తన కన్నతల్లి వృద్ధాప్యంలో ఉన్నపుడు, చివరి రోజు వరకు ఆమెను చూసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అనేక సార్లు వెళ్లారు. ఆమెకు సేవ చేశారని కూడా వార్తలు చదివాం. చిత్రాలను చూశాం. కానీ అలాంటి మరో తల్లిని చూసేందుకు ఆమె కుమార్తెకు వీసా నిరాకరించిన అదే పెద్దమనిషి తీరును ఎలా చూడాలి?
ఈ ఏడాది జనవరి తొమ్మిదిన ఆన్‌లైన్ ద్వారా క్షమ, ఆమె భర్త వీసా దరఖాస్తులను సమర్పించగా దాదాపు నెల రోజుల పాటు దరఖాస్తును తొక్కి పట్టి ఏ కారణం చెప్పకుండా మానసిక ఆందోళనకు గురిచేశారు. చివరికి భర్త కాల్విన్ ప్రీస్ట్‌కు వీసా మంజూరు చేసి, క్షమకు తిరస్కరించారు.
బెంగళూరులో ఉంటున్న తల్లి వసుంధరా రామానుజమ్‌ను పరామర్శించే నిమిత్తం ఇండియన్- అమెరికన్ మహిళ క్షమా సావంత్ (51) గతేడాది మే నెల నుంచి మూడు సార్లు దరఖాస్తు చేశారు. అమెరికాలోని మన దౌత్య కార్యాలయాలు అత్యవసర వీసా నిరాకరించాయి. తీవ్ర నేరారోపణలతో జైళ్లలో ఉన్న నిందితులకు, శిక్షలు పడిన వారికి కూడా ఇలాంటి కారణాలతో పరిమిత బెయిలు మంజూరు చేసిన ఉదంతాలు మనకు తెలిసిందే. క్షమ సావంత్ నేరస్థురాలు కాదు, మన దేశ ఉగ్రవాద లేదా మరొక నిషేధిత జాబితాలో ఆమె పేరు లేదు. ఎలాంటి కేసులు లేవు. కానీ కారణాలు చూపకుండానే మీరు తిరస్కరణ జాబితాలో ఉన్నారంటూ అమెరికా వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్ నగరంలో భారత కాన్సులేట్ దౌత్య కార్యాలయం 2025 ఫిబ్రవరి మొదటి వారంలో వీసా నిరాకరించింది. కారణం ఏమిటో చెప్పాలంటూ గట్టిగా అడిగినందుకు, చెప్పాల్సిన పని లేదని, కార్యాలయంలో అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులను పిలిపించింది. భర్త కాల్విన్ ప్రీస్ట్‌కు వీసా మంజూరు చేసి తనకు నిరాకరించటానికి నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకించే రాజకీయ కారణాలు తప్ప మరొకటి కాదని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు.
క్షమ సావంత్ మహారాష్ట్రలోని పూనాలో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. తల్లి స్కూల్ ప్రిన్సిపల్‌గా పని చేశారు. ఇంజనీర్ అయిన తండ్రి క్షమ పదమూడేళ్ల వయస్సులో ఒక ప్రమాదంలో మరణించారు. ఆమె ముంబైలో చదువుకొని సాఫ్ట్‌వేర్ ఇంజనీరయ్యారు. 1996లో అమెరికా వెళ్లిన తరువాత అర్థశాస్త్రంలో పిహెచ్‌డి చేసి కొంతకాలం ప్రొఫెసర్‌గా పని చేశారు. అక్కడే ఆమె 2006లో వామపక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. అంతకు ముందు ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. 2012లో వాషింగ్టన్ ప్రజా ప్రతినిధుల సభకు పోటీ చేసి ఓడిపోయారు. తరువాత సియాటిల్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో గెలిచి 2014 నుంచి 2024 వరకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో కుల వివక్ష వ్యతిరేక తీర్మానం చేయించటంలో కీలక పాత్ర పోషించటాన్ని హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వీసా తిరస్కరణ వెనుక ఈ అంశం ఉందా అన్న ప్రశ్నకు ఇంతకు మించి బిజెపి ప్రభుత్వ రాజకీయ నిర్ణయం వెనుక మరొక కారణం కనిపించటం లేదన్నారు. ”నేను ఒక సోషలిస్టును. పదేళ్ల పాటు కార్మికవర్గ ప్రతినిధిగా సియాటిల్ కౌన్సిల్‌లో ఉన్నాను. ఆ సమయంలో నేను ప్రజా ఉద్యమ నిర్మాణానికి, కనీస వేతనం గంటకు 15 డాలర్లకు పెంచాలని కోరుతూ నా పదవిని వినియోగించాను. ఇప్పుడది 20.76 డాలర్లకు పెరిగింది. అమెరికాలో ఇది గరిష్టం. పేదల గృహ నిర్మాణాలకు కార్పొరేట్ సంస్థలు వాటా చెల్లించాలని కూడా నేను పని చేశాను. 2020 ఫిబ్రవరిలో సిఏఏ, ఎన్.ఆర్.సి చట్టాలను ఖండిస్తూ సియాటిల్ కౌన్సిల్‌లో పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయం నాకు ఒక లేఖ పంపింది. అమెరికాలోని హిందూత్వ శక్తులు, మోడీ మద్దతుదార్ల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాం. 2023 ఫిబ్రవరిలో కుల వివక్షపై చారిత్రాత్మక నిషేధాన్ని ప్రకటించటం లో విజయం సాధించాం. మాకు విశ్వహిందూ పరిషత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. మితవాద హిందూ అమెరికన్ ఫౌండేషన్, ఉత్తర అమెరికా హిందువుల సంఘటన మాకు వ్యతిరేకంగా పని చేశాయి. అందువలన మోడీ ప్రభుత్వం, అమెరికాలోని దాని మద్దతుదార్లు మాకు వ్యతిరేకంగా ఉన్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. వారందరికీ నా రాజకీయ అభిప్రాయాలు ఏమిటో తెలుసు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు అనుమతించక పోవటం అమానుషం. ఏ రకమైన ప్రభుత్వమిది. నా వీసా తిరస్కరణ వెనుక రాజకీయ కారణాలు లేవని మోడీ సర్కార్ చెప్పుకోవాలంటే వీసా మంజూరు చేసి నిరూపించుకోవచ్చ”ని క్షమ పేర్కొన్నారు.
అమెరికాకు వెళ్లిన వారందరూ అని కాదు గానీ ఎక్కువ మంది తమతో పాటు కులతత్వాన్ని, కుల వివక్షను కూడా తీసుకుపోయారు. ఈ మధ్య దానికి మతాన్ని కూడా తోడు చేశారు. మన దేశంలో మత ప్రాతిపదిక మీద పని చేసే సంస్థలన్నింటికీ అమెరికా శాఖలు ఉన్నాయి. దక్షిణాసియా నుంచి వచ్చిన దళితులు, ఇతర అణచివేతకు గురైన కులాల వారు అమెరికాలో కూడా దాన్ని తప్పించుకోలేకపోతున్నారు. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం విద్యాపరంగా మూడింట ఒక వంతు, పని స్థలాల్లో , మూడింట రెండు వంతుల మంది వివక్షను ఎదుర్కొ న్నట్లు తేలింది. తక్కువగా చూడటం, సూటిపోటి మాటలు, లైంగిక వేధింపుల గురించి 30 మంది దళిత మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమ అనుభవాలను బహిరంగ లేఖ రూపంలో వెల్లడించారు. సిస్కో సిస్టమ్స్ కంపెనీలో అగ్రవర్ణాలుగా భావించబడుతున్నవారు తనకు రావాల్సిన ఉద్యోగోన్నతి, వేతన పెంపుదలను ఎలా అడ్డుకుంటున్నారో వెల్లడిస్తూ దాఖలు చేసిన కేసును ఒక దళత సామాజిక తరగతికి చెందిన ఇంజనీరు గెలిచారు. ఆ తరువాత వందలాది మంది తాము ఎదుర్కొన్న వివక్ష గురించి గళం విప్పారు. ఈ పూర్వరంగంలోనే క్షమ సావంత్ సియాటిల్ సిటీ కౌన్సిలర్‌గా వివక్షకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింప చేయించారు.
క్షమా సావంత్ అలుపెరగని పోరాట యోధురాలు. కార్మిక వర్గాన్ని దోచుకుంటున్న ధనికులు, వారికి మద్దతు ఇస్తున్న అధికార రిపబ్లిక్, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరొక పార్టీ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని ఆమె గతంలో ప్రకటించారు. దళితుల సమస్యల మీద ఆ సామాజిక తరగతికి చెందిన వారు మాత్రమే సక్రమంగా స్పందించగలరని, వారు మాత్రమే పోరాటాలకు నాయకత్వం వహించాలని చెబుతున్న వారు క్షమ పోరాటం, ఆమె ఎదుర్కొంటున్న వేధింపులను చూసిన తరువాత తమ సంకుచిత వైఖరిని మార్చుకోవాలని సూచించటం తప్పు కాదేమో!
ఎం. కోటేశ్వరరావు