సవాళ్ళు వదిలి సమస్యలపై దృష్టి పెట్టండి

May 16,2024 05:45 #Articles, #cpm, #edite page, #TDP, #YCP

మే 13తో ఎన్నికల రణరంగం ముగిసింది. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పారింది. మొదటిసారి ఓటర్లు తాగడం కూడా ఎన్నికలతోనే అలవాటు చేసుకుంటున్నారు. ఆ రకంగా కొత్త తరాన్ని మత్తులో ముంచుతున్నారు. మతం, కులం, ఉపకులం, తెగలు, ఉపతెగల పేరుతో ప్రజల మధ్య ద్వేష భావాలు పెరిగాయి. ప్రజలకు ముందుండాల్సిన కార్మికవర్గం కూడా ఈ చీలికల్లో కొట్టుకుపోతున్నది. జూన్‌ 4 లెక్కింపు తరువాత జయాపజయాలు తెలుస్తాయి. ఈలోగా అధికార, ప్రధాన ప్రతిపక్షాలు సవాళ్ళు, అడ్డుసవాళ్ళతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ప్రత్యేకించి అధికార పార్టీ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలపై కేంద్రీకరించడం లేదు. ఈ వేసవిలో మంచినీళ్ళు, విద్యుత్‌ కోత లేకుండా చూడడం చాలా అవసరం. ఇటీవల వర్షాలకు అసలే నాసిరకంగా ఉన్న రోడ్లు మరింత గుంతలు పడి అభివృద్ధిని వెక్కిరిస్తున్నాయి. ఫలితంగా ప్రమాదాలూ పెరుగుతున్నాయి. కూలీలు బలవుతున్నారు. సంక్షేమ పథకాలకు (డిబిటి) బటన్‌లు నొక్కి నాలుగైదు మాసాలైనా ఇంత వరకు పేదల అకౌంట్‌లోకి డబ్బులు పడలేదు. వారి సొమ్ము వారికందించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. దానికి బదులుగా ఏ కాంట్రాక్టరుకు ఎంత కట్టబెట్టాలని రెండు పక్షాలు పోటీలు పడి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు వీధి పోరాటాల కింద మారిపోయింది. మహిళలు, పిల్లలు సైతం ఈ ఘర్షణల్లో బాధితులవుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. రెండు పక్షాలు పోటీలు పడి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టిస్తున్నాయి. దానికి బదులు రాష్ట్రాభివృద్ధికి ప్రపంచ దేశాల అనుభవాలపై అన్వేషణ సాగిస్తే ఫలితాలొస్తాయి. ప్రశాంత వాతావరణాన్ని కల్పించి సమస్యల పరిష్కారానికి పోటీలు పడి ఆలోచిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.

టిడిపి, వైసిపిలు బిజెపితో వున్నంతకాలం రాష్ట్రానికి మేలు జరగదు
ఇప్పటికి నాలుగు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. మన రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల ఎక్కువ మంది దృష్టి రాష్ట్రంపైనే కేంద్రీకరించడం కన్పిస్తున్నది. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల ఎజెండా పక్కకు పోయింది. రాష్ట్రంలో ఎవరు గెలిచినా రేపు మోడీ మరల గద్దెనెక్కితే ఆ పల్లకినే మోస్తారు. దానివల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీలేదని ఈ పదేళ్ళ అనుభవం. మూడోసారి మోడీని గద్దెనెక్కించడానికి రకరకాల ప్రయత్నాలు సాగుతున్నాయి. మన రాష్ట్ర రాజకీయ సమీకరణలో అధికార వైసిపిని దెబ్బ తీయడానికి టిడిపి బిజెపి సరసన చేరింది. ఇది తక్షణం వారికి కొంత ప్రయోజనం కలిగించినప్పటికీ రానున్న కాలంలో మన రాష్ట్ర భవిష్యత్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎన్నికల అనంతరం బయటకి వచ్చే వీలు లేకుండా తెలుగుదేశం ఎన్డీయేలో చేరడం వల్ల రాష్ట్రానికి జరిగే హాని అంతా ఇంతా కాదు. కేంద్రంలో వచ్చే ఎన్డీయే ప్రభుత్వం తమపై ఆధారపడాల్సి వస్తుందని వైసిపి, టిడిపి పార్టీలు రెండూ ఆశాభావంతో ఉన్నాయి. బలహీనమైన బిజెపి కేంద్రంలో రావాలని వారిద్దరూ కోరుకుంటున్నారు. అసలు బిజెపియే అధికారంలోకి రాకూడదని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. వైసిపి, టిడిపి శ్రేణుల్లోనూ ఇలాంటి అభిప్రాయం బలంగా ఉంది. ప్రజల మనోభావాలను గౌరవించి బిజెపిని అడ్డుకుంటే ఈ పార్టీలకూ జాతీయ స్థాయిలో గౌరవం పెరుగుతుంది. వారి పార్టీలు నిలదొక్కుంటాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటికన్నా నాలుగు దశల పోలింగ్‌ అనంతరం బిజెపి అత్యంత బలహీనమైన స్థానంలోకి వెళ్ళిపోతున్నదని అందరికీ అర్థమవుతున్నది. షేర్‌ మార్కెట్‌ గ్రాఫ్‌ సైతం దిగిపోతున్నది. మోడీ మాటల్లో తడబాటు కనిపిస్తున్నది. నిరాశా నిస్పృహల్లో మతం పేరుతో దేశ ఐక్యత, సమైక్యతకు తూట్లు పొడుస్తున్నారు. ఒక ప్రధాని ఇంతగా దిగజారి మాట్లాడిన ఘటనలు ముందెన్నడూ లేవు. మోడీ ముందు హిట్లరైనా, నెతన్యాహు అయినా సాటి రారు. అబద్దాల ప్రచారంలో 100 మంది గోబెల్స్‌ కూడా మోడీ ముందు దిగదుడుపే.

