బద్ధకిస్తున్న భారతం

Jun 30,2024 05:30 #editpage

భారతదేశంలోని కిటకిటలాడే వీధుల్లో… జీవితం చురుకైన రంగుల్లో ప్రవహించేచోట… నిశ్శబ్ద మహమ్మారి బద్ధకం, ఉదాసీనత ముసుగు క్రమక్రమంగా ఆక్రమించుకుంటోంది. ‘పెద్దలు ఒకప్పుడు తేజస్సుతో నిండిపోయారు/ ఇప్పుడు నిశ్చలంగా వున్నారు, చలనం లేదు/ వారి శరీరాలు క్షీణించాయి/ చింతించే ధోరణి పెరిగింది’ అంటాడో కవి. ఆధునిక జీవన శైలికి అలవాటు పడుతున్న భారతీయులు- శారీరక శ్రమకు దూరమౌతూ… జబ్బులకు దగ్గరవుతున్నారు. ఫలితంగా మధుమేహం, ఊబకాయం క్రూరమైన హాస్యం చేస్తున్నాయి. హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. ‘ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయె/ ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రికల్‌ అంతరించే/ ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయె/ ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికంగన్న చిత్రలేఖకుని కుంచియ నశించె’- ఈ భూమిని ఏమని వర్ణింతును… ఎందరెందరో మహానుభావులు ఈ భూమిలోనే కలిసిపోయారు అంటారు గుర్రం జాషువ. నదీగమనం వలే ఉరకలెత్తే జీవనాన్ని ఉపేక్షించి, నిద్రకైనా విరామమెరుగని ఆధునిక జీవనయాత్ర నుంచి దూరంకాలేక… ఇచ్చోటనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వైనం, జాషువా చెప్పినట్లుగా అందరికీ వర్తిస్తుంది.
ఒక మనిషి ఆరోగ్యంగా వుండటానికి శారీరక శ్రమ ఎంత అవసరమో ఇప్పటికే అనేక నివేదికలు హెచ్చరిస్తూ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వున్న పెద్దల్లో మూడింట ఒక వంతు మంది తగినంత శారీరక శ్రమ చేయడం లేదని, వారానికి కనీసం 150 నిమిషాల తేలికపాటి శ్రమ కూడా చేయడంలేదని వెల్లడైంది. కాగా, సగం మంది భారతీయులు శారీరక శ్రమ చేయడంలేదని తాజాగా ‘లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌’ పెద్ద బాంబు పేల్చింది. పురుషులతో పోల్చితే ఎక్కువమంది మహిళలు శారీరక శ్రమ చేయడంలేదని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం…తగినంత శారీరక శ్రమ చేయనివారిలో మహిళలు 57శాతం వుంటే, పురుషులు 42 శాతం వున్నారు. 195 దేశాల్లో అధ్యయనం చేయగా, శారీరక శ్రమ లేని దేశాల జాబితాలో భారత్‌ 12వ స్థానంలో వుంది. భారత్‌ అప్రమత్తం కాకపోతే… కోరి రోగాలను కొని తెచ్చుకున్నట్టేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జన్యు కారణాల వల్ల వచ్చే గుండె జబ్బులు, మధుమేహం వంటి జబ్బుల ముప్పు, మిగతావారికంటే భారతీయులకు పదేళ్ల ముందే మొదలవుతుందని చెబుతున్నారు.
కార్పొరేట్ల ధన దాహంతో పెరిగిన పనిగంటలు, ఎక్కువగా కూర్చుని చేసే ఉద్యోగాలు పెరగడం, వాతావరణ మార్పులు, సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలకు పాలకుల నిర్లక్ష్యం తోడైంది. ఏ కాస్త తీరిక దొరికినా, ఆ సమయాన్ని స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, సోషల్‌మీడియా దోచుకుంటున్నాయి. ఆ సమయంలో కళ్లకు, నోటికే తప్ప… శరీరానికి పనిలేదు. కళ్లు అలసటకు గురవుతుంటే, ఒళ్లు తిన్నది అరాయించుకోలేక భారమైపోతోంది. భారత్‌లో ఈ సంస్కృతి స్కూలు స్థాయి నుంచే మొదలవుతున్నది. పిల్లలు, యుక్తవయస్కుల్లో కూడా తగినంత శారీరక శ్రమ లేదని ఈ అధ్యయం చెబుతోంది. కార్పొరేట్‌ స్కూళ్లలో మార్కులు, ర్యాంకుల ఒత్తిడే తప్ప ఆటస్థలాలుండవు. చెమట కూడా పట్టని ఏసీ క్లాసురూమ్‌లలో పిల్లలు జీవమున్న రోబోలు. సరైన శారీరక శ్రమ లేకపోవడంతో లేప్రాయంలోనే ఊబకాయంతో ఆపసోపాలు. చిన్ననాటి నుంచి చదువుతో పాటు, ఆటపాటలను ప్రోత్సహించి, ఆరోగ్యవంతమైన యువతగా, దేశానికి పెట్టని కోటగా మార్చుకుంటున్న దేశాలు అనేకం వున్నాయి. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పాఠశాలల్లో ఆటస్థలాలు, ఆటలు అవసరమని చైనా, క్యూబా వంటి దేశాలు తాము సాధిస్తున్న పతకాల ద్వారా చెప్పకనే చెబుతున్నాయి. భారత్‌లో అత్యధికంగా వున్న యువత-సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుండాలంటే… వెంటనే వ్యాయామం మొదలెట్టాల్సిందే. పెద్దలు సైతం వారానికి 150 నుంచి 300 నిమిషాలు సైక్లింగ్‌, వాకింగ్‌, జాగింగ్‌, స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాలు మధ్యస్థంగా చేయొచ్చు. కాబట్టి మన శారీరక శ్రేయస్సుకు ప్రాధాన్యతనివ్వాలి. శారీరక శ్రమను జీవితంలో అంతర్భాగం చేసుకోవాలి. ‘దేశమంటే మట్టికాదోయ్ / దేశమంటే మనుషులోయ్ ‘ అంటారు గురజాడ. దేశం సుసంపన్నంగా వుండాలంటే…దేశంలోని మనుషులంతా ఆరోగ్యంగా వుండాలి.

➡️