కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉత్త మాటల గారడీగానే తేలిపోయింది! కీలకమైన రంగాలు వేటికీ ఘనమైన కేటాయింపులు జరపలేదు. ధరల పెరుగుదలకు కారణమై, సామాన్యుల దైనందిన జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టటానికి ఏ చర్యలూ ప్రకటించలేదు. ఈ దశాబ్ది ఆఖరికి పదికోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ఘనంగా పేర్కొన్నా- అందుకు తగిన కార్యాచరణ, నిధుల కేటాయింపూ కనపడలేదు. ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకం యజమానులకు ఉపయోగపడుతుంది తప్ప ఉద్యోగార్థులకు పెద్దగా మేలు చేసేది కాదు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తారు సరే … శిక్షణానంతరం ఉద్యోగాల మాటేమిటి? అన్న ప్రశ్నకు ఈ బడ్జెట్‌లో సమాధానం లేదు. ఏడాదికి సగటున 78.5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్న మంత్రి మాట… గతంలో మోడీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ వలె డొల్లగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగం మీద, ఉపాధి హామీ పథకం మీదా గతంలో మాదిరిగానే మోడీ ప్రభుత్వపు చిన్నచూపు కొనసాగింది. ఎరువుల రాయితీని మరింత తగ్గించి, రైతులకు ద్రోహం చేసింది. గ్రామీణ వ్యవసాయ కార్మికులకు, చిన్న రైతులకు, పేదలకు తోడ్పాటునిస్తున్న ఉపాధి హామీకి నిధులను తెగ్గోసింది. గత బడ్జెట్‌తో పోలిస్తే- ఎరువుల సబ్సిడీలో రూ.24,894 కోట్లు, ఆహార సబ్సిడీలో రూ.7082 కోట్లు కోత పెట్టారు.
ఈకాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల 14.5 శాతం మేర ఉండగా, వ్యయంలో పెరుగుదల 5.94 శాతం మాత్రమే! పెరిగిన ఆదాయాన్ని ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఉపయోగిస్తే- యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ, ఈ బడ్జెట్లో ఆ మొత్తాన్ని జిడిపిలో ఆర్థికలోటు తగ్గించే అంకెల విన్యాసం వైపు మళ్లించారు. ఇది కార్పొరేట్లను, అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిదారులను సంతృప్తపరిచే చర్యే తప్ప- దేశ ప్రజలకు దోహదపడేది కాదు. ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రాలకు జరిపే నిధుల కేటాయింపు బిజెపి హయాంలో అంతకంతకు కుదించుకుపోతోంది. 2022 బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఏకంగా రూ.40 వేల కోట్లకు ఎగనామం పెట్టేశారు! ప్రతిపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు మరింత ద్రోహం చేయటానికి ఇది దారి తీయొచ్చు! ప్రభుత్వరంగంలోని రూ.50 వేల కోట్ల మేర వాటాల ఉపసంహరణకు ప్రతిపాదించటం మరీ దారుణం.
ఆంధ్రప్రదేశ్‌కు ఈసారి కూడా కేటాయింపుల్లో తీరని ద్రోహం జరిగింది. గొప్ప సాయం అందిస్తున్నట్టు ప్రసంగంలో ప్రవచించినా, నిజంగా చూపిన ప్రేమ శూన్యం. విభజనచట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చటానికి నిర్ధిష్టమైన ప్రస్తావన కానీ, కేటాయింపులు కానీ చేయలేదు. రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్ల నిధులను అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ద్వారా రుణం తీసుకోవటానికి సాయపడతామని చెప్పారే కానీ, గ్రాంటుగా ఒక్క రూపాయి కూడా విదిలించలేదు. ఈ అప్పును ఎవరు చెల్లిస్తారో, వడ్డీని ఎవరు భరిస్తారో స్పష్టత లేదు. అప్పు ఇప్పించటమే ఒక ఘనమైన సహాయం అని కేంద్రం మభ్యపెట్టదలిస్తే అది రాష్ట్ర ప్రజలతో క్రూర పరిహాసమే! పోలవరం ప్రాజెక్టు గురించి గొప్ప ప్రస్తావనలు చేసినా, నిధుల కేటాయింపు మీద కానీ, నిర్వాసితులకు పునరావాసం మీద కానీ ఒక్క మాటా లేదు. విశాఖ రైల్వే జోనూ, కడప స్టీలు ఫ్యాక్టరీ ఊసే లేదు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించబోమని ఆ మధ్య కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖలో కుంటి తుడుపు ప్రకటన చేశారు కానీ, ఈ బడ్జెట్లో అలాంటి భరోసా ఏమీ ఇవ్వలేదు. వెనకబడిన జిల్లాలకు సహాయం జాబితాలో ప్రకాశంను కూడా కలపటం హర్షించదగ్గదే కానీ, కొద్దిపాటి విదిలింపు నిధులతో ఒరిగేదేమీ ఉండదు. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి మేలు జరిగిపోయినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేయడం తొందరపాటే అవుతుంది. విభజన హామీలను అమలు జరపటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. రాజధాని నిర్మాణానికి, పోలవరం పూర్తికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకూ తగినన్ని నిధులు పొందటం మన హక్కు. గట్టిగా అడిగి, పోరాడి సాధించాలి. లేదంటే ఇలాంటి ప్రసంగాల ప్రహసనాలతో, అంకెల గారడీలతో మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉంటాం. రాష్ట్ర విభజన జరిగి, పదేళ్లు గడిచిపోయాక కూడా ‘అన్ని హామీలూ అమలు చేస్తా’మన్న దగ్గరే బిజెపి ప్రభుత్వం ఆగిపోవటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు.