అబద్దాల ఫ్యాక్టరీలో అభివృద్ధి బలి
మోడీ అబద్దాల ఫ్యాక్టరీలో సత్యం బలైపోతున్నది. మోడీని ఆదర్శంగా తీసుకున్న వైసిపి, టిడిపిలు కూడా ఆ బాటనే నడుస్తున్నాయి. మోడీ గ్యారెంటీ పేరుతో మన రాష్ట్రానికి ఏమి చేయబోతారో చెప్పిన తీరు చూస్తుంటే జనం ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ పదేళ్ళలో చేసిన అన్యాయాలు జనం మర్చిపోలేదు. వైసిపి, టిడిపిలు మర్చిపోయినట్లు నటిస్తున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఈ పార్టీలు నోరు మెదపడం లేదు. ఈ ఎన్నికల్లో రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం గురించి బల్ల గుద్ది వాదిస్తున్న బిజెపి మాటల్ని రాష్ట్ర ప్రజలు విశ్వసించరు. కానీ మెజారిటీ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వైసిపి, టిడిపిలు బిజెపి విద్రోహం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా మోడీ విజనే తన విజన్‌ అన్నట్లుగా చంద్రబాబు చెప్తుంటే మోడీ విజన్‌కు అసలైన వారసుణ్ణి తానే అన్నట్లుగా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ పదేళ్ళలో రాష్ట్రంలో కేంద్రం ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టిందో, ఎంత మందికి ఉద్యోగాలిచ్చిందో ఒక్క ఉదాహరణ కూడా బిజెపి నాయకులు చెప్పలేకపోయారు. మోడీ మూడు సార్లు రాష్ట్రానికొచ్చి 17 కేంద్ర సంస్థల్ని దానం చేసినట్లుగా పదే పదే ప్రచారం చేసుకున్నారు. కానీ అందులో అత్యధిక భాగానికి కనీసం సొంత భవనాలు కూడా లేని వాస్తవాన్ని దాచిపెట్టారు. పోలవరం నిర్వాసితులను గోదాట్లో ముంచారు. రాజధాని అమరావతి నిర్మాణం త్రిశంకు స్వర్గంలో ఉంది. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై ఈ మూడు పార్టీలు మౌనం పాటించాయి. కడప ఉక్కు గురించి ప్రస్తావనే లేదు. అదానీకోసం పెట్టిన ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ప్రాజెక్టుల గురించి మాత్రం పదేపదే గొప్పలు చెప్పుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏ గ్రామానికీ రోడ్డు, మంచినీరు, విద్యా, వైద్య సౌకర్యాలు లేకపోయినా రూ.525 కోట్లతో ఏజెన్సీ సంపదను తరలించుకుపోవడానికి విజయనగరం నుండి ఏజెన్సీ మీదుగా రాజమండ్రి వరకు హైవే వేయడం వారి అభివృద్ధి నినాదం అసలు స్వరూపాన్ని వెల్లడిస్తున్నది.
ఈ ఎన్నికల్లో భూ హక్కుల రక్షణ చట్టంపై చర్చ జరిగింది. కానీ ఆ చట్టం తెచ్చినప్పుడు సిపిఐ(యం) మినహా మరెవరూ దాన్ని వ్యతిరేకించలేదు. ఆనాడు మౌనంగా ఉన్న టిడిపి ఇప్పుడు లొల్లి చేయడం ఎన్నికల కోసమే. ఈ చట్టం తెచ్చింది కార్పొరేట్లకు భూమి బదలాయించడానికే. అందుకే వారప్పుడు మాట్లాడలేదు. నాడు 2013 భూసేకరణ చట్టానికి సవరణ తెచ్చిన టిడిపి ఇప్పుడు ఆ సవరణ ఉపసంహరించుకోకుండా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం గురించి మాట్లాడటంలో నిజాయితీ లేదు. చంద్రబాబు తెచ్చిన సవరణలను జగన్‌ కూడా కొనసాగించి ఇప్పుడు టిడిపిని విమర్శించడంలో నిజాయితీ లేదు. అసలు నమూనా చట్టాన్ని రూపొందించి రాష్ట్రాలు అమలు చెయ్యాలని ఆదేశించింది మోడీ ప్రభుత్వమే.
తమ హయాంలో కియా ఫ్యాక్టరీని తీసుకు వచ్చామని తెలుగుదేశం ప్రచారం చేసుకుంది. కానీ ఈ ఫ్యాక్టరీలో మన రాష్ట్రం యువతకు ఎంత మందికి ఉద్యోగాలొచ్చాయో చెప్పలేదు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలిస్తామని జీవో తెచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఆ తరువాత దాని అమలు ఊసే మర్చిపోయారు. విదేశీ పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలిస్తామని నిరుద్యోగ యువతను భ్రమల్లో ముంచుతున్న వీరు ఇప్పటికే రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి? ఎంత మంది వీధిన పడ్డారో చెప్పడం లేదు. వచ్చే ఉద్యోగాలు తక్కువ, పనిచేసే జనం ఎక్కువ అవడంతో కనీస వేతనాలు డిమాండ్‌ చేయగిలిన స్థితిలో కార్మికులు లేరు. పెట్టుబడికి మొదటి ప్రాధాన్యతనిస్తామని చెబుతున్న ఈ పార్టీలు కార్మికుల శ్రమకు కనీస వేతనాన్ని అమలు చేస్తామని మాత్రం చెప్పడం లేదు. సామాజిక పెన్షన్‌ పెంచుతామని పోటీలు పడుతున్న వీరు ఉద్యోగుల వేతనాలు పెంచుతామని, శ్రామికులకు భద్రత కల్పిస్తామని, బోనస్‌లు ఇప్పిస్తామని చెప్పడం లేదు. అంటే పెట్టుబడికి లాభాన్ని గ్యారెంటీ ఇచ్చే పార్టీలు సంపద సృష్టించే శ్రమకు న్యాయం చేస్తామని చెప్పడంలేదు.

