దేశ రాజకీయ, ఆర్థిక పాలనా వ్యవస్థలో కార్మిక సంస్కరణలను అమలు చేయడానికి కార్మికులు, యూనియన్లు ఎన్నో ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. తొంభయ్యవ దశకంలో అమలైన ప్రపంచీకరణ విధానాల ప్రభావం అన్ని రంగాలపై పడింది. మొదటగా వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2002లో రెండవ లేబర్ కమిషన్ చేసిన సిఫార్సులను అనుసరించి కార్మిక హక్కులపై దాడి ప్రారంభించింది. 2019లో రెండోసారి వరుసగా అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలు అవలంభిస్తూ. కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చి పెట్టడానికి కార్మిక చట్టాల క్రోడీకరణను చేపట్టింది. 29 కార్మిక చట్టాలను సవరించే పేరుతో నాలుగు కోడ్‌లుగా మార్చింది. పార్లమెంటులో వేతనాలపై కోడ్‌ను ఆమోదించింది. మిగిలిన మూడు కోడ్‌లు 2020 సెప్టెంబరులో ఎటువంటి చర్చ లేకుండా ప్రతిపక్షాలు గైర్హాజరయిన సమయంలో ఆమోదింపజేసుకుంది. అయితే వీటిని ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నది. నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశముంది.
వేతనాల కోడ్-2019
కార్మికుల శ్రమను మరింత దోచుకుని కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం తెచ్చినవే ఈ లేబర్‌కోడ్స్. వేతనాలకు సంబంధించిన చట్టాలను, బోనస్‌కు సంబంధించిన చట్టాలను వేతనాల కోడ్ ద్వారా రద్దుచేసింది. కానీ వాస్తవానికి యజమానులకు ప్రయోజనం కలిగే విధంగా మార్పు చేసి మరికొన్ని నిబంధనలను చేర్చింది. 1957లో జరిగిన 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ కనీస వేతనాలను నిర్ణయించాలని సిఫార్సు చేసింది. 1992లో సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో ధృవీకరించింది. దీన్నే 44, 45, 46 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్సులు 2012, 2013, 2015ల్లో వరుసగా పునరుద్ఘాటించాయి. కానీ మోడీ పాలనలో ఒకే ఒక లేబర్ కాన్ఫరెన్సు 2015లో జరిగింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఏకగ్రీవంగా చేసిన సిఫార్సులను ఆమోదించింది. 2019 నవంబరులో పార్లమెంటులో బిల్లును ఆమోదింపచేసుకుంది కేంద్రం. తరువాత ముసాయిదా నిబంధనలను నోటిఫై చేసిన తర్వాత అభిప్రాయాలను తెలియపరచాలని అసంబద్ధంగా కోరింది. ముసాయిదా నోట్స్‌లో కనీస వేతనాలను నిర్ణయించే నిబంధనను చేసింది. వీటిపై కార్మిక సంఘాలు తమ అభిప్రాయాలను తెలియచేశాయి. ఈ రోజు వరకు కూడా కేంద్రం రూల్స్‌ను ఖరారు చేయలేదు. యాజమాన్యాల ఒత్తిడి కారణంగా వేతనాల కోడ్ నిబంధనలను రూపొందించడంలో జాప్యం చేస్తూ, కనీస వేతనాల నిబంధనను తొలగించాలని చూస్తున్నది.
వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిపరిస్థితుల కోడ్-2020
పదమూడు చట్టాల్లోని కార్మికులకు సంబంధించిన అన్ని ప్రాథమిక అంశాలను ఒకే కోడ్‌లో రద్దు చేసింది. పని పరిస్థితులు, కాంట్రాక్టు పని విషయంలో యజమానుల బాధ్యతలు, వేతనానికి సంబంధించి నిర్వచనాన్ని పక్కదారి పట్టించింది. పాత చట్టాల్లో ఉన్న ప్రాథమిక అంశాలు వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం లాంటి ద్వైపాక్షిక అమలు యంత్రాంగాన్ని నీరుగార్చింది. ఈ కోడ్ ద్వారా యజమానులు అన్నింటిని ఉల్లంఘించి కార్మికులను దోచుకోవడాన్ని న్యాయబద్ధం చేయాలని చూస్తున్నది. దానికనుగుణంగా వారి ప్రయోజనార్థం ప్రభుత్వం మార్పులు చేసింది. పని పరిస్థితులు, ఉపాధి సంబంధాలు, భద్రత, ఇతర అంశాలకు సంబంధించిన విషయాలు రద్దు చేయబడినవి. నిర్మాణ, బీడీ, సిగార్, గనులు, డాక్ కార్మికులు, వర్కింగ్ జర్నలిస్టులు, సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులు, మోటారు రవాణా కార్మికులు మొదలైన వారికి సంబంధించిన అంశాలను ఈ కోడ్‌లో మార్పు చేసింది. ఫలితంగా అసంఘటిత రంగంలోని అనేకమంది కార్మికులు నష్టపోతున్నారు.
