తీవ్ర వాతావరణ సంఘటనల సంవత్స రంగా, అత్యంత ఉష్ణోగ్రతల కాలంగా చరిత్రలో నిలిచిపోతూ 2024 మన నుంచి సెలవు తీసుకుంది. ఎప్పుడూ ఎరగని వడగాడ్పులు, భయంకరమైన చలిగాలులు మనల్నే కాదు శ్రీలంక, మాల్దీవుల్ని కూడా ఈ ఏడాది అతలాకుతలం చేశాయి. మొన్నటికి మొన్న ‘ఫంగల్’ తీరం దాటుతున్నప్పుడు పాండిచ్చేరిలో ఒకేసారి 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది! 2023లో ఆకాశానికి రంధ్రం పడినట్లు ఒకే రోజు 95 సెంటీమీటర్ల వాన కాయపట్నాన్ని (తూత్కుడి) ముంచెత్తింది! ప్రతి ఏటా ఈశాన్య రుతుపవనాల కాలంలో దక్షిణ ద్వీపకల్పంలో సగటున ఇలాంటి నాలుగు తుఫాన్లు తప్పవని ఇటీవల భారత వాతావరణ శాఖ మొహమాటం లేకుండా ప్రకటించింది.
ఇక మొత్తం భూమండలాన్ని పలిశీలిస్తే 1.5 డిగ్రీలకు మించి భూమి ఉష్ణోగ్రత పెరగరాదని మనం పెట్టుకున్న లక్ష్మణ రేఖ ఉత్తుత్తి గీతగా మిగిలిపోయిందనీ, 2035 నాటికి 3.1 సెల్సియస్ డిగ్రీలు పెరిగినా ఆశ్చర్య పోనక్కరలేదని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే ఆంత్రోపోసిస్ యుగం మనల్ని అంతుబట్టని తీరాలకు చేర్చడం ఖాయం.
మాంట్రియల్ ప్రోటోకాల్ (1989) ముందుకు తెచ్చిన ఓజోన్ పొర రక్షణ, క్యోటో ప్రోటోకాల్ (2005) ప్రతిపాదించిన గ్రీన్‌హౌస్ ఉద్గారాల తగ్గింపు, పారిస్ ఒప్పందపు (2016) ఉష్ణోగ్రతల తగ్గింపు, గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ లోని శూన్య ఉద్గార దేశాలకు నష్టపరిహార చెల్లింపు వంటివి పర్యావరణ ప్రియులందరూ గొప్ప మైలురాళ్ళుగా చెప్పుకుంటారు. వాటి విలువను తక్కువ అంచనా వెయ్యలేము. మొన్నటికి మొన్న ‘బాకు’ నగర అంతర్జాతీయ సదస్సులో ఆమోదించిన ‘ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ కార్బన్ మార్కెట్’ స్థాపన, కార్బన్ ఉద్గారాల నికర డేటా డాక్యుమెంటేషన్ వ్యవస్థ ఏర్పాటు కూడా గొప్ప ముందడుగుగా భావించవచ్చు.
కానీ పేద దేశాలకు అందించే నష్టపరిహారంపై ధనిక దేశాలు గొప్ప ఉదారతను ప్రదర్శించినట్టు అంతర్జాతీయ మీడియా కొనియాడ్డమే ఆశ్చర్యం కలిగిస్తుంది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షైన్ బమ్ (ఆమె పర్యావరణ శాస్త్రవేత్త కూడా) లాగా 2050 నాటికి తాము శూన్య ఉద్గార దేశంగా మారి తీరుతామని బల్ల గుద్ది మరీ చెప్పిన అధినేత ఒక్కరంటే ఒక్కరూ లేరు. అలాగే 2040 కల్లా బొగ్గు గనులన్నీ మూసేస్తామని చెప్పిన ఇండోనేషియా లాంటి దేశం ధనిక దేశాల్లో ఒక్కటంటే ఒక్కటీ లేదు. ఉద్గారాల వరుసలో ముందున్న 24 దేశాలన్నీ పేద దేశాలకు ఆర్థిక సాయం గురించి మాట్లాడాయే తప్ప ‘నెట్ జీరో’ సాధిస్తామని మాట వరసకైనా చెప్పలేదు. ”మేం పర్యావరణ ధ్వంసం చేస్తాం. పేద దేశాలు విలవిలలాడుతాయి. వాటికి అంతో ఇంతో సాయం చేస్తాం” ఇదీ వాటి తీరు! ఇక నష్టపరిహారం కిందా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసమూ ఇస్తామంటున్న నిధులు కూడా బ్యాంకులో, కార్బన్ మార్కెట్లో, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో సమకూరుస్తాయి తప్ప ప్రభుత్వాలు మాత్రం పూర్తి బాధ్యత తీసుకోవట!
విచిత్రం ఏమంటే సంపన్న దేశాల్లో ఎంత శాస్త్ర సాంకేతికత పెరిగినా కర్బన ఉద్గారాలేమీ తగ్గడం లేదు. ఉద్గారాల ‘లెక్కల్లో లాఘవం’ మాత్రం పెరుగుతోంది. ఏకీకృత అంతర్జాతీయ వ్యవస్థ ఏదీ మన భూగోళం గురించి పట్టించుకునేది లేకపోవడం పెద్ద విషాదం.
ఇక కాప్ 29 సదస్సులో ఆయిల్ గ్యాస్ కంపెనీల అధినేతలు ”మేం లేకుంటే మానవుడు మళ్ళీ గుహల్లో బతకాల్సిందే” అంటూ ప్రారంభ సభలోనే బెదిరింపులకు దిగడం విచిత్రాల్లోకల్లా విచిత్రం. కాలం అలా వుంది మరి! ఎప్పుడూ ఎరగని అసమానతల వైపరీత్యం ఒకవైపు, బహుళ జాతి కంపెనీల విశ్వరూపం మరోవైపు, పర్యావరణ సమస్యనే అంగీకరించని నాయకులు పీఠాలెక్కడం ఇంకోవైపు ముప్పేట ముసురుకొస్తున్న కాలం మనది. ఇలా ప్రకృతి నియమాలూ పర్యావరణ రాజకీయాలూ శత్రు శిబిరాలుగా మారిన కాలం మనది. సమస్య మన అభివృద్ధి నమూనాలో, ఆర్థిక విధానాల్లో, మితవాద రాజకీయ పోకళ్ళలో వుందని చెప్పే వారే కరువైన కాలం కూడా మనది.
దీనికి సమాధానంగా ప్యారిస్ పరిసరాల్లో పదేళ్ళ క్రితం ఏడు రోజుల పాటు స్వేచ్ఛగా చర్చోప చర్చలు జరిపిన దేశ విదేశీ విద్యార్థులు ”అందరూ అడిగే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు సముద్రాలూ అమెరికాను నిలదీస్తాయి. వాతా వరణమూ చైనాను నిగ్గదీస్తుంది” అంటారు. చూడ్డానికిది భావకవిత్వంగా కనిపించ వచ్చునేమో గాని ఇలాంటి భావితరం కన్నా పుడమి తల్లి రక్షణకు ప్రస్తుతానికి భరోసా ఎక్కడుంది?
– ఫీచర్స్ అండ్ పాలిటిక్స్