనల్‌ మాలిక్‌” (నేను ప్రభువును) అన్న నినాదం సృష్టించి నిరుపేద ముస్లింను కూడా తనవైపు ఉంచుకోవాలని నిజాం ప్రయత్నించాడు. అది కూడా సాధ్యం కాలేదు. 1917లో రష్యాలో సోషలిస్టు రాజ్యం ఏర్పడ్డాక ఆ స్ఫూర్తితో ఉత్తరాది నుండి వచ్చిన ముస్లిం పాత్రికేయులు హైదరాబాద్‌లో ఉర్దూ పత్రికలు పెట్టి నిజాంను ఏకిపారేశారు. ”అనల్‌ మాలిక్‌” అన్న భావనను ఎండగడ్తూ మగ్దూం మొహియుద్దీన్‌ కవితలు రాశాడు. రోజుకు పావలా సంపాదించే ముస్లిం రిక్షా కార్మికుడు ప్రభువు అవుతాడా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ముస్లింలను ఆ మాటలతోనే కవ్విస్తారు. ఇది మన భూమి, ఈ భూమికి మనమే ప్రభువులం, మన రాజ్యాన్ని లాగేసుకొన్నారు అని రెచ్చగొడ్తారు.
తెలంగాణలో దొరల ఆగడాలపై మా భూమి, దాసి, వీర తెలంగాణ, చిల్లర దేవుళ్లు వంటి సినిమాలు వచ్చాయి. శ్యాంబెనగల్‌ నిజాం కాలం నాటి తెలంగాణ ఇతివృత్తంతో అంకుర్‌, నిషాంత్‌, మండి వంటి సినిమాలు నిర్మించారు. ఇవన్నీ 40 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలు. వాస్తవ ఘటనల ఆధారంగా తీసినవి. ఈ తరం వారు వీటిని చూడలేదు. అవి చూస్తే నిజాం పాలన అండగా దొరలు పాల్పడిన అకృత్యాలు తెలుస్తాయి. ఇవన్నీ యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. చిత్రాల కంటే ఎక్కువ సంఖ్యలో నవలలు వచ్చాయి. గంగు, ప్రజల మనిషి, చిల్లర దేవుళ్లు, మోదుగు పూలు, జనపదం, తెలుగు గడ్డ, జైత్రయాత్ర వంటి అనేక నవలలు తెలంగాణ సాయుధ పోరాటం ఘటనలను, దానికి ముందు నాటి స్థితిని తెలియచేస్తాయి. ఒక నాటి తెలంగాణ స్థితిగతులను తెలుసుకోవాలనుకొనే వారు పైన పేర్కొన్న నవలలు చదవాలి. సినిమాలు చూడాలి. అప్పుడు అర్థమవుతుంది సంఫ్‌ు పరివార్‌ ‘రజాకార్‌’ సినిమాను భారీ వ్యయంతో ఎందుకు నిర్మించిదో?

– ఎస్‌. వినయ కుమార్‌

(రచయిత ప్రజాశక్తి మాజీ సంపాదకులు)

➡️