ఖరీఫ్‌ సన్నద్ధత?

May 21,2024 06:05 #Articles, #edit page, #Kharif

ఈఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే జూన్‌ తొలి వారంలోనే రాష్ట్రాన్ని పలకరిస్తాయన్న వాతావరణ శాఖ చల్లని కబురు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో తల్లడిల్లుతున్న జనానికి భారీ ఉపశమనం. నిరుడు ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు వైఫల్యం చెందగా ఈ మారు పసిఫిక్‌లో లానినా పరిస్థితుల వలన అధిక వర్షం కురుస్తుందన్న సూచన రైతాంగానికి పెద్ద ఊరట. వ్యవసాయ ఆధారిత ఎ.పి.కి ఖరీఫ్‌ ప్రధానమైనది. ఇప్పుడే 60-70 శాతం భూమి సాగవుతుంది. కోటి ఎకరాలకు పైగా సేద్యం కోటి మందికి పైగా రైతులకు, కౌలు రైతులకు, అంతే సంఖ్యలో ఉన్న వ్యవసాయ కార్మికులకు జీవనాధారం ఇదే. రాష్ట్ర స్థూలోత్పత్తికి సైతం ఇదే ఇరుసు. కాగా గత సంవత్సరం రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. వచ్చాక కూడా అంతగా ప్రభావం చూపని కారణంగా ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితి నెలకొంది. సీజన్‌ ముగిసే సమయానికి 400 మండలాల్లో తీవ్ర వర్షాభావం తిష్ట వేసింది. ప్రభుత్వం మాత్రం 103 మండలాల్లోనే కరువును ప్రకటించింది. రబీలోనూ అనావృష్టి కొనసాగగా, ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందనగా 87 కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకొంది. రైతులు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేదు. వేసిన పంటల్లో లక్షల ఎకరాలు దెబ్బతిన్నాయి. కరువుతో పాటు అకాల వర్షాలు, డిసెంబర్‌లో వచ్చిన మిచౌంగ్‌ తుపాన్‌ రైతుల ఉసురు తీసింది. ఇప్పుడు ‘నైరుతి’ మోసుకొచ్చిన తీపి కబురు విపత్తులతో నష్టాలు చవిచూసిన రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
ఖరీఫ్‌ సజావుగా సాగాలంటే రైతులకు అదనుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పరపతి అందుబాటులో ఉంచాలి. మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ప్రభుత్వ యంత్రాంగం తలమునకలైంది. పోలింగ్‌ ముగిసినప్పటికీ జూన్‌ 4న ఫలితాలొచ్చే వరకు కోడ్‌ అమల్లో ఉంది. అప్పటి వరకు ఇ.సి. పర్యవేక్షణలో ప్రభుత్వం నడుస్తుంది. కోడ్‌ ఉంది కదా అని సీజన్‌ ఆగదు. అందుకనుగుణంగా అధికార యంత్రాంగం ఖరీఫ్‌కు సన్నద్ధం కావాలి. కానీ ఇప్పటి వరకు సమగ్ర సమీక్ష లేదు. సబ్సిడీ విత్తనాల సేకరణ మొదలు కాలేదు. ఎరువులపైనా ఉదాసీనతే. పరపతి పరిస్థితీ అదే తీరు. ఖరీఫ్‌లో కరువు, తుపాన్‌లతో పంట నష్టపోయిన 12 లక్షల రైతులకు రూ.1,294 కోట్లు విడుదల చేస్తూ ఎన్నికల కోడ్‌ రాకముందు మార్చి 6న ముఖ్యమంత్రి బటన్‌ నొక్కగా ఇప్పటికీ ఖాతాల్లో జమ కాలేదు. బీమా వ్యవహారం తేల్లేదు. విపత్తు మండలాల్లో బ్యాంకులు ఫ్రెష్‌ లోన్లు ఇవ్వలేదు. వార్షిక రుణ ప్రణాళిక మీటింగ్‌లు ఎన్నికల పేరిట వాయిదా పడ్డాయి. రైతు భరోసా కిస్తు ప్రశ్నార్ధకమైంది. కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలొచ్చే వరకు తేలేటట్లు లేదు. రబీ పంటల సేకరణను పట్టించుకునేనాథుడు లేడు. రబీ పంట నష్టాలపై అతీగతీ లేదు. రైతులకు విత్తనాలివ్వకుండా, రుణాలిప్పించకుండా, ఎరువుల్లేకుండా, రుణాలు, పెట్టుబడి సాయం ఇవ్వకుండా సేద్యం ఎలా చేస్తారు? ఎన్నికలయ్యాక చూసుకుందామనుకుంటే గడచిన కాలం తిరిగొస్తుందా? ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. అది నడుస్తూనే ఉండాలి. ఎన్నికైన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రాధమ్యాలు మారుతుంటాయి. ఎన్నికలున్నందునే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని మాసాల ఖర్చుకు సభామోదం తీసుకుంటుంది. ఈ ఖరీఫ్‌లో స్కీములు, ఇతర వ్యవహారాలు ఓటాన్‌ బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా అమలవుతాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇతర అంశాలు నిర్ణయమవుతాయి. ఎన్నికలు సరిగ్గా ఖరీఫ్‌ వేళ వచ్చినందున ఈ అంశాలను ప్రభుత్వం, సి.ఎస్‌. గమనంలోకి తీసుకొని సమీక్షలు జరిపి ఖరీఫ్‌కు యావత్‌ యంత్రాంగాన్నీ సిద్ధం చేయాలి. సామాజిక పెన్షన్ల మాదిరిగా ఇన్‌పుట్‌ సబ్సిడీకి, రైతు భరోసా, బీమా, సబ్సిడీ విత్తనాలకు ఇబ్బందులేమీ ఉండవు. అవసరమైతే ఇ.సి. నుంచి తగిన అనుమతులు తీసుకొని ఖరీఫ్‌ సాగడానికి అన్ని ఏర్పాట్లూ చేయాలి. పోలింగ్‌ వరకు అధికార వైసిపి, టిడిపి కూటమి పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. పోలింగ్‌ ముగిశాకా అదే ధోరణితో ఉన్నారు. గెలుపోటముల అంచనాల్లో బిజీగా గడుపుతున్నారు. వాటన్నింటినీ పక్కనపెట్టి ఖరీఫ్‌ సన్నద్ధతపై ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించే పని చేయాలి.

➡️