సంక్షేమం ప్రజల హక్కు
సంక్షేమ కార్యక్రమాలు దండగని, ఉపాధి హామీ పథకం నిరుపయోగమని, వీటివల్ల జనం సోమరిపోతులు అవుతున్నారని ప్రత్యక్షంగా మైకుల్లో చెప్పే ధైర్యం లేకపోయినా ఆ యా పార్టీల నాయకులు ప్రయివేటుగా రోజూ అదే పనిగా ఊదరగొడుతూనే ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఉచితాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవి ప్రజల హక్కు. వారు పోగొట్టుకున్న సంపద. అందులో కొద్ది భాగం కంటితుడుపుగా సంక్షేమ కార్యక్రమాల పేరుతో తిరిగి ఇస్తున్నారు. అలా ప్రజలకు ఇవ్వకుండా మాడ్చితే కడుపుకోతతో తిరుగుబాటు చేస్తారన్న భయంతో ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల సలహాతో వీటిని అమలు చేస్తున్నారు. వాటికి ముచ్చటగా తెలుగు పేర్లు పెట్టి తమవిగా బ్రాండ్లు వేసుకుంటున్నారు. ఒకే పథకానికి వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లు ఉంటాయి. ఒకే పథకానికి రాష్ట్రంలో వివిధ పార్టీలు వేర్వేరు బ్రాండ్ల పేర్లు పెట్టుకుంటున్నాయి. అంతకు మించిన తేడా లేదు. కానీ ఈ కొద్దిపాటి పథకాల వల్ల ప్రజల ఆదాయం ఎంతో కొంత పెరిగి అది కొనుగోలు శక్తి పెంపుదలకు దారితీస్తుంది. సరుకుల అమ్మకాలు పెరిగి ఉత్పత్తి పెంపుదలకు దారితీస్తుంది. కొంతమందికైనా ఉపాధి పెరుగుతుంది. ఉపాధి హామీ చట్టం లాంటి పనుల ద్వారా కూలీలకు బేరమాడే శక్తి కలుగుతుంది. కూలీల వేతనాలు పెంచడానికి ఇష్టంలేని పెత్తందార్లు, భూస్వాములు ఈ పథకాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఈ రెండు పార్టీల గ్రామ నాయకత్వమంతా ఇలాంటి పెద్దమనుషుల చేతుల్లోనే ఉండడం వల్ల వారి మాటే వేదంగా చలామణి అవుతున్నది. ఈ చట్టాన్ని కొనసాగించి మెరుగు పర్చాలని వామపక్షాలు తప్ప మరెవరూ మాట్లాడడం లేదు. ఇదే మాదిరి పట్టణ ఉపాధి పథకాన్ని కూడా చేపట్టాలని వామపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో వామపక్షాలు భాగస్వామిగా ఉన్న ‘ఇండియా’ వేదిక మాత్రమే ఉపాధి కార్మికులకు, స్కీం వర్కర్స్‌కు వేతనం పెంచుతామని హామీ ఇచ్చింది.