పారిశ్రామిక సంబంధాల కోడ్ -2020
కార్మికుల ప్రాథమిక హక్కులతోపాటు ట్రేడ్ యూనియన్లతో తమను తాము సంఘటిత పర్చుకోవడం, సమిష్టిగా ఆందోళనలు చేయడం, తమ ప్రాథమిక హక్కులపై వ్యతిరేకంగా ఉద్యమించడం, ఫిర్యాదుచేసే హక్కులు కలిగి ఉన్నారు. ఈ ప్రాథమిక హక్కులన్నింటిని ఈ కోడ్ ద్వారా నిరోధించింది. కార్మిక, ఉద్యోగ సంబంధాల స్వభావంలో మార్పులు చేయాలని, స్థిరకాల ఉపాధి, కాంట్రాక్టు పని విధానం మొదలైంది. ఇది ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత యజమానులు, ప్రభుత్వం ఏ విధంగాను ఇబ్బంది పడనవసరం లేకుండా లబ్ధి చేకూరుతుంది.
కార్మికులకు సమ్మె హక్కు లేకుండా చేసేందుకు తమ డిమాండ్ల సాధన కోసం పోరాడే కార్మికుల హక్కులను కాలరాయడానికి ఉద్దేశించింది ఈ కోడ్. కార్మిక సంఘాలు సంఘటితం కాకుండా చేయడానికి పెట్టుబడిదారీ వర్గానికి చట్టబద్ధంగా ఆయుధాలను అందజేసేలా రూపొందించినదే ఈ పారిశ్రామిక సంబంధాల కోడ్.
ఇది అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) చేసిన తీర్మానాలకు విరుద్ధంగా, సామూహిక బేరసారాల హక్కును కార్మికులకు దూరం చేయడం తప్ప మరొకటి కాదు.
సామాజిక భద్రతపై కోడ్ – 2020
సామాజిక భద్రతపై బీడీ, ఇనుప ఖనిజం, మైకా గనులు, సున్నపురాయి, డోలమైట్ గనుల వంటి పరిశ్రమల్లో పనిచేసే చాలామంది కార్మికులకు ఇప్పటికే చట్టబద్ధంగా వున్న సామాజిక భద్రతా హక్కులను ఈ కోడ్ అనిశ్చితిలో పడేసింది. అన్ని నిబంధనలను రద్దు చేసిన ప్రభుత్వం సెస్ వసూలు నిబంధనలను విస్మరించింది. అసంఘటిత రంగ కార్మికులకు కనీస సామాజిక భద్రతా చర్యలను చేపట్టేందుకు ప్రభుత్వం నిధుల కేటాయింపులో ఎటువంటి నిబద్ధత లేకుండా దుర్మార్గంగా వ్యవహరించింది. ఈ కోడ్‌లో వారి గురించి ప్రస్తావించలేదు. ఈ విధంగా సామాజిక భద్రతపై ఇ.పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ లతో సహా ఇప్పటికే ఉన్న సామాజిక భద్రతా పథకాలను, హేతుబద్ధీకరించి మోసపూరితంగా ఈ కోడ్ వ్యవహరించింది.
వాస్తవానికి ఈ కోడ్ ద్వారా సామాజిక భద్రతా పథకాలను నిర్వీర్యం చేసే ప్రక్రియకు పునాది వేసింది. ప్రయివేటు సంస్థలు, కార్పొరేట్లు కోరుకునే విధంగా ఇపిఎఫ్ స్కీంను పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వానికి అధికారాన్నిచ్చింది. గ్రాట్యుటీ అనేది అన్ని ట్రేడ్ యూనియన్ల ఏకగ్రీవ డిమాండ్. దీనిని ప్రభుత్వం తిరస్కరించింది.
ఒక్కసారి కార్మిక మంత్రిత్వ శాఖ ఈ నాలుగు లేబర్ కోడ్స్ నిబంధనలను నోటిఫై చేసిన తరువాత, 29 కార్మిక చట్టాలు ఉనికిలో వుండవు. ఇవన్నీ కార్మికులపై బానిసత్వపు దోపిడీ పరిస్థితులను ఉద్దేశించినవి. పని పరిస్థితులు, కనీస వేతనం, పని గంటలు, శ్రామిక ప్రజల దాదాపు అన్ని చట్టబద్ధమైన హక్కులను తొలగించడమే లక్ష్యంగా పాలకవర్గం పెట్టుకుంది. సామాజిక భద్రతతోపాటు, సమిష్టి బేరసారాల హక్కు, సమ్మె చేసే హక్కు మొదలైనవి సందర్భానుసారంగా వుంటాయి. వీటితోపాటు కార్మిక చట్టాల అమలుకు ప్రధామైన తనిఖీ నిబంధనలు తొలగించింది.
అందుకే అన్ని కార్మిక సంఘాలు ఈ నాలుగు లేబర్ కోడ్‌లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ…వీటిని రద్దు చేయాలని మోడీ సర్కార్‌ను డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌కు రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, అభ్యుదయవాదులు మద్దతు తెలుపుతున్నారు. లేబర్ కోడ్‌ల అమలుకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను మరింతగా ఉధృతపరచాలి. కార్మికుల హక్కులను కాలరాసే ఈ లేబర్ కోడ్స్‌ను రద్దు చేసే వరకు విశ్రమించకూడదు.
వ్యాసకర్త : ఎస్.ఎస్.ఆర్.ఎ. ప్రసాద్, సెల్ : 9490300867/