‘సమాజంలో కులం- సమాజాంతరాల్లో కులం/ కులంలో కులం- మతంలో కులం/ గుడిలో కులం- బడిలో కులం/ పెళ్లిలో కులం- ప్రేమలో కులం’ అంటారు కవి శంబూక. ‘జైళ్లలోనూ కులం – ఖైదీలకు చెప్పే పనుల్లోనూ కులం’ వుందన్న విషయాన్ని ‘జై భీమ్’ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తే, నిజ జీవితంలో వేళ్లూనుకొని వున్న కుల వివక్ష జైళ్లలోనూ వుందని, ఆ వివక్షకు ముగింపు పలకాలని, కులం ఆధారంగా పనిని వేరు చేసి కేటాయించే పద్ధతులను విడనాడాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిం చడం…మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. మనకున్న కులం భాష- సంస్కృతం. దానికి మరో పేరు దేవభాష. 19వ శతాబ్దం వరకూ శూద్ర, పంచములకి చెందిన ఎవ్వరూ ఈ దేవభాషను నేర్చుకోరాదనే పైశాచిక అంశాలుండేవి. మనకున్న కులం ఫిలాసఫీ- బ్రాహ్మణ మతం. దానికి మరో పేరు వేదాంతం. మనకున్న కులచట్టం- మనుధర్మ శాస్త్రం. ఇది వేల ఏళ్లుగా మన భౌతిక, మానసిక జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా శాసిస్తూ వచ్చింది. భారతదేశం నా మాతృభూమి- భారతీయులంతా నా సహోదరులన్న సోదరభావాన్ని…ఈ కులమతాల సంస్కృతి విషపూరితం చేసింది. తరతరాల మానవ మేధస్సుకు మేకులు కొట్టిన ఈ సంస్కృతి, దేశ ప్రజల ప్రగతికి శిలువ వేసింది. ‘నేను పుట్టక ముందే/ దేశద్రోహుల జాబితాలో/ నమోదైంది నా పేరు’ అంటారు ఖాదర్ మొహియుద్దీన్. అలాగే..పుట్టుకతో పడిన కుల వివక్ష ముద్ర… పుట్టుమచ్చలా మరణం వరకూ వెంటాడుతోంది.
కుల వ్యవస్థను అసహ్యించుకుంటున్నట్లు నటిస్తూ, అభ్యుదయం గురించి కోతలు కోస్తూ, అంతర్నాటకమాడే ప్రబుద్ధులు నేడు అవతరించారు. జాతి నరనరాన్ని నమిలివేస్తున్న కులతత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలనే మతోన్మాద భావజాలాన్ని సనాతన ధర్మం అంటూ భుజానికెత్తుకోవడం అంటే… ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను నిరంకుశంగా అణగదొక్కడం కాదా? సనాతన ధర్మం, హిందూ సంస్కృతి వంటి అర్థం తెలియని పదాలను వల్లెవేస్తారేగాని, ఆ ధర్మాల లోతుగాని, మతం ఎత్తిన అవతారాలుగాని తెలుసుకోరు. ‘మానుతున్న గాయాన్ని మళ్లీ ఎవరో కెలికారు/ ఎవరో స్వేచ్ఛను యాభై ఏళ్లలోపే పరీక్షకు నిలబెట్టారు’ అంటారు కవి యాకూబ్. ‘భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దేశ సమగ్రతను కాపాడుతానని, పక్షపాతం లేకుండా ప్రజలందరికీ న్యాయం చేస్తా’నని ప్రమాణం చేసిన వ్యక్తి, ఇప్పుడు తానొక మత ప్రతినిధిగా, సనాతన ధర్మ పరిరక్షకునిగా ప్రకటించుకోవడం చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడం కాదా? రాజ్యాంగబద్ధంగా ప్రజలిచ్చిన పదవిని అవమానించడం కాదా? సనాతన ధర్మానికి ప్రాతిపదిక- కులం. సనాతన ధర్మాన్ని ప్రబోధించే ధర్మశాస్త్రాల్లో శూద్ర- పంచములపై అమలుజేయబడ్డ నిషేధాలు- సాంఘిక కిరాతకత్వానికి చిహ్నాలు కాదా? సనాతన ధర్మాన్ని ప్రబోధించడం అంటే కులవ్యవస్థను ప్రోత్సహించడం కాదా? సనాతన ధర్మం అంటే-దళితులు, గిరిజనులపై తరతరాలుగా పెరిగిపోతున్న అంటరానితనం, కుల వివక్ష, మహిళలపై సాగుతున్న అణచివేతకు దన్నుగా నిలవడం కాదా? ‘జస్ట్ ఆస్కింగ్…’ అంటున్నారు ప్రజలు.
గుర్రం జాషువా ఒకసభలో గొంతెత్తి పద్యం చదివితే, అదే సభలో వున్న ‘కవి సామ్రాట్’ బిరుదాంకితుడైన ఒకాయన ‘జాషువా గారు పంచమ స్వరంలో చదివిన పద్యం ఆ పాత మధురంగా వుంది’ అన్నాడట. జాషువా పంచముడనే విషయాన్ని సభలో కూడా ఎత్తిపొడవడమే ఆయన ఉద్దేశం.. అంటూ ‘ఆధునిక యుగంలో కుల వ్యవస్థ’ అనే పుస్తకంలో పేర్కొన్నాడు సీవీ. లౌకికతత్వాన్ని గౌరవించాల్సిన ఒక మంత్రి…’సూడో సెక్యులరిజం’ అంటూ చులకనగా మాట్లాడటం, ఒక మతతత్వ ప్రతినిధిలా ఇతర మతాలను తూలనాడే విధంగా వ్యాఖ్యానించడం చూస్తే… కులాన్ని దూషించిన ఆ కవి సామ్రాట్‌కి, లౌకికతత్వ విలువలకు, నైతికతకు వలువలూడ్చిన ఈ నట సనాతన వాదికి తేడాలేదు. ‘కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేదు. ఒక నీతిని నిర్మించలేదు’ అంటారు అంబేద్కర్. ప్రతి భారతీయుడి నరనరాన జీర్ణించుకొని వున్న లౌకికతత్వాన్ని నిర్జించి, ఏ విలువల నిర్మాణం కోసం సనాతన ధర్మ రక్షణ చట్టం తేవాలని అంటున్నారో… సదరు మంత్రిగారు చెప్తారా?