బలహీనపడుతున్న బిజెపి
బిజెపి రామమందిర నిర్మాణం మినహా ఈ పదేళ్ళలో సాధించిన ఘనకార్యమేమీ లేదని మోడీ మాటల్లోనే వెల్లడైంది. ఇలాంటి బిజెపికి బలమైన ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఈ ఎన్నికల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనే బిజెపికి ఎదురు గాలి వీస్తున్నది. పైకి డాంబికంగా 370-400 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకుంటున్నా ఏ సర్వేలోనూ ఆఖరికి బిజెపిని బలపరిచే విశ్లేషకులు సైతం 250కి మించి రావని చెప్పాల్సిన పరిస్థితి. అందుకే బిజెపి నిస్పృహతో తెగబడి దేశ సమైక్యతకే చిచ్చుపెడుతున్నది. మన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పటి వరకు బిజెపి ఘోరాలను దాచిపెట్టి అపచారం చేశాయి. దీనివల్ల దేశానికి, ప్రజలకు హాని జరగడమేగాదు…ఆ పార్టీల అస్తిత్వానికి కూడా ప్రమాదం ముంచుకొస్తుంది. వివిధ రాష్ట్రాల్లో బిజెపితో జతకట్టిన వివిధ ప్రాంతీయ పార్టీల అనుభవం కూడా. అందుకే టిడిపి, వైసిపిలు తమ వైఖరిపై పునరాలోచించాలి.

ప్రజా పోరాటాలతోనే కమ్యూనిస్టుల పురోగమనం
ఎన్నికల ప్రక్రియ సాగుతుండగానే మన రాష్ట్రంలో అనేకచోట్ల కార్మికుల సమ్మెలు జరిగాయి. విజయనగరంలో మిమ్స్‌, రాజమండ్రిలో పేపర్‌ మిల్లు, గంగవరం పోర్టు కార్మికుల సమ్మెలు జయప్రదంగా జరిగాయి. దీర్ఘకాలంగా తాడేపల్లి ఎసిసి సిమెంట్స్‌ లాకౌట్‌లో ఉంది. కృష్ణపట్నం జెన్‌కో రక్షణకు ఇంజనీర్లు, కార్మికులు పోరాడుతున్నారు. అయినా మీడియాలో వీటి ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. వామపక్షాలు మినహా ఏ పార్టీ వీటి గురించి ప్రస్తావించలేదు. ఇలాంటి సమ్మెలు జరగకుండా చూసేందుకే ప్రధాన పార్టీలు కార్పొరేట్లకు హామీలిస్తున్నాయి. కార్మికుల పక్షాన నిలబడే కమ్యూనిస్టులను దెబ్బ తీయడానికి తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారు.
అనేక కారణాల వల్ల ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టుల స్థితి బలహీనంగా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగదు. ప్రపంచ వ్యాపితంగా పరిస్థితులు మారుతున్నాయి. సంక్షోభంలో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థపై యువతలో భ్రమలు తొలగు తున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమ పురోగతికి నేపథ్యం తిరిగి ఏర్పడుతుంది. ఈ ఎన్నికల్లో సిపిఐ, సిపిఐ(యం) మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా కలిసికట్టుగా ఎన్నికల క్యాంపెయిన్‌ చేపట్టాయి. మొదటిసారి ఈ రెండు పార్టీలతో పాటు సిపిఐ(యంఎల్‌) పార్టీలు వామపక్షాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకున్నాయి. భవిష్యత్‌లో ఈ ఐక్యత మరింత బలపడుతుంది. బిజెపికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో అనేక మంది ప్రజాతంత్రవాదులు, రైతు, ప్రత్యేక హోదా సాధన నాయకులు వామపక్షాల్ని బలపరిచారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత మాత్రమే దేశ ప్రజలకు ప్రత్యామ్నాయం చూపగలుగుతుంది.

 వ్యాసకర్త సిపిఎం ఎ.పి రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

➡️