చర్చ లేకుండానే జమిలి ఎన్నికల నిర్ణయం!

ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఒక ప్రతిపాదన ఎవరైనా చేస్తే దాని మంచిచెడ్డలను చర్చించి మెజారిటీ అభిప్రాయం ప్రకారం తీసుకొనే నిర్ణయం లేదా చర్య. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ఏ సంస్థలకైనా ఇదే సూత్రం. కానీ అలాంటి ప్రక్రియ లేకుండానే ముందుగానే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఎలా అమలు జరపాలో సూచించండి అంటూ ఒక కమిటీని వేసి, దానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు, పార్టీలతో చర్చించి ఒక బిల్లును పెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే జమిలి ఎన్నికల అంశం. ఇదేం ప్రజాస్వామ్యం? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ 2023 సెప్టెంబరు రెండున తీసుకున్న నిర్ణయం ప్రకారం మాజీ రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఒక ఉన్నత స్థామి కమిటీని వేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకుగాను ఆ సమస్యను పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేసినట్లు న్యాయశాఖ తీర్మానంలో ఉంది. దాని అర్ధం ఏమిటి ముందే తీసుకున్న నిర్ణయాన్ని ఎలా అమలు జరపాలో చెప్పమని కోరటమే కదా? కోవింద్‌ కమిటీ అదే చేసింది, దానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం లేదా గేలి చేయటం తప్పితే…’ఇంత చేసిన తరువాత బిల్లు పెట్టటానికి పార్టీలను అడిగేదేమిటి? అవి చెప్పేదేమిటి? మీ అభిప్రాయాలను చెప్పండ’ంటూ కోవింద్‌ కమిటీ పార్టీలకు లేఖ రాసింది. అన్ని పార్టీలు దానికి తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా సమర్పించాయి. వాటిలో వ్యతిరేకతను వ్యక్తం చేసినవి భిన్నాభిప్రాయాలు వెల్లడించినవీ ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే సిఫార్సులు చేసినట్లు తీరు తెన్నులు వెల్లడిస్తున్నాయి. అందుకే అనేక పార్టీలు తమ వ్యతిరేకతను పునరుద్ఘాటించాయి.
స్వాతంత్య్రం వచ్చిన తొలి సంవత్సరాల్లో జమిలి ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగంలో ఎక్కడా వాటికి సంబంధించి నిర్దిష్ట ఆదేశమేమీ లేదు. అందుకే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని కోవింద్‌ కమిటీ కూడా చెప్పింది. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పెద్దలు ముందుకు తెచ్చిన నినాదాన్ని అమలు చేసేందుకు పూనుకున్నారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందినదిగా మార్చాలనుకుంటున్నామని ఆ దిశగా తీసుకుంటున్న పెద్ద చర్యలలో ఇదొకటని బిజెపి పెద్దలు నమ్మబలుకుతున్నారు. దీన్నే మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టటం అంటారు. జమిలి ఎన్నికలు మేలని 1999లోనే లా కమిషన్‌ అభిప్రాయపడింది. దేశాభివృద్ధికి ఇది సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్‌ అనుకుంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన వెంటనే దీన్ని ఎందుకు ముందుకు తేలేదు? ప్రపంచంలో జమిలి ఎన్నికలు జరుగుతున్నవి మూడే మూడు దేశాలు అవి స్వీడన్‌, బెల్జియం, దక్షిణాఫ్రికా. ఈ మూడు చోట్లా దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈ విధానాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవల ఎన్నికలు జరిగిన దక్షిణాఫ్రికాలో 64 లక్షలు (40 శాతం) ఓట్లు తెచ్చుకున్న పార్టీకి 200కు గాను 73 సీట్లు వస్తే కేవలం 29 వేలు తెచ్చుకున్న పార్టీకి ఒక సీటు వచ్చింది. ఇది కదా ప్రజాస్వామ్యమంటే! కానీ మన దేశంలో జరుగుతున్నదేమిటి? పార్టీలు తెచ్చుకున్న ఓట్లకు సీట్లకు పొంతన ఉంటోందా? 2019లో బిజెపికి వచ్చిన ఓట్లు 37.36 శాతమైతే సీట్లు 55.8 శాతం, అదే 2024లో ఓట్లు 36.56 శాతం కాగా సీట్లు 44 శాతం వచ్చాయి. మైనారిటీ ఓట్లతో అధికారాన్ని పొందింది. డబ్బు ప్రమేయం లేకుండా ఎందుకు చేయరు? ఎన్నికల విధానాన్ని ఎందుకు సంస్కరించరు?
అధికార యంత్రాంగ సమయం, డబ్బు వృధాను అరికట్టటానికి ఒకేసారి ఎన్నికలని మరొక పాట పాడుతున్నారు. కోవింద్‌ కమిటీ చేసిన సూచనలలో ఏ కారణంతోనైనా ఒక ప్రభుత్వం పడిపోతే జరిగే ఎన్నికలు ఐదేళ్లలో మిగిలిన కాలానికి మాత్రమే అన్నది ఒకటి. సంక్షోభంతో ఐదేళ్లలో ఎన్నిసార్లు పతనమైతే అన్నిసార్లు జరుపుతారా? హాస్యాస్పద ప్రతిపాదన కాకపోతే మరేమిటి? జనాభా లెక్కలతో కలిపి బిసి కులగణన జరపాలని కోరితే దానికి బిజెపి ససేమిరా అంటున్నది. కావాలంటే రాష్ట్రాలు లెక్కించుకోవచ్చు అన్నది. అప్పుడు సిబ్బంది సమయం, డబ్బు దండగ కాదా? జమిలి ఎన్నికల వాదన దీనికి ఎందుకు వర్తించదు? జమిలి ఎన్నికల చర్చ జరుగుతుండగానే దాని స్ఫూర్తిని దెబ్బ తీసేదిగా కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఒకేసారి జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలను ఈసారి విడదీసింది. మరోవైపు జమిలిని వ్యతిరేకించే పార్టీలకు నీతులు చెబుతారా? పదేళ్ల మోడీ విఫల పాలన పైనుంచి జనం దృష్టిని మళ్లించేందుకు తప్ప జమిలి ఎన్నికలు మరొక మేలుకు కాదన్నది స్పష్టం. జనాభిప్రాయాన్ని తుంగలో తొక్కి నిరంకుశంగా ఏదో ఒక సాకుతో జమిలిని రుద్దితే హమ్‌ భీ దేఖేంగే (మనమూ సంగతి చూద్దాం) అని పాలకులకు పాఠాలు చెప్పేందుకు జనం సిద్ధపడటం తప్ప చేసేదేముంది !

– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️