తీర్పు నిక్షిప్తం

May 14,2024 05:35 #editpage

ఎన్నికల యజ్ఞంలో కీలక ఘట్టమైన పోలింగ్‌ సోమవారం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాల్లో కొన్ని హింసాత్మక సంఘటనలు, అక్కడక్కడ కొద్దిపాటి ఉద్రిక్తతలు మినహా ఓటింగ్‌ సజావుగా జరిగింది. ఎక్కడా రీపోలింగ్‌ అవసరం ఉండకపోవచ్చని ఎన్నికల సంఘం ప్రాథమికంగా పేర్కొంది. పోలింగ్‌ కేంద్రం స్థాయి నుంచి పూర్తి సమాచారం వచ్చాకగాని నిర్దిష్టత రాదు. రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉందని, చాలా చోట్ల తీవ్ర ఎండలు లేదంటే పిడుగులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలున్నప్పటికీ, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇ.సి. సరైన సదుపాయాలు అంతగా కల్పించనప్పటికీ… ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసాన్ని, గౌరవాన్ని, చైతన్యాన్ని తెలియజేస్తుంది. ఈ తడవ ఇవిఎంల మొరాయింపు, తమ ఓట్లు జాబితాల్లో లేవన్న ఫిర్యాదులు గతంతో పోల్చితే తక్కువే. ఎ.పి. వ్యాప్తంగా 4.14 కోట్ల ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, మహిళా ఓటర్లు 2.10 కోట్లు కాగా పురుషులు 2.02 కోట్లు. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం ఒక విశేషం కాగా పోలింగ్‌ కేంద్రాల వద్ద స్త్రీలు బారులు తీరడం అంతకంటే పెద్ద విశేషం. పోలింగ్‌ సమయం సాయంత్రం ఆరు గంటలకు ముగియగా, అప్పటికి పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని ఇ.సి. కల్పించింది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,500 పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలో ఉన్న వారి ఓటింగ్‌ పూర్తయ్యేసరికి రాత్రి పదిగంటలు దాటవచ్చు.
ఈ మారు పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఇ.సి. ఆశిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో 78.41 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019లో 79.64 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటలకు 68.12 శాతం ఓటింగ్‌ జరిగింది. తుది అంకెలు వచ్చేసరికి పోలింగ్‌ 80 శాతం క్రాస్‌ అవుతుందని ఇ.సి. చెబుతోంది. గతం కంటే పోలింగ్‌ శాతం కొంత తగ్గుతుందన్న వాదనలూ తెరమీదికొచ్చాయి. కాగా ఓటింగ్‌ సరళిపై రాజకీయ పార్టీలు ఎవరికి తోచినట్లు వారు భాష్యాలు వల్లిస్తున్నాయి. పోలింగ్‌ పెరగడం రాష్ట్రంలో ప్రభుత్వ మార్పునకు సంకేతమని టిడిపి కూటమి చెబుతుండగా, పథకాల లబ్ధిదారులు ఓటెత్తారని వైసిపి విశ్లేషిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్‌ తమకు అనుకూలమంటే, పట్టణాల్లో తమకే అనుకూలం అని ఊహాగానాలు చేస్తున్నారు నాయకులు. ఓటింగ్‌ ముగిసి, క్షేత్ర స్థాయి నుంచి పక్కా వివరాలు అందితేనే పోలింగ్‌ శాతంపై స్పష్టత వస్తుంది. రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్‌ జరుగుతున్నందున, మంగళవారం మధ్యాహ్నానికి స్పష్టత రావచ్చు.
ఈ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల్లో 2,387 మంది, లోక్‌సభ స్థానాల్లో 454 మంది పోటీ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు జూన్‌ 4న చేపడతారు. పోలింగ్‌ ముగిసినప్పటికీ ఫలితాలు వెల్లడి కావడానికి, తమ భవితవ్యం తేలడానికి అభ్యర్ధులు, పార్టీలు ఇంకా మూడు వారాలు వేచి చూడాలి. అప్పుడే ఓటరు తీర్పు బహిర్గతమవుతుంది. రాష్ట్రంలో వైసిపి, టిడిపిాజనసేనాబిజెపి కూటమి, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆప్‌, ఇండియా వేదిక అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. త్రిముఖ పోటీ ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ కాలంలో ఇ.సి. అవలంబించిన ధోరణి సందేహాస్పదంగా ఉంది. విమర్శలూ ఎదుర్కొంది. పోలింగ్‌కు కొద్ది గంటల ముందు ఐఎఎస్‌, ఐపిఎస్‌లు, డిఎస్‌పి, సిఐ, ఎస్‌ఐ వంటి అధికారులపై చర్యలు, పింఛన్‌ పంపిణీ, డిబిటి స్కీంలపై చేసిన నిర్ణయాలు ఇ.సి. తొట్రుపాటును ఎత్తిచూపుతున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలోనూ తీవ్ర లోపాలు కనిపించాయి. పోలింగ్‌ రోజున అనంతపురం, మాచర్ల, తెనాలి సంఘటనలపై సీరియస్‌గా తీసుకున్నట్లు ఇ.సి. వెల్లడించింది. ఎ.పి. వ్యాప్తంగా పోలింగ్‌ సందర్భంగా 120 హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయనీ తెలిపింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్లు, విద్యుత్‌ సరఫరా, ఫ్యాన్ల వంటి కనీస సదుపాయాలు కల్పించడంలో ఇ.సి. విఫలమైంది. ఇ.సి. ఎంతగా ప్రచారం చేసినా దాదాపు కోటి మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఏది ఏమైనా పోలింగ్‌ ముగిసింది. ఓటరు తీర్పు ఇవిఎంలలో నిక్షిప్తమైంది. ఫలితాల వెల్లడి వరకు సంయమనం పాటించడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ముఖ్య బాధ్యత.

➡